ఎదసిరల్లో నెత్తురే కాదు
అప్పుడప్పుడు
భాషా ప్రవాహాలను శ్వాసింపజేయాలి

నేనీరోజు ఊపిరి సరిగ్గా
తీసుకోలేదంటే
నా భాషను నేను సరిగ్గా మాట్లాడకపోవడమే
పడుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే
అక్షరాలు
మెదడులో భాషా క్రీడలాడుతాయి

నేను
యింగులీషు రైముల రైలుపట్టాల
మీద
పరిగెత్తలేకపోవచ్చు
నా భాషా సంద్రంలో
సంపూర్ణంగా స్నానం చేయగలను
భాష నేను నిర్మించుకున్న అస్తిత్వకుటీరం

యిప్పుడీ కుటీరంలో యే గవాక్షం తీసినా
అజంతాల సువాసనలు వెదజల్లుతాయి
నేను నడుస్తుంటే
నా వెంటొచ్చే నీడఛ్ఛాయ
నన్ను నిలిపిన
నేను పలికిన భాష మాత్రమే.
భాషను గేలిచేసి శ్వాసించని
వాడిప్పుడు
నడుస్తున్న మృత కళేబరం
వాడు
పరభాషా అస్తిపంజరాన్ని నిర్మించుకోవచ్చు
వెన్నుపూస మాతృభాషే..!

నా జానపదుల శిష్టోచ్ఛారణలో
ఆంగ్లడిస్కోల సౌరెన్నెటికీ
పరిమళించదు..!
పరాయి భాషిప్పుడు మధువు లేని తెనెతట్టు
ఎంతపిండినా ఏమాత్రం మధువొలుకుతుంది…?

ఇప్పుడు
ఈ నేల చెట్టు కొమ్మను
పరాయి గొడ్డలి నరుకుతుంటే
పాలకులు కొలిమిలో
శీతల నిప్పులు పోస్తున్నారు
చెట్టు మొదల్ని కదిలించే వాడెవడు
చెట్టు నా తొలి తల్లి

భాష శ్వాసించనివాడు నేలపై
ఆకురాలిన చెట్టే
అమ్మ చనుబాల తీపంత మధురం
నాయాస
అదే నా శ్వాస
నిశ్వాస నా భాష

నేనిప్పుడు ఊపిరి తీసుకుంటున్నానంటే
నా భాషని
శ్వాసిస్తున్నాని……!!!

Leave a Reply