2026 మే 3వ తేదీన జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో NTA నీట్ పరీక్షను రద్దు చేశారు. గత సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో నీట్ పరీక్ష రద్దు కాబడి మరలా నిర్వహించడం జరిగింది. విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టి జరుపుతున్న ఈ వికృత క్రీడలో కేంద్ర, రాష్ట్ర పాలకులు విద్యార్థులను పావులుగా మార్చుతున్నారు. 1980 తర్వాత విద్య క్రమక్రమంగా ప్రైవేటీకరణ జరిగి ప్రవేశ పరీక్షలు పేరుతోను, పోటీ పరీక్షల పేరుతోను విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. ఎంతోమంది విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విధిలేని పరిస్థితులలో తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆశతో ఆస్తులు అమ్మి, అప్పులు చేసి మరీ తమ పిల్లలను కార్పొరేట్ విద్యా సంస్థలలో చదివిస్తున్నారు. 1980 ముందు విద్యారంగ స్థితిని మనం ఒకసారి పరిశీలిస్తే, ఇప్పటి పరిస్థితి ఎందుకింత భయంకరంగా తయారయ్యిందో అర్థమవుతుంది.
ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1980 ముందు కేవలం ఎంబీబీఎస్, బి డి ఎస్ వంటి మెడికల్ కోర్సులలో జాయిన్ కావడానికి ప్రవేశ పరీక్ష ఉండేది. ఇందుకోసం గుంటూరులో సీవీ ధన్ కోచింగ్ సెంటర్, హైదరాబాదులో రామయ్య కోచింగ్ అకాడమీ లు విద్యార్థులకు ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత స్వల్పకాలిక శిక్షణను ఇచ్చేవారు. మిగిలిన ఏజీబీఎస్సీ, బివిఎస్సి, ఇంజనీరింగ్, ఐఐటీ, ఎన్ఐటి వంటి కోర్సులలో జాయిన్ కావడానికి ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు చేపట్టేవారు. ఇప్పటికీ ట్రిపుల్ ఐటీలలో ప్రవేశానికి 10వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు చేపడుతున్నారు. టిటిసి, బీఈడీ వంటి కోర్సులకు కూడా ఇదే ప్రాతిపదికన ప్రవేశాలు చేపట్టేవారు. 1986లో ఎంసెట్ ప్రవేశ పరీక్ష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పటి నుంచి ప్రైవేటు విద్యా సంస్థల హవా పుంజు కున్నది. ఇదే పద్ధతిలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రవేశ పరీక్షలు పెట్టి వృత్తి విద్యా కోర్సులలో అడ్మిషన్లు చేయడం మొదలుపెట్టారు.
2014లో బిజెపి నాయకత్వం లోని ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత 2016లో ఒకే దేశము ఒకే పరీక్ష పేరుతో నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించడం మొదలుపెట్టారు. ఇదే పద్ధతిలో ఐఐటీ, నిట్ వంటి ఇంజనీరింగ్ అడ్మిషన్లకి AIEEE, JEE వంటి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు.IIM లలో ప్రవేశాల కొరకు క్యాట్, మ్యాట్ వంటి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ రకమైన జాతీయస్థాయి పరీక్షల నిర్వహణ ను మొదటినుంచి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు కూడా తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నీట్ పరీక్షను రద్దుచేసి, 12వ తరగతి మార్కులు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ కోర్సులలో అడ్మిషన్ లు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేయడానికి కారణం ఏమంటే, రాష్ట్రాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం కుదించి, సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడంగా భావిస్తుంది. నిజానికి విద్య రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోనికి చేర్చిన తర్వాత ఇటువంటి దుస్థితి దాపురించింది. మరోవైపు కార్పొరేట్ శక్తులు విద్యను దేశవ్యాప్తంగా వ్యాపారమయం చేయడం కూడా మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నేడు విద్య కొనుక్కునే స్థితికి చేరింది. ప్రభుత్వ విద్య పతనం అంచులకు చేరుకున్నది.
మొదటినుంచి విద్య ప్రైవేటీకరణను, ప్రవేశపరీక్షలను, పోటీ పరీక్షలను వ్యతిరేకిస్తున్న వామపక్ష విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నిరసనలను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు, ఈరోజు ఆ దుష్ఫలితాలను విషపు గుళికలు చేసి సామాన్య ప్రజానీకానికి తినిపిస్తున్నారు. వీటి ఫలితమే ప్రశ్న పత్రాల లీకేజీలుగా చెప్పవచ్చు. గత 10 సంవత్సరాల కాలంలో ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వంలో 93 సార్లు వివిధ జాతీయ ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాలు లీకేజ్ కావడం జరిగింది. అయినప్పటికీ ఇందుకు బాధ్యత గల ప్రభుత్వ సంస్థల పెద్దలపై ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోబడలేదు. తుతూ మంత్రంగా చర్యలు చేపట్టడం వలన మళ్ళీ మళ్ళీ ఇటువంటివి పునరావృతం కావడం జరుగుతున్నది. బాధ్యత గల కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఇటువంటి సంఘటనల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇక ఉన్నతాధికారుల వైఖరి చెప్పవలసిన పనిలేదు. లేనిపోని విషయాలకు కలుగజేసుకొనే ఉన్నత న్యాయస్థానాలు కూడా నిమ్మకి నీరెత్తినట్లుగా సోజ్యం చూస్తున్నాయి. ఫలితంగా సామాన్య విద్యార్థులు బలి పశువులుగా మారుతున్నారు.
ఈ స్థితిలో పౌర సమాజం చేయవలసిన డిమాండ్లు ఏమిటంటే, “ముందుగా విద్యను ఉమ్మడి జాబితా నుంచి తొలగించి రాష్ట్ర జాబితాలో చేర్చాలి. అన్ని రకాల ప్రవేశ, పోటీ పరీక్షలను రద్దు చేసి, అకడమిక్ స్థాయి అర్హత పరీక్షల మార్కులు ఆధారంగా అన్ని వృత్తి విద్య కోర్సులలో ప్రవేశాలు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. మొత్తం విద్యను కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలి.” వీటిని సాధించడానికి దేశంలోను, రాష్ట్రంలోనూ గల విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రజాసంఘాలు విశాల ప్రాతిపదికన పోరాట వేదికలను ఏర్పాటు చేసి, పోరాటాలు నిర్వహించాలి. అప్పుడు మాత్రమే విద్య ప్రైవేటీకరణ విషపు గుళికలను నాశనం చేయడం జరుగుతుందని ఆశిద్దాం.
——– పేడాడ కృష్ణారావు,
గౌరవాధ్యక్షులు,
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, శ్రీకాకుళం జిల్లా.




