అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ పరకాల నాగన్న శుక్రవారం (03-06-2026)
అనారోగ్యంతో ఖమ్మంలో మరణించారు. ఈ దేశ ప్రజల విముక్తి కోసం సుదీర్ఘకాలంపాటు ఆడి, పాడి తుది శ్వాస వరకు పోరాడే ప్రజల పక్షానే నిలిచిన నాగన్నకు విరసం జోహార్లు అర్పిస్తోంది. శ్రీపాద శ్రీహరి అమరత్వంతో ఎరుపెక్కిన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామంలో నాగన్న జన్మించారు. శ్రీహరి స్ఫూర్తితో గజ్జె కట్టి గళం ఎత్తి బయల్దేరిన పాలబుగ్గల పసివాడు పరకాల నాగయ్య నుండి అరుణోదయ నాగన్నగా రాజకీయ పరివర్తన చెంది ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఆయనది నిరుపేద గీత కార్మిక కుటుంబం. బాల్యం నుంచే కష్టపడే తత్వం అలవడింది. పేదరికం విసిరే సవాళ్లను ఎదుర్కొంటూనే అద్భుతమైన కళాకారుడిగా ఎదిగారు. చిన్నప్పుడు ఆయన మేకలు కాశారు. యువకుడిగా ఉన్నపుడు ఒకవైపు తాళ్లెక్కడం, మరో వైపు కూలిపనులు చేసేవారు. పదహారేళ్ల వయసులో పాలేరుగా పనిచేశారు. ఆ కాలంలో రాజారం గ్రామం కమ్యూనిస్టు పార్టీ కేంద్రంగా ఉండేది. నాగన్న పాలేరుగా పనిచేస్తూనే పార్టీ సమావేశాలకు హాజరయ్యారు. సొంతూరిలో విప్లవ కార్యకర్త కందాళ నర్సింహారెడ్డి ప్రభావంతో ఎం.ఎల్. పార్టీ రాజకీయాలకు దగ్గరయ్యారు. అదే గ్రామంలో శ్రీపాద శ్రీహరి సోదరులు నిర్వహించిన వయోజన విద్యా కేంద్రంలో అక్షరాలు నేర్చుకున్నారు. కూలి పనులకు వెళ్లేటపుడు పల్లెపదాలను కైగట్టారు. విప్లవ నాయకుడు రామనర్సయ్య కొరియర్ గా పనిచేసిన మధుసూదన్ రెడ్డి దగ్గర నాగన్న పాటలు నేర్చారు. శ్రీపాద శ్రీహరి ప్రభావంతో విప్లవ రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో తిరుమలాయపాలెంలో జరిగిన పీడీఎస్యూ రాష్ట్ర మహా సభల సందర్భంగా నిర్వహించిన వర్క్ షాప్ లో అరుణోదయ రామారావుతో అయిన పరిచయం ఆయన సాంస్కృతిక రంగంలోకి తీసుకొచ్చింది. తన సహచరి లక్ష్మితో కలిసి 1978లో పూర్తికాలం విప్లవ కార్యకర్తగా మారారు. 1981 మే 1న మహబూబాబాద్ లో తొలి బుర్రకథ ప్రదర్శనను ఆయన బృందం ఇచ్చింది. 1987 తర్వాత రైతుకూలీ సంఘం బాధ్యతల్లో ఆయన వెళితే, సహచరి లక్ష్మి మహిళా సంఘంలోకి వచ్చారు. ఈ క్రమంలో వారు బతుకు దెరువు కోసం టైలరింగ్ వృత్తి చేశారు. కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసమని నమ్మిప నాగన్న ఏనాడూ వెనకడుగు వేయలేదు.
కామ్రేడ్ నాగన్న గత 50 సంవత్సరాలుగా సాంస్కృతికోద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. తెలుగు నేల మీద జననాట్యమండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రెండూ పీడిత ప్రజల పక్షాన ప్రజలను జాగృతం చేశాయి. బుర్రకథలు, జముకులు, ప్రజా కళారూపాలతో వేలాది మంది ప్రజలతో అనేక ప్రదర్శనలు ఇచ్చాయి. ప్రజలను చైతన్యం చేసి ఉద్యమాల వైపు నిలబెట్టాయి. నాగన్న అరుణోదయ సంస్థ పేరునే తన ఇంటి పేరుగా ప్రాచుర్యం పొందారు.
సామ్రాజ్యవాద వ్యతిరేక పాటల నుండి విప్లవోద్యమ అమరవీరుల పాటలు, ప్రజా సమస్యలపై తాను పాడిన ప్రతి పాటా ప్రజా బాహుళ్యంలో విశేషంగా ప్రాచుర్యం పొందింది. ప్రజా కవిగా, గాయకుడిగా నిత్యం ప్రజలను చైతన్యం చేశారు. నిర్బంధాలు, చిత్రహింసలను ఎదుర్కొని విప్లవ సాంస్కృతిక సేనానిగా నిలబడ్డారు. తాను మాత్రమే కాకుండా సహచరిని, కుమారుడు అజయ్ లను కూడా విప్లవ రాజకీయాల వైపు నిలబెట్టారు. కవులకు, కళాకారులకు నాగన్న జీవితం ఆదర్శం. నూతన సమాజం కోసం కళా సాంస్కృతిక రంగాల్లో క్రొంగొత్త సృజనాత్మత రూపాలతో కృషి చేయడమే నాగన్నకు నిజమైన నివాళి అవుతుంది. నాగన్నకు విప్లవ రచయితల సంఘం విప్లవ జోహార్లు అర్పిస్తోంది.
అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు
రివేరా, కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం
తేదీ – 04-06-2026
స్థలం – విజయవాడ





విప్లవ జోహార్లు. ✊✊✊