సామ్రాజ్యవాదం చరిత్ర గురించి చదవడం
ఇంటా బయటా పచ్చి దోపిడీ, వాటిలో వాటికి పోటీ, ఒక దేశం పతనం చెంది మరోటీ కొత్తగా రావడం ఇవన్నీ కూడా సామ్రాజ్య వాదపు లక్షణాలు. అందుకే లెనిన్ సామ్రాజ్యవాదాన్ని’కృషించిపోతున్న పెట్టుబడిదారీ విధానం’గా వర్ణించాడు. అప్పుడే శ్రామిక సామాజిక విప్లవం తొలిదశ మొదలవుతుంది. సామాజిక వైరుధ్యాల మూలంగానే పెట్టుబడిదారీ విధానం పతనమై తీరుతుంది. సోషలిజం విజయవంతం అవుతుంది. చారిత్రక ఉద్యమ సూత్రాలే వీటన్నిటిని నిర్ణయిస్తాయి. క్షీణ పెట్టుబడి దారీ విధానపు వినాశ విపరీత బుద్ధులు సామ్రాజ్యవాద దశలో నగ్నంగా కనబడతాయి. అంతర్గత వైరుధ్యాలు కొట్టొచ్చినట్టుగా బయటపడతాయి.
వైరుధ్యం తీవ్రతర మయింది. గుత్త పెట్టుబడిదారీ విధానానికి ఉత్త పెట్టుబడిదారీ విధానానికి వైరుధ్యం వచ్చి పడింది. వలసలకు వలస రాజ్యాధిపతులకు వైరుధ్యం పెరిగింది. వివిధ పెట్టుబడిదారీ దేశాల మధ్య వాటి అభివృద్ధిలో హెచ్చుతగ్గులు ఉండడం వల్ల, వైరుధ్యాలు తీవ్రమైనాయి. ఇలాంటి వైరుధ్యాలన్నీ పెచ్చు పెరిగి సంఘర్షణ పడ్డ ఫలితంగానే శ్రామిక వర్గ నాయకత్వం కింద సోషలిస్టు జనతా ప్రజాస్వామ్య విప్లవ విజయాలకు పూర్వ రంగం సిద్ధమైంది. సామ్రాజ్యవాదాన్ని పరిశోధించిన లెనిన్ ఓ మాట చెప్పాడు. వివిధ దేశాల రాజకీయ ఆర్థిక అభివృద్ధులలో తేడా ఉన్నందున సామ్రాజ్యవాదం బాగా బలహీనంగా ఉన్న చోట బద్దలవుతుంది. లెనిన్ చెప్పింది నిజమేనని చరిత్ర రుజువు చేసింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జారిస్టు రష్యా సామ్రాజ్యవాదం వైరుధ్యాలకు కేంద్రంగా ఉండేది. సామ్రాజ్యవాదం అనే గొలుసులో అతి బలహీనమైన లింకు రష్యాయే. అందుకనే 1917 అక్టోబర్ సోషలిస్టు విప్లవం అక్కడ లెనిన్ నాయకత్వాన నెగ్గి ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు దేశంగా ఒరవడి పెట్టి మానవజాతి చరిత్రలో కొత్త యుగం నెలకొల్పింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా విప్లవ విజయం, ఆసియా యూరప్ దేశాల్లో విప్లవ విజయాలు అన్నీ కూడా మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతానికి సరికొత్త తార్కాణాలు.
సామ్రాజ్యవాదం దానంతటదిగా ఎప్పుడూ గద్దె దిగదని చరిత్ర మనకు చాటి చెబుతుంది. అవసానకాలం సమీపించిన కొద్దీ సామ్రాజ్యవాదం మరింత బరితెగించి సైనిక కుతంత్రాలకు, రాజకీయ మోసాలకు, పాల్పడుతుంది. అందుకే మావో అన్నాడు. “చికాకు పెట్టడం, ఓడిపోవడం, మళ్లీ చికాకు పెట్టడం, మళ్ళీ ఓడిపోవడం… వాళ్లు కూలిపోయే వరకు ఇదే ప్రపంచమంతటా సామ్రాజ్యవాదులు, విప్లవ ప్రతీఘాతకులు అవలంబించే విధానం.” రాజకీయ, ఆర్థిక సంక్షోభాల నుంచి తమ్ము తాము కాపాడుకోవడానికి హిట్లర్ జర్మనీలో ఫాసిస్టు నియంతృత్వం ప్రవేశపెట్టాడు. జర్మనీ ప్రజానీకాన్ని ఆర్థిక దోపిడీలకు రాజకీయ పీడనకు గురిచేశాడు. “తిండికి బదులు తూటాలు” అని ఎలుగెత్తి చాటాడు. రెండో ప్రపంచ యుద్ధాన్ని మొదలెట్టి ప్రపంచ ప్రజలను దోపిడీ చేశాడు. ప్రపంచ ప్రజానీకం ఫాసిజానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడ్డం వలన 12 ఏళ్లు తిరక్కముందే హిట్లర్ సర్వనాశనం అయ్యాడు.వెయ్యేళ్ల సామ్రాజ్యాన్ని నిర్మిద్దామని కలలుగని భస్మాసురుడిలా దహించుకు పోయాడు. మావో అన్నాడు కూడా… “ప్రపంచ ప్రజలను పోరాటంలోకి నెట్టి సామ్రాజ్య వాదాన్ని అంతం చేసే నూతన శకం ఆసన్నమైంది. అమెరికన్ సామ్రాజ్యవాదం, రష్యా సోషల్ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రతిచోట కూడా దురాక్రమణ, కూలదోయడం, అదుపు, జోక్యం,ఇలాంటి వాటితో చివరకు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నాయి. చిన్నచిన్న దేశాలలో ప్రజలను పోరాటాలకు వాళ్లే రేకెత్తిస్తున్నారు. ప్రజల విప్లవ పోరాటాలే క్రమ క్రమంగా సామ్రాజ్యవాదాన్ని బలహీనపరిచి చివరకు సర్వనాశనం చేస్తాయి.
సామ్రాజ్యవాదానికి, అవకాశవాదానికి వ్యతిరేకంగా పోరాటం:
సామ్రాజ్యవాదులు తమ అవసానకాలంలో శ్రామిక వర్గం లోని అవకాశవాద పాత కొత్త రివిజనిస్టులు బూర్జువా వర్గానికి పూర్తిగా అమ్ముడుపోయి ఉత్త సజ్జుగా సామ్రాజ్యవాదపు బంటులుగా మిగిలిపోతారు. వీళ్లు అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో చోటు చేసుకుని, సామ్రాజ్యవాదం లోని వైరుధ్యాలను కప్పిపెట్టి ప్రజల పోరాట శక్తిని నీరు గార్చాలని చూస్తారు. సామ్రాజ్యవాదులు చేసుకోలేని పని వీళ్ళు చేసి పెడతారు. శ్రామిక వర్గానికి తీరని ద్రోహం చేసే ఇలాంటి విద్రోహులనే లెనిన్ “మాటల్లో సోషలిజం, చేతల్లో సామ్రాజ్యవాదం వెరసి సోషల్ సామ్రాజ్యవాదం” అన్నాడు. అందుకే లెనిన్ చాలాసార్లు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని అవకాశవాద రివిజనిజాల వ్యతిరేక పోరాటంతో మేళవించ మన్నాడు. అలా మేళవించకపోతే ఆ పోరాటం ఉత్త దండగ మారిదని కూడా నొక్కి చెప్పాడు. ఇవాళ సోవియట్ విద్రోహపు ముఠా సరిగ్గా లెనిన్ తిట్టినట్టే చేస్తున్నారు. సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని నామమాత్రంగా జపిస్తూ ఆచరణలో దోపిడీ విధానాన్ని, విస్తరణ వాదాన్ని అమలు పరుస్తున్నారు. రష్యా రివిజనిస్టులు ముమ్మాటికి సోషల్ సామ్రాజ్యవాదులే.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ విప్లవం బాగా అభివృద్ధి చెందడం వల్ల సామ్రాజ్య వాదం ఎత్తుగడలు మార్చుకుంది. శ్రామిక వర్గం అధికారానికి రానిచోట లంచాలు ఇచ్చి జోక్యం కల్పించు కోవడం, శ్రామిక వర్గం అధికారానికి వస్తే కూలదోయడం, చాప కింద నీరులా చొచ్చుకు పోవడం ఇలాంటి పనులన్నీ బూర్జువా వర్గం చేస్తూంది. సైనిక చర్యలు, సాయుధ దండయాత్ర, రాజకీయ కుతంత్రం ఇవి వాళ్ళ నయా వలస విధానాలు. విద్రోహులకు కీలుబొమ్మలకు లంచాలిచ్చి పరోక్షంగా వలస పాలన సాగించడం లేదా సైనిక సాయం ఆర్థిక సాయం ముసుగుల్లో విదేశాలకు సరుకులు గుప్పించి పెట్టుబడులు పెట్టి బడుగు దేశాలను ఆర్థికంగా దోపిడీ చేసి, సైనికంగా ఆర్థికంగా అదుపు చేయడం లేదా ఇతర దేశాలను తమ మీద సాంతం ఆధారపడేటట్టు చేయడం ఇవి సామ్రాజ్యవాదులు చేసే పనులు. ప్రజలను బానిసలుగా చేసి ప్రపంచాధిపత్యం సంపాదించి, వలస పాలన కొనసాగించేందుకు సామ్రాజ్యవాదులు ఎలాంటి కుతంత్రాలైన కుట్రలైన చేస్తారు. సామ్రాజ్యవాదులు ఎన్ని రకాల కొత్త కొత్త ఎత్తులు ఎత్తిన దోపిడీ అనేది, పోరాటాన్ని, పీడన అనేది ప్రతిఘటనను రగుల్కొల్పక మానవు. వాళ్లు దురాక్రమణకు దిగినందువల్ల తమ మెడకు తామే ఉచ్చు బిగించు కుంటున్నారు. వెధవ పనులు ఎక్కువ చేసిన కొద్దీ ఉచ్చు మరింత బిగుస్తుంది. వాళ్ల ఘాతుకాలన్నీ వాళ్లకు త్వరలోనే గోరీ కట్టడానికి దారితీస్తాయి. ఎక్కువ కాలం మన లేవు.
సామ్రాజ్యవాదానికి చావు మూడింది:
మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతం మీద ఆధారపడి మావో, సామ్రాజ్యవాదపు గతాన్ని వర్తమానాన్ని పసిగట్టి దానికి వ్యతిరేకంగా చైనా తదితర ప్రపంచ ప్రజలు జరిపిన పోరాటానుభవాలను పరిశీలించి వ్యూహం ఎత్తుగడలు రూపొందించాడు. ఇలా అన్నాడు కూడా:”మొదటి ప్రపంచ యుద్ధం, మొట్టమొదటి సోషలిస్టు విప్లవం, (రష్యా అక్టోబర్ విప్లవం) ప్రపంచ చరిత్ర గతిని మార్చివేసి, కొత్త యుగానికి దారి తీశాయి.” ఈ యుగంలో సామ్రాజ్యవాదం”తన దివాళా కోరుతనాన్ని పూర్తిగా బయట పెట్టుకుంది”.(మావో: నూతన ప్రజాస్వామ్యం). మావో ఇంకా ఇలా చెప్పారు.”దీర్ఘకాల దృష్ట్యా పరిశీలించి చూస్తే సామ్రాజ్యవాదం ఇతర ప్రతీఘాతకులు కూడా కాగితం పులులు.ఇది వ్యూహం. మరోకోణం నుంచి చూస్తే వారు నిజం పులులు. ఇనప పులులు. ప్రజలను భక్షిస్తారు. ఎత్తుగడల రీత్యా ఇదీ మన ఆలోచన.సామ్రాజ్యవాదాన్ని ఓడించడానికి శాస్త్రీయ సిద్ధాంతమే గొప్ప ఆయుధం. సామ్రాజ్యవాదం చనిపోతున్న పెట్టుబడిదారీ విధానమే గాని చనిపోయిన పెట్టుబడిదారీ విధానం కాదు. ప్రజల జీవన్మరణ పోరాటంలో ఈ సామ్రాజ్యవాదానిది ద్వంద్వ స్వభావం. సుదీర్ఘ సాయుధ ప్రజా పోరాటాలు లేకుండా సామ్రాజ్యవాదాన్ని ఉన్నదున్నట్టు తుడిచి పెట్టగలమనుకోవడం కల్ల. నదురు బెదురూ లేకుండా సుదీర్ఘ పోరాటాలు జరిపే ధైర్య సాహసాలు ఉంటేనే సామ్రాజ్యవాదం నాశన మవుతుంది. విప్లవం విజయవంతం అవుతుంది. దేశాలు స్వాతంత్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. ఇది చారిత్రక ధోరణి. సామ్రాజ్యవాదానికి చావు మూడింది. విజయ పరంపరలనేవి అనేక కష్టాలతో నష్టాలతో, కూడి ఉంటాయి. ” పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదాలు నాశనమై, సోషలిస్టు జనతా ప్రజాస్వామ్య విప్లవాలు విజయం పొందే చారిత్రక దశ ఇది” అన్నాడు మావో. మార్క్సిస్టు- లెనినిస్టు సిద్ధాంతం అధ్యయనం చేస్తే సామ్రాజ్యవాదం, సోషల్ సామ్రాజ్యవాదం స్వభావాలు అర్థమవుతాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితి తేటతెల్లం అవుతుంది. విప్లవ విజయంపై నమ్మకం పెరుగుతుంది. సమస్త మానవజాతి విముక్తికి విప్లవ విధానాలను మరింత బాగా అమలుపరచ గలుగుతాం.




