రాయలసీమ అంటే కరువు, వలసలు, వ్యవసాయ సంక్షోభం మాత్రమే కాదు. సామాజిక అసమానతలపై జరిగిన పోరాటాలకు కూడా సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన వామపక్ష, విప్లవోద్యమాలు, దళిత, బహుజన ఉద్యమాలు, రైతు-కూలీ పోరాటాల ప్రభావం ఉంది. వీటి వల్ల ఒకప్పుడు బహిరంగంగా కనిపించిన కుల వివక్షలో చాలా మార్పులు వచ్చాయి. కానీ అవే కొత్త రూపాలలో నేడు సమాజాన్ని వెంటాడుతున్నాయి.
కులం అంతరించిపోయిందనీ, సామాజిక సంబంధాల్లో, ఉత్పత్తి సంబంధాల్లో కులం లేదని వాదించేవారు చాలా మంది ఉన్నారు. కులంతో సహా మొత్తంగా గ్రామీణ ఉత్పత్తి సంబంధాలు చాలా మారాయి. అందులోనూ కులానికి ఉన్న కొన్ని పాత రూపాలు మారాయి. కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కుల వివక్ష రూపం మారింది. ఒకప్పుడు బహిరంగంగా కనిపించిన వివక్ష నేడు రాజకీయ, ఆర్థిక, సామాజిక సంబంధాల వెనుక దాక్కొని అనేక కొత్త రూపాల్లో వ్యక్తమవుతోంది. వ్యవసాయ కూలీ పనుల విషయంలో కూడా ఈ మార్పులను గమనించవచ్చు.
కూలీ పని కోసం పిలిచినా… అగ్రకుల ఆధిపత్యమే నిర్ణయమా?
ఇటీవల ఒక గ్రామీణ ప్రాంతంలో దళిత యువ రైతుకు ఎదురైన ఒక చేదు అనుభవం దీనికి ఒక ఉదాహరణ. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ల నాన్న వ్యవసాయం చేస్తూ వచ్చారు. ఇంతకాలం తను వాళ్ళ నాన్నకు పనులలో అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేక తనే పూర్తిగా మొదటిసారి వ్యవసాయం లోకి అడుగుపెట్టాడు. ఆ వ్యక్తి వాళ్ళ నాన్నకు ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో వరి వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గెనాలు(గట్లు) కొట్టడం, దున్నేటప్పుడు వాటిని బురద మన్నుతో ఒక క్రమ పద్ధతిలో పేర్చడం, వరి నారు పీకడం, పీకిన నారుని నాట్లు వేసేటప్పుడు ప్రతి చోటికి చేర్చడం, నాట్లు వేయడం. నారుని పీకిన చోటు నుంచి పొలంలో అన్ని చోట్లకు తీసుకుపోయేటప్పుడు బురద మట్టి తో శరీరం మొత్తం తడిసి ముద్దవుతుంది. యంత్రాలతో చేసే పని ఎంతున్నా మానవ సమూహిక శ్రమ, సహకారం లేనిదే ముందుకు వెళ్లలేని పరిస్థితి.
ఆ యువ రైతు మాదిగ సామాజిక వర్గం. 1300 జనాభా గలిగిన ఆ గ్రామంలో ముఖ్యంగా రెడ్డి (130), కురువ (130), బోయ (50), మంగలి (30), చాకలి (30) మాల (3), వడ్డెర (40), ఎరుకల (15), బొమ్మలాటొళ్ళు (3), మాదిగ (110) సామాజిక వర్గాలు ప్రజలు ఎక్కువగా ఉంటారు. 1996, 98 మధ్యలో వచ్చిన తీవ్రమైన కరువు కారణంగా ఆ గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల నుంచి తీవ్రమైన వలసలు జరిగినప్పటికీ కోమటి (4), బ్రాహ్మణ (3), మాల (4), ముస్లిం (3) కుమ్మరి (5) ఈడిగ (4) మొదలగు సామాజిక వర్గాలు వలసల కారణంగా ఆ గ్రామం నుంచి పూర్తిగా కనుమరుగైపోయాయి.
ఈ ప్రాంతంలో జరిగిన విప్లవ పోరాటాలు, త్యాగాల ఫలితంగా నేడు ప్రతి మాదిగ కుటుంబానికి రెండు నుంచి ఐదు ఎకరాల భూమి ఉంది. అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా దళిత ఆత్మగౌరవ పోరాటాలు ఎన్నో ఈ గ్రామంలో జరిగాయి. ఈ ఊరిలో ప్రధానంగా రెడ్లు, కురువ సామాజిక వర్గాలదే రాజకీయాధిపత్యం.
ముఖ్యంగా ఈ ప్రాంతంలోని రైతాంగం భూగర్భ జలాల పై ఆధారపడి వ్యవసాయ బోర్ల ద్వారా సంవత్సరానికి ఒకటి లేదా వాతావరణం అనుకూలిస్తే రెండో పంట కూడా తీస్తుంటారు. అందుకే ఈ వానాకాల సీజన్లో దాదాపుగా అందరూ వరి పంటే ఎక్కువగా సాగు చేస్తారు. జూన్ లో నారు సిద్ధం చేసి ఆగస్టు చివరిలోగా వరి నాట్లు వేయాలి. కాబట్టి జూలై రెండవ వారం నుంచి ఆగస్టు చివరి వరకు వరి నాట్లు వేసే సమయంలో కూలీలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎవరి సొంత పొలంలో వాళ్ల పనులు చేసుకున్న తర్వాత అన్ని సామాజిక వర్గాల వాళ్లు కూలీ పనుల కోసం వెళ్తుంటారు. ఎవరి పొలం పనుల కోసమైతే కూలీలు వెళ్లారో, వారికి ఆ రోజు కూలీతోపాటు ఉదయము, మధ్యాహ్నము రెండు పూటలా భోజనం కూడా పెట్టాలి. ఇది ఆ చుట్టుపక్కల గ్రామాలలో గతంలో నుంచి వస్తున్న ఒక పద్ధతి. సరిగ్గా ఇక్కడే ఆ దళిత రైతుకు ఒక ప్రత్యేక పరిస్థితి ఎదురైంది. ఆ దళిత రైతు తన రెండెకరాల పొలంలో వరి నాట్లు వేయడానికి ఇతర సామాజిక వర్గంలోని కూలీలు రావడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇక్కడ కూలి అనేది ప్రధాన ప్రశ్న కాదు. మాదిగోల్ల పనికి పోతే వాళ్ల ఇంట్లో చేసిన బువ్వే తినాలి. కాబట్టే మాదిగల వ్యవసాయ పనులకు ఇతర కులాల వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. అదే మాదిగ సామాజిక వర్గంలోని వాళ్లే కూలీలుగా వస్తుంటారు. వరి నారు పోసిన రోజు నుంచి కలుపు తీసేవరకు ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
వరి నాట్లు వేయాల్సిన రోజు రానే వచ్చింది. నాట్లు కోసం అదే సామాజిక వర్గంలోని పదిమంది కూలీలను భార్యాభర్తలు కలిసి ఒక వారం ముందుగానే పిలిచారు. కానీ సరిగ్గా నాట్లు వేసే ముందు రోజు సాయంత్రం అదే గ్రామంలోని అగ్రకుల వైసిపి నాయకుడు కూడా వరి నాట్లు వేయడానికి హడావిడి చేస్తూ దళిత యువ రైతుకు రావాల్సిన కూలీలను, తనకున్న కులం, రాజకీయ ప్రభావంతో తన వైపు తీసుకుపోయాడు. అయితే ఈ సమస్యను ఒక ఛాలెంజ్ గా తీసుకున్న దళిత రైతు పట్టుదలతో దళిత కూలి మహిళల తో మాట్లాడి సమస్యను వారికి తెలియజేసి ఒప్పించడం ద్వారా అందులో ఐదు మందిని మాత్రమే తిరిగి రాగలిగారు. వచ్చిన ఐదు మందితో రెండు ఎకరాల వ్యవసాయ నాట్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకొని పనులు మొదలుపెట్టాడు. ఆ కారణంగా ఒకరోజులో జరగాల్సిన పనికి మూడు రోజుల సమయం తీసుకుంది. ఈ మూడు రోజుల సమయంలో అనేక అవాంతరాలు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక వచ్చింది. వ్యవసాయం పెట్టుబడిగా మారిందంటున్న సందర్భంలో వ్యవసాయంలో కులం, అంటరానితనం తీసుకున్న కొత్త రూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేదే నేటి ఉద్యమాల ముందున్న ప్రశ్న. ఇది ఒక వ్యక్తి లేదా ఒక గ్రామానికి సంబంధించిన చిన్న సంఘటనగా కొట్టిపారేయవచ్చు. ఇలా ఎందుకు చేశారని కూలీలను విచారించగా వీరి ఆర్థిక రాజకీయ సంబంధాలన్నీ ఆ వ్యక్తి కేంద్రంగా ముడిపడి ఉన్నాయనే విషయం మనకు అర్థమైంది. కానీ దీని వెనుక ఉన్న సామాజిక సంబంధాలను పరిశీలిస్తే రాయలసీమ గ్రామీణ సమాజంలో మారుతున్న కుల, రాజకీయ, ఆర్థిక సంబంధాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.
సమాజంలో కూలీ తన శ్రమను ఎక్కడికి అమ్ముకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలి. అదే సమయంలో రైతుకు తన పంటను సాగు చేసుకునేందుకు అవసరమైన సమయంలో కూలీలు అందుబాటులో ఉండటం కూడా అవసరం. ఈ రెండింటి మధ్య సమతుల్యత లేకపోతే వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతింటుంది. అయితే ఈ సంబంధాలపై కులం, రాజకీయ ఆధిపత్యం, స్థానిక అధికార సంబంధాలు ప్రభావం చూపడం సమస్యాత్మకం.
రాయలసీమ గ్రామీణ సమాజంలో కులం కొత్త విషయం కాదు. భూమి యాజమాన్యం, నీటి వనరులపై ఆధిపత్యం, గ్రామ రాజకీయాలు, సామాజిక గౌరవం, కూలీ సంబంధాలు ఇలా అనేక రంగాల్లో కుల నిర్మాణం తన ప్రభావాన్ని చూపింది. అయితే 1970లు, 1980లు, 1990లలో రాయలసీమలో విస్తరించిన వామపక్ష, విప్లవోద్యమాలు గ్రామీణ సామాజిక సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. భూస్వామ్య ఆధిపత్యం, వెట్టిచాకిరీ, తక్కువ కూలీ, దళితులపై వివక్ష, సామాజిక అవమానాలకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో పోరాటాలు జరిగాయి.
ఈ ఉద్యమాల ప్రభావంతో గ్రామాల్లో అణగారిన వర్గాలకు ఒక సామాజిక ధైర్యం వచ్చింది. “కులం పేరుతో అవమానించడం”, “కులం ఆధారంగా పని నిరాకరించడం”, “అధికార వర్గాల ముందు తలవంచడం” వంటి పాత సామాజిక ఆచారాలను ప్రశ్నించే వాతావరణం ఏర్పడింది.
కులం ఎక్కడికీ పోలేదు. కుల వివక్ష చాలాసార్లు గతంలో మాదిరిగా బహిరంగంగా కనిపించదు. కానీ అది ఇతర రూపాల్లో బయటపడుతుంది. ఎవరితో సన్నిహితంగా ఉండాలి? ఎవరిని రాజకీయంగా అనుసరించాలి? ఎవరి పొలంలో పని చేయాలి? ఎవరికి మద్దతు ఇవ్వాలి? ఎవరి మాట గ్రామంలో చెల్లుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కొన్నిసార్లు సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాలతో ముడిపడి ఉంటాయి. అందుకే కుల వివక్షను కేవలం “కులం పేరుతో దూషించడం” లేదా “అంటరానితనం పాటించడం” వంటి ప్రత్యక్ష రూపాల్లోనే చూడకూడదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో శ్రమ, భూమి, రాజకీయ అధికారం, సామాజిక సంబంధాలు ఎలా పనిచేస్తున్నాయో కూడా పరిశీలించాలి.
దళిత కూలీల పరిస్థితిలో మరో కోణంః
భారతదేశంలో స్వేచ్ఛగా కూలీ పని చేసుకొనే మార్పులు జరిగాయనే వాదన ఉంది. కూలీలకు, వాళ్ల శ్రమకు ఎలాంటి సామాజిక బంధనాలు లేవనే వాళ్లు ఉన్నారు. ఇందులో కూడా కొన్ని మార్పులు వచ్చిన మాట నిజమే. కానీ పూర్తిగా మార్పులు జరగలేదు. ఏదో ఒక రూపంలో కులం శ్రమ సంబంధాల్లో వివక్షకు కారణం అవుతోంది. దళిత సమాజంలో కూడా వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే విషయంలో కొంతమంది వెనుకడుగు వేయడం కనిపిస్తోంది. దీనికి కారణాలు అనేకం కావచ్చు. తక్కువ కూలీ, పని భద్రత లేకపోవడం, ఇతర ఉపాధి అవకాశాలు, వలసలు, ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ఉపాధి, స్థానిక రాజకీయ సంబంధాలు ఇవన్నీ ప్రభావం చూపుతాయి. అయితే ఒకప్పుడు కుల ఆధారిత ఆధిపత్యానికి వ్యతిరేకంగా కష్టపడి సంపాదించుకున్న శ్రమ గౌరవం, సామాజిక స్వేచ్ఛ, ఉపాధి హక్కులు బలహీనపడకుండా చూడాల్సిన అవసరం ఉంది.
మరోవైపు, అగ్రకులాలకు చెందిన అనేక కుటుంబాల్లో వ్యవసాయ కూలీ పనులకు వెళ్లడం పట్ల సామాజిక సంకోచం ఉండటం కూడా గ్రామీణ సమాజంలోని కుల విభజనను మరో కోణంలో చూపిస్తుంది. “కూలీ పని అంటే ఒక కులానికి చెందిన పని” అనే భావన సమాజంలోని శ్రమ గౌరవాన్ని దెబ్బతీస్తుంది.
శ్రమకు కులం ఎలా ఉంటుంది?
వ్యవసాయం లేకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నడవదు. రైతు లేకుండా వ్యవసాయం సాధ్యం కాదు. వ్యవసాయ కూలీ లేకుండా కూడా వ్యవసాయం సాధ్యం కాదు. విత్తనం వేసే చేతి నుంచి పంట కోసే చేతి వరకు ప్రతి శ్రమకూ విలువ ఉంది. అయితే శ్రమకు కూడా కులాన్ని కేటాయిస్తే సమాజం ముందుకు వెళ్లదు. “ఈ పని ఆ కులం వాళ్లదే”, “ఆ పని ఈ కులం వాళ్లు చేయకూడదు” అనే భావనలను అధిగమించాల్సిన సమయం ఇది. వ్యవసాయ కూలీ పని చేసే వ్యక్తిని తక్కువగా చూడటం ఎంత తప్పో, కూలీ పనిని ఒక నిర్దిష్ట కులానికి మాత్రమే పరిమితం చేయడం కూడా అంతే తప్పు.
గ్రామాల్లో కులం, రాజకీయాలు, ఆర్థిక సంబంధాలు చాలాసార్లు పరస్పరం ముడిపడి ఉంటాయి. ఎన్నికల సమయంలో కుల సమీకరణాలు బలపడటం, రాజకీయ నాయకుల చుట్టూ కుల ఆధారిత సమూహాలు ఏర్పడటం కొత్త విషయం కాదు.
రాయలసీమకు కావాల్సింది కొత్త సామాజిక రూపంః
రాయలసీమలో గతంలో జరిగిన పోరాటాల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏమంటే ..సామాజిక గౌరవం ఎవరి దయతోనూ రాదు, అది పోరాడి సాధించుకున్న హక్కు. రాయలసీమలో ఒకప్పుడు బహిరంగంగా కనిపించిన కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించిన ఉద్యమాల స్ఫూర్తి నేడు మరోసారి అవసరం. అయితే ఆ పోరాటం కొత్త రూపంలో ఉండాలి. కులానికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, కులం పేరుతో శ్రమను విభజించే భావనకు వ్యతిరేకంగా, శ్రమను అవమానించే సంస్కృతికి వ్యతిరేకంగా, రాజకీయ ఆధిపత్యం పేరుతో ఉపాధి సంబంధాలను ప్రభావితం చేసే ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉండాలి. వ్యవసాయ పనికి కూలీ కావాలి. కూలీకి పని కావాలి. రైతుకు పంట కావాలి. ఈ మూడు సంబంధాల మధ్య కులం అడ్డుగోడగా నిలవకూడదు.
రాయలసీమ నేల ఎన్నో సామాజిక పోరాటాలను చూసింది. ఇప్పుడు ఆ పోరాటాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కులం లేని సమాజం కోసం మాత్రమే కాదు, శ్రమకు గౌరవం, ఉపాధికి స్వేచ్ఛ, రైతుకు భరోసా, ప్రతి మనిషికి సమాన గౌరవం కలిగిన గ్రామీణ సమాజం కోసం.




