ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న వారిపై ఢిల్లీ పోలీసులు వరుసగా రెండో రోజు ఆదివారం (అక్టోబర్ 11) కూడా ఉక్కుపాదం మోపారు. విస్తృతంగా అరెస్టులు (డిటెన్షన్లు) చేపట్టారు. కన్నాట్ ప్లేస్, జంతర్ మంతర్ నుండి అదుపులోకి తీసుకున్న మైనర్లతో సహా కనీసం 50 మందిని, సెంట్రల్ ఢిల్లీకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండ్వాలన్ ఖుర్ద్‌లోని ఒక కమ్యూనిటీ సెంటర్‌కు తరలించారు. ఢిల్లీ పోలీసులు తమపై విపరీతంగా బలప్రయోగం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు తమను కొట్టారని, మర్మాంగాలపైన దాడి చేశారని, చాలామంది ఫోన్లను గుంజుకుని గ్యాలరీలోని నిరసనల ఫోటోలు, వీడియోలను డిలీట్ చేశారని అదుపులోకి తీసుకున్న వ్యక్తులు తెలిపారు. నిరసనకారులను మొదట ఛావ్‌లా పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత పాండ్వాలన్ ఖుర్ద్‌లోని కమ్యూనిటీ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారికి న్యాయవాదులను గానీ, వైద్య సహాయాన్ని గానీ అందకుండా వేరు చేశారు. లాయర్లు, విలేకరులు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోకూడదని ఆదివారం ఉదయమే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, సెక్యూరిటీ సిబ్బంది తమను బాధితుల వద్దకు వెళ్లనివ్వలేదని ఆ తర్వాత పాండ్వాలన్ ఖుర్ద్ కమ్యూనిటీ సెంటర్‌కు చేరుకున్న న్యాయవాదులు చెప్పారు.

అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్న 30 ఏళ్ల న్యాయవాది అర్జున్ ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కన్నాట్ ప్లేస్‌లో తన స్నేహితులతో ఉన్నప్పుడు, ఎటువంటి మహిళా సిబ్బంది లేకుండానే మగ పోలీసులు ఒక దంపతులను ఈడ్చుకెళ్లడం చూశానని చెప్పారు. దీనిని తాను, తన స్నేహితులు నిరసించడంతో తమను కూడా డిటెన్షన్ బస్సుల్లోకి ఎక్కించారని ఆయన తెలిపారు.

“కన్నాట్ ప్లేస్‌లోని పిండ్ బలూచి రెస్టారెంట్ సమీపంలో ఉన్న ఎల్ఐసి భవనం దగ్గర ఒక నిర్జన రహదారిపైకి మమ్మల్ని తీసుకెళ్లారు. అది పూర్తిగా బారికేడ్లతో మూసివేసి ఉంది. మా ఫోన్లలో సహాయం కోసం అడగడానికి కూడా అనుమతించలేదు. 10 మంది చొప్పున ఐదు వరుసల్లో మమ్మల్ని రోడ్డుపై కూర్చోబెట్టారు. అదొక ఫైరింగ్ లైన్‌లా ఉంది, మమ్మల్ని కాల్చి చంపేస్తారేమో అనిపించింది. ఈ గుంపులో బహుశా 16-17 ఏళ్ల వయస్సు ఉన్న మైనర్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత, అంతకుముందు వీడియోలు రికార్డు చేయడం లేదా ఫోటోలు తీయడం చూసిన వ్యక్తులను గుర్తించి వారి ఫోన్లను గుంజుకోవడం ప్రారంభించారు. ఫోన్ పాస్‌వర్డ్‌లను అడిగి, ఇవ్వడానికి నిరాకరించిన వారిని తీవ్రంగా కొట్టారు,” అని ఉన్నికృష్ణన్ చెప్పారు.

అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఎంత బతిమాలినా వినకుండా, స్వాధీనం చేసుకున్న ఒక వ్యక్తి ఫోన్ గ్యాలరీని చూస్తూ పలువురు పోలీసు సిబ్బంది “నవ్వుతూ వారి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకున్నారు” అని ఉన్నికృష్ణన్ తెలిపారు.

అదుపులోకి తీసుకున్న వారు ఎదుర్కొన్న వేధింపులకు ఇది కేవలం ప్రారంభం మాత్రమే.

ఆ తర్వాత గ్రిల్స్; వేర్వేరు గదులలాగా అమర్చిన ఒక నీలిరంగు ఢిల్లీ పోలీస్ వ్యాన్ వచ్చింది. అందులోకి వరుసగా నిరసనకారులను బలవంతంగా తోసి ఎక్కించారని ఉన్నికృష్ణన్ చెప్పారు.

“పోలీసులు ఒక వరుసలో నిలబడి, మమ్మల్ని ఒకరి తరువాత మరొకరు చెంపదెబ్బలు కొట్టారు, గుప్తభాగాలపై దాడి చేశారు; మొత్తం శరీరమంతటా విచక్షణారహితంగా బాదారు. మాతో ఉన్న మైనర్లు కూడా ఈ హింసను ఎదుర్కొన్నారు. జైలు తరహాలో గ్రిల్స్ అమర్చిన ఆ గదుల వల్ల మేం పరిగెత్తడానికి గానీ, తప్పించుకోవడానికి గానీ వీలు లేకుండా పోయింది. ఎక్కడికీ వెళ్లే దారి లేదు. అది అత్యంత భయానకంగా అనిపించింది,” అని ఆయన చెప్పారు.

పేరు చెప్పడానికి ఇష్టపడని 20 ఏళ్ల ఒక విద్యార్థి మాట్లాడుతూ, జంతర్ మంతర్ సమీపంలో తనను కూడా అలాగే అదుపులోకి తీసుకుని, అప్పటికే పదుల సంఖ్యలో నిరసనకారులు ఉన్న డిటెన్షన్ బస్సులోకి ఎక్కించారని తెలిపారు.

“వారు ప్రజలను కొట్టి వారి ఫోన్లను లాక్కున్నారు. డిటెన్షన్ సెంటర్ వద్ద ఫోన్లు తిరిగి ఇస్తామని చెప్పారు. నేను నా ఫోన్‌ను వారికి ఇవ్వకుండా బ్యాగ్‌లోనే ఉంచుకున్నాను,” అని అతను చెప్పారు.

ఆ బస్సులు ఒక జైలులా ఆ విద్యార్థి అభివర్ణించాడు. ఒక్కొక్కరిని ఐదుగురు అధికారులు మార్చి మార్చి కొట్టారని అతను తెలిపాడు. “వారు నా ముఖంపై చెంపదెబ్బలు కొట్టారు, తలపై కొట్టడానికి ప్రయత్నించినప్పుడు నేను పక్కకు తప్పుకున్నాను. కానీ నా ఒంటిపై నాటి గాయాలు అయ్యేలా విచక్షణారహితంగా బాదారు,” అని అతను చెప్పాడు.

“ఆ తర్వాత బస్సు ముందుకు సాగినప్పుడు, మమ్మల్ని చివరికి పాండ్వాలన్ ఖుర్ద్ కమ్యూనిటీ సెంటర్‌కు తీసుకెళ్లే వరకు మేం ఎక్కడ ఉన్నామో కూడా అర్థం కాలేదు. అక్కడ తాగడానికి నీళ్లు గానీ, తినడానికి తిండి గానీ లేవు. ఫోన్లు వారి దగ్గరే ఉంటే మా సమాచారాన్ని ఏ విధంగానైనా దుర్వినియోగం చేస్తారనే భయంతో మేం మా ఫోన్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాం. కానీ వారు మాకు ఇవ్వలేదు,” అని అతను తెలిపాడు.

‘ది వైర్’ తో పాటు ఇతర స్వతంత్ర వార్తా సంస్థలకు క్రమం తప్పకుండా వ్యాసాలు రాసే పాత్రికేయుడు (జర్నలిస్ట్) ఎం. రాజశేఖర్ కూడా అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నట్లు సమాచారం.

ద్వారకాలోని ఛావ్‌లా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని, అక్కడ బస్సు కొద్దిసేపు ఆగిందని ఉన్నికృష్ణన్ చెప్పారు. సాయంత్రం వేళల్లో తమను తీసుకెళ్తున్న వాహనాలు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా అదుపులోకి తీసుకున్న వారికి ఏమాత్రం సమాచారం లేదు.

“మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు లేదా అసలు ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో పోలీసు అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు,” అని ఉన్నికృష్ణన్ చెప్పారు.

తమ ఫోన్లను దాచుకోగలిగిన కొందరు నిరసనకారులు తమ స్నేహితులకు, న్యాయవాదులకు సమాచారం అందించగలిగినప్పటికీ, అక్కడ ఉన్న మైనర్లు మాత్రం తీవ్ర భయాందోళనలకు, అయోమయానికి గురయ్యారని ఉన్నికృష్ణన్ పేర్కొన్నారు.

“మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మనకు ఏమవుతుంది’ అని వారు మమ్మల్ని పదే పదే అడుగుతూనే ఉన్నారు,” అని ఉన్నికృష్ణన్ చెప్పారు.

పోలీసులు మైనర్లతో సహా అదుపులోకి తీసుకున్న వ్యక్తులందరి వివరాలను నమోదు చేసుకున్నారని, వారు నిజంగా మైనర్లేనని నిర్ధారించుకోవడానికి రెండుసార్లు తనిఖీ కూడా చేశారని ఉన్నికృష్ణన్ నొక్కి చెప్పారు. తాము మైనర్లను అదుపులోకి తీసుకుంటున్నామనే విషయం పోలీసులకు స్పష్టంగా తెలుసని ఇది తెలియజేస్తోందన్నారు.

ఛావ్‌లా పోలీస్ స్టేషన్ తర్వాత బస్సును పాండ్వాలన్ ఖుర్ద్ కమ్యూనిటీ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ తీవ్ర గాయాలైన ఇతర నిరసనకారులను, చేయి విరిగిన ఒక వ్యక్తిని వారు చూశారు. ఉన్నికృష్ణన్ ఉన్న బస్సు రాత్రి 7 గంటల ప్రాంతంలో పాండ్వాలన్ ఖుర్ద్‌కి చేరుకొన్న తర్వాత కమ్యూనిటీ సెంటర్ గేట్లకు తాళాలు వేశారు. అందువల్ల అదుపులోకి తీసుకున్న వారు పంపిన సమాచారం అంది, అక్కడకు న్యాయవాదులు, వైద్య బృందాలు రాత్రి 8 గంటల తర్వాతే రాగలిగారు. పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ బాధితులను కలవడానికి వారిని అనుమతించలేదు.

అదుపులోకి తీసుకున్న వారిని అక్కడికి తీసుకెళ్లినట్లు లాయర్ల గ్రూప్‌లోని మెసేజ్‌ల ద్వారా తెలుసుకున్న ఫహద్ ఎమ్. ఖాన్, ఆయన సహచరుడు గౌరవ్ సైకిల్‌వాలా రాత్రి 8 గంటల తర్వాత కమ్యూనిటీ సెంటర్‌కు చేరుకున్నారు. అయితే, లాయర్లు తమ విధులను నిర్వర్తించేందుకు అనుమతించాలని ఆ ఉదయాన్నే సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వారిని లోపలికి రానివ్వలేదు. ఖాన్ ‘ది వైర్’ తో పంచుకున్న వీడియోలలో, వారు కమ్యూనిటీ సెంటర్ ఇనుప గేట్ల వెలుపలి నుండి పోలీసులను లోపలికి అనుమతించాలని కోరడం, సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ప్రస్తావించడం కనిపిస్తుంది.

“ఆ తర్వాత మేము పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్‌కు ఫోన్ చేశాం, అది వచ్చింది. ఆ వ్యాన్‌తో పాటే మేము లోపలికి వెళ్ళాం,” అని ఖాన్ చెప్పారు.
లాయర్లు అక్కడకు చేరుకున్న తర్వాతే గాయపడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారని ఖాన్ చెప్పారు. ఫోన్లు స్వాధీనం చేసుకున్న పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు, ఛావ్‌లా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో పాటు ద్వారకా డీసీపీకి కూడా ఫిర్యాదు పంపుతున్నట్లు ఖాన్ తెలిపారు.

అయితే, సుప్రీంకోర్టు ఉత్తర్వుల వెలుగులోనే కాకుండా, అదుపులోకి తీసుకున్న వారితో వ్యవహరించిన విధానం దృష్ట్యా కూడా ఈ అరెస్టులు అనేక ప్రాతిపదికల ప్రకారం చట్టవిరుద్ధమైనది.

“ఈ నిర్బంధం పూర్తి అక్రమం. అందుకు ఎటువంటి సరైన కారణాలు చూపలేదు. సూర్యాస్తమయం తర్వాత కూడా మహిళలను అదుపులోనే ఉంచారు. మైనర్లను డిటెన్షన్ సెంటర్లలో ఉంచారు. ఫోన్లను గుంజుకుని వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇవన్నీ తీవ్రమైన చట్ట ఉల్లంఘనలే” అని ఖాన్ అన్నారు.

“అంతే కాకుండా, సెంట్రల్ ఢిల్లీ నుంచి ప్రజలను అదుపులోకి తీసుకుని, వారు తిరిగి రావడానికి కూడా వీలులేని విధంగా 40 కిలోమీటర్ల దూరంలో వదిలేయడానికి ఉన్న సమర్థన ఏమిటి? లాయర్లు, జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వు స్పష్టంగా పేర్కొంది. కానీ మేము లాయర్లమని, బాధితులను కలిసే హక్కు మాకు ఉందని అర గంటకు పైగా అక్కడ ఉన్న పోలీసు అధికారులను బతిమిలాడుతూనే ఉన్నాం. అయినా మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. పోలీసులు మాత్రం ‘మాకు తెలియదు’ అని చెబుతూ వచ్చారు. ఒకవేళ మీరు వారిని అదుపులోకి తీసుకుంటే, లాయర్లను కలవడానికి అనుమతించాలనే కనీస చట్ట పరిజ్ఞానం మీకు ఉండాలని మేము అన్నాము,” అని ఖాన్ వివరించారు.

కనీసం ఐదుగురు మహిళలు ఉన్న మరొక బస్సు రాత్రి 9 గంటల ప్రాంతంలో కమ్యూనిటీ సెంటర్‌కు చేరుకుందని, అయితే లోపల ఎంతమంది ఉన్నారని లాయర్లు అడగడానికి ప్రయత్నించడంతో ఆ బస్సును వేరే ప్రాంతానికి మళ్లించారని ఖాన్ చెప్పారు.
ఖాన్ రాసిన ఫిర్యాదు ప్రతిలో అదుపులోకి తీసుకున్న బాధితులు కూడా సంతకం చేశారు—చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకోవడం, కొట్టడం, ఫోన్లు లాక్కోవడం, ఫోన్లను తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం, ఒకరికి చేయి విరగడంతో సహా తీవ్ర గాయాలైనప్పటికీ మెడికో లీగల్ కేస్ నమోదు చేయకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఇద్దరు మైనర్ల పేర్లను కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

https://thewire.in/government/pandwalan-khurd-detainees-recount-night-of-horror-beaten-private-parts-phones-minors

Leave a Reply