1929 సెప్టెంబర్ 13న, జతిన్ దాస్ అరవై మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసి లాహోర్ సెంట్రల్ జైలులో మరణించాడు. అతను ఎలాంటి హింసాత్మక చర్యకు పాల్పడలేదు. వలస పాలన దృష్టిలో, అతని నేరం కేవలం ఒక దృఢ నిశ్చయం, అంటే భారతదేశం తనను తాను పరిపాలించుకోవాలనే అతని నమ్మకం. వారాల తరబడి సాగిన నిరాహార దీక్షతో క్షీణిస్తున్న అతని శరీరం, విచారణ కన్నా నిర్బంధం ద్వారా నోరు మూయించాలని ప్రభుత్వం అప్పటికే నిర్ణయించుకున్న ఒక వ్యక్తికి, నిరసన తెలిపేందుకు మిగిలి ఉన్న ఏకైక భాషగా మారింది. అతని మరణం కారణంగానే సెప్టెంబర్ 13వ తేదీని ఖైదీల దినోత్సవంగా పాటిస్తారు. దాదాపు ఒక శతాబ్దం తరువాత, ఈ తేదీని కేవలం గతాన్ని తలచుకుని స్మరించుకోవడం కోసం కాకుండా, అంతకంటే పురాతనమైన, ఇంకా పూర్తికాని ఒక కథను చూసేందుకు ఒక దృక్కోణంగా పరిగణించడం ముఖ్యం. ఆ కథ ఏమిటంటే, ఏ నేరం రుజువు కాకముందే ఎవరు నేరస్థులో ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తాయి? ఆ నిర్ణయం ప్రభుత్వం అప్పటికే అనుమానితులుగా గుర్తించిన వారిపైనే అసమానంగా ఎలా పడుతుంది.
వలసకాలంలోని జైలు ఎన్నడూ కేవలం నేరాలను శిక్షించే స్థలం కాదు. అది రాజకీయాలను నడిపించే ఒక సాధనం. 1919 నాటి రౌలట్ చట్టం, భారత రక్షణ నిబంధనలు, కేవలం ఉద్దేశం ఉందన్న అనుమానంతోనే, విచారణ లేకుండా, భారతీయులను నిరవధికంగా నిర్బంధించడానికి బ్రిటిష్ వారికి అధికారం ఇచ్చాయి. నేరం రుజువైందా లేదా అన్నది దాదాపు అప్రధానం, నిర్బంధమే ఒక సందేశం. దేశద్రోహం అనేది ఒక చట్టపరమైన అభియోగం కన్నా, మొత్తం జనాభాను ఒక నిగూఢమైన ముప్పుగా గుర్తించే మార్గంగా మారింది. వలస జైలు, దానికదే ఒక విధంగా, స్వాతంత్ర్య పోరాటానికి రెండవ ముఖభాగంగా మారింది. రాజకీయాలను అణచివేయాలని అనుకున్నప్పటికీ, అవి కొనసాగిన ఒక ప్రదేశంగా అది నిలిచింది. జతిన్ దాస్ నిరాహార దీక్ష, దాని తర్వాత జరిగిన జైలు మరణాలు, నిరసనల వెల్లువ, భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ తదితరులు, వలస ప్రభుత్వం అదృశ్యంగా ఉంచడానికి ఇష్టపడిన ఒక విషయాన్ని బహిర్గతం చేశారు. అదేమిటంటే, నేరం రుజువు కాకుండా నిర్బంధించడం అనేది ఒక రకమైన రాజకీయ హింస, అది తాను అణచివేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రతిఘటననే సృష్టిస్తుంది.
1947 తర్వాత ఈ వ్యవస్థాగత నిర్మాణంలో మార్పు ఎంత తక్కువగా జరిగిందనేది ఆశ్చర్యకరమైన విషయం; కానీ చాలా అరుదుగా ఈ విషయం గురించి చర్చిస్తారు. ముందస్తు నివారణా నిర్బంధాన్ని స్వతంత్ర భారతదేశం ఒక వలసవాద అవశేషంగా రద్దు చేయకుండా, దానిని తన రాజ్యాంగ నిర్మాణంలో విలీనం చేసి, దాదాపు యథాతథంగా నిలుపుకుంది. ఇది పొరపాటున జరిగింది కాదు. భారతదేశ రాజ్యాంగ నిర్మాణ ప్రాజెక్టుకు ఉన్న ముఖ్య ఉద్దేశ్యం, ఒక విస్తృత వలసవాద వ్యతిరేక ఉద్యమాన్ని ఒక అదుపులో ఉండే చట్టబద్ధమైన వ్యవస్థగా మార్చేందుకు—అంటే విప్లవాన్ని పాలనాయంత్రాంగా పరివర్తనం చెందించేందుకు—చేసిన ప్రయత్నం.
నివారణ నిర్బంధం ఆ మార్పును తట్టుకుని నిలిచింది, కొత్త రాజ్యం ఎన్ని విముక్తి ప్రసంగాలను చేసిప్పటికీ, ఆమోదయోగ్యమైన అసమ్మతికి పరిమితులను నియంత్రించడానికి పాత రాజ్యం ఉపయోగించిన అదే సాధనం అవసరమైంది. ఇది ఎప్పుడూ కేవలం చట్టానికి మాత్రమే పరిమితం కాలేదు; అత్యవసర పరిస్థితి, హక్కుల నిలిపివేత, అంతులేని నిరీక్షణ, ఎటువంటి వివరణ ఇవ్వకుండా వ్యక్తిని బంధించడం వంటి పరిస్థితులు అధికారిక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా సాధారణ జీవితంలోనూ, కథనాల్లోనూ కొనసాగాయి.; చట్టాల పుస్తకాలలో కనిపించినంతగానే కల్పనలు, జ్ఞాపకాలలో కూడా కనిపించాయి.
“ఇలాంటి ‘తాత్కాలిక’ అధికారాలు ఎప్పుడూ కేవలం తాత్కాలికంగానే ఉండిపోకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ‘ది స్టేట్ ఆఫ్ ఎక్సెప్షన్ ఇన్ ఇంటర్నేషనల్ లా అండ్ సెక్యూరిటీ’ (అంతర్జాతీయ చట్టం, భద్రతలో అత్యవసర పరిస్థితి) అనే తమ రచనలో చట్ట నిపుణులు ఫియోనువాలా ని అయోలిన్, ఓరెన్ గ్రాస్ వాదించినట్లుగా—అత్యవసర చర్యలు ఒకసారి అమల్లోకి వస్తే వాటిని నిలిపివేయడం దాదాపుగా అసాధ్యం అవుతుంది. ప్రతిసారీ వాటి గడువును పొడిగించడం తదుపరి పొడిగింపును మరింత సులభతరం చేస్తుంది. చివరికి, ఒక మినహాయింపుగా ఉద్దేశించినది కాస్తా, ‘రాజ్యం పనిచేసే విధానం’ గానే మారిపోతుంది. భారతదేశంలో నివారక నిర్బంధం (ప్రివెంటివ్ డిటెన్షన్) అనుసరించిన మార్గం ఇదే. ఒక వలసవాద అత్యవసర తర్కం కింద ప్రవేశపెట్టారు; ఒక రాజీగా రాజ్యాంగంలో పొందుపరచారు; ఆపైన 1975-77 అత్యవసర పరిస్థితి; చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్ట ఆవిర్భావం, జమ్మూ& కశ్మీర్ ప్రజా భద్రతా చట్టం ద్వారా ఏడు దశాబ్దాలుగా పునరుద్ధరించారు; కొత్త పేరుపెట్టారు, విస్తరించారు. 1975-77 ఒక అలిఖిత నియమాన్ని ఉల్లంఘించినందువల్లనే అత్యవసర పరిస్థితి ఒక అసాధారణ సంఘటనగా గుర్తుండిపోయింది.
“ఆ రచించని నియమం ఈరోజు కూడా మళ్లీ అమలవుతోంది, పైగా ఒక నిర్దిష్ట గుర్తింపుని ఆపాదించుకుని అమలవుతోంది. సౌత్ ఏషియా హ్యూమన్ రైట్స్ డాక్యుమెంటేషన్ సెంటర్ (దక్షిణాసియా మానవ హక్కుల డాక్యుమెంటేషన్ సెంటర్) ద్వారా భారతదేశ నివారక నిర్బంధ విధానంపై జరిగిన ఒక మైలురాయిలాంటి అధ్యయనం ప్రకారం—ఒక నిర్బంధాన్ని జాతీయ భద్రతా అంశంగా చిత్రీకరించిన తర్వాత, కాగితాలపై ఉండే రాజ్యాంగపరమైన రక్షణలు వాస్తవంలో రక్షణగా మారడం చాలా అరుదు. విధానపరమైన ప్రక్రియ ఒక నాటకంగా మారిపోతుంది; “భద్రతా ముప్పు” అనే ముద్ర మిగిలిన పనినంతా ఎటువంటి అడ్డంకి లేకుండా పూర్తి చేస్తుంది. గత దశాబ్దపు రికార్డులు ఈ విషయాన్ని స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి.
ఉపా కింద శిక్షపడే రేటు అత్యంత తక్కువగా ఉంటున్నప్పటికీ, ఏ కోర్టు తీర్పు వెలువరించక ముందే విచారణ ఖైదీలుగా ఉండాల్సిన సమయం తరచుగా సంవత్సరాల తరబడి, కొన్నిసార్లు దశాబ్ద కాలానికి దగ్గరగా చాంతాడంత సాగుతోంది. షార్జీల్ ఇమామ్ 2020 నుండి విచారణ లేకుండానే జైలులో ఉన్నారు. ఉమర్ ఖలీద్ కేసు కూడా అదే వేగంతో సాగుతోంది. భీమా కోరేగావ్ నిందితుల్లో చాలామంది వృద్ధులు, మరికొందరు స్పష్టంగా క్షీణిస్తున్న ఆరోగ్యంతో ఉన్నారు; కోర్టులో ఇంకా క్షుణ్ణంగా రుజువుకాని ఆరోపణలపైన వారు విచారణ ఖైదీలుగా సంవత్సరాల తరబడి గడిపారు. జి.ఎన్. సాయిబాబా పదేళ్లపాటు జైలు జీవితం గడిపారు—అందులో చాలా సమయం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తించిన పరిస్థితుల మధ్య గడిచింది—చివరకు ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. అయితే ఆ విడుదల లభించే సమయానికే, ఏళ్ల తరబడి బంధీగా ఉన్న కాలం చేయాల్సిన నష్టాన్ని చేసేసింది.”
“ఇక్కడ స్పష్టమైన ఒక ప్రతివాదన ఉంది, దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. ‘ది ట్రాన్స్ఫార్మేటివ్ కాన్స్టిట్యూషన్’ (పరివర్తనా రాజ్యాంగం) అనే గ్రంథంలో చట్ట నిపుణుడు గౌతమ్ భాటియా వాదించినట్లుగా—కనీసం ఆకాంక్ష పరంగానైనా, వలసవాద అధికార క్రమాన్ని తెంచివేసి, వ్యక్తిగత గౌరవాన్ని, స్వేచ్ఛను కేంద్రస్థానంలో నిలిపేందుకు భారత రాజ్యాంగ రచన జరిగింది. ఆ ఆకాంక్ష వాస్తవమైనది, దాన్ని పట్టుకుని వేలాడటం అమాయకత్వమేమీ కాదు. అయితే, ఆ వాగ్దానానికి, వలసవాద రాజ్యం నుండి దాదాపు యథాతథంగా సంక్రమించిన నివారక నిర్బంధ వ్యవస్థాగత రకానికి మధ్య ఉన్న ఆ అగాధమే—ఉపా, ఎన్ఎస్ఏ, పిఎస్ఏల నిరంతర వినియోగాన్ని రాజ్యాంగం స్వయంగా పేర్కొన్న లక్ష్యంతో సమర్థించుకోవడాన్ని అత్యంత కష్టతరం చేస్తోంది. నేటి రాజకీయ ఖైదీ సరిగ్గా ఆ అగాధంలోనే జీవిస్తున్నాడు—అంటే ఒక పరివర్తనాత్మకమైన రాజ్యాంగ పత్రానికి; ఆ పత్రం ఎన్నడూ పూర్తిగా తొలగించలేకపోయిన ఒక కారాగార యంత్రాంగానికి మధ్య అతను బందీగా ఉన్నాడు.”
“జనాభా నిష్పత్తితో పోలిస్తే ముస్లింల జైలు శిక్షల రేటుపై సచార్ కమిటీ నివేదిక అందించిన గణాంకాలు ఏదో ఒక విడిగా ఉన్న గణాంకం కాదు. అది చాలా కాలంగా కొనసాగుతున్న ఒక పద్ధతికి చెందిన అనుభవపూర్వక అవశేషం. ముఖ్యంగా అది ఏదైనా వ్యవస్థీకృత లేదా సమర్థవంతమైన రూపాన్ని దాల్చినప్పుడు ముస్లిం గుర్తింపును సహజంగానే నేర స్వభావానికి దగ్గరగా ఉన్నట్లుగా ప్రభుత్వం భావించే అత్యంత సుదీర్ఘమైన వైఖరికి ఉండే ప్రత్యక్ష సాక్ష్యమది. విస్తరిస్తున్న భద్రతా యంత్రాంగాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, సమాజాలు ముందుగా ‘నేరస్థుడి’ రూపాన్ని సృష్టించి, ఆ తర్వాత ఆధారాలు వెతకడంలో—లేదా అసలు వెతక్కపోవడంలో— అద్భుతంగా రాణిస్తాయి. రౌలత్ చట్టాన్ని సమర్థించుకోవడానికి వలసవాద ప్రభుత్వానికి నాడు ‘రాజ్యద్రోహి అయిన స్థానికుడు’ ఎలా అవసరమయ్యాడో, నేటి ప్రభుత్వం కూడా ముస్లిం, దళిత కార్యకర్తలు, విశ్వవిద్యాలయ/కళాశాల క్యాంపస్ నిర్వాహకులలో అదే విధంగా ఉపయోగపడే రూపాన్ని కనుగొంది. అతని గుర్తింపులోనే అతని నేరం స్పష్టంగా కనిపిస్తున్నందున, అతని నిర్బంధానికి ఎటువంటి వివరణ అవసరం లేదు.
ఇది మనల్ని ఖైదీల దినోత్సవం అసలు ఉద్దేశ్యం ఏమిటనే విషయాన్ని తిరిగి తీసుకువస్తుంది. ఒక శతాబ్దం గడిచినా, మనం జతిన్ దాస్ను, అతని సహచరులను రాజకీయ ఖైదీలని పిలవడానికి అనుకూలంగా ఉన్నాం; ఒక న్యాయమైన ఆశయం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులుగా వారిని కీర్తిస్తున్నాము కూడా. కానీ ఆ పదాన్ని వారి సమకాలీనులకు దాదాపుగా ఎన్నడూ వర్తింపజేయడం లేదు.
సాధారణ ప్రజా వేదికల చర్చల్లో షార్జీల్ ఇమామ్ను ఒక రాజకీయ ఖైదీగా వర్ణించరు; ఆయన ఒక ‘ఉగ్రవాద నిందితుడు’. ఉమర్ ఖలీద్ ఒక భిన్నాభిప్రాయం గల నిరసనకారుడు కాదు; ఆయన ఒక ‘దేశద్రోహి’. ఆ పదజాలాన్ని కూడా చేజిక్కించుకొని, తద్వారా అదే వ్యవస్థాగత హింసకు గురవుతున్న, నిరూపించబడిన చర్య ఆధారంగా కాకుండా కేవలం అనుమానిత భావజాలం ఆధారంగా నిరవధిక నిర్బంధాన్ని అనుభవిస్తున్న వ్యక్తులకు, వారి పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించడానికి వీలు కల్పించే ఆ ‘రాజకీయ ఖైదీ’ అనే హోదానే నిరాకరిస్తున్నారు.”
“ఖైదీల దినోత్సవాన్ని నిజాయితీగా స్మరించుకోవడమంటే కేవలం 1929 లో మరణించినవారిని అమరవీరులుగా గౌరవించడం మాత్రమే కాదు, ఈ అసమానతను గుర్తించడం కూడా. చరిత్రలోని రాజకీయ ఖైదీలను పూజించే ఒక దేశం, నేడు సరిగ్గా అదే రకమైన అనుభవాన్ని అనుభవిస్తున్న వారికి ఆ పేరును ఎందుకు నిరాకరిస్తోందో అని ప్రశ్నించుకోవడమే నిజమైన స్మరణ. ఎవరిని ‘రాజకీయ ఖైదీ’ అని పిలవాలి, ఎవరిని ‘ఉగ్రవాది’ అని పిలవాలి అనే అంశంపై సాగే ఈ పోరాటం ఈ చరిత్రకు యాదృచ్ఛికం కాదు; అది నిరంతరం కొనసాగుతున్న చరిత్ర.”
ఖైదీల దినోత్సవాన్ని నిజాయితీగా జరుపుకోవడం అంటే, కేవలం 1929లో మరణించిన వారిని గౌరవించడం మాత్రమే కాదు, ఈ అసమానతను గుర్తించడం కూడా. చరిత్రలోని రాజకీయ ఖైదీలను పూజించే ఒక దేశం, నేడు దాదాపు అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్న వారికి ఆ పేరును ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నించడమే నిజమైన స్మరణ. ఎవరిని రాజకీయ ఖైదీ అని, ఎవరిని ఉగ్రవాది అని పిలవాలనే ఈ పోరాటం ఈ చరిత్రకు యాదృచ్ఛికం కాదు; అది నిరంతరం కొనసాగుతున్న చరిత్ర.
అనువాదం : పద్మ కొండిపర్తి
రచయిత ఢిల్లీలో నివసిస్తున్న ఒక పీహెచ్డీ విద్యార్థి; ఫ్రాటర్నిటీ మూవ్మెంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి.
https://maktoobmedia.com/post?id=116570&slug=the-prisoner-as-political-category




