ప్రతి సంవత్సరం భారతదేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఒకే విధమైన హామీ ఇస్తున్నారు : ఇప్పుడు కష్టపడి చదవండి, అవసరమైన త్యాగాలు చేయండి, అప్పుడు విద్య మీకు మెరుగైన భవిష్యత్తును అందిస్తుంది. ఈ ఆశతో కుటుంబాలు పాఠశాల ఫీజులు, కోచింగ్ సెంటర్లు, పోటీ పరీక్షల కోసం భారీ మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తున్నాయి. విద్యార్థులు తమ సామాజిక జీవితాన్ని, అభిరుచులను, తగిన నిద్రను కూడా త్యాగం చేస్తూ పగలు-రాత్రి కష్టపడి చదువుతున్నారు. తమ శ్రమకు చివరకు ఫలితం దక్కుతుందని ఆశిస్తూ పోటీ పరీక్షలను ఎదుర్కొంటున్నారు.

కానీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రశ్నాపత్రాల లీకులు సంవత్సరాల తరబడి చేసిన సాధనని నాశనం చేస్తున్నాయి. పట్టభద్రులు, పీజీ విద్యార్థులు, చివరకు పీహెచ్‌డీ చేసిన వారు కూడా స్థిరమైన ఉపాధి కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు క్రమంగా బలహీన పడుతున్నాయి. ఒక తరం మొత్తాన్ని అంతులేని పోటీ లోకి నీటి వేస్తున్నారు, ఆ పోటీకి ముగింపు ప్రతిసారీ మరింత దూరమవుతోంది.

మన విద్యా వ్యవస్థలోని అన్ని సమస్యల మూలం ఒకే ప్రశ్నలో ఉంది: విద్య యొక్క అసలు ప్రయోజనం ఏమిటి?

ఒకవైపు, విద్యను కోట్లాది కుటుంబాల సంపదను పీల్చుకునే లాభదాయకమైన పరిశ్రమగా మార్చారు. అదే సమయంలో పెట్టుబడి వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా పనిచేసే భారీ కార్మిక శక్తిని తయారు చేసే సాధనంగా కూడా మార్చారు. మరోవైపు, ఎప్పటిలాగే, ఇది పాలక వర్గాల భావజాల ప్రచారానికి సమర్థవంతమైన సాధనంగా మారింది.

స్వాతంత్ర్యానికి ముందు, ఆ తరువాత భారతదేశ విద్యా చరిత్ర ఎంతో మార్పులతో కూడుకున్నది. భారతీయ విద్యా వ్యవస్థను పరిశీలిస్తే దానిని ప్రధానంగా ఈ కొన్ని దశలుగా విభజించవచ్చు:

  1. ప్రాచీన భారతదేశ విద్యా వ్యవస్థ
  2. వలస పాలనా కాలంలోని విద్యా వ్యవస్థ
  3. స్వాతంత్ర్యం తరువాతి భారతదేశ విద్యా వ్యవస్థ

ప్రాచీన భారతదేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా వేద విధానంపై ఆధారపడి ఉండేది. గురుకులాలు ప్రధాన విద్యా కేంద్రాలుగా ఉండేవి. గురుకుల వ్యవస్థ భారతదేశంలో మతపరమైన, కుల ఆధారిత విద్యా నిర్మాణానికి పునాది వేసింది. తరువాత కాలంలో ఈ విధానాన్ని ఇస్లామిక్ పాలకులు మదర్సాల రూపంలో కొనసాగించారు.

అయితే 1813 నాటి చార్టర్ చట్టం తరువాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ చట్టం కింద ఈస్ట్ ఇండియా కంపెనీ శాస్త్రీయ విద్యా వ్యవస్థను ప్రోత్సహించడానికి, దానిని  అమలు చేయడానికి నిధులను కేటాయించింది.

ఆ తర్వాత 1854 నాటి వుడ్ డిస్పాచ్ ప్రజా విద్య విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చింది. దీని ఫలితంగా బాంబే, మద్రాస్ కలకత్తా లో మూడు ప్రధాన విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి.

తరువాత 1904 నాటి ఇండియన్ యూనివర్సిటీస్ చట్టం ద్వారా విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నియంత్రణ పెరిగింది. వాటి పరిపాలన, పనితీరును మెరుగుపరచడానికి కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టారు.

1947లో అధికార మార్పిడి తరువాత విద్యను కనీసం అధికారికంగా అయినా ప్రజా బాధ్యతగా పరిగణించారు. 1964-66 మధ్య పనిచేసిన కోఠారి కమిషన్ విద్యను సామాజిక మార్పుకు శక్తివంతమైన సాధనంగా పేర్కొంది. సమానత్వాన్ని పెంచేందుకు “కామన్ స్కూల్ సిస్టమ్” (Common School System) ను ప్రతిపాదించింది.

అయితే ఈ లక్ష్యాలు పూర్తిగా అమలు కాలేదు. తీవ్రమైన దోపిడీ, అసమానతలతో కూడిన సమాజంలో పాలక వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్రం పనిచేసింది. అయినప్పటికీ, విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అనే భావన కనీసం గుర్తింపుకి నోచుకుంది.

1976 నుండి భారత పాలక వర్గాలు విద్యా వ్యవస్థపై మరింత నియంత్రణ సాధించేందుకు ప్రయత్నించాయి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ పని చేయడానికి పూనుకుంది. 1976కు ముందు విద్య పూర్తిగా రాష్ట్ర జాబితాలోని అంశంగా ఉండేది.

అయితే ఈ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితా (Concurrent List) లోకి మార్చారు. ఈ చర్యను అనేక విమర్శకులు భారత సమాఖ్య వ్యవస్థపై దాడిగా భావించారు.

దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విద్యపై చట్టాలు చేయగలిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ప్రభావం గణనీయంగా పెరిగింది. ఈ మార్పు పెట్టుబడిదారీ వర్గాలు, ప్రైవేటు రంగానికి చెందిన వారికి, భారతదేశంలోని ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా మారిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు.

వారి దృష్టిలో, ఈ కేంద్రీకరణ విద్యా విధానాలను మార్కెట్ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చడానికి మార్గం సుగమం చేసింది.

42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా వ్యవస్థలో కేంద్రీకరణ పెరిగిన తరువాత ప్రపంచ బ్యాంకు పాత్ర మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచ బ్యాంకు ప్రధానంగా ప్రపంచ పెట్టుబడి మార్కెట్లను సులభతరం చేయడానికి, వాటిని రక్షించడానికి పనిచేసే సంస్థగా వ్యవహరిస్తుంది కానీ విద్యా సమానత్వాన్ని సాధించడమే దాని ప్రధాన లక్ష్యం కాదు.

ఈ దృక్పథం ప్రకారం, భారతదేశంలోని అణగారిన వర్గాల విద్యా అవసరాలను పరిష్కరించడంలో ప్రపంచ బ్యాంకు విధానపరంగా అయినా నిర్మాణాత్మకంగా అయినా ఆసక్తి చూపలేదు.

1980ల నుండి ప్రపంచ బ్యాంకు అనేక వలసానంతర దేశాలలో విద్యా విధానాలపై ప్రభావం చూపడం ప్రారంభించింది. భారతదేశంలో కూడా అనేక విద్యా సంస్కరణలు ఈ విధాన సూచనలకు అనుగుణంగా ప్రవేశ పెట్టారని విమర్శకులు పేర్కొన్నారు.

1986లో భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ – ఎన్ పి ) ను ప్రవేశపెట్టింది. ఈ విధానం పైకి చూస్తే సామాజిక న్యాయం, శాస్త్రీయ విద్య, కుల అసమానతలు, లింగ వివక్ష వంటి సమస్యలను పరిష్కరించడానికి అన్నట్టు ప్రగతిశీలంగా కనిపించింది.

అయితే విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ఇదే కాలం నుండి భారత విద్యా రంగంలో ప్రైవేటు రంగం ప్రవేశించి వ్యవస్థీకృత రూపం తీసుకోవడం ప్రారంభమైంది.

1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణలు — సరళీకరణ (లిబరలైజేషన్), ప్రైవేటీకరణ (ప్రైవేటైజషన్), ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) లేదా ఎల్ పి జి విధానం తరువాత ఈ ధోరణి మరింత వేగవంతమైంది.

ఈ విధానాల కింద విద్యా రంగంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పి పి పి ) నమూనాలు పెరిగాయి. విమర్శకుల ప్రకారం, ఈ మార్కెట్ ఆధారిత సంస్కరణలు ప్రపంచ బ్యాంకు ప్రైవేటీకరణ విధానాలకు అనుగుణంగా ఉన్నాయి.

వారి అభిప్రాయం ప్రకారం, ఈ విధానాలు విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి బదులుగా:

  • విద్యలో అసమానతలను పెంచాయి
  • బహుస్థాయి విద్యా వ్యవస్థను బలపరిచాయి
  • అణగారిన వర్గాలను మరింత వెనుకకు నెట్టాయి

మార్కెట్ శక్తులు విద్యా ప్రాధాన్యతలను నిర్ణయించడం ప్రారంభించడంతో, అందరికీ సమానమైన, నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించాలనే రాజ్యాంగ లక్ష్యం బలహీనపడిందని విమర్శకులు అంటున్నారు.

1995లో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ (జి ఏ టి టి) స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు టి ) ఏర్పడింది. భారతదేశం దాని స్థాపక సభ్య దేశాలలో ఒకటిగా నిలిచింది.

విమర్శకుల దృష్టిలో, డబ్ల్యు టి లో భారతదేశం భాగస్వామ్యం, విద్యా రంగాన్ని ప్రపంచ పెట్టుబడులకు మరింత అనుకూలంగా మరింత తెరిచింది.

దీని ఫలితంగా విద్య :

  • సామాజిక మార్పుకు సాధనంగా కాకుండా
  • ప్రపంచ కార్మిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పనిచేసే రంగంగా మారింది

అంటే విద్య యొక్క ప్రధాన లక్ష్యం ప్రజాస్వామ్య అభివృద్ధి, సమాజ నిర్మాణం కాకుండా, అంతర్జాతీయ పెట్టుబడులకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారు చేయడంగా మారిందని విమర్శకులు భావిస్తున్నారు.

ఇటాలియన్ మార్క్సిస్టు ఆలోచనాపరుడు ఆంటోనియో గ్రాంసీ తన “సాంస్కృతిక ఆధిపత్యం” (కల్చరల్ హేజమోనీ) సిద్ధాంతంలో విద్య పాలక వర్గాల భావజాల ఆధిపత్యాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించాడు.

గ్రాంసీ ప్రకారం:

  • ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ (Organic Intellectuals) ప్రస్తుత శక్తి నిర్మాణాలను సమర్థించే భావజాలాన్ని పునరుత్పత్తి చేస్తారు.
  • ప్రజా మేధావులు (Public Intellectuals) ఆధిపత్య భావజాలానికి ప్రత్యామ్నాయమైన ప్రతిఘటన భావజాలాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

ఈ సిద్ధాంతాన్ని భారతదేశ విద్యా వ్యవస్థకు అన్వయిస్తే, కొంతమంది విమర్శకుల అభిప్రాయం ప్రకారం, విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులు, వైస్ ఛాన్సలర్ల నియామకాలు కేవలం విద్యా అర్హతల ఆధారంగా కాకుండా రాజకీయ, భావజాల అనుబంధాల ఆధారంగా ప్రభావితం అవుతున్నాయి.

అందువల్ల పరిశోధన, బోధనలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన అనేక మంది విద్యావేత్తలు రాజకీయ అనుకూలత లేకపోవడం వల్ల అవకాశాలను కోల్పోతున్నారని విమర్శలు ఉన్నాయి.

అదే సమయంలో, ప్రభుత్వ విధానాలను విమర్శించే ప్రజా మేధావులు నిఘా, కేసులు ఇంకా అరెస్టులను ఎదుర్కొంటున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు.

ఉదాహరణగా: ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే లాంటి వారి పేర్లను తరచుగా ప్రస్తావిస్తారు.

(జి.ఎన్. సాయిబాబా అనేక సంవత్సరాలు జైలులో గడిపిన తరువాత విముక్తి పొందారు. ఆనంద్ తేల్తుంబ్డే ప్రముఖ రచయిత, పరిశోధకుడు, ప్రజా మేధావిగా గుర్తింపు పొందారు.)

విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ఇటువంటి ఘటనలు ఉన్నత విద్యా రంగంలో విమర్శనాత్మక ఆలోచన, ప్రజాస్వామ్య చర్చలకు స్థలం తగ్గుతున్నదనే సంకేతాలుగా ఉన్నాయి.

కాలక్రమేణా విద్యను సమాజం అందించాల్సిన హక్కుగా కాకుండా, వ్యక్తిగత పెట్టుబడిగా చూడటం ప్రారంభమైంది.

“ఉద్యోగ సామర్థ్యం”, “నైపుణ్యాలు”, “పోటీతత్వం”, “మానవ మూలధనం” వంటి పదాలు విద్యా విధానాలలో ప్రధానంగా మారాయి.

విద్య లక్ష్యం:

  • ఆలోచించే పౌరులను తయారు చేయడం నుండి,
  • మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పనిచేసే నైపుణ్యం కలిగిన కార్మికులను తయారు చేయడం వైపు మారింది.

దీని ఫలితంగా:

  • ప్రైవేటు పాఠశాలలు విస్తరించాయి,
  • ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పెరిగాయి,
  • ఎడ్యుటెక్ కంపెనీలు విద్యా రంగంలోకి వచ్చాయి.

నాణ్యమైన విద్య పొందడం కుటుంబ ఆర్థిక సామర్థ్యంపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ విద్యా సంస్థలు తగిన నిధుల కొరతతో బలహీనపడుతూ వచ్చాయి.

ఇది కేవలం ప్రభుత్వం వెనక్కి తగ్గడం కాదు. మార్కెట్ ప్రయోజనాలకు అనుగుణంగా విద్యను పునర్వ్యవస్థీకరించడంలో ప్రభుత్వం కూడా చురుకైన పాత్ర పోషించిందని విమర్శకులు అంటున్నారు.

ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడానికి బదులుగా:

  • ప్రైవేటు నిధులను పొందాలని,
  • కార్పొరేట్ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని,
  • మార్కెట్ సూత్రాల ప్రకారం పనిచేయాలని

విద్యాసంస్థలను ప్రోత్సహించారు.

ఈ విధంగా విద్య ఒక సామాజిక బాధ్యత నుండి వ్యాపార అవకాశంగా మారింది.

2014లో బి జె పి అధికారంలోకి వచ్చినప్పుడే భారత విద్యా వ్యవస్థలో మార్కెట్ ఆధారిత మార్పులు ప్రారంభం కాలేదు. అయితే, బి జె పి పాలనలో ఈ ప్రక్రియ మరింత వేగవంతమైందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో హిందూత్వ భావజాల ప్రాజెక్టుతో విద్యను అనుసంధానించే ప్రయత్నాలు కూడా పెరిగాయి.

ఆర్థిక పునర్వ్యవస్థీకరణ, భావజాల నియంత్రణ రెండూ ఒకేసారి కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ – ఎన్ పి) 2020 ఈ దిశలో అత్యంత స్పష్టమైన ఉదాహరణగా విమర్శకులు భావిస్తున్నారు.

ఈ విధానం ఆధునికమైనది, మార్పును తీసుకువచ్చేది అని ప్రచారం చేసినప్పటికీ, ఇందులోని:

  • వృత్తి ఆధారిత విద్య (వొకేలైజషన్),
  • పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు,
  • డిజిటల్ విద్య,
  • మార్కెట్ ఆధారిత దృక్పథం.

విద్యను పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా మార్చుతున్నాయి.

విశ్వవిద్యాలయాలకు “స్వయంప్రతిపత్తి” (అటానమి) ఇచ్చినప్పటికీ, తగిన ప్రభుత్వ నిధులు లేకుండా ఈ స్వయంప్రతిపత్తి చివరకు: అధిక ఫీజులు, కార్పొరేట్ల పై ఆధారపడటం, ప్రైవేటీకరణకు దారితీస్తుంది.

విద్య లక్ష్యం కూడా సమాజంపై విమర్శనాత్మక అవగాహన కలిగిన పౌరులను తయారు చేయడం నుండి, మార్కెట్ అవసరాలకు త్వరగా సరిపోయే ఉద్యోగులను తయారు చేయడం వైపు మారుతోందని వారు భావిస్తున్నారు.

ఈ ఆర్థిక మార్పుతో పాటు విద్యా వ్యవస్థలో భావజాల మార్పు కూడా జరుగుతోందని విమర్శలు ఉన్నాయి.

పాఠ్యపుస్తకాల మార్పులు, చరిత్రలో కొన్ని అంశాల తొలగింపు లేదా పునర్వ్యాఖ్యానం, విద్యాసంస్థలలో కొత్త పరిపాలనా విధానాలు వంటి అంశాలు ఈ ప్రక్రియలో భాగం.

 సిడ్నీ వెర్బా గాబ్రియేల్ ఆల్మండ్  రాజకీయ సామాజికీకరణ (పొలిటికల్ సోషలైజేషన్) సిద్ధాంతంలో పాఠశాల స్థాయి నుంచే రాజకీయ అవగాహన రూపుదిద్దుకుంటుందని వివరించారు.

ఈ సిద్ధాంతాన్ని భారతదేశానికి అన్వయిస్తే, విమర్శకుల ప్రకారం, విద్యా వ్యవస్థలో విమర్శనాత్మక ఆలోచనకు బదులుగా విధేయతను పెంచే విధానం అభివృద్ధి చెందుతోంది.

విద్య లక్ష్యం కేవలం విద్యార్థులను విద్యావంతులను చేయడం కాదు, ఆర్థికంగా ఉపయోగపడే రాజకీయంగా ప్రశ్నించని పౌరులను తయారు చేయడం.

భారత విద్యా వ్యవస్థలోని తీవ్రమైన సంక్షోభాన్ని పేపర్ లీక్ సంఘటనలు బయటపెడుతున్నాయి.

2019 నుండి 2024 మధ్యకాలంలో 15 రాష్ట్రాల్లో కనీసం 41 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఒక అంచనా. వీటి ప్రభావం లక్షలాది మంది అభ్యర్థులపై పడింది.

విద్యార్థులు సంవత్సరాల పాటు చేసిన తమ కృషిని కోల్పోతున్నారు, పరీక్షలు రద్దు కావడంతో మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తోంది. దీనితో పాటు ఫలితాల ఆలస్యం, న్యాయపరమైన పోరాటాలను ఎదుర్కొంటున్నారు.

ఇవి కేవలం అవినీతి సంఘటనలు మాత్రమే కాకుండా, విద్య,  ఉపాధిని కొద్ది అవకాశాల కోసం జరిగే తీవ్రమైన పోటీగా మార్చిన వ్యవస్థ సహజ ఫలితాలని విమర్శకులు అంటున్నారు.

అవకాశాలు పరిమితంగా ఉన్నప్పుడు, అక్రమ మార్గాలు, నేర నెట్‌వర్క్‌లు అభివృద్ధి చెందుతాయని వారు పేర్కొంటున్నారు.

ఎక్కువ మంది యువత విద్యా సంస్థల్లోకి ప్రవేశిస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ తగినంత స్థిరమైన ఉద్యోగాలను సృష్టించలేకపోతోంది.

ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గడం, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరగడం వల్ల పరీక్షలు అవకాశాల పంపిణీ సాధనాలుగా మారాయి.

దీని ఫలితంగా కోచింగ్ పరిశ్రమ భారీగా విస్తరించింది.

కోటా వంటి నగరాలు పోటీ పరీక్షల ఆర్థిక వ్యవస్థకు కేంద్రాలుగా మారాయి.

కోచింగ్ సంస్థలు, ఎడ్యుటెక్ కంపెనీలు విద్యార్థులు వారి కుటుంబాల భయాలు, ఆందోళనలను ఉపయోగించుకుని భారీ లాభాలు పొందుతున్నాయని విమర్శలు ఉన్నాయి.

“మెరిట్” అనే భావన కూడా ప్రశ్నించ తగినదే.

పరీక్షలు అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తున్నాయని చెబుతున్నప్పటికీ, విద్యార్థుల ప్రారంభ పరిస్థితులు ఒకేలా ఉండవు. ధనిక కుటుంబాలకు చెందిన విద్యార్థులకు: మంచి కోచింగ్; ప్రైవేట్ ట్యూటర్లు; డిజిటల్ వనరులు; ఆంగ్ల భాషా పరిజ్ఞానం; అనుకూలమైన విద్యా వాతావరణం అందుబాటులో ఉంటాయి. ఇతర విద్యార్థులు మాత్రం అదే పోటీలో వెనుకబడతారు.

ప్రైవేటీకరణ, మార్కెట్ ఆధిపత్యంతో పాటు హిందూత్వ భావజాలం విద్యా రంగంలోకి ప్రవేశిస్తోందని విమర్శకుల వాదన.

విద్యాసంస్థలు సమాజం తన చరిత్రను, సంస్కృతిని, పౌర గుర్తింపును ఎలా అర్థం చేసుకుంటుందో నిర్ణయించే కీలక ప్రదేశాలు. ఆర్ ఎస్ ఎస్  దీన్ని చాలా కాలం క్రితమే అర్థం చేసుకుని, తరతరాలుగా భావజాల నిర్మాణానికి విద్యను ఉపయోగిస్తోంది.

పాఠ్యపుస్తకాల మార్పులు, విశ్వవిద్యాలయ పరిపాలనలో జోక్యం, పరిశోధనా సంస్థలపై ప్రభావం, శాస్త్రీయ దృక్పథంపై దాడులు వంటి అంశాలు ఈ ప్రక్రియలో భాగం.

“డీకాలనైజేషన్” (వలస విముక్తి) పేరుతో చరిత్రను పునర్నిర్మించడం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి.

వలస పాలన భారత చరిత్రను వక్రీకరించిన విషయం నిజమే. కానీ డీకాలనైజేషన్ అంటే ఒక పురాణాన్ని తొలగించి మరో పురాణాన్ని స్థాపించడం కాదు.

అది:

  • వలసవాదం సృష్టించిన రాజకీయ, ఆర్థిక నిర్మాణాలను అర్థం చేసుకోవడం,
  • కొనసాగుతున్న దోపిడీ వ్యవస్థలను విశ్లేషించడం,
  • చరిత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం.

ఈ అభిప్రాయం ప్రకారం, హిందూత్వ రాజకీయాలు చరిత్రను మతపరమైన విభజనల ఆధారంగా పునర్నిర్మిస్తున్నాయి.

భారతదేశ విద్యా సంక్షోభాన్ని కేవలం కొన్ని సంస్కరణలతో పరిష్కరించలేమని విమర్శకులు అంటున్నారు.

కఠినమైన పేపర్ లీక్ చట్టాలు, కొత్త పరీక్షా విధానాలు, పాఠ్యపుస్తకాల మార్పులు లేదా కొత్త నియంత్రణ సంస్థలు సమస్యల లక్షణాలను మాత్రమే పరిష్కరించగలవు.

మూల సమస్య సమాజ నిర్మాణంలోనే ఉందని వారు వాదిస్తున్నారు.

అసమానతలు, దోపిడీ, లాభాల ఆధారంగా నడిచే సమాజంలో విద్య కూడా అదే పరిస్థితులను పునరుత్పత్తి చేస్తుందని వారి అభిప్రాయం.

ప్రస్తుత వ్యవస్థలో విద్య లక్ష్యం: విముక్తి కలిగించే జ్ఞానాన్ని అందించడం కాదు; క్రమశిక్షణ కలిగిన కార్మికులను తయారు చేయడం; విధేయ పౌరులను సృష్టించడం; లాభాలను పెంచడం అని విమర్శకులు పేర్కొంటున్నారు.

ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకున్న ప్రజాస్వామ్య సమాజంలో మాత్రమే నిజమైన విముక్తి విద్య సాధ్యమౌతుంది

అటువంటి విద్య: శాస్త్రీయమైనది, ప్రజా కేంద్రితమైనది, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించేది, సృజనాత్మకతను ప్రోత్సహించేదిగా ఉండాలి.

విద్య లక్ష్యం మార్కెట్ కోసం చౌకైన కార్మికులను తయారు చేయడం కాకుండా, మానవ సామర్థ్యాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయడం కావాలి.

సిద్ధాంతం ఆచరణ కలిసిపోవాలి. జ్ఞానం ఒక వస్తువుగా కాకుండా సమాజ మార్పుకు ఉపయోగపడే సామూహిక సాధనంగా మారాలి.

విద్యార్థులను అంతులేని పోటీలో నెట్టడం కాకుండా: ఆసక్తి, సృజనాత్మకత, సామాజిక బాధ్యత, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించాలి.

చివరికి, విద్య అనేది మనం నిర్మించాలనుకునే సమాజంతో విడదీయరాని సంబంధం కలిగి ఉంది.

దోపిడీ సమాజానికి పునాది అయినంత కాలం విద్య కూడా దోపిడీ సాధనంగానే కొనసాగుతుంది.

ప్రజలచే సృష్టించిన, ప్రజల మధ్య పంపినీ చేసిన, ప్రజల సమిష్టి విముక్తికి ఉపయోగపడే జ్ఞానం ఆధారంగా మాత్రమే నిజమైన విముక్తి విద్య సాధ్యమవుతుంది.

Leave a Reply