“హృదయ దీపం” కథల సంపుటిని భాను ముస్తాక్ రచించారు.

ఈ పుస్తకం 2025 సంవత్సరాలనికి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్నది. ఈ పుస్తకాన్ని తెలుగులోకి “నాగిని అప్పసాని” అనువదించారు. ఇందులో మొత్తం 12 కథలు ఉంటాయి. అవి ముస్లిం మహిళల రోజు వారి జీవితాలను, అనుభవాలను తెలియజేస్తాయి. వారి జీవితాల పట్ల సానుభూతి ఇందులో ఉంటుంది. ముస్లిం స్త్రీల దైనందిన జీవితంలోని బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఎలా ఉంటాయో ఈ పుస్తకం చదివితే కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. వారికి రోజూ గృహింసనే కాదు, సామాజిక కట్టుబాట్లను  వారు నిశ్శబ్దంగా ఎలా భరించారనే విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా మూఢనమ్మకాలు కూడా ముస్లిం మహిళల జీవితాల్లో కనిపిస్తాయి.

ముస్లిం స్త్రీలు వారి చుట్టూ ఉండే కుటుంబ పరిస్థితులు, మతం, వివిధ నమ్మకాలు, వాటి చుట్టూ ఉండే సామాజిక వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. మత నియమాలను పాటించడం ముస్లిం మతంలో ముఖ్యంగా స్త్రీలకు తప్పనిసరి. వాళ్లు బయటికి వెళ్లినా సరే బురఖా లోనే వెళ్లాలి. ఎప్పుడూ ఇంటి పరదా లోపల ఉండాలి. ఎవరైనా పరాయి మగవాళ్ళు ఇంటికి వస్తే కొంగు నిండుగా తల మీద వేసుకోవడం తప్పనిసరి. ఇలాంటి మత నియమాల మద్య వీళ్లకు స్వేచ్ఛ ఉండదు. నిజం మాట్లాడితే చాలావరకు ముస్లిం మహిళలు ఎక్కువగా చదువుకోరు. ఎందుకంటే వారి మతంలో ఖురాన్ చదివితే చాలా వరకు జన్మ ధన్యమవుతుంది అనే విశ్వాసం ఉంటుంది. వీరిలో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. కుటుంబానికి,పెద్దలకు, బంధువులకు గౌరవం ఇవ్వడం మరీ తప్పనిసరి. వాస్తవానికి ఒక ముస్లిం అమ్మాయి పడుతున్న బాధలు చెప్పుకుంటే ఈ సమాజంలోని ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమగా చూసుకోగలడు. అంతటి బాధలు వాళ్ళ జీవితంలో ఉంటాయి. ఇప్పటికీ చాలామంది వారి మత విశ్వాసాల ప్రకారం అమ్మాయికి వయసు రాగానే చదువు మానిపించి పెండ్లు చేస్తారు ఈ పెళ్లిళ్లు చాలా ఖర్చుతో కూడుకొని ఉంటాయి. చాలాచోట్ల బిడ్డకు 5 తులాల బంగారం రెండు లక్షల నగదు, ఒక బైకు ఇవ్వాలి. ఇది ఒక ఆచారంగా కొనసాగుతోంది.

పెళ్లి అనంతరం ఆ మహిళ తన భర్త ఇంటికి వెళ్లి సేవలు చేస్తూ తిట్లు తింటూ భర్త దగ్గర అవమానాలు పడుతూ, జీవితాన్ని నెట్టుకొస్తుంది. ఇది ఒక రకంగా నరకంలోకి తోయడమే.

చాలావరకు ముస్లిం అమ్మాయిల జీవితం అంతే.స్వేచ్ఛగా బతికే అవకాశం ఉండదు. కొందరికి మాత్రం అందుకు భిన్నంగా మంచి జీవితాలు ఉండొచ్చు. ఈ విషయాలన్నీ హృదయ దీపం పుస్తకంలో చదువుకోవచ్చు మనం.

ఇందులోని మొదటి కథ షాయిస్తా మహలు రాతి పలకలు. ఈ కథలో సాహిస్తా అనే ఒక ముస్లిం అమ్మాయి జీవితం గురించి ఉంటుంది.

ఆమెకి ఆరుగురు పిల్లలు. అందులో ముగ్గురు మగ పిల్లలు. ముగ్గురు ఆడవాళ్లు. అయినా సరే ఆమెకి తన భర్త కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడు. ఇంకొక అమ్మాయో అబ్బాయో పుడితే ఆపరేషన్ చేయిస్తాను అంటారు. నాకు పిల్లల్ని పోషించే స్తోమత ఉంది అంటాడు. కొద్ది రోజులకు ఇంకో అబ్బాయి పుడతాడు. వారి మధ్య ఎంతో ప్రేమ ఉంటుంది కానీ ఆమె చనిపోతుంది. అతను తట్టుకోలేనంతగా బాధపడతాడు.పిల్లలను ఇంటిని చూసుకునేవారు ఉండరు ఒకరకంగా కుమిలిపోతాడు

కానీ మరో పెళ్లి చేసుకుంటాడు. ఈ కథను చదవాలి. షాయిస్తా పెద్ద అమ్మాయి ఆ ఇంటికి అమ్మలా మారి ఆ పిల్లల్ని లాలిస్తుంది.

ఈ కథను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ పుస్తకంలో ముఖ్యమైన కథ ఇది అనుకోవచ్చు..

ఈ పుస్తకంలోని తర్వాత కథల్లో కూడా ముస్లిం మహిళల జీవితాల్లోని బాధలను చర్చించడం ఉంది. ముస్లిం అమ్మాయి జీవితం పంజరంలో బంధించిన చిలకలాంటిది.ఓ కథలో.. పెళ్లి చేసుకున్నాక భర్త భార్యని ఇంటికి తీసుకొస్తాడు. కొన్ని రోజులు బాగా నడుస్తుంది తర్వాత ఆమెను ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. పిల్లల పుట్టినాక అది తీవ్రమవుతుంది. ఆడపిల్లలు పుడితే ఆ మహిళ హింసను భరిస్తుంది. భర్త ఇల్లు విడిచి వేరే అమ్మాయితో వెళ్ళిపోతాడు. అమ్మాయి తట్టుకోలేనంత బాధను భరిస్తుంది.

భార్య తెచ్చిన సంపదతో అతడు వేరే అమ్మాయితో సంబంధాలు పెట్టుకుని షాపింగ్ షికార్లకు తిరుగుతుంటారు. ఆమెని ఆఖరికి పనిమనిషిలాగా తయారుచేస్తారు. పిల్లల్ని పుట్టించే యంత్రంలో వాడుకుంటాడు. భర్త అక్రమ సంబంధాన్ని ప్రశ్నిస్తే తాగొచ్చి కొడతాడు. తన పిల్లల్ని పట్టించుకోడు. ఇవన్నీ సమాజంలో ఉండే వాస్తవాలే. అందుకే ఈ పుస్తకం ముస్లిం జీవితాలను చాలావరకు దగ్గరగా ప్రతిబింబించింది.

ఈ పుస్తకం మొత్తంలో హృదయ దీపం కథ చాలా అద్భుతంగా ఉంటుంది. భర్త భార్యను వదిలేసి ఒక నర్స్ వెంట తిరుగుతుంటాడు. ఆ అక్రమ సంబంధాన్ని అతను బలంగా సమర్తించుకుంటాడు. తన భార్య మెహరీన్ ను నర్స్ తో పోలుస్తాడు, అవమానిస్తాడు, నీవల్ల సుఖం లేదని నిందిస్తాడు. ప్రశ్నించిన భార్యను విడాకులు ఇస్తానని బెదిరిస్తాడు.దీన్ని భరించలేక ఆమె పుట్టింటికి వెళ్తుంది. అక్కడ ఆమెను పట్టించుకోరు. అప్పటిదాకా ప్రేమించిన పుట్టినిల్లే ఆమెను శత్రుపూరితంగా చూస్తుంది.అదో ఘోరం.అలా ఆమె పుట్టింటికి తిరిగి రావడం అనేది,వారి ఇంటి పరువును తీసినట్టు మాట్లాడుతారు.

మరి ముఖ్యంగా భర్త భార్యతో తన దూరాన్ని సమర్తించుకోవడానికి “నువ్వు నా తల్లి లాంటి దానివి” అంటాడు. అప్పటికే వారికి పెద్ద కూతురు సల్మా 16 ఏండ్ల అమ్మాయి. చివరి పిల్లాడు పాలు తాగే అబ్బాయి.

ఈ సంఘటనలన్నీ కూడా మెహరీన్ ఆత్మహత్య వైపు తీసుకెళ్తాయి. ఆత్మహత్యను తన కూతురు ఆపే విధానాన్ని చదివితే గొప్ప అనుభూతి కలుగుతుంది.

“నాన్న కోసం చావాలనుకున్న నువ్వు మా కోసం బతకలేవా” అనే కూతురు మాట ఆమెను ఆత్మహత్య నుంచి వెనక్కి తీసుకొస్తుంది.

ముస్లిం మహిళల జీవితాల్ని వాస్తవానికి దగ్గరగా చూపెట్టిన ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి.

Leave a Reply