పన్నెండు మంది బుద్ధిజీవులు తెలంగాణ జనగణన సందర్భంగా కులం, మతం వద్దనుకునే వారికోసం ప్రత్యేకంగా ఒక కాలమ్ చేర్చాలని హైకోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన ఫలితంగా కులం, మతం వద్దనుకున్న వారికోసం ఒక కాలమ్ కేటాయించడం, ఈ కాలమ్ లో దాదాపు 11.96 లక్షల(3.4 శాతం)మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం ఎవరూ ఊహించని గొప్ప పరిణామం. ఆ విధంగా వీరందరూ తమ ప్రజాస్వామిక హక్కుని సాధించుకున్నారు. హిందూత్వవాదులకు ఈ పరిణామాలు మింగుడు పడక వీరిపై గుర్రుగా ఉండగా, ఈ సమస్యను అర్ధం చేసుకోలేని వారు గందరగోళపడుతున్నరు. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటున్న అత్యధిక పార్టీలు, ప్రజాసంఘాలు ఈ అంశానికి ఉన్న ప్రాముఖ్యతను చులకనగా చూస్తూ, గుర్తించకున్నా, తగు సహాయ సహకారాలు అందించకున్నా ఎంతో చైతన్యం గల వీరు మన దేశంలోని కుల నిర్మూలనా పోరాటానికి కొత్త పోరాట రూపాన్ని పరిచయం చేశారు. ఈ విధంగా దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా వివిధ రూపాలలో కుల, మత రహిత అస్తిత్వాన్ని ప్రకటించుకుంటున్న వారు బహుశా కోట్ల సంఖ్యలో ఉండవచ్చు. ఆ రకంగా దేశ వ్యాప్తంగా ఉన్న కుల, మత రహిత అస్తిత్వ ప్రకటనవాదుల కృషి భారతీయ ఆత్మ అని పిలువబడుతున్న విచ్ఛిన్నకర, విధ్వంసకర కులానికి, కుల వ్యవస్థకు చితి పేర్చనుంది. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి గొప్ప దోహదం చేయనుంది. హిందూయిజం భారత దేశానికి ఆత్మ వంటిది అని వలసపాలనా కాలంలో తొమ్మిది మంది గవర్నర్ జనరల్స్ కింద 39 సంవత్సరాల పాటు ఐసిఎస్ ఆఫీసర్ గా పనిచేసిన రెజినాల్ హెచ్ క్రాడిక్ అనే బ్రిటిషర్ తన ది ‘డైలమా ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో “ఈ కుల వ్యవస్థ అనే కోటని బయటి నుండి దాడులు జయించలేవు. దీని గోడలకి లోపలి సైన్యం మరమ్మతులు చేయడం నిలిపివేసినప్పుడే అవి బీటలు వారతాయి. భారతదేశాన్ని రక్షిస్తున్న నిజమైన వ్యవస్థ కుల వ్యవస్థయే. భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్యం నెలకొంటే అది కుల వ్యవస్థను నాశనం చేస్తుంది.కులాలని నాశనం చేస్తే అది హిందుయిజాన్ని నాశనం చేస్తుంది” అని అంటాడు . సమీప భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా జరిపే జనగణన సందర్భంగా కులాల లెక్కలు తీసి, రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరుపాలని డిమాండ్ చేస్తున్న వీరంతా ఇదే జనగణనలో తెలంగాణలో కేటాయించినట్లు తమకు ప్రత్యేక కాలమ్ కేటాయించాలని అడగడం ప్రజాస్వామికమైనది.
డా.బి ఆర్ అంబేద్కర్ అన్నట్లు కులాన్ని సంస్కరించడం లేదా నిచ్చెన మెట్ల కులాల మధ్య సమానత్వాన్ని సాధించడం సాధ్యం కాదు. మెజారిటీ ప్రజల అభివృద్ధికి అడ్డంకిగా ఉండి వారిని పశువుల కంటే హీనంగా చూస్తున్న కుల వ్యవస్థను ధ్వంసం చేయాల్సిందే. ఈ రూపంలోనో మరో రూపంలోనో.అందుకు ఒకడుగేసిన ఈ మితృలందరికీ అభినందనలు. ఒకప్పుడు సామాజిక విప్లవకారుడు పెరియార్ అంటరానితనానికి పునాదిగా ఉన్న కుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. దేశంలోని వర్గ వ్యవస్థతో పెనవేసుకున్న కుల వ్యవస్థ మన ప్రజలను అడ్డూ అదుపులేకుండా దోపిడీ చేస్తూ వారి ఐక్యతకు, అభివృద్ధికి, స్వయం గౌరవానికి అడ్డంకిగా ఉన్నది. క్రూరమైన హింసకు, ఆధిపత్య పాలనకు పాలకుల చేతిలో అదనపు సాధనంగా ఉపయోగపడుతుంది. బ్రాహ్మణీయ మనువాద సంస్థ ఆర్ ఎస్ ఎస్ ప్రవచిస్తున్న హిందూత్వ ఫాసిజానికి పునాదిగా ఉన్నది. ఒక్కమాటలో కుల వ్యవస్థ వల్ల దేశ ఉత్పత్తి సామర్థ్యమూ, ఉత్పత్తి శక్తుల ఎదుగుదల కుంటుపడగా పచ్చి అభివృద్ధి నిరోధకులు మాత్రమే ఇది రక్షించబడాలని, దీన్ని ఉపయోగించుకొని హిందూత్వ కార్పోరేట్ రాజ్యాన్ని నెలకొల్పాలని కుట్రలు చేస్తున్నరు. ఈ నేపధ్యంలో కుల వ్యవస్థ, హిందూత్వవాదుల అరాచకాలు, కుల, మతరహితవాద ఉద్యమ ఆవశ్యకత రీత్యా ఈ అంశాన్ని పరిశీలించాలి .
మన దేశం ప్రపంచంలోనే అతి ప్రాచీన చరిత్ర, నాగరికత, సంస్కృతి గలది. వ్యవసాయం, స్థిర నివాస గ్రామాలతో పాటు పట్టణ నాగరికత కలిగి విదేశాలతో వాణిజ్యం నెరపిన సింధూ జీవన విధానం మనది. ఇంతటి ఘనమైన దేశ ప్రజల పై నాలుగు వేల సంవత్సరాల క్రితం అనేక ఉపద్రవాలతో పాటు ప్రధానంగా విదేశీ వలసవాద పితృస్వామిక ఆర్య సంచార తెగల దాడుల మూలాన వర్ణ,కుల వ్యవస్థలు నెలకొని వినాశనం ప్రారంభమై వేల సంవత్సరాలు గడిచినా నేటికీ కోలుకోలేకపోతున్నది. ఈ నాగరికత ధ్వంసమైపోయిన తర్వాత దాదాపు వేయి సంవత్సరాలకు పైగా మరో నాగరికతను నిర్మించుకోలేకపోయింది. సింధూ ప్రాంతాన్ని దురాక్రమించిన ఈ ఆర్యుల రుగ్వేదం ప్రకారమే వీరు రాజన్యులు( క్షత్రీయులు), బ్రాహ్మణులు(పూజారులు),విశ్ లు(సాధారణ ప్రజలు)గా మూడు తెగలుగా జీవిస్తూ సింధూ ప్రాంతం పై దాడి చేశారు. ఈ అనాగరికులతో యుద్ధాలు చేసిన నల్లని రంగు గల స్థానిక సింధూ ప్రజలను దాసులని సమాజంలో(ఉత్పత్తి వ్యవస్థలో)భాగమని ప్రస్తావించారు. అనగా ఆర్య త్రైవర్ణాలు ఒకవైపు సింధూ ప్రజలను దాసులు ఆ తరువాత శూద్రులుగా మరొక వైపున ఉన్న సామాజిక విభజన రంగును బట్టి వర్ణ వ్యవస్థ ఆరంభమైంది. ఆ తరువాత వర్ణాల మధ్య విభజన,వర్ణ ధర్మాలు ఉనికిలోకి వచ్చి ఆర్య త్రైవర్ణాలకు సేవ చేయడమే శూద్రుల కర్తవ్యమని చెప్పారు. రంగు, సామాజిక హోదా, అంతస్తు మీద ఆధారపడి వర్ణ వ్యవస్థ విభజనను ప్రారంభిస్తే ఈ సామాజిక హోదాను సామాజిక శ్రమ విభజనతో పాటు ఒక తెగ పై మరొక తెగ రాజకీయ ఆధిపత్యం ఆధారంగా నిర్ణయించారు. శ్రమచేసే ప్రజలు సామాజిక వ్యవస్థలో కింది మెట్టున ఉన్నారు. ఈ కాలపు వర్ణ వ్యవస్థ స్వల్పంగా ఉన్న అదనపు శ్రమను రాబట్టడానికి ఉపయోగపడ్డా గెలుచుకున్న స్థానిక తెగలపై సాంఘిక ఆధిపత్యాన్ని ప్రతిష్టించడమే విదేశీ ఆర్యుల వర్ణ విభజన ప్రాధమిక లక్ష్యం.ఈ రాజకీయ ఆధిపత్యమే ఆ తరువాత వర్ణ/వర్గ వ్యవస్థ ఆవిర్భావానికి దారితీసింది.వర్ణ వ్యవస్థ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం,స్థానిక తెగల పై నిరంతరం జరిగే యుద్ధాలలొ విజయమే లక్ష్యంగా యజ్ఞాలు,యాగాలు చేసి ఆహార ధాన్యాలను తగులపెట్టి, పశువులను కోసుకుతిని,సోమరసం తాగి జల్సాలు చేసే ఆర్యుల సంస్కృతి,జీవన విధానమే ఈ దేశం పై రుద్దబడ్డది.
సామాజికోత్పత్తి క్రమంలో శూద్రుల సంఖ్య, స్థిర నివాసాలు పెరగడం, ఇనుము వాడుకలోకి రావడం, అటవీ భూములు నరికి నాగలితో కూడిన వ్యవసాయం పెరగడం, పట్టణాలు, వాణిజ్యం అభివృద్ధి వల్ల అనేక చోట్ల తెగలలోని సమానత్వం స్థానంలో స్వార్థం, దురాశ చోటు చేసుకుని కేంద్రీకృత వర్గ రాజ్యాలు ఆవిర్భవించాయి. వీటి ప్రక్కనే మరికొన్ని తెగల రాజ్యాలలో వర్ణ వ్యవస్థ వికృత రూపం తీసుకుంది. వర్ణ వ్యవస్థ తెగల పై ఆధిపత్యం మరియు మిగులు ఉత్పత్తిని రాబట్టే యంత్రాంగంగా పని చేసింది. భూధానాల వల్ల భూమిని కలిగి ఉండి వ్యవసాయ ఉత్పత్తి దారులపై అధికారం చెలాయించే అధికారులతో పాటు తెగలను లొంగతీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున శ్రామికులు పుట్టుకొచ్చారు. అస్పృశ్యత ఉనికిలోకి వచ్చింది. ఈ కాలం నుండే కుల వ్యవస్థకు బీజాలు పడ్డాయి. వ్యవసాయదారులైన వైశ్యులు వాణిజ్యం చేపట్టగా, శూద్రులు వ్యవసాయదారులయ్యారు. బ్రాహ్మణులు ఆధిపత్య పూరిత బ్రాహ్మణీయ భావజాలంతో వర్ణ,కుల వ్యవస్థలకు దైవత్వాన్ని అపాదించారు. అందుకనుగుణమైన సాహిత్యాన్ని రూపొందించి ప్రచారం చేశారు. సామాజికోత్పత్తి క్రమంలో, మన దేశ నిర్ధిష్ట పరిస్థితిలో, ఉత్పత్తి వ్యవస్థ అభివృద్ధిలోని ఒకానొక దశలో రాజ్యం, సమాజాన్ని నిర్వహించే అవసరాల నేపధ్యం నుండి రూపొందిన వ్యవస్థకి,ఆనాటి బ్రాహ్మణులు సిద్ధాంత కర్తలుగా చట్ట రూపమిచ్చారు. రాజ్య పాలన,వ్యాణిజ్యం,చేతి వృత్తుల కేంద్రాలుగా పట్టణాలు ఎదగగా గ్రామీణ ప్రాంతాల స్థిర వ్యవసాయం,గనుల వల్ల రాజ్యం బలొపేతమైనా ఆ తరువాత పట్టణ జనాభా పెరగడం,వ్యవసాయం దెబ్బతిని,ఉత్పత్తి క్షీణించడం,కరువుల వల్ల సామాజిక కల్లోలం నెలకొన్నది.అందువల్ల చేతి వృత్తుల ప్రజలు తిరిగి గ్రామాలలోకి వెళ్లి వ్యవసాయ అభివృద్ధికి సహకరిస్తుండడం వల్ల స్వయంపోషక గ్రామాలు రూపుదిద్దుకున్నాయి. ఈ మార్పు మన ఉపఖండంలో తొలి అతి పెద్ద కేంద్రీకృత రాజ్యమైన మగధ సామ్రాజ్యం తన కేంద్రీకృత వ్యవస్థలో ఉత్పత్తిని నిర్వహించలేకపోవడంతో వికేంద్రీకరణ అవసరమైనది.రాజ్య వ్యవస్థ నిర్వహణకు మధ్య దళారుల పాత్ర అవసరమై విరివిరిగా భూధానాలు పెరిగి మొదట పైనుండి ఆ తరువాత కింది నుండి భూస్వామ్య వ్యవస్థ నెలకొన్నది. ఫలితంగా వర్ణ వ్యవస్థ కంటే సంకుచితమైన శ్రమను, శ్రామికులను విభజించే, ఉత్పత్తి వ్యవస్థను నిర్వహించే వేల కులాల కుల వ్యవస్థ ఏర్పడింది. శూద్రకులాల ప్రజలను అణచి పెట్టి అదనపు మిగులును కొల్లగొట్టడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ కాలంలో బ్రాహ్మణీయ వ్యవస్థ చట్రంలోకి తేవడానికి వర్ణ సంకర సిద్ధాంతాన్ని ఉపయోగించి ఒక్కొ కుల బృందానికి ఒక్కో వృత్తిని కేటాయించారు. ప్రతి వృత్తినీ కులంగా మార్చారు. మానసిక, శారీరక శ్రమల మధ్య విభజన సృష్టించారు. కులేతర వివాహాలపై కట్టడి, అనువంశిక శ్రమ విభజనలను రుద్దడంతో కుల వ్యవస్థ సమాజాన్ని కట్టడిలో ఉంచి ఉత్పత్తిని కొనసాగించే సాధనంగా మారింది. అందుకు ఉపయోగపడే బ్రాహ్మణ వర్ణ రాజ్యాంగం మనుధర్మ శాస్త్రం ద్వారా శూద్ర కులాల ప్రజలకు ఆస్తి,అధికారం, విద్యా హక్కు, ఆయుధం పట్టే హక్కు, అధికారం నెరపే హక్కులను నిషేధించారు. శూద్రులు, స్త్రీలు పశువులతో సమానులని ప్రచారం చేశారు. మూఢత్వంలోకి నెట్టి వారి శ్రమను దోచుకున్నారు. శ్రమకు తగ్గ ఫలితం కోరకుండా పై మూడు వర్ణాలకు సేవచేస్తూ బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించి దానం లేదా బిచ్చం మీద అడుక్కుతిని బతకాలని,ఇది దేవుడిచ్చిన వరమని కర్మ సిద్ధాంతాన్ని బోధించారు. ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచనా శక్తిని బ్రాహ్మణీయ మనువాదులు పథకం ప్రకారమే చంపి వేశారు. ఈ పరిణామాల వల్ల కులం/జాతి మీద ఆధారపడిన భూస్వామ్య విధానం ఉనికిలోకి వచ్చింది. కుల వ్యవస్థ భారత సమాజపు ప్రత్యేక లక్షణం కాగా అది భూస్వామ్య విధానాన్ని కొనసాగించే నిర్ధిష్ట నిర్మాణమైంది. ఈ కుల వ్యవస్థ అతి తక్కువ ఆర్ధికేతర నిర్భంధంతో మిగులును రాబట్టి, దాన్ని స్వంత చేసుకునే ఉత్పత్తి వ్యవస్థ, రాజ్య వ్యవస్థలని నిర్మించేందుకు అవసరమైన నిర్మాణాన్ని అందించింది. అది ఒక సామాజిక వ్యవస్థ గానూ,మతం,న్యాయ అంశాల మీద ఆధారపడిన ఉపరితల నిర్మాణంగానూ పని చేసింది.ఈ కుల వ్యవస్థ ప్రజల ప్రతిఘటనను తక్కువ స్థాయిలో ఉండేలా చేసి రాజ్య యంత్రాంగాన్ని బలోపేతం చేసే నిర్మాణంగా పని చేసింది.భూస్వామ్య ఉత్పత్తి ఆర్ధిక విధానంలో మౌలిక మార్పులు లేవు కనుక దీన్ని కొనసాగించే నిర్ధిష్ట నిర్మాణమైన కుల వ్యవస్థ నిలిచే ఉంది.వ్యవసాయిక విప్లవం జరిగేంత వరకు ఉంటుంది కూడా.దీని బ్రాహ్మణీయ భావజాలం ప్రజా తిరుగుబాట్లను కంట్రోల్ చేస్తూ సమాజంలో మౌలిక మార్పు రాకుండా అడ్డకుంటూనే ఉన్నది,ఉంటది.
మన సమాజ పరిణామ క్రమంలో ఉత్పత్తి నిర్వహణ, ఆధిపత్యం, దోపిడీ కోసం శూద్ర కులాల ప్రజలను వ్యవసాయోత్పత్తితో ముడివేసి చేతి వృత్తుల వారిగా, సేవా వృత్తుల వారిగా మార్చి ఊరిలో కొందరిని,వాడలో అంటరాని వారుగా మరికొందరిని బంధించి వేయడానికి సాధనంగా ఉపకరించింది కుల వ్యవస్థ.ప్రత్యేక తరహా ఉత్పత్తి వ్యవస్థను రూపొందించి నియంత్రించడం, అందుకనుగుణమైన సామాజిక క్రమశిక్షణని నెలకొల్పడం కొరకు మాత్రమే కాక శ్రమజీవుల పై రాజ్యం నియంత్రణని నెలకొల్పడం కోసం కూడా కుల వ్యవస్థ ఆవిర్భవించింది. అంబేద్కర్ విశ్లేషించినట్లుగా ఊరు వాడ విభజన, ఉప కుల విభజన, ఎక్కువ తక్కువలనే నిచ్చెన మెట్ల వ్యవస్థను బలోపేతం చేశారు. వ్యవసాయ ఉత్పత్తి క్రమంలోని సహజమైన క్రతువులకు,తంతులకు, మాతృస్వామిక ఆరాధనకు దైవత్వాన్ని,మూఢ నమ్మకాలను ఆపాదించి బ్రాహ్మణీయ సంస్కృతికి జీవం పోశారు.ఈ క్రమంలోనే ఉత్పత్తి శ్రామిక కులాల అదనపు శ్రమను, సంపదను అడ్డూ అదుపూ లేకుండా పాలకవర్గ బ్రాహ్మణవాదులు దోచుకు తింటూ నేటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నరు.
చరిత్రలో ఈ బ్రాహ్మణీయ భావవాద భావజాలాన్ని,ఆచరణను చార్వాకులు,లోకాయతులు,సాంఖ్యులు సవాల్ చేశారు.బుద్ధుడు వర్ణ ధర్మాల పై తిరుగుబాటు చేశాడు.తన హేతువాద తాత్విక దృక్పథంతో శూద్ర కులాల ప్రజలకు మార్గదర్శిగా ఉండడమే కాక ఉపఖండాన్నంతా ప్రభావితం చేశాడు.ఈ వారసత్వంతోనే గురునానక్,రవిదాస్,కబీర్, రవిదాస్ , హరిదాసు, బసవణ్ణ మొదలగు వారి భక్తి ఉద్యమం,సూఫీ ఉద్యమం మధ్య యుగపు రైతుల,వెట్టి కూలీల,చేతి వృత్తుల ప్రజల తిరుగుబాట్లు జరిగాయి.బ్రిటీష్ వలసవాద వ్యతిరేక పోరాట కాలంలో పూలే,సావిత్రి బాయ్, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్, అయ్యంకాళీ వంటి మహానీయులు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా స్వయం గౌరవం,హక్కుల కోసం పీడిత కులాలను, స్త్రీలను,ఆదివాసులను,మతం మైనారిటీలను, జాతులను చైతన్య పరిచారు.దేశపు రాజ్యాంగంలో తొలిసారి ఈ దేశ ప్రజలను మనుషులుగా గుర్తించి అనేక హక్కులను పొందుపర్చారు.వారి అభివృద్ధికి అనేక సంస్కరణలు,రాయితీలు,రిజర్వేషన్లకు చట్ట రూపమిచ్చారు. సమానత్వం,స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి ఆధునిక భావాలకు రాజ్యాంగంలో స్థానం కల్పించారు.ఆర్ధిక సమానత్వమే కాదు సామాజిక న్యాయం, అసమానతలు లేని సాంఘిక సమానత్వం సమాజంలో నెలకొల్పాలంటే ఫాసిస్టు కుల వ్యవస్థ నిర్మూలన కావాలని తమ జీవితాంతం పోరాడారు. కులం పునాదుల మీద దేనినీ నిర్మించలేము. కులం పునాదుల మీద ఒక జాతినీ, నీతినీ నిర్మించలేము. నిర్మించినా అది కూలిపోతుంది అని అంబేద్కర్ హెచ్చరించారు. బ్రిటిష్ వలసపాలన కాలంలోనూ అధికార మార్పిడి అనంతరం గత ఎనబై సంవత్సరాల కాలంలోనూ సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ విధానాల చొరబాటు,ఉత్పత్తి విధానంలో వచ్చిన మార్పుల వల్ల కుల వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.కుల వ్యవస్థలో ముఖ్య నియమాలైన వంశపారంపర్య వృత్తులు,అంతర్వివాహాలతో పాటు ఇతర కుల లక్షణాలేవీ నేడు షరతులు కావు.నేడు వీటిపై సామాజికంగా కొన్ని సడలింపులు రావడంతో బలహీనపడ్డది. అయితే కుల వ్యవస్థకున్న భూస్వామ్య ఆర్థిక పునాది ధ్వంసం కాలేదు.దీంతోపాటు సామ్రాజ్యవాద నియంత్రణలోని భారత పెట్టుబడిదారీ విధానం భూస్వామ్య వ్యవస్థను రక్షించినట్లే కుల వ్యవస్థను కూడా కాపాడుతుంది.అందువల్ల కుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలన కాలేదు.అయితే కులాలో చలనం జరిగి కొన్ని శూద్ర కులాలు అగ్రకులాలుగా, భూస్వాములు, పెట్టుబడిదారులు, కార్మికవర్గం, రైతులతో పాటు పెటీ బూర్జువా వర్గం మధ్య తరగతి బాగా పెరిగింది.చైతన్యవంతమైన నవతరం పుట్టుకొచ్చింది.దీని ప్రతి ఫలనమే కులం వద్దు,మతం వద్దంటూ దేశ వ్యాపితంగా ఎక్కడికక్కడ ఉద్యమాలు.
శతాబ్దాలుగా పీడిత కులాల ప్రజలు కుల వ్యవస్థ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడి ఎన్నో విజయాలు సాధించినా నేటి కుల వ్యవస్థ నిర్మూలనా పోరాటంలో సామాజిక ప్రజాస్వామిక శక్తుల వైఫల్యం, పీడిత కులాల ఉద్యమంలోని బలహీనతలను ఆసరా చేసుకుని కుల వ్యవస్థను దోపిడీ వర్గాలు తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నాయి.పీడక కులాధిపత్య,పురుషాధిపత్య హిందూత్వ ఫాసిస్టు శక్తులు కులానికి ఉన్న ఆర్థిక పునాదిని,ఉపరితలంలో ఉండే పాత భావాలను, సంస్కృతిని వాడుకుని పెట్రేగి పోతున్నాయి.సామ్రాజ్యవాద ప్రైవేటీకరణ పథకాలు అమలు చేస్తూ ప్రజల సంపదను కాజేయడం వల్ల దారిద్ర్యం,కుల హత్యలు పేదరికం,నిరుద్యోగం, ఆకలి చావులు, బలవంతపు హత్యలు పెరిగిపోయాయి. పీడిత కులాల ప్రజలను విద్యా,విజ్ఞానాలకు దూరం చేస్తూ అంధ మూఢ విశ్వాసాలను పెంచుతున్నారు. రాజ్యాధికారంగా చెలామణీ చేయబడుతున్న ప్రభుత్వాధికారంలో, రాజకీయ పార్టీల పదవులలో కొద్దిపాటి రాయితీలిచ్చి దగా చేస్తున్నారు.ముఖ్యంగా రాజకీయ రంగంలోని రిజర్వేషన్ల ద్వారా తమకు అనుకూలమైన దళారీ వర్గాన్ని సృష్టించుకున్నారు.సంస్కరణ పధకాలు, అమలు జరుగని కొద్ది శాతం రిజర్వేషన్లనే సామాజిక న్యాయంగా భ్రమింప జేస్తున్నారు.మరోవైపు ఫాసిస్టు హిందూ మతానికి వెన్నెముక అయిన కుల వ్యవస్థను పటిష్టం చేసే కుల ప్రాతిపదికన కుల స్థిరీకరణ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు.ఇందువల్ల కుల వ్యవస్థ,హిందూత్వ ఫాసిజం బలోపేతమౌతుంటే పీడిత కులాల ఉద్యమం ఖండన మండనలకే పరిమితమైంది.కుల నిర్మూలనా పోరాటాలంటే కులానుకున్న ఆర్థిక, రాజకీయ,సామాజిక,సాంస్కృతిక,భావజాల పరమైన పోరాట కార్యక్రమం చేపట్టకుండా ఈ పోరాటాలను వర్గ పోరాటంతో సమన్వయం చేయకుండా కుల పీడనను, కుల వివక్షతను, దాడులను,అంటరానితనాన్ని,హత్యలను ఖండించి దోషులను శిక్షించాలని, రిజర్వేషన్లు, రాయితీలు అమలు చేయాలనే అడపాదడపా ప్రదర్శనల స్థాయికి కుదించబడ్డది.కుల వ్యవస్థలోని అసమానతల వల్ల ఒక కులం మరో కులానికి అడ్డుగా నిలబడుతుండడంతో తల క్రిందుల తపస్సు చేసినా కులాల మధ్య సమానత్వం, అంటరానితనం నిర్మూలన సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కుల ప్రాతిపదికన సామాజిక న్యాయం దక్కడం లేదు.ప్రత్యేక తరహా ఫాసిస్టు బ్రాహ్మణీయ భావజాలం కలిగిన కుల వ్యవస్థ నిర్మాణం వల్ల ప్రతి కులం తన కింది కులంతో పోల్చుకుని ఎక్కువ కులమని విర్రవీగుతుండడం వల్ల పీడిత కులాలు పరస్ఫరం సంఘర్షణలో కూరుకుపోయాయి. కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు తమ తమ కులాల పరువుకు భంగకరమని తమ కన్నబిడ్డలనే చంపుకునే కుల హత్యలు పెరిగాయి.ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ హిందూ మతతత్వాన్ని,బహుజాతులకు వ్యతిరేకంగా అంధ భరత జాతి తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. అందువల్ల ఒక సామాజిక సమూహాం మరొక సామాజిక సమూహాన్ని నిర్మూలించుకునే దురవస్థ లోకి నెట్టబడ్డారు.ముఖ్యంగా బ్రాహ్మణీయ మనువాద పీడనను వదిలించుకోవడానికి ముస్లిం మతం స్వీకరించిన ప్రజలను విదేశీయులుగా,దేశ ద్రోహులుగా,టెర్రరిస్టులుగా చిత్రీకరించి తోటి పీడిత కులాల చేతనే హత్యలు చేయిస్తున్నారు.ఘర్ వాపసీ పేరుతో హిందూ మతంలో చేరి అణగారిన కులాలుగా అంటరానివారుగా మారమంంటున్నారు.క్రిస్టియన్,సిక్కు,బౌద్ధ,జైన మతావలంభకుల పరిస్థితి మౌలికంగా ఇందుకు భిన్నమేమీ కాదు. ప్రకృతి ఆరాధకులైన ఆదివాసులను వనవాసులుగా పేర్కోంటూ వారి సంస్కృతిలోకి చొరబడి బ్రాహ్మణీకరిస్తూ హిందూ మతంలోకి మార్చే భారీ కుట్ర అమలు జరుగుతున్నది.
పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద ప్రైవేటీకరణ పథకాలకు ఒకత్వ నినాదాన్ని జోడించి అన్ని రంగాలకు విస్తరిస్తున్నారు.ఒకే సిద్ధాంతం,ఒకే పార్టీ,ఒకే నాయకుడు,ఒకే దేశం,ఒకే జాతి,ఒకే మతం,ఒకే చట్టం,చివరికి ఒకే పన్ను అమలు వరకు వెళ్లింది.ఇందువల్ల దేశంలోని భిన్న జాతుల,సంస్కృతుల,ప్రాంతాల అభివృద్ధికి, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది.బహుజాతులను నిర్మూలించే భారత జాతీయ వాదాన్నే,హిందూ మతోన్మాదాన్నే భారత జాతీయ వాదంగా ప్రచారం చేస్తున్నారు.ప్రజల సంస్కృతిలోని ప్రజాస్వామిక పార్శ్వాన్ని నిర్మూలిస్తున్నరు. ఆహారం, భాష, దుస్తులు, విద్యా, వైద్యం,విజ్ఞానం, కళలు, నాట్యం, చిత్రకళ, చరిత్ర, తత్వశాస్త్రం మొదలగు పలు రంగాలను బలప్రయోగం మోసం వక్రీకరణ అంధ విశ్వాసాలు మూఢ విశ్వాసాల ఆధారంగా బ్రాహ్మణీయ హిందూవీకరణకు గురి చేస్తున్నారు.ప్రకృతి,సామాజిక వ్యవస్థల అనివార్య పరిణామం మార్పు,నిత్య చలనం అనే వైరుధ్య సూత్రానికి విరుద్ధమైన ఊహాజనిత అశాస్త్రీయ వాగాడంబరంతో కూడిన పిడివాదాన్ని, కాలం చెల్లిపోయిన సనాతన భావవాద భావజాలంతో ప్రజల బుర్రలను కలుషితం చేస్తున్నారు. రాజకీయాలను హిందూవీకరించండి-హిందూయిజాన్ని మిలిటరీకరించండి అంటూ హిందూత్వ ఫాసిజాన్ని బలోపేతం చేస్తున్నారు.అగ్రకులాధిపత్య పురుషాధిపత్య కుల వ్యవస్థను కాపాడి తమ దోపిడీ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి మొత్తం రాజకీయ వ్యవస్థను, పోలీసు, మిలిటరీ, న్యాయ వ్యవస్థ, ఉన్నతాధికార వ్యవస్థ మొదలగు పలు రంగాలను, సంస్థలను లంచగొండిగా,అవినీతి మయంగా మార్చి హిందూవీకరిస్తూ వాడుకుంటున్నారు.ప్రతి కులంలో కులతత్వాన్ని,అగ్రకులతత్వాన్ని రెచ్చగొట్టి కుల స్థిరీకరణకు పాల్పడుతుండడం వల్ల కుల వ్యవస్థ వెన్నెముకగా గల హిందూ మతం,హిందూత్వ ఫాసిజం బలోపేతం అవుతుంది. ప్రత్యేకంగా ముస్లింలను విదేశీయులుగా ముద్రవేసి వారి వల్లనే దేశ ప్రజలకు హిందూ మతానికి,చరిత్రకు, సంస్కృతికి పెద్ద నష్టం జరిగిందని కుతర్కం చేస్తూ పీడిత కులాల్లోని గణనీయమైన భాగాన్ని నమ్మించి తమ వైపుకు తిప్పుకోగలుగుతున్నారు.ముస్లింలపై దాడులు చేయడం చివరికి దేశం నుండి వెళ్ళగొట్టాలనే దుష్ట,ఫాసిస్టు నాజీయిస్టు ఎత్తుగడలతో ప్రజలలోని కొంత భాగపు సమ్మతిని సాధించగలుగుతున్నారు. వీరి పథకాలు ఆచరణ నినాదాలలోని అశాస్త్రీయతను డొల్లతనాన్ని ప్రశ్నించే లౌకిక వాదులు,ప్రజాస్వామిక వాదులు, అంబేద్కరిస్టులు,కమ్యూనిస్టులను కుహనా లౌకిక వాదులని నిందలేస్తున్నారు.దేశ ప్రజల శత్రువులైన ముస్లింల పట్ల బుజ్జగింపు ధోరణి పనికిరాదని ఇప్పటికే మన దేశానికి అపార నష్టం జరిగిందని రంకెలేస్తున్నారు.రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కుల రద్దు, తలాక్ సమస్య, ఘర్ వాపసీ, గోరక్షక్, లవ్ జీహాద్ తదితర నినాదాలతో ప్రతీఘాతుక ఉద్యమాలు నిర్మాణం చేస్తున్నారు.
దేశ సంపదలను,శ్రామిక శక్తిని సామ్రాజ్యవాదులకు,కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ కార్మికవర్గం రైతాంగం,మధ్య తరగతి వర్గాలు పీడిత కులాల,సెక్షన్లప్రజలకు రాజ్యాంగంలో ఉన్న కొద్దిపాటి రక్షణలను, హక్కులను పూర్తిగా ఎత్తివేస్తున్నారు.రాజ్యాంగాన్ని ఎత్తివేసి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని నెలకొల్పే కుట్రలు చేస్తున్నారు.భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారి హత్యలు పెరుగుతున్నవి.భిన్న సంస్కృతుల ప్రజలను టెర్రరైజ్ చేసే మూక దాడులు పెరిగాయి. అసహన వాతావరణం హద్దులు దాటింది. దేశంలో పెరుగుతున్న రాజకీయార్ధిక సంక్షోభాన్ని కుహనా దేశ భక్తి, సమైక్యత, సమగ్రతల ముసుగులో ఫాసిస్టు చర్యలకు ఒడిగడుతున్నారు.ఈ పరిణామాలన్నీ కులాధారిత భూస్వామ్య వ్యవస్థ పునాది పై బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజంగా రూపుదిద్దుకోవడానికి నిదర్శనం.ఈ హిందూత్వ ఫాసిజం యుద్ధోన్మాధంతో కూడిన ద్వేష పూరితమైన,వాగాడంబరంతో అసంబద్ధమైన సమస్యలను లేవనెత్తుతూ మధ్యతరగతి వర్గాలను,శ్రామిక ప్రజానీకంలోని క్రింది పొరలను పక్కదారి పట్టిస్తుంది.ప్రజల నిత్య జీవిత సమస్యల నుండి పక్కదారి పట్టించే అత్యంత ప్రమాదకరమైన సాధనంగా తయారైంది. ఇది బహూజాతులను, పీడిత కులాలను వారి సంస్కృతి నుండి బుల్డోజ్ చేసే వ్యూహాత్మక ఏకజాతి భరత జాతి అనే అత్యంత జాతీయ దురహంకార పూరితమైన ఉగ్ర నియంతృత్వం.విశాల పీడిత ప్రజానీకం పై వారి హక్కులు,స్వేచ్ఛ, స్వయం గౌరవం పై ప్రతీఘాతుక దురహంకార పూరిత కక్ష పూరిత హింసా విధానం.కుల-వర్గ పీడిత ప్రజలను దోచుకుని బ్రతికే బ్రాహ్మణీయ బడా భూస్వాముల బడా పెట్టుబడిదారుల ఆధిపత్యం కొనసాగింపుకు మత మౌడ్యపు మధ్య యుగాల నాటి కులం పునాదిగా గల క్రూరత్వం.ఇది అంతర్జాతీయ సామ్రాజ్యవాద ఫైనాన్స్ పెట్టుబడి అనే తీవ్ర ఉగ్ర నియంతృత్వంతో ముడివేసుకున్నందు వల్ల ప్రజల అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు.
ఈ విషాదకర పరిస్థితిలో కుల వ్యవస్థ దాష్టీకాన్ని, హిందూమతం,హిందూత్వ ఫాసిజం యొక్క ఘోరాలను నేరాలను తిట్టిపోసుకుంటూనో, విమర్శిస్తేనో సరిపోదు. హిందూ మతోన్మాదానికి, హిందూత్వానికి వెన్నెముకగా ఉన్న కుల వ్యవస్థ నిర్మూలనకు లేదా రద్దు కోసం పీడిత కులాల ప్రజలు ఐక్యమై పోరాడడమే నేటి కీలక కర్తవ్యం. బహుకులాల అస్తిత్వ ఉనికి బ్రాహ్మణీయ కుల వ్యవస్థను, హిందూత్వ ఫాసిజాన్ని, వర్గ-కుల దోపిడీని మరింత బలోపేతం చేస్తున్న దృష్ట్యా, ఏకీకృత హిందూ మెజారిటీవాదం అనే నినాదంతో సాగుతున్న సాంఘీక పునర్నిర్మాణం మరింత కల్లోలంగా మారుతుంది. ఏకీకృత హిందూ మతం అనేది వివిధ అసమాన, అమానవీయ,అంటరాని కులాలను అంశీభూతాలుగా కలిగి ఉంది.హిందూ మతం అనేది ఒక మతం కాదు. ఇది అగ్రకుల ఆధిపత్యం,పురుషాధిపత్యంతో కూడిన ఫాసిస్టు ఆధిపత్య వ్యవస్థ. పర్యవసానంగా అగ్రకుల మెజారిటీ సమూహాల ఆధిపత్యం పునాదిగా మెజారిటీ మతం పేరు మీద ఏకీకృత హిందూ మతం అనే కార్యక్రమం తీవ్రం చేయబడుతుంది.అందులో భాగమే అణగారిన కులాలలో అగ్రకుల తత్వాన్ని రెచ్చగొట్టి బ్రాహ్మణీకరించడం.తద్వారా కుల వ్యవస్థను స్థిరీకరణ చేసి హిందూత్వాన్ని బలోపేతం చేస్తున్నారు.హిందూత్వవాదులు దేశంలో అతి పెద్ద సామాజిక సమూహమైన ఆదివాసీలను హిందూ మతస్థులుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేశారు. ఆదివాసులను అవమానపరుస్తూ వనవాసులుగా, రాముని సేవకులుగా, హిందువులుగా పేర్కోంటూ, వారి ప్రకృతి ఆరాధన సంస్కృతిలో బ్రాహ్మణీయ సంస్కృతిని చొప్పిస్తున్నారు. కొన్ని సంస్కరణలు,సంక్షేమ పథకాలను అమలు జరుపుతూ తమకనుకూలమైన దోపిడీ ఆధిపత్య పెత్తందారీ వర్గాన్ని సృష్టించుకుని సామాజిక పునాదిగా వాడుకుంటున్నారు.ఆదివాసీ అటవీ ప్రాంతాల్లో హిందూ దేవాలయాల నిర్మాణం, హిందూ మత బోధన చేయడానికి పాఠశాలల స్థాపన, వనవాసీ కళ్యాణ్ మంచ్ వంటి రాజకీయ సంస్థల నిర్మాణం ద్వారా ఆదివాసీలను బలవంతంగా హిందూ మతంలోకి మారుస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలగలసి మన సమాజం నేడు అశాంతితో అట్టుడుకుతుంది. అందుకే కుల నిర్మూలన, హిందూ మత భావజాల వ్యతిరేక చైతన్య కార్యక్రమం ప్రచారానికే పరిమితం కాకుండా హిందూత్వకు వెన్నెముకగానున్న కుల,మత రహిత ఉద్యమాలకు అండగా నిలబడాలి.దేశ వ్యాప్తంగా జరుగబోవు జనగణన సందర్భంగా కులం,మతం వద్దంటున్న వారికోసం ప్రత్యేకంగా కాలమ్ ను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి.వీరికి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇచ్చి ప్రోత్సహించాలని డిమాండ్ చేయాలి. ఇందువల్ల కుల, మత వ్యతిరేక శక్తుల సంఘటిత బలం పెరగడమే కాక కుల వ్యవస్థ ఏదో మేరకు బలహీనమై హిందూత్వ ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి ఉపయోగపడుతుంది. కావున ఇలాంటి చైతన్య శీలురైన కోట్లాది మంది ప్రజలతో ఐక్యమై పోరాడడం కుల నిర్మూలన కావాలని కోరుకుంటున్న ప్రజాస్వామికవాదులందరి బాధ్యత.
తేది.10.11.2026.




