అల్లకల్లోలంగా ఉన్న ప్రచండమైన గాలి 
ఆఫ్రికా కికియులోని పసుపు రంగు గోధుమ పంట నేలను జంతువు చర్మంలా కదిలిస్తోంది.
అచ్చం గుంపుల్లో కదిలే ఈగల్లా, పుష్టిగా పెరిగిన ఆఫ్రికా విశాలమైన గడ్డి మైదానాల్లో
ఉధృతంగా పారే రక్తపుటేరుల్లా స్వర్గంలో శవాలు చెల్లాచెదురై పడి ఉన్నాయి
~
ప్రజలు ఆఫ్రికా గడ్డి మైదానాల్లో జరిగిన ఈ రక్తపాతాలతో ముడిపడి ఉన్నారు!
ఈ అభాగ్యుల మరణాల వల్ల లాభ పడేదంతా శవాలను తినే లుకలుక లాడే పురుగులు, రాబందులు మాత్రమే! చూడండి ఎంత నిర్ధయో?
అన్ని వైపుల నుంచి "మృతి చెందిన వాళ్ళపై అస్సలు జాలి చూపద్దు"
అనే అరుపులు వినిపిస్తున్నాయి!
~.
ఇక్కడ మృతుల గణాంకాల లెక్కలు యాంత్రికం మాత్రమే!
కానీ వలసవాద పాలకులు గణాంకాల విధానాలతో తమ హింసను సమర్ధించుకుంటూ ఉంటారు!
~
ఇక్కడ ఏమీ తెలీకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న తెల్లజాతి బాలుడి హత్య సంగతి ఏంటి మరి?
ఇదంతా వలస విధానం క్రూరమైన హింసా సారాంశమే కదా?
అడవి మనుషులుగా ఉన్న వాళ్ళందరూ ప్రాణ త్యాగానికి అర్హులన్న వలసవాద నీచ దృష్టి ఎంత ఘోరమైనదో కదా? అడవి బిడ్డలంటే యూదులలా విస్మరించబడే వాళ్ళు మాత్రమే కదా వీళ్ళకి?
~
చూడండిక్కడ!
నదీ తీరంలో హింసించే వారి చేతుల్లో నలిగిన పొడవైన గడ్డి కాండాలు విరిగిపడిపోతాయి!
చిత్ర హింసల పాలైన తెల్లని ఐబిస్ పక్షులు కేకలు వేస్తూ దుమ్ములో అల్లకల్లోలంగా తిరుగుతూనే ఉంటాయి!
నాగరికత మొదలైనప్పటి నుంచి ఐబిస్ పక్షులు వలయాలు వలయాలుగా అవిశ్రాంతిగా నడుస్తూనే ఉన్నాయి!
ఎండిపోయిన నదుల నుంచో లేదా గుమిగూడిన జంతువులు నిండిపోయిన మైదానం నుంచో ఆ పొడవు ముక్కుల పక్షులు అలా తిరుగుతూనే ఉన్నాయి!
~
ఒక జంతువు మరొక జంతువుని చంపడాన్ని అత్యంత సహజమైన ప్రకృతి నియమం అంటాడు మనిషి !
కానీ ఈ వింత చూడండి!
నిటారుగా స్థిరంగా నిలబడ్డ మనిషి తోటి మనిషికి నొప్పి కలిగించడంలో మాత్రమే దైవత్వాన్ని వెతుక్కుంటున్నాడు!
~.
వలసవాద పిచ్చెక్కిన జంతువులాంటి ఉన్మాద స్థితిలో మనిషి చేసే యుద్ధాలు, బిగుతైన డోలు చర్మంపై అత్యంత కిరాతకంగా నృత్యం చేస్తాయి !
కానీ విషాదం ఏంటంటే ఆ స్థానిక ప్రజల భయాన్ని అతడు శాంతిగా ప్రకటిస్తాడు!
చనిపోయిన వాళ్ల వల్ల వచ్చిన శీతలమైన శాంతిగా మురిసిపోతాడు!
~
మళ్లీ క్రూరమైన అనివార్యతతో అతడు రుమాలు కంటిన మురికిని కారణంగా చూపిస్తూ చేతులు తుడుచుకుంటాడు!
అచ్చం స్పెయిన్ లో అనుభవించినట్లుగా!
అక్కడి మన కరుణ వృధా ప్రయాస అంతే!
వింతేమిటంటే ఇక్కడ గొరిల్లాలు సూపర్ మాన్ తో కుస్తీ పడతాయి!
~
నేను రెండు రకాల రక్తంతో కలిసిపోయి విషపూరితమై ఉన్నాను!
నాలో ఆఫ్రికా,బ్రిటిష్ రక్తాలు జమిలిగా ప్రవహిస్తున్నాయి!
అందుకే నేను రెండు వైపులా చీలిపోయాను!
నాలో రక్తనాళాలు రెండుగా విభజించబడి ఉన్నాయి!
ఎటువైపు వెళ్లాలో తెలియడం లేదు!
~
నేను తాగుబోతు బ్రిటిష్ సామ్రాజ్యవాదిని
నా ఆఫ్రికా ప్రజల కోసం దుర్భాషలాడిన వాడిని!
నేను ఎవరిని ఎన్నుకోవాలి?
మిశ్రమ వారసత్వాన్ని కలిగినవాడిని !
నేను ఎంతగానో ప్రేమించిన ఆఫ్రికానా లేక
నేను పెరిగి నేర్చుకున్న ఇంగ్లీషు భాషా,సాహిత్య సంస్కృతినా?
పోనీ రెంటినీ మోసం చేయనా?
నాకు వాళ్ళు ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వనా వద్దా?
ఏం చేయను చెప్పండి?
ఇంతటి భయంకరమైన ఊచకోతని ఎదుర్కొంటూ ఇంత ప్రశాంతంగా ఏమీ జరగనట్లే ఎలా ఉండను?
నా మూలాలున్న ఆఫ్రికా నుంచి విడిపోయి ఎలా బతకను?

అనువాదం: గీతాంజలి
***
Derek Walcott (1930–2017) ప్రపంచ ప్రసిద్ధ కవి, నాటకకర్త, వ్యాసకర్త. కరేబియన్ దీవి దేశమైన సెయింట్ లూసియాకు చెందిన ఆయన, వలసవాద చరిత్ర, ప్రకృతి, మానవ సంబంధాలు, గుర్తింపు వంటి అంశాలను తన రచనల్లో సున్నితంగా ఆవిష్కరించారు.
1992లో సాహిత్య నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన రచించిన Omeros మహాకావ్యం, అలాగే Love After Love వంటి కవితలు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి. సరళమైన భాషలో లోతైన జీవిత తత్వాన్ని వ్యక్తీకరించడం ఆయన రచనల ప్రత్యేకత. ఆయన ఆధునిక ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రభావవంతమైన కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

Leave a Reply