(ఫిబ్రవరి 5వ తేదీ గడ్చిరోలీలో జరిగిన దాడిలో అమరుడైన కా.ప్రభాకర్ అలియాస్ పడ్కల్ స్వామి 2016లో తన జీవన సహచరి కా.సులోచన అలియాస్ నవత అమరత్వ సందర్భంగా రాసిన వ్యాసం ఇది. అప్పట్లో అమరుల బంధుమిత్రుల సంఘం ప్రచురించిన పుస్తకంలో ఇది అచ్చయింది. మొదట ఈ పుస్తకం పేరు ఆదర్శవీర వనిత కామ్రేడ్ నవత. అచ్చుకు వెళ్లే క్షణాన కామ్రేడ్ అమ్మగా మారింది. కా.ప్రభాకర్ స్మృతిలో ఈ వ్యాసం పునర్ముద్రణ.. వసంతమేఘం టీం)
నిన్ను, మన పిల్లల్ని కలుసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఉద్యమ అవసరాల రిత్యా కొంత లేటయినా చివరికి మనందరిని కలుసుకొమ్మని మనకు ఓ మంచి అవకాశం పార్టీ పనుల్లో ప్లాన్ జరుగడంతో మిమ్ముల్నందరిని కలుసుకుంటాననే ఉత్తేజంతో ఎంతో ఆశతో సుదీర్ఘ ప్రయాణం చేస్తూ మనం కలుసుకునే కాంటాక్టు ప్లేసుకు, చేరుకుంటున్న క్రమంలో నాలో మీ అందర్ని ఒక్క క్షణంలో చూడబోతున్నాననే ఉత్తేజం మరింత పెరిగింది. కాని చివరకి కాంటాక్టు ప్లేస్‌లో మీరు ఎవరూ కలువకపోగా నాలో పొంగివచ్చిన ఉత్తేజాన్ని ధ్వంసం చేస్తూ వచ్చిన 4/6 నాటి నీ అమరత్వం వార్త వినగానే నాగుండె ఒక్కసారి దుఃఖంతో నిండిపోయింది రమా! మన వైవాహిక జీవితంలోని నీ జీవిత గాధలన్నీ ఒక్కసారి నా కళ్లల్లో సుడులు తిరిగాయి రమా.
ఇంటివద్ద నీవు అత్త మామలతో (నేను పార్టీలోకి వచ్చిన తర్వాత) ఎదుర్కొన్న నీ కష్టాలు, నీ తల్లిదండ్రులు కూడా నీకు సహకరించని సమయంలో నీవు పడ్డ బాధలు, పోలీసుల వేధింపులు ఎదుర్కొన్న నీ జీవిత గాథలన్నీ కళ్ల ముందు తిరగసాగాయి రమా! పిల్లల పోషణ, చదువులకు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ బతకడం కన్నా పిల్లలకు విషం పోసి, నీవు విషం తాగి చనిపోతానని భరించలేని నీ బాధలన్నీ గుర్తుకొస్తే గుండె రగిలిపోతుంది రమా…పైన పేర్కొన్న కుటుంబ, సమాజ బాధలే చివరికి నిన్ను విప్లవం వైపు మల్లించి దోపిడీ సమాజంపై అసహ్యాన్ని, కసిని రగిలించి సమాజ మార్పు కోసం పయనించిన నీ మార్గం నాకు ఎంతో ఉత్తేజాన్ని, సత్తువనిచ్చింది రమా. నీవు విప్లవంలోకి అడుగుబెట్టిన నాటి నుండి కానీ లేక మన వైవాహిక జీవితం మొదలైన నాటి నుండి మన మధ్యలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్నా, చెళ్లెళ్ల అన్యోన్య బంధంలా సాగిన మన వైవాహిక జీవితం గుర్తుకొస్తూంది.
ఉప్పొంగుతున్న దుఃఖాన్ని అదిమిపట్టేందుకు ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు వుబికి వస్తున్నాయి రమా… కామ్రేడ్ నవతా ఈ క్రూర రాజ్య నిర్బంధం వల్లా చివరి క్షణంలోనైనా నీ అమరత్వపు ముఖాన్నైనా, కడసారి చూపును కూడా చూడ నోచుకోలేకపోతున్నందుకు గుండె రగిలిపోతుంది. రమా…ఏది ఏమైనా కామ్రేడ్ నవతా నీ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు ఈ వర్గ రహిత సమాజ స్థాపన మార్గాన్ని వదలనని నా ముందు నీవు చేసిన శపథాన్ని నీ మాటలతో కాక నేటి నీ అమరత్వం ద్వారా నిరూపించుకున్నావ్ గదా రమా! నువ్వు పడ్డ కష్టాలు, బాధలు, మన మధ్యలో మొదటి నుండి చివరి వరకు ఏలాంటి సమస్యలు లేకుండా పెనవేసుక పోయిన మన గాఢమైన వైవాహిక బంధం…నేడు నన్ను దుఃఖంలో ముంచెత్తగా, నీవు వర్గ రహిత సమాజ స్థాపనకై చివరికంటా పోరాడుతానని శపథం చేసిన నీ శపథాన్ని నేటి నీ అమరత్వంతో నిరూపించుకున్నందుకు నీ అమరత్వం నాకు ఎంతో సత్తువనిస్తుందని, నీ ఆశయ బాటలోనే తప్పకుండా నా విప్లవమార్గాన్ని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంతటి నిర్బంధం, పెను తుఫానులు ఎదురైనా నీ ఆశయసాధనకై చివరికంటా పోరాడుతానని నీ అమరత్వం సాక్షిగా శపథం చేస్తూ…
నీకు నేను తలవంచి వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నానమ్మా..
కామ్రేడ్ నవత అమర్ హై! అమర్ హై!
కామ్రేడ్ నవత ఆశయాన్ని కొనసాగిద్దాం! కొనసాగిద్దాం!
అమర్ హై కా. నవతా అమర్ హై కా.నవతా…
కా. నవతకు విప్లవ జోహార్లతో`దుఃఖంతో
నీ
ప్రభాకర్




