విచారణ మొదలైంది!

          “మీ టీవీ ఛానల్లో డిబేట్ జరిగింది, అంటే మీరు యెలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు?” విచారణ కమిటీ సభ్యుడు అడిగాడు. ఆ టీవీ ఛానల్ వోనరుకు యేమీ అర్థం కాలేదేమో అయోమయంగా చూశాడు. ‘ఇందులో మా తప్పు యేమీ లేదు’ అన్నట్టు చూస్తున్న సిబ్బంది వైపు చూపు తిప్పి అందర్నీ చూస్తూ “ఆన్సర్ మీ” గొంతుపెంచి అన్నాడు కమిటీ పెద్ద.

          “ఇప్పుడూ వో శానిటేషన్ వర్క్ చేసేటప్పుడు కూడా చేతికి గ్లౌజులు వేసుకుంటారు. కాళ్ళకి బూట్లు వేసుకుంటారు. ఊ… ముఖానికి మాస్క్ తగిలించుకుంటారు… అలాంటిది మీరు…” తలడ్డంగా వూపి భరించలేనట్టు “మైండ్‌లెస్ ఫూల్స్” గొణుక్కున్నట్టు పైకే తిట్టాడు కమిటీ పెద్ద.

          ‘టీవీ డిబేట్‌ను శానిటేషన్ వర్క్‌తో పోల్చుతాడేమిటి?’ అనుకున్నాడు కొత్తగా జర్నలిజంలో చేరిన కుర్రాడు. “ఏ పనిచేసే ప్రదేశంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం వుందని తెలిసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా?” కమిటీ పెద్ద మాటలకు ఆ జూనియర్ జర్నలిస్టు వెంటనే తలాడించాడు, అందరితో పాటు.

          “ఇప్పుడు అక్కడో ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు సేఫ్టీ ప్రీకాషన్స్ తీసుకుంటాం కదా?” వోనరును టార్గెట్ చేసి చూస్తూ అడిగాడు మరో కమిటీ సభ్యుడు, కమిటీ పెద్దకు సహకరిస్తూ.

          “అంటే… డిబేట్ జరుగుతున్నప్పుడు ఆయా పర్సన్స్‌కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ యివ్వాలని మాకు మాన్యువల్‌లో లేదు సార్” చాలా నిజాయితీగా చెప్పాడు ఛానల్ వోనరు. వెంటనే విచారణ కమిటీ పెద్ద చకచకా రాసుకున్నాడు. “ఇక మీదట తప్పక పాటించవలసిన నిబంధనావళిలో చేర్చమని ప్రభుత్వానికి తమ విచారణ కమిటి సిఫార్సు చేస్తుంది” అని కమిటీ పెద్ద అక్కడికక్కడే ప్రకటించాడు.

          విచారణ కమిటీలో వుత్సాహంగా వున్న సభ్యులు ‘యిక మీదట టీవీ ఛానల్స్‌లో బ్యాండేజ్‌లూ మెడిసిన్సూ యివే కాకుండా వో డాక్టరుని నర్సునీ కూడా నియమించాల’ని తమ పెద్దకు చెప్పారు. అంతే కాదు, ‘హెల్త్ ఇన్సూరెన్స్‌కు యిక్కడ మార్కెట్ స్పేస్ వుందని, ఆ విషయాన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా గుర్తించాల’ని విన్నవించుకున్నారు. కమిటీ పెద్దగారు గబగబా రాసుకున్నారు.

          “యాక్చువల్‌గా డిబేట్ కోసం స్పీకర్స్‌కు మీరు యిచ్చిన టాపిక్ యేమిటి?” మరో కమిటీ సభ్యుడు అడిగాడు. ఆ ప్రశ్నకు నీళ్ళు నమిలాడు వోనరు. పోగ్రామింగ్ హెడ్ చేతులు నలుపుకున్నాడు. “మతాన్ని రాజకీయపార్టీలు యెలా ఎబ్యూజ్ చేస్తున్నాయి- అనేది టాపిక్” చెప్పాడు ఇన్చార్జ్, యిక చెప్పక తప్పదన్నట్టు.

          “ఏమయ్యా… యింతకన్నా వేరే టాపిక్ మీకేమీ దొరకలేదా?” అని అడిగి, సమాధానం రాకపోయేసరికి, “దేశాన్ని తగలెట్టేసేలా వున్నారే?” అన్నాడు కమిటీ పెద్ద.

          “అసలే యిది మనోభావాల కాలం. ఎప్పుడైనా యెందుకైనా యెవరికైనా మనోభావాలు గాయపడవచ్చు. ఆ గాయాలు మరెందరినో గాయపరచవచ్చు. అవసరమా?” మరో కమిటీ సభ్యుడు ఆవేశపడ్డాడు.

          “అందుకనే మేం వేరు వేరు మతాల వాళ్ళని పిలవలేదు సార్. ఒకే మతం… అదీ మెజారిటీ మతం…” ఇన్చార్జ్ చెప్పడం పూర్తికాలేదు, “మెజారిటీ జనాలు చూస్తారు, రేటింగ్ వస్తుంది” అంతేనా అన్నట్టు కమిటీ పెద్ద అసహనంగా చూశాడు.

          “ఇది డెమోక్రసీ…” యేదో సంజాయిషీ యివ్వబోయాడు పోగ్రామింగ్ హెడ్. “నిజమే, మనది డెమోక్రసీ దేశమే, కాని కొన్నిటికి డెమోక్రసీ చెల్లదు. మతం, దేశభక్తి వీటికి డెమోక్రసీ వుంటుందా? మెజారిటీ మతమే మతం. మెజారిటీ దేవుడే దేవుడు. భక్తయినా అంతే. దాని మీద డిబేటు ఏమిటయ్యా, బుద్ధి లేపోతే సరి” విసుక్కున్నాడు కమిటీ పెద్ద.

          “అందుకే… అందరూ వొకే మతం వాళ్ళు సార్, మేం ఆ జాగ్రత్త తీసుకున్నాం సార్” వుత్సాహంగా చెప్పాడు పోగ్రామింగ్ హెడ్.

          “మరిప్పుడేమయ్యింది?” చురచురా చూశాడు కమిటీ పెద్ద.

          కొద్దిసేపు నిశ్శబ్దం.

          “ఊ… మీరతన్ని యెందుకు కొట్టారు?” కమిటీ పెద్ద కాషాయ కండువాని అడిగాడు. “లైవ్‌లో” అందించాడు కమిటీ సభ్యుడు. “అదీ చెప్పు తీసుకొని” అందించాడు మరో కమిటీ సభ్యుడు.

          “మీరు ముగ్గురు కాదు, ముప్పైమంది అడిగినా వొకటే చెపుతా, నేనాడ్ని చంపేస్తాను…” కాషాయ కండువా ధైర్యంగా చెప్పింది.

          “నోనో… మీరలా మాట్లాడకూడదు” చాలా వోపిక తెచ్చుకొని మరీ చెప్పాడు కమిటీ పెద్ద. “మీరు ఆవేశ పడితే మీకే నష్టం” తలాడిస్తూ చెప్పాడు వొక కమిటీ సభ్యుడు. “మీరిలా మాట్లాడితే మీదే తప్పని రిపోర్టు యివ్వాల్సివుంటుంది” హెచ్చరికగా చెప్పాడు మరో కమిటీ సభ్యుడు.

          “మీకు సిగ్గులేదా? మన దేవుణ్ణి పట్టుకు అలా మాట్లాడుతుంటే? నాకే దేవుడా? మీకు కాదా?” ఆవేశంతో అరుస్తూ అడిగింది కాషాయ కండువా.

          “నేనేం తప్పు మాట్లాడానో చెప్పు” అంది సన్నాసి గెడ్డం.

          “ఒరేయ్… నిన్ను కొరికేస్తాను. నరికేస్తాను. చంపేస్తాను…” కాషాయ కండువా వూగిపోతూ వుంది. ఇద్దరు పోలీసులు సహా చాలామంది పట్టుకు ఆపడంలో ఆపసోపాలు పడుతున్నారు.

          “మీరు వైరల్ అయిన వీడియో చూశారు కదా?” కళ్ళతో చూసిన దానికి మళ్ళీ అడగడం యెందుకని- అడిగింది సిబ్బందిలో వొకామె.

          “నేను యిప్పుడు కూడా చెప్పుతో కొడతా. తంతా. చంపుతా. ఎవడు వస్తాడో రమ్మను?” పట్టుకొని ఆపుతున్న కొద్దీ కాషాయ కండువా రెచ్చిపోతూ బలంగా మీది మీదికి వస్తోంది.

          “వీళ్ళ యిష్టారాజ్యం అయిపోయింది, వీళ్ళ వల్లే హిందూ మతానికి చెడ్డ పేరు” అంది సన్నాసి గెడ్డం బాధ పడింది. “ద్వేషానికి హిందూ మతంలో చోటులేదు” అని గింజుకుంటోంది.

          “ఊ… మీ వెర్షన్ చెప్పండి” అన్నాడు కమిటీ పెద్ద.

          “ఈమధ్య మోడీగారు హైదరాబాదు వచ్చారు, మీకు తెలుసు. ఆయనకు ఆయన పార్టీ కార్యకర్తలు యేదైనా ప్రెజెంటు చేసుకోవచ్చు. కాని, దశావతారాలకు సంబంధించిన శ్రీకృష్ణుడి విశ్వరూప సందర్శనం బొమ్మని… యిదిగో చూడండి… పేపర్లో వచ్చిందే… మేమేమీ మార్ఫింగు చేసింది కాదు. అన్ని తలలు అలాగే వుంచి సెంటర్లో వున్న శ్రీకృష్ణుడి తలకాయ తీసేశారు. శ్రీకృష్ణుడి తలకాయ స్థానంలో మోడీ తలకాయ పెట్టి… యిలా చేస్తే… హిందూ మతం మనోభావాలు దెబ్బతినవా అండీ…” సన్నాసి గెడ్డం మాటలు పూర్తికాలేదు.

          “శ్రీకృష్ణుడి తలకాయ అంటే చెప్పు తీసుకుకొడతా? నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు. శ్రీకృష్ణుడి తలకాయ… శ్రీకృష్ణుడి తలకాయ… అంటావా?” కాషాయ కండువా ఆగ్రహంతో రెచ్చిపోతోంది.

          “నాకన్నా నువ్వే యెక్కువ సార్లు అంటున్నావ్… అయినా శ్రీకృష్ణుడి తలకాయ కత్తిరించి తీసేసి మోడీ తలకాయ పెట్టడం తప్పుకాదు. తలకాయని తలకాయ అంటే తప్పా?, తలకాయ కాకపోతే శిరస్సు. దటీజ్ బాడీ పార్ట్…” సన్నాసి గెడ్డం తను చెప్పాల్సింది చెప్పుకుపోతున్నాడు.

          “శ్రీకృష్ణుడి తలకాయ అంటే మళ్ళీ చెప్పు తీసుకుకొడతా? కొట్టడం కాదు, చంపేస్తా. ఏందది శ్రీకృష్ణుడి తలకాయ అను చెప్తా… నీ యమ్మ…” కాషాయ కండువా గంతులేస్తున్నాడు, పోలీసులు వారిస్తున్నారు.

          పిల్లలకు యిక మీదట తలకాయ అన్న పదం బాన్ చేశారని, శిరస్సు అని మాట్లాడాలని అప్పుడే దాడులకు గురికాకుండా వుంటారని- ఆ సమయంలోనూ తలిదండ్రులైన వాళ్ళు తమ పిల్లల గురించి ఆలోచించారు. కొందరు మరింత ముందుకు వెళ్ళి ‘శిరస్సుకి నూనె రాయి’ ‘శిరసు దువ్వుకో’ ‘శిరసు పోటు వచ్చింది, జండూ బామ్ అందుకో’- యిలా ప్రాక్టీసు చేసేస్తున్నారు, లోపల్లోపల. తలకాయను తలకాయ అనడం నేరమైతే, మరి చేతులను కరములు, పాదాలను పాదపద్మములు అనాలేమో, అని ఆలోచించేస్తున్నారు.

          కమిటీ పెద్దకు యేమి మాట్లాడాలో యేమీ బోధపడలేదు. అందర్నీ ఆగమని మళ్ళీ వీడియో క్లిప్ మళ్ళీ చూసుకున్నాడు. ఆ వీడియోలో ఆంజనేయుడు కాషాయ కాన్వాయ్ ముందు గంతులేస్తున్నాడు.

          “చూడండి… హనుమ్మజ్జయంతి పండుగలు చేసే మనం… మంగళవారం వస్తే చాలు ‘జైవీర్ హనుమాన్’కి అని నినాదాలిచ్చే మనం… వూళ్ళో కోతిని కూడా అలా తాడుకట్టి ఆడించరు కదండీ… యెలా ఆడిస్తున్నారో చూడండి…” సన్నాసి గెడ్డం చెపుతుంటే, “అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేయండి” కసురుకుంటూ చెప్పాడు కమిటీ పెద్ద. “ఏమి జరిగిందో చెప్పండి చాలు” అన్నాడు కమిటీ సభ్యుడు.

          “నేను వార్తగా వచ్చిన ఫోటోని చూపించాను. రాముడ్నీ కృష్ణుడ్నీ యెలా వాడుకుంటున్నాయో పేపర్ కటింగ్ చూపించాను. నా స్వంతమేమీ కాదు…” సన్నాసి గెడ్డం చెపుతుంటే, “యివన్నీ మాట్లాడడానికి మీరెవరు?” కమిటీ పెద్ద చాలా సీరియస్సుగా అడిగాడు.

          తను హిందువునని, అన్య మతస్తున్ని కానని, తన జై భారతి సంఘం గురించి యింకా హిందుస్తానీ గోరక్షక అధ్యక్షుడిగా చేసిన సేవలగురించి, హిందూ మత సంరక్షణ గురించి చెప్పుకొచ్చింది సన్నాసి గెడ్డం.

          “ఒరేయ్… నిన్ను చెప్పుతో కొట్టడం కాదురా, చేతికి దొరికితే చంపేస్తా… దొరుకు నా కొడకా… నీ యమ్మ…” కాషాయ కండువా మాట్లాడుతున్న భాష యిదివరకు యెక్కడో విన్నట్టు అనిపించింది అక్కడివాళ్ళకి. సోషల్ మీడియాలో అని తరువాత తోచింది.

          “ఎందరో అలా వాడుకున్నారు, దేవుళ్ళ తలకాయలు సారీ దేవుళ్ళ శిరస్సులు తీసేసి తమ నాయకులవి పెట్టుకున్నారు, అందులో తప్పేముంది? అది ఆర్టు” అన్నాడు కమిటీ పెద్ద. షార్ట్ వీడియోల భాష తనకూ వచ్చేస్తోందని గుర్తించకపోలేదు.

          “ఎవరు చేసినా తప్పే, అందరూ చేస్తే అది సాధారణం అయిపోదు” అంది సన్నాసి గెడ్డం. అని ఆగలేదు. “తలకాయ అన్నమాటే తప్పయితే, రాముడికి మోడీగారు దారి చూపిస్తూ నడిపిస్తున్నారు అది తప్పు కాదా? సీతకు తన ఛాతీ యిచ్చిన రాముడు మోడీగారి యాభైయ్యారు యించీల ఛాతీమీద తలవాల్చి సేదతీరడం న్యాయమేనా?” అడిగింది.

          “చూడు స్వామీ… నువ్వు మాట్లాడినప్పుడు రాముడు అన్నావు గాని ‘రాముడుగారు’ అనలేదు. కాని యిన్ని కబుర్లు చెప్పే నువ్వు ‘మోడీగారు’ అనే అన్నావ్. దటీజ్ పవర్. మోడీగారే లేకపోతే రాముడికి చరిత్రే వుండేది కాదు. ‘జై శ్రీరామ్’ నినాదం యెప్పుడునుండి వచ్చింది? మోడీగారు అధికారంలోకి వచ్చాకే కదా?” కాషాయ కండువా వెనుక చేరిన భక్తులందరిదీ వొకే మాట.

          కమిటీ పెద్ద, సభ్యులూ వొకరి కళ్ళలోకి వొకరు చూసుకున్నారు. లోలోపలి భయాలని గుర్తించి గుర్తించనట్టే వున్నారు.

          “హర హర మహాదేవ పోయిందండీ… హర హర మోదీ ఘర్ ఘర్ మోదీ వచ్చింది…” అని, “దేవుడు చూస్తే తలకాయ పాతుకుంటాడు” అని దుఃఖపడింది సన్నాసి గెడ్డం.

          “మళ్ళీ తలకాయ అంటున్నావ్… నీ తలకాయ నరికేస్తాను… చంపేస్తాను…” వున్మాదంతో అరుస్తోంది కాషాయ కండువా.

          “మీరు ఆ పదం వాడకండి” నెమ్మదిగా చెప్పాడు కమిటీ పెద్ద.

          “ఏ పదం?” అడిగింది సన్నాసి గెడ్డం.

          “తల… కాయ…” గుసగుసగా అన్నారు కమిటీ సభ్యులు.

          “అది కాదండీ… మేము మంచి విద్య అందిస్తాం. వైద్యం అందిస్తాం. నీళ్ళు అందిస్తాం. నిరుద్యోగం తీరుస్తాం. రోడ్లు బాగుచేస్తాం. ఇవి చెప్పాలి కాని మతాన్ని రెచ్చగొట్టి…” సన్నాసి గెడ్డం చెపుతుంటే, “అవన్నీ మాకొద్దు, మా మతం ప్రమాదంలో వుంది. ముందు మా మతాన్ని కాపాడండి. కాపాడిన వాడే మా నాయకుడు…” కాషాయ కండువా యిప్పుడు వొక్కటి కాదు.

          “మరి దేముడు… రాముడు?” ఆందోళనగా సన్నాసి గెడ్డం.

          “నిన్నటి వరకు దేముడెవడికి తెలుసు? రాముడెవడికి తెలుసు? తెలిసినా యింత తెలుసా? ఇంత భక్తా? ఇంత భక్తి ముందుందా? అంతా మా మోడీగారు వచ్చాకే!” భక్తులందరిదీ వొకే స్వరం.

          విచారణ కమిటీ ముందున్న జనాలను చూస్తే, రాముడి కంటే మోడీ గొప్పవాడు అనిపించింది కమిటీ పెద్దకి.

          భక్తులలోంచి వెల్లువెత్తుతున్న గొంతుల్నే రిపోర్టుగా రాసేశాడు కమిటీ పెద్ద, తోటి కమిటీ సభ్యులు కూడా ‘సముచితం’ అన్నారు.

          తృప్తిగా రిపోర్ట్ చూసుకున్నారు.

          ‘హి ఈజే టెర్రరిస్ట్ అండ్ అర్బన్ నక్సలైట్, బట్ హి క్లైమ్స్ టు బీ యే హిందూ’

          విచారణ ముగిసింది!

Leave a Reply