ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు గంగూలీ, వందేమాతర గేయం ప్రస్తావనలు వచ్చినప్పుడల్లా మీడియా డెస్కులు వేరయ్యేవి. బెంగాలీల అక్షరమాలలో ‘వ’ లేదు కాబట్టి సౌరభ్ గంగూలీ అని రాయాలని ఇన్చార్జి అంటే, అలాగయితే… మనం బందేమాతరం అనాల్సిందేనని వాదించేవాళ్ళం. యుపీ, బిహార్ వాసులతో బందేమాతరం అనిపించాలని సరదాగా అనేవాళ్లం.
వందేమాతరం పార్లమెంటు చట్టం ద్వారా రాజ్యాంగబద్ధతను పొందిన తర్వాత ఇప్పుడు అలాంటి సరదాలకు సాధారణంగానే తావు లేదు. వందేమాతరమా… బందేమాతరమా? ఆ గేయంలోని రెండు పాదాలు పాడాలా లేక మొత్తం ఆరూ ఆలపించాలా అనే చర్చకూ వీల్లేని వాతావరణంలోకి మనమంతా ప్రవేశించాం. బహుళత్వాన్ని ఏకరూపకత వడివడిగా ఓడిస్తున్న సందర్భం ఇది.సంఘీ సభ్యులు ఒకరిద్దరు ఉండేవారుగానీ, వారి ప్రభావం పెద్దగా డెస్క్‌లపై లేని కాలం ఒకటి ఉండేది. నిజంగానే వారి ప్రభావం లేదా! లేక లేనట్టు అనిపించేదా? తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ కాశీకి చెందిన సంస్కృత పండితుల కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్న చిత్రాలు ఇటీవల బయటకు వచ్చాయి. నెహ్రుగారి సైంటిఫిక్ టెంపర్‌మెంట్ రాజ్యాంగంలోకీ చేరిన వైజ్ఞానిక శకం నాటి ముచ్చట ఇదనేది మరవరాదు.
జాతి సంఘటీకరణకు ఒక హిందూ దేవత స్తుతి గేయాన్ని మొదట పాడించిన వాడు నెహ్రూ. జాతీయ భావన విస్తరణకు వినాయకుడి నిమజ్జనాల సంప్రదాయం ప్రారంభించింది తిలక్. బనియాల గణపతిని అందరి వాడిని చేసింది జాతీయోద్యమం. హిందూ బ్రాహ్మణీయ ఆధిపత్య భావనను కాంగ్రెస్‌లో అంబేడ్కర్, జిన్నా, ముస్లిం లీగ్ కనుగొనడం మిథ్య కాదు, అది వాస్తవం. రెండు విభజనలను చూసి, వలస పాలన లోతులను తనలో దాచుకున్న 151 ఏళ్ల వందేమాతరం చరిత్రే దీనికి సాక్ష్యం.
ఒక ‘రాజద్రోహ’ గేయం రాజ్యాంగబద్ధతను పొందటం విరోధాభాస.
రాజు అధికారాన్ని ఎదిరించిన గేయం. బ్రిటిష్ విభజన కుట్రను ఛేదించిన గేయం వందేమాతరం. దానిలో దాగిన చారిత్రక
అంశాలు సంఘీయులకు కలిసివచ్చేవే అయినా, జనగణమన లాంటి వినయ విధేయ చచ్చు
గీతమైతే అది కాదు.
బెంగాల్‌ను పాలించిన నవాబుల కాలంలో బంకింబాబు రాసిన నవల ఆనందమఠ్
లోని ఆరు పదాల గేయం అది. సందర్భం బెంగాలీ ధాతు కరువు. ఆకలికి తాళలేక మట్టి, విషముష్టికాయలను తిన్న దుర్భర కరువు పరిస్థితులను బెంగాల్ చూసింది.
మరోవైపు గోళ్లు ఊదగొట్టి పన్నులను నవాబులు వసూలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా సాధువులు చేసిన తిరుగుబాటుకు వందేమాతరం బాణి కట్టింది.
అప్పుడు అక్కడ ముస్లింలు ప్రభువులుగా ఉండటం సంఘీయులకు కలిసి వచ్చింది. అయితే, అప్పటికే శతాబ్దానికి పైగా తెల్లవారి గుప్పిట్లో నవాబుల జుట్టు ఉందనేది నాగపూర్ వర్సిటీ దాచిపెడుతుంది.
ఆ మాటకొస్తే మన హైదరాబాద్ సంస్థానం ప్రభువు నిజాం అంత దుర్మార్గుడు నవాబ్ మీర్ జాఫర్. చరిత్రలో ప్లాసీ యుద్ధంగా పిలిచే దొంగ యుద్ధంలో సిరాజుద్దౌలాను ఈస్ట్ ఇండియా కంపెనీ మందుగుండు సాయంతో వధించి దలవాయి మీర్ జాఫర్
గద్దెనెక్కాడు. ఆ క్షణమే బెంగాల్ తెల్లవారి వశమైపోయింది. అందువల్లే బెంగాలీల చరిత్రలోనే అత్యంత అప్రతిష్ఠపాలైన ప్రభువు అతడు.
రాజకీయాల్లో వెన్నుపోటుకు, వంచనకు, ద్రోహచింతనకు మీర్ మెటాఫర్. అలాంటి నవాబుకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటులో నైతిక, ధార్మిక బలం ప్రసాదించాలంటూ కాళీమాతను ప్రార్థిస్తూ రాసిన గేయం వందేమాతరం.
అయితే అక్కడ బెంగాలీలు ముస్లిం కాబట్టి ప్రభువును ఎదిరించారా? లేక తనకే ఒక ద్రోహ చరిత్ర కలిగిన వలస పాలకుల కీలుబొమ్మను ఎదుర్కొన్నారా? అతడు ముస్లింలకు ఏ విధంగానూ ప్రతినిధి కాదు. అలాంటప్పుడు ముస్లింలతో బలవంతంగా, ఇప్పుడైతే చట్టంతో భయపెట్టి మరీ వందేమాతరం పాడించాలన్న పట్టుదల ఎందుకు? చరిత్ర
పునఃమూల్యాంకనం అంటే, ఆ చరిత్రలో భాగమైన వారి మత సంబంధ భావోద్వేగాలు, అప్పటి అనివార్యతలను తప్పు పట్టడం కాదు. ఆ పరిమితులను వదిలించుకుని ముందుకు దూకిన కాలాన్నీ, ఆ క్రమపు విప్లవ తత్వాన్నీ నిర్దిష్టంగా పసిగట్టి సొంతం చేసుకోవడమే సరైన చారిత్రక దృక్పథం అవుతుంది.
ప్రత్యేక ఉత్పత్తి విధానంలో అభివృద్ధి చెందిన తెలంగాణ సమాజం ఫ్యూడల్ శక్తులతోను, తిరోగమన, ప్రతిరోధక భావజాలంతోను ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఒక కాలంలో ఉధృతంగా సాగుతున్న అలాంటి పోరాటాలకు పోటీగా వందేమాతరాన్ని
ఏబీవీపీ విద్యార్థులు నిలబెట్టారు.
పోసపోసిన దేశభక్తి, జాతీయ భావన, సమైక్య స్ఫూర్తికి వందేమాతరం ప్రతీక అంటూ ప్రచారాన్ని లంఘించుకున్నారు. దానిని పాడనివాడిని దేశద్రోహిగా ముద్రవేసి దాడులు చేసేవారు. వందేమాతరం చారిత్రకతను కొత్త పోరాట సందర్భంలో విశ్లేషించిన రాడికల్స్ దానికి ఉన్న విప్లవ తత్వాన్ని ముందుకు తెచ్చి సంఘీయుల ప్రచారాన్ని సమరశీలంగా తిప్పికొట్టారు. తొలినుంచీ సామ్రాజ్యవాదుల తొత్తులుగా వ్యవహరిస్తున్న సంఘ్ రాజకీయ రంగును బయటపెట్టారు. విరసం కవి ఎన్.కే. “లాల్ బనో గులామీ ఛోడో బోలో వందేమాతరం” దీర్ఘ కవిత ఈ నేపథ్యం నుంచే వచ్చింది.
1905 బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంతో ప్రాచుర్యం పొందిన వందేమాతరం… ఆ విభజన కుట్ర భగ్నమై రాజధాని 1911లో కలకత్తా నుంచి ఢిల్లీకి మారడంతో ఆ ప్రాంతంతోపాటే రాజకీయ వేదిక నుంచి కనుమరుగైంది. ముంబై, గుజరాత్ బనియాల దన్నుతో జాతీయోద్యమం కొత్త రంగులు, కొత్త నినాదాలను అందుకుంటున్న దశలో తిరిగి ఆ భూతాన్ని తట్టి లేపినవాడు నెహ్రూ. ఒక హిందూ దేవత స్తుతి గీతాన్ని
దేశమంతా ఎలా పాడుతుందనే సమస్య ముందుకు వచ్చినప్పుడు నెహ్రూ చూసిన పరిష్కారమే ఇప్పుడు సంఘీ కేంద్ర సర్కారుకు కంటగింపుగా ఉంది. ఆరు పాదాల ఆ గేయంలోని పూర్తిగా కాళీ ఆరాధనతో నిండిన నాలుగు పాదాలు వదిలేసి. తక్కిన రెండు పాదాలను కాంగ్రెస్ సభల్లో పాడేవారు. ఆ తర్వాత కూడా ఆ సంప్రదాయం కాంగ్రెస్ లో కొనసాగింది. అయితే వందేమాతరం చట్టం అయ్యాక జరిగిన తొలి పంద్రాగస్టు వేడుకలో ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం లో ఆరు పాదాలు వినిపించడం, అందుకు సోనియా అభ్యంతరం తెలపడం, కాకతాలీయంగా ఆమె విదేశీ, క్రైస్తవ నేపథ్యం… బీజేపీకి, నాగపూర్ వర్సిటీకి కావాల్సినంత మసాలాను అందించింది.
ఆ మాటకొస్తే మొదటినుంచీ వందేమాతరం సంఘీయుల అస్త్రంగానే ఉంది. ఇప్పుడు వారు దానిని బయటకు తీసిన సందర్భమే కొత్తది.
సెంటిమెంటల్‌గా బెంగాలీ మానసికతను గెలుచుకోవడానికి, ఆర్థికంగా, రాజకీయంగా ఆ సమాజాన్ని వెనక్కు నెట్టిన ప్రత్యేక చారిత్రక పరిస్థితులకు కారణమంటూ తనకు నచ్చని భావజాలాన్ని, తనకు నచ్చని ఇతర మతాలను టార్గెట్ చేయడం సంఘ్ సుదీర్ఘంగా అనుసరిస్తున్న ఎత్తుగడ.
అయితే, బెంగాల్ సమాజంలోని సంక్లిష్ట పెట్టుబడిదారీ సంబంధాలు హిందుత్వ ప్రయత్నాలకు గట్టి సవాల్‌ను విసిరాయి. తొలితరం బూర్జువావర్గం తలెత్తుతూ, జౌలీ, జనపనార మిల్లులతో స్వతంత్ర పెట్టుబడికి బీజాలు పడిన భారతీయ తొలి నగరాల్లో కలకత్తా ఒకటి కావడంతో సంప్రదాయ శక్తులకు రాజకీయ అనుకూలతలు అక్కడ తక్కువ.
అలాగే కొంతమేర అమలైన భూసంస్కరణల కారణంగా ఏపీ, తెలంగాణలో దొరికినంత తేలిగ్గా బెంగాల్‌లో మార్కెట్ శక్తులకు భూములు దొరకడం కష్టం అయింది. ఈ నేపథ్యంలో సంఘ్ అక్కడ పని ప్రారంభించింది. చాలాకాలం సుభాష్ చంద్రబోస్ ప్రతిష్ఠ వాడుకుని బలపడే ప్రయత్నం చేసింది. సోనియా విదేశీయతను ప్రశ్నించి కాంగ్రెస్ ను వీడిన మమతాబెనర్జీ ద్వారా బెంగాల్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. ఆమెను కేంద్రంలో మంత్రిని కూడా వేసింది. చివరకు తాము ఇచ్చిన భూములను టాటాల కోసం తామే లాగేసుకుని బెంగాలీ కమ్యూనిస్టులు పూర్తిగా అప్రతిష్ఠపాలయిన తర్వాతే మమత ద్వారా సంఘ్‌కు సూది మొనంత చోటు కాలు మోపేందుకు దొరికింది. ఇంతై వటుడంతై అన్నట్టు మూడు విడతల సీఎం మమతను నవ వామనావతారంలో భూస్థాపితం చేసింది. ఒక అడుగు ఈడీ, సీబీఐ వాషింగ్ మెషిన్, రెండో అడుగు సర్ రూపంలో పడితే. ఆ పార్టీని నిలువునా చీల్చి మూడో అడుగు తో ఆపరేషన్ పూర్తి చేసింది.ఈ క్రమమంతా వందేమాతరం రాజకీయాల చుట్టూనే నడిచింది.
75 ఏళ్ల పంద్రాగస్టు సందర్భం, ఆ గేయానికి 150 ఏళ్లు నిండిన సన్నివేశాల్లోకి బెంగాల్ సహా దేశాన్నంతా సంఘీయులు దింపేశారు. దీనికి పరాకాష్టగా, జనగణమన, జాతీయ జెండాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన చట్టానికి సవరణ చేసి ఆ జాబితాలో వందేమాతరాన్ని చేర్చారు.
ఆ గేయ ఆలాపనకు ఎటువంటి భంగం కలిగించినా, జైలులో పడేయడం ఆ చట్ట సవరణ సారాంశం. బీజేపీని వ్యతిరేకించే మమత తృణమూల్ కాంగ్రెస్ వందేమాతరాన్ని కాదన లేదు కదా! అందువల్లే పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు ఆ బిల్లును ఆ పార్టీ (మమత) ఎంపీలు ఎదురెళ్లి స్వాగతించారు.
నిజానికి, ఆ సమయానికి మమత పార్టీ కార్యాలయాలు, కార్యకర్తలు, ఎంపీలపై బెంగాల్‌లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఓ కేసులో విచారణ కోసం తన నియోజకవర్గం కృష్ణనగర్ వెళ్లడానికి ఎంపీ మహువా మొయిత్రా భయపడి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
కోడిగుడ్లతో సంఘీయులు దాడి చేస్తారని ఆమె అన్నప్పుడు, సుప్రీంకోర్టు గొప్ప మాట సెలవిచ్చింది. స్వాతంత్ర్య సమరయోధులు తుపాకీ గుళ్లకు భయపడలేదు.. మీరేంటి కోడిగుడ్లకు జంకుతున్నారని ఎద్దేవా చేసింది. ఆమె ఇంకా కోర్టు హాలులోనే ఉంటే, వందేమాతరం అని జడ్జీలు బిగ్గరగా అరిచేవారేమో!
తృణమూల్ కార్యకర్తలు, బంగ్లాదేశ్ సరిహద్దు అంచుల్లోని ముస్లిం సముదాయాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్టు బెంగాల్ నుంచి వార్తలొస్తున్నాయి. అయితే దిగ్భ్రాంతికి గురిచేస్తున్న ఇలాంటి వార్తల మధ్య బెంగాల్‌ను విద్వేష కాటునుంచి దేహాలను అడ్డుపెట్టి కాపాడుకుంటున్న వారి ఉదంతాలూ వెలుగు చూస్తున్నారు.
స్టేజ్ ఆర్టిస్ట్ శుభాంకర్ దాస్ శర్మ తాను ముస్లింను కాదు అని చెప్పడానికి నిరాకరించి చావుదెబ్బలు తిన్నాడు. జూలై 28 రాత్రి ప్రదర్శన ముగించుకుని బస్సు కోసం నార్త్ 24 పరగణాల జిల్లా కేంద్రంలోని శ్యామనగర్‌లో నిలబడిన ఆయనను కొంతమంది చుట్టుముట్టారు.
ఆయన ధరించిన ఖాకీ కుర్తా పైజమా గురించి నిలదీశారు. “నువ్వు ముస్లింవా?” అని వారు వేసిన ప్రశ్నకు, “కాదు” అని ఒక్కమాట చెబితే అక్కడినుంచి బయటపడేవాడే. కానీ, అలా చేయడం ముస్లింలను మరింత ప్రమాదంలోకి నెట్టేయడం అవుతుందని ఆయన భావించారు.
“ఏం ఖాకీ కుర్తాలు ముస్లింలే వేసుకుంటారా? నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ యూనిఫాం కూడా అదే కదా..” అంటూ వారిని శుభాంకర్ ఎదుర్కొన్నాడు. ఎన్ని సార్లు గద్దించినా తన మత అస్తిత్వం బయట పెట్టడానికి ససేమిరా అన్నాడు.
ఆగ్రహంతో ఆ మూక ఎంతగా దాడి చేసిందంటే ఆయన ముఖం, కంటి భాగం, కర్ణభేరీల నుంచి నెత్తురు స్రవించింది. దెబ్బలు తప్పించుకోవడానికి నేల మీద బోర్లా పడుకుని చేతులు అడ్డుపెట్టుకుంటే, పక్కటెముకలు విరిగేలా కాళ్లతో తన్నారు.
ఈ దాడిలో ఆయన చెవుల లోపలి భాగం బాగా దెబ్బతిందని, తక్కిన శరీర భాగాల్లో లోతైన గాయాలు గుర్తించామని వైద్యులు చెబుతున్నారు. ఆయనకు కనీసం రెండు, మూడు సర్జరీలు అవసరం అవుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఆయనకు రెండు చెవులూ వినిపించడం లేదు.
కళాకారుడికి, ప్రజలకూ మధ్య సంబంధం ప్రదర్శనతో మొదలై, దానితోనే ముగిసేది కాదు. తన జీవితాన్నే కళాకారుడు వేదికపై ప్రదర్శిస్తున్నాడని ప్రజలు భావిస్తారు. హాల్లో జనం శ్వాస వింటూ తమ నటనకు కళాకారులు ప్రాణం పోస్తారు.
ఈ బంధం రంగస్థల వేదికనుంచి సమాజంలోకీ విస్తరించినప్పుడే అది నిజమైన కళ అవుతుంది. వారు నిజమైన కళాకారులు అనిపించుకుంటారు. శుభాంకర్ అలాంటి నిజమైన కళాకారుడు.
వందేమాతర రాజకీయాలను ఓడించే కళను ఇలాంటివారి నుంచే మనం అభ్యసించాలి.




