బెల్జియం, ఫ్రాన్స్, భారతదేశ విద్యార్థి ఉద్యమాలకు పీపుల్స్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనిటీ (జాతీయ కమిటీ) తన హృదయపూర్వక విప్లవ సంఘీభావాన్ని, రెడ్ సెల్యూట్స్ తెలియజేస్తోంది. విద్య, ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, దోపిడీ, వివక్ష లేని సమాజం కోసం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు సాగిస్తున్న సాహసోపేతమైన పోరాటాలు అణగారిన, వంచనకు గురైన ప్రజల విముక్తి ఆకాంక్షలను మరింత బలపరుస్తున్నాయి.

బెల్జియం, ఫ్రాన్స్, భారతదేశ విద్యార్థి ఉద్యమాలు విద్య అనేది ఒక వస్తువు కాదని, ప్రాథమిక మానవ హక్కు అని మనకు గుర్తుచేస్తున్నాయి. విద్యా సంస్థలలో వివక్ష, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, పెరుగుతున్న ట్యూషన్ ఫీజులు, రుణాల భారం, కుల, మత, వర్గ, జెండర్ ఆధారిత అణచివేత, నిరంకుశ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసే ప్రతిఘటన విశాలమైన ప్రజాస్వామిక, సామాజిక ఉద్యమాలలో అంతర్భాగం. క్యాంపస్‌లలో బావ ప్రకటన స్వేచ్ఛను, సంఘం ఏర్పరచుకునే హక్కును, సురక్షితమైన, గౌరవప్రదమైన విద్యా వాతావరణాన్ని నిర్ధారించడానికి చేసే పోరాటం; మొత్తం సమాజ విముక్తి కోసం సాగే పోరాటం కూడా.

విద్యార్థులు కేవలం భవిష్యత్తును మార్చాలని ఆశించేవారే కాదు, వర్తమానంలో అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో  ఒక క్రియాశీల శక్తి అని మేము నమ్ముతున్నాము. కార్మికులు, రైతులు, మహిళలు, ఆదివాసులు, అట్టడుగు వర్గాలు, శ్రామిక ప్రజలతో ఐక్యతను పెంపొందించుకోవడం ద్వారా, సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం, దోపిడీ లేని స్వేచ్ఛపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించగలరు.

విద్యార్థి ఉద్యోగాల బలం, విశాలమైన ప్రజా ఉద్యమాలతో తమను తాము మమేకం చేసుకున్నప్పుడు; విద్య, ఉపాధి హక్కులను గౌరవప్రదమైన జీవితం కోసం సాగే ప్రజల విశాల పోరాటాల నుండి వేరు చేయనప్పుడే పూర్తిగా సాకారమవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా పాలకుల వర్గాలు అణచివేత, విభజన, మతతత్వం, యుద్ధ అసమానత; లాభాపేక్ష విధానాల ద్వారా దోపిడీని తీవ్రతరం చేస్తున్న ఈ తరుణంలో, విద్యార్థుల ఐక్య ప్రతిఘటన కొత్త ఆశను కలిగిస్తుంది. ఒక దేశంలో విద్యార్థుల పోరాటాలు మరో దేశంలోని వారికి స్ఫూర్తినిస్తాయి; అలాగే ఒక ప్రాంతంలోని నిరసనలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం డిమాండ్లను బలపరుస్తాయి. కాబట్టి అంతర్జాతీయ ఐక్యత అనేది కేవలం సానుభూతి వ్యక్తీకరణ మాత్రమే కాదు; ఇది అణచివేత, దోపిడీలకి వ్యతిరేకంగా జరిగే ఉమ్మడి పోరాటానికి ఒక నిబద్ధత.

Leave a Reply