భారత స్వాతంత్ర్య పోరాటంలో వేగుచుక్క అల్లూరి సీతారామరాజు, ఆదివాసుల గుండెల్లో ఆరని జ్యోతి అల్లూరి సీతారామరాజు. అలనాటి తెల్ల ప్రభుత్వానికి సింహస్వప్నం అల్లూరి సీతారామరాజు, అందుకే తెలుగునాట తొలి బూటకపు ఎన్ కౌంటర్ సీతారామరాజుది. నేలతల్లి బిడ్డల విముక్తి కోసం నేలకొరిగిన వీరుడు సీతారామరాజు, అయినా చావులేని సమరశీలి సీతారామరాజు. ఇంతకీ సీతారామరాజు జీవితకాలం కేవలం ఇరవై ఏడేళ్ళు. కాని అల్లూరి ఊసులు, వాసనలు నూరేళ్ళయినా మాసిపోలేదు, మాయం కాలేదు. ఎందుకని ? అప్పుడు

నా చిన్నప్పుడు రెండో ప్రపంచయుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు నాజీలు నరజాతిని నెత్తురు టేరుల్లో ముంచెత్తు తున్నప్పుడు ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు తాము నమ్మిన ఆశయాల కోసం కమ్యూనిస్టులు ప్రాణాలని తృణప్రాయంగా అర్పిస్తున్నపుడు …

కోయలు మా ఊరు (కృష్ణాతీరం, కృష్ణాజిల్లా) వస్తుండేవారు. ముఖాలూ, చేతులు చూసి ఏవేవో చెబుతూండేవారు. వారి వేష భాషలు మాకు బాగా నచ్చేవి. అప్పటికే ఆ నోటా, ఆ నోటా అల్లూరిని గురించి విని ఉన్నాం. ఎంతో ఆసక్తిగా అడిగేవాళ్ళం, ఎవరిని అడిగినా, ఎందరిని అడిగినా కోయలందరిది ఒకటే మాట-“రామరాజు చనిపోలేదు, చనిపోడు. బతికే ఉన్నారు. బతికే ఉంటారు.” నిజానికి అప్పటికే అతను చనిపోయి ఇరవైఏళ్ళు గడిచిపోయాయి. ‘అయినా కోయలు ఈ నిజం ఎందు కొప్పుకోరు?’ అని మాలో మేము తర్కించుకునే వాళ్ళం. ‘ప్రజలలో పనిచేసి, ఉద్యమాలు నిర్మించి, పోరాడి, ప్రాణాలిచ్చిన వాళ్ళు ప్రజల దృష్టిలో అమరులు.’ ఇలా సమాధాన పడేవాళ్ళం.

ఉన్నావో లేవో కొందరు నీవున్నావంటారు. ధారగ నీ రక్తము ప్రవహించిన స్థలమందున మేము వీరాగ్రేసర! ఊరు గట్టి నీ పేరు పెట్టెదము. సూర్యచంద్రులున్నంత వరకు ఈ చుక్కలున్నంత వరకు అంటూ బుర్రకథల్లో ఈ మాటలతో బొమ్మలు గీసేవారు.

అల్లూరి సీతారామరాజు పుట్టి, పెరిగి, చదువుకుని చాలా ఊళ్ళు తిరిగాడు. చివరికి కొండల్లోకి, కోనల్లోకి వెళ్ళిపోయాడు. ఆ ప్రజల మధ్యే బతికాడు. వాళ్ళ కష్టాలు కళ్ళారా చూశాడు. అన్యాయాలు, అక్రమాలు, దోపిడి, పీడనలు పసిగట్టాడు. వాటిమీద మండిపడ్డాడు. కళ్లెర్ర జేశాడు. ఎవరి కష్ట ఫలం వారికి దక్కాలన్నాడు. కోయలని కూడగట్టాడు. వారికి ప్రేమపాత్రు డయ్యాడు. మన్యం రగిలించాడు.ఉద్యమ జ్వాల మండించాడు. పోరాట బాట వెంట నడిచాడు. అందరినీ నడిపించాడు.
అన్యాయం అంతం చేయాలంటే ఆయుధాలు పట్టక తప్పదనుకున్నాడు. వ్యవస్థీకృత మార్పుకోసం జరిగే ప్రయత్నం సాయుధం గానే ఉండాలి. అది ఉత్త మాటలతో పని కాదు. ఈటెలు, కత్తులు, విల్లు, బాణాలు మంటలుగా మండితేగాని దోపిడి, బూడిద పాలు కాదు. తన అనుభవం ద్వారా అల్లూరి ఆకళించు కున్న సత్యం ఇది. ఆనాడు అన్నవరంలో ఆంధ్రపత్రిక విలేఖరితో నిక్కచ్చిగా ఈ మాటలే చెప్పాడు. దీనికి ఎలాటి డోకా లేదు.

సీరారామరాజు పోరాడిన ప్రాంతంలో నిప్పు ఏనాటి నించో రాజు కుంటూనే వుంది. రంప పితూరీ (1877)కి ద్వారబంధాల రామచంద్రయ్య నాయకత్వం వహించాడు. లాగరాయి పితూరీ (1916)కి నాయకత్వం వీరయ్య దొర కుటుంబానిది. అక్కడే ఆ తరవాత గరిమెండ పంగరాజు (కొండ కమ్మరి), సిట్టల భీముడు (మాల) పోరాటాలు జరిపారు. ఇవన్నీ సాంతం ఇంకా చరిత్రకెక్కనే లేదు. సీతారామరాజు మన్యం విప్లవం (1922-24) బాగా పేరు పొందింది.

ఆ విప్లవాన్ని తాత్కాలికంగా అణచడానికి ఆనాటి ప్రభుత్వం 40 లక్షల రూపాయలు వెచ్చించిందని అంచనా. మలబారు పోలీసులని, అస్సాం రైఫిల్ దళాన్ని కూడా పంపవలసి వచ్చింది.

మన్యం ఇవాళ మన కళ్ళముందు ఇంకా మండుతూనే వుంది. అడ్డతీగల, రంపచోడవరం, గుర్తేడు, కొయ్యూరు ఇంకా ఇంకా వార్తలలోకి ఎక్కుతూనే ఉన్నాయి. పరాయి పాలన ముగిసి 50 ఏళ్ళయినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా అక్కడ సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆదివాసులకి అన్యాయం జరుగుతూనే ఉంది. వాళ్ళ జీవ నాధారాలైన అడవులు, భూములు అన్యాక్రాంత మవుతూనే ఉన్నాయిు. దీనిని ఆరికట్ట డానికి ఆనాటి (1917) నుండే ఏదో ఒక మేరకి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చిట్టచివరికి అది 1/10 అనే చట్టరూపం తీసుకుంది- ‘ఆదివాసుల భూములు అన్యులు కొనగూడదు’. ఈ 1/70 చట్టం ఆచరణలో అడుగడుగునా నీరుగారిపోతూనే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చూస్తోంది. ఈ ప్రయత్నాన్ని మనం తీవ్రంగా ప్రతిఘటించక పోతే ఆదివాసుల జీవనాధారం శాశ్వతంగా పోతుంది. ఆనాటి తెల్ల ప్రభుత్వం మైదాన ప్రాంతాల్లో జమీందారీ వ్యవస్థని నెలకొల్పినట్టే, మన్యంలో ముఠాదారీ వ్యవస్థని నెలకొల్పింది. ఈ ముఠాదారీ వ్యవస్థ చేసే పనులే ఇవాళ ఫారెస్టు డిపార్టమెంటు, రెవిన్యూ డిపార్టుమెంటు, పోలీసు డిపాస్లమెంటు చేస్తున్నాయి. కనుక మన్యం పోరాటం ఇవాళ యింకా ఎక్కువ కష్టభూయిష్ట మయింది. ఆదివాసుల తిరుగుబాటు మీద ఎవరు ఏ వైఖరి అవలంబిస్తారనేది చాలా ముఖ్యం.

ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అప్పుడు టంగుటూరి ప్రకాశంగారి చెప్పు చేతల్లో వుంది. ‘తెల్ల ప్రభుత్వంమీద తిరుగుబాటు జరుగుతోంది. మమ్మల్నేం చేయమంటార’ని అడిగారు పెద్దాపురం కాంగ్రెసువారు. వారికి తణుకు కాంగ్రెసువాది బ్రహ్మజోస్యుల సత్యనారాయణ గారి ద్వారా వర్తమానం అందింది. ‘దోపిడి దొంగల ముఠాతో చేతులు కలపపద్ద’ని ప్రకాశంగారు తాఖీదు సంపారు. తెల్లదొరలతో షరీకయి గద్దె నెక్కింది కాంగ్రెసు. ఆ కాంగ్రెసుతో ఇవాళ భారతదేశంలో పార్ల మెంటరీ పార్టీలన్నీ చెట్టపట్టాలేసుకుని నడుస్తున్నాయి. ఇది మన కళ్ళముందు కనిపించే సత్యం. అయితే ఆనాటి అల్లూరి బాటలో నడుస్తోంది ఈనాటి యువత. బూటకపు ఎన్ కౌంటర్ల లో రోజూ నేలకొరుగుతూనే ఉన్నారీనాటి విప్లవకారులు. ప్రజల కోసం పోరాడేవారికి అల్లూరి ఊపిరి, ఉత్తేజం. గెలుపు, ఓటమిలకి యిది ఓట్ల జూదం కాదు.ఇది ఉద్యమం, తిరుగుదాటు, పోరాటం, విప్లవం, నిరంతరం కొనసాగేదే విప్లవం. ఏ వ్యవస్థయినా మర్రిచెట్టులా వేళ్ళూని ఉంటుంది, ఊడలు దిగుతుంది. దానిని కూకటి వేళ్లతో పెకలించాలన్నా, ఊడలతో సహా కూల్చాలన్నా ఒట్టి మాటలతో అయ్యే పని కాదు. చెట్టుని మించిన విప్లవ చేవతో ముఖ్యంగా యువత కదిలినప్పుడే యిది సాధ్యమవుతుంది.

అల్లూరి సీతారామరాజు వ్యక్తి కాదు శక్తి. ఒక విప్లవ శక్తి. విప్లవ విజయానికి యుద్ధం ఎంత అవసరమో అల్లూరికి తెలుసు. అందుకు తగిన వ్యూహం, ఎత్తుగడలు ఆతనికున్నాయి. సుశిక్షిత సైన్యం కూడా సమకూర్చు కున్నాడు. తెల్లసైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. గాము మల్లుదొర, గంటం దొర, వర్షాలు, అగ్గిరాజు లాంటి సేనానులున్నారు. వీరిలో గంటందొర చివరి వరకు పోరాడు తూనే వున్నాడు. సీతారామరాజు చనిపోయిన (7-5-1924) తరవాత నెలవరకు కూడా తన పోరు నిరాటంకంగా కొనసాగించాడు. తెల్ల ప్రభుత్వానికి లొంగలేదు. అంతటితో వూరుకోలేదు ప్రభుత్వం, గంటందొర పోయిన తరవాత కూడ చాలా ఏళ్ళపాటు వందల మంది మీద కేసులు బనాయించి శిక్షల కోసం అండమాన్ పంపింది. అదే బ్రిటిష్ వారి కుతంత్రం, కుటిల నీతి, దమనకాండ. వలసవాదుల, సామ్రాజ్య వాదుల స్వభావమే అంత. సామ్రాజ్యవాదం హిరణ్యాక్షుడిలా ఇవాళ నేలనంతా చాపచుట్టి తన చంకలో పెట్టుకుంటోంది. మనం చూస్తూ ఊరుకోవలసిందేనా ? అల్లూరి స్ఫూర్తితో ముందుకు నడవాలి. సామ్రాజ్యవాదపు కుటిల పన్నాగాలని పసి గట్టాలి. దాని కోటిపడగలని మొదలంటా నరకాలి. మానవజాతికి అప్పుడే నిజమైన విముక్తి. ఈ సామ్రాజ్యవాదం అనే పెనుపాముని దేశ దేశాల ప్రజలనే చలిచీమలు మట్టుబెట్టి తీరతారు.

అల్లూరి సీతారామరాజు నూరో పుట్టినరోజున మనందరం ప్రతిన తీసు కుందాం. అదే అల్లూరికి నిజమైన నివాళి. విరసం చారిత్రక కర్తవ్యం కూడా అదే.

Leave a Reply