ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల ఆస్తులను పరుల పరం (స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు తేరగా ఇచ్చివేయటం) చేయటం మోడీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది. మొదట్లో అయితే నష్టాల్లో ఉన్న వాటినే పెట్టుబడిదారులకు తెగనమ్ముతున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత కాలంలో లాభాల్లో ఉన్న వాటిని కూడా ప్రైవేటు పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నారు! ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటం ఒక విధానంగా మన పాలకులు అనుసరిస్తున్నారు. దేశ భక్తి, స్వావలంబన గురించి గొప్పలు పోయే పాలకులు ప్రజల ఆస్తులను విదేశీ పెట్టుబడిదారులకు అమ్మివేయటాన్ని ఏమని సమర్థించుకుంటారు? ఈ నేపథ్యం లోంచే ఈ మధ్య అతి ప్రధానమైన ఐడిబిఐ బ్యాంకును కూడా విదేశీ పరం చేయటానికి సమాయత్తమవటాన్ని చూడాలి .ఇది మరీ విడ్డూరం.
ప్రజలు చెల్లించిన పన్నుల డబ్బుతో నష్టాల నుంచి గట్టెక్కిన స్వదేశీ బ్యాంకును విదేశీ కార్పొరేటు సంస్థకు అప్పగించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. అయినా, మోడీ ప్రభుత్వం ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు స్పీడు పెంచింది. దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించిన వాటిలో ఐడిబిఐ బ్యాంకును చెప్తారు. ఇది 1 జూలై 1964 లో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటైంది. 2004లో బ్యాంకింగ్ కంపెనీగా మార్పు చెందింది. ప్రస్తుతం అది ప్రైవేట్ రంగ బ్యాంకుగా కొనసాగుతోంది. దీనిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎలఐసి), భారత ప్రభుత్వం ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి. సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, హోమ్ లోన్స్, ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్, డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డులు వంటి పూర్తి స్థాయి సేవలను అందిస్తున్నది. ఇంతటి చరిత్ర, పాత్ర కలిగిన ఈ బ్యాంకును ఇప్పుడు మోడీ ప్రభుత్వం తెగనమ్మటానికి సిద్ధమవటం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది.
భారత ఆర్థిక రంగాన్ని సమూలంగా మలుపు తిప్పే అత్యంత భారీ డీల్‌కు మోడీ ప్రభుత్వం తెరలేపింది. ఐడిబిఐ బ్యాంక్ మెజారిటీ వాటా విక్రయానికి మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) అక్టోబర్ 14న ఆమోదముద్ర వేసింది. కెనడాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ దిగ్గజం ఫెయిర్‌ఫాక్స్ హోల్డింగ్స్ అనుబంధ సంస్థ ‘ఎం/ఎస్ కెనడా ఇంక్’ అనే కార్పొరేట్ సంస్థ ఏకంగా రూ. 52,878.08 కోట్లు వెచ్చించి, ఈ బ్యాంకులో 60.72 శాతం నియంత్రణ వాటాను చేజిక్కించుకుంది. భారత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కావడం విశేషం. ఎయిర్ ఇండియా అమ్మకం తర్వాత ప్రభుత్వ రంగంలో జరిగిన అతిపెద్ద పెట్టుబడి ఉపసంహరణ ఇదే. దీంతో భారత ఆర్థిక సేవల రంగంలో ఇదే అతి పెద్ద విదేశీ పెట్టుబడి ఒప్పందం.
ఈ లావాదేవీలో ఐడిబిఐ బ్యాంకు మొత్తం విలువ సుమారు రూ.87,100 కోట్లుగా లెక్కగట్టారు. అయితే.. అక్టోబర్ 14 నాటి షేరు ముగింపు ధర రూ.90.40తో పోలిస్తే 11 శాతం తక్కువ ధరకు వాటాలను విక్రయించడం గమనార్హం. దీంతో దాదాపు కెనడా కంపెనీకి రూ.4800 కోట్ల లబ్ధి చేకూర్చినట్లయ్యింది. దీన్ని మొత్తం రెండు దశల పోటీ బిడ్డింగ్ ద్వారా నిర్వహించారు. మొదటగా 2022 అక్టోబరు 7న ఆసక్తి వ్యక్తీకరణ (ఇఓఐ) ప్రకటన వెలువడగా, ఐదు సంస్థలు బిడ్ దాఖలు చేశాయి. ఇందులో అర్హత సాధించిన నాలుగు పార్టీల్లో రెండు సంస్థలు మాత్రమే టెక్నో-ఫైనాన్షియల్ బిడ్డ్ ను సమర్పించాయి. ఈ ఒప్పందం తర్వాత ఐడిబిఐలో కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసి సంయుక్తంగా 34శాతం వాటాను మాత్రమే కలిగి ఉంటాయి.
ఐడిబిఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం గత కొంత కాలంగా కసరత్తు చేసింది. ఫెయిర్ ఫాక్స్ పొందుతున్న 60.72 శాతం వాటాలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 30.48 శాతం వాటాను సుమారు రూ.26.620 కోట్లకు విక్రయించాలని నిర్ణయించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి)కు ఉన్న 30.24 శాతం వాటాను దాదాపు రూ.26,400 కోట్లకు అమ్మనుంది. ప్రతి షేర్‌కు రూ.81 చొప్పున బిడ్‌ను ఫెయిర్‌ఫాక్స్ గెలుచుకుంది. వాటాకు సంబంధించిన విక్రయం పూర్తయితే… దేశ ఆర్థిక రంగంలో ఇది అతిపెద్ద ఎఫ్‌డిఐగా నిలవనుందని కేంద్రం తెలిపింది. ఈ వాటాల విక్రయంతో ఐడిబిఐ బ్యాంకులో ఎల్‌ఐసి వాటా వచ్చే రెండేళ్లలో 19 నుంచి 15 శాతానికి పడిపోనుంది. మిగిలిపోయిన ప్రభుత్వ వాటాను బహిరంగ మార్కెట్ ద్వారా విక్రయిస్తారు. కాగా… ఫెయిర్ ఫాక్స్ కు అంతపెద్ద మొత్తంలో వాటాలు విక్రయించడం పెట్టుబడుల ఉపసంహరణ కాదని, అదొక ‘స్ట్రాటజిక్ రీ స్ట్రక్చరింగ్’ (వ్యూహాత్మక పునర్నిర్మాణం) అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొస్తున్నారు. వాటాల విక్రయం జరిగినా ఆ బ్యాంకులో ప్రభుత్వానికి, ఎల్ఐసికి వాటాలు ఉంటాయని ఆమె తెలిపారు.
పార్లమెంటులో హామీకి తూట్లు.. ఆర్థిక వ్యవస్థకు ముప్పు :
ఈ ఐడిబిఐ బ్యాంకు మొండి బకాయిల భారంతో తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ బ్యాంకును నిలబెట్టడానికి ప్రభుత్వం ఎల్‌ఐసి నుంచి భారీ మూలధనం తెచ్చింది. ఎల్ఐసి 2019లో రూ. 21.624 కోట్లతో వాటా కొని, తర్వాత మరో రూ.4,743 కోట్లు పెట్టింది. ఇదంతా పాలసీదారుల సొమ్మే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.4,557 కోట్ల పన్ను చెల్లింపుదారుల ధనాన్ని పెట్టింది. ఇప్పుడు ఐడిబిఐ బ్యాంకు ఆర్థికంగా బలపడింది. లాభాలు పెరిగాయి. 2003లో ఐడిబిఐ చట్టం తెచ్చినప్పుడు పార్లమెంటు స్థాయీ సంఘం ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గకూడదని సూచించింది. అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్, లోక్‌సభ, రాజ్యసభల్లో ఆ మేరకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ వాటా పదిహేను శాతానికి పడిపోతోంది. అంటే ఆ హామీ నేరుగా ఉల్లంఘించ బడుతోంది. ముఖ్యంగా, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ (సిసిఇఏ)కి ప్రభుత్వం వద్ద మిగిలిన పదిహేను శాతం వాటాను కూడా భవిష్యత్తులో ఓపెన్ మార్కెట్‌లో అమ్మేందుకు అధికారాలు ఇచ్చింది. అంటే ఇది కేవలం నియంత్రణ మార్పు కాదు, ప్రభుత్వ ఉనికినే క్రమంగా తుడిచేయడానికి సిద్ధమయ్యారని అర్థం. ఐడిబిఐ ఒకప్పుడు పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలిచ్చే ప్రత్యేక సంస్థ. ఇలాంటి సంస్థలు లేకపోతే మౌలిక సదుపాయాలు, చిన్న పరిశ్రమలకు పెట్టుబడి దొరకడం కష్టమవుతుంది. అయినా ఐడిబిఐ బ్యాంకును ప్రైవేటు పరం చేయటం ఎవరి ప్రయోజనాలకోసమో!
నష్టాల ఊబి నుంచి లాభాల వైపు ప్రయాణం:
ఒకప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఐడిబిఐ బ్యాంకు పరిస్థితి దారుణంగా ఉండేది. 2017లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకును ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పిసిఎ) పరిధిలోకి నెట్టి కఠిన ఆంక్షలు విధించింది. ప్రభుత్వం, ఎల్‌ఐసి వేల కోట్ల రూపాయల మూలధనాన్ని అందించి బ్యాంకును పునరుద్ధరించాయి. 2018 సెప్టెంబర్ నాటికి 31.78 శాతంగా ఉన్న గ్రాస్ ఎన్‌పిఎలు, 2026 మార్చి నాటికి ఏకంగా 2.32 శాతానికి తగ్గించారు. ఎన్‌పిఎలు కేవలం 0.15 శాతానికి దిగిరావడం విశేషం. అంతేకాకుండా గడచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 9,513 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి, బ్యాంకు తన బలాన్ని నిరూపించుకుంది. ఇలా ఆర్థిక పుష్టితో లాభాల్లో ఉన్న ఐడిబిఐ బ్యాంకును ఉన్న పలంగా ఎందుకు అమ్మాల్సి వస్తున్నదో మోడీ చెప్పాలి.
అభివృద్ధి సంస్థ నుంచి అమ్మకపు సరకు దాకా:
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడిబిఐ) జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1964లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ ఆర్థిక సంస్థ. ఆనాటి నుండి నేటివరకు దీర్ఘకాలిక రుణాల ద్వారా దేశ పరిశ్రమలకు ఆధారంగా నిలిచింది. సరళీకరణ విధానాల కాలంలో దీన్ని క్రమంగా వాణిజ్య బ్యాంకుగా మార్చారు. 2019లో ఐడిబిఐ ఒడిదుడుకుల నుంచి బయట పడటం కోసం ఎల్‌ఐసి 51 శాతం వాటా తీసుకున్న తర్వాత రిజర్వ్ బ్యాంక్ దీన్ని ప్రైవేటు రంగ బ్యాంకుగా వర్గీకరించింది. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసి పెట్టుబడితో నడుస్తున్న ఐడిబిఐ ప్రైవేటు బ్యాంక్ ఎలా అవుతుంది? ప్రస్తుత కేంద్రం, ఎల్‌ఐసి కలిపి 95 శాతం వాటా కలిగి ఉన్నా, నియంత్రణాధికారం ప్రభుత్వం చేతిలో లేదు. అమ్మకానికి దారి వేయడానికి చేసిన దశలవారీ మార్పులే ఇప్పుడు ఇక్కడికి దారితీశాయనే అనుమానం కలుగుతున్నది. బ్యాంకు పేరు మాత్రం అలాగే ఉన్నా, యాజమాన్యం, నిర్ణయాధికారం మాత్రం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లింది!
రిజర్వేషన్ల రద్దు- సామాజిక న్యాయానికి ముప్పు:
ఐడిబిఐలో వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, ఒబిసి వర్గాలకు చెందిన వారు, మహిళలు, వికలాంగులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నంత వరకే రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది. ప్రైవేటీకరణ తర్వాత కొత్త నియామకాల్లో ఆ అవకాశం శాశ్వతంగా పోతుంది. ఇది కేవలం ఉద్యోగుల విషయం మాత్రమే కాదు. రైతులు, చిన్న వ్యాపారులు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుతున్న విధానమే ప్రశ్నార్థకం అవుతుంది. లాభం మాత్రమే లక్ష్యంగా ఉండే విదేశీ పెట్టుబడితో నడిచే ప్రైవేటు బ్యాంకు తక్కువ లాభాల శాఖలను, చిన్న రుణాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది.
మరోవైపు, ఐడిబిఐ బ్యాంకును ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ సంస్థకు బ్యాంకు వాటాలను విక్రయించడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ బలహీన పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకును ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఐడిబిఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తక్కువకు పడి పోనివ్వబోమని ప్రభుత్వం పార్లమెంటుకు హామీ ఇచ్చిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఉద్యోగుల సర్వీస్ కండిషన్లు, పెన్షన్ ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో గత అనుభవాల నేపథ్యంలో ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఐడిబిఐకి దేశవ్యాప్తంగా వేల శాఖలున్నాయి. లక్షలాది జన్‌ధన్ ఖాతాలు, బీమా, అటల్ పెన్షన్ ఖాతాలు ఈ బ్యాంకుపై ఆధారపడి ఉన్నాయి. రూ.3 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు ప్రధానంగా సామాన్య ప్రజలవే. వారు డబ్బు దాచింది ప్రభుత్వ అండ ఉందనే నమ్మకంతోనే. ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే, డిపాజిటర్లు భయపడనవసరం లేదని. కానీ అమ్మకం తర్వాత ఉద్యోగుల సేవా నిబంధనలు, రిజర్వేషన్లు, శాఖల నిర్వహణ, రుణ విధానాలపై చట్టబద్ధమైన హామీలు బహిరంగంగా ప్రకటించలేదు. అదేవిధంగా ప్రభుత్వం “మేము, ఎల్ఐసి వాటాదారులుగా కొనసాగుతాం” అంటోంది. కానీ 15, 19 శాతాల మైనార్టీ వాటాలతో బ్యాంకు విధానాలపై నియంత్రణ ఉండదు. ఎల్ఐసి వాటాను కూడా రెండేళ్లలో 15 శాతానికి తగ్గించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగుల జీవితాలే కాదు, లక్షలాదిగా ఉన్న ఖాతాదారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
ముగింపు:
ఉద్యోగ భద్రతపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత అధికారులను, ఉద్యోగులను వారి సర్వీస్ సీనియారిటీ, పెన్షన్, జీతభత్యాల రక్షణతో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ అయ్యే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణంగా లాభనష్టాలతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందిస్తాయి. ప్రైవేటీకరణ వల్ల గ్రామీణ బ్రాంచ్‌ల విస్తరణ తగ్గవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫెయిర్‌ఫాక్స్ ‘ఫైనాన్షియల్ హోల్డింగ్స్’ గ్రూప్‌కు ఐడిబిఐ బ్యాంక్‌ను విక్రయించే ప్రతిపాదనను నిరసిస్తూ ఆల్ ఇండియా ఐడిబిఐ ఆఫీసర్స్ అసోసియేషన్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌ల కలయికతో ఏర్పడిన ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడిబిఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయ్‌స్’ (యుఎఫ్ఏఐఇ) నవంబర్ 2, 3 తేదీలలో దేశవ్యాప్త నిరాహార దీక్షతో పాటు సమ్మె నోటీసును జారీ చేసింది. 2003, డిసెంబర్‌లో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం బ్యాంకులో ప్రభుత్వ మెజారిటీ వాటాను కొనసాగించాలని, అందుకోసం ప్రభుత్వం లేదా ఎలఐసి ద్వారా కనీసం 6 శాతం ఈక్విటీని కొనుగోలు చేసి, ప్రభుత్వ వాటాను 51 శాతానికి పైగా ఉంచాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల ప్రయోజనాల గురించి ఏమాత్రం ఆలోచించినా ఐడిబిఐ అమ్మకాన్ని మోడీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి. ప్రభుత్వ వాటా 51 శాతం కన్నా తగ్గనివ్వకూడదన్న 2003 పార్లమెంటు హామీని గౌరవించాలి. ఒప్పంద పత్రాలన్నింటినీ పార్లమెంటు, ప్రజల ముందు ఉంచి చర్చ జరపాలి. అంతవరకు ఏ నిర్ణయమూ అమలు చేయకూడదు. భూములు, భవనాలతో సహా బ్యాంకు ఆస్తుల పూర్తి విలువను స్వతంత్ర సంస్థ ద్వారా నిర్ధారణ చేయాలి.




