మల్లెల నరసింహమూర్తి మల్లె పువ్వు లాంటి కవిత్వాన్నే కాదు పాలకవర్గాల దోపిడీ విధానాల్ని, రాయలసీమ కరువును, వెనుకబాటుతనాన్ని, ముఠా కక్షల్ని నిరసిస్తూ సీరియస్ కవిత్వాన్ని రాసే అభ్యుదయవాది. “మట్టి తంబూర” అనే శీర్షికతో ఈ కావ్యాన్ని వెలువరించడమూ, ఒక జానపద సంగీత వాద్యంగా ఈ కావ్యాన్ని ప్రకటించడంతోనే మట్టితో కవి కవిత్వం ఎంతలా మమేకమైందో అర్థం అవుతుంది. 2004లో ప్రాంతీయ అస్తిత్వంలో భాగంగా “జలస్వప్నం” కావ్యాన్ని రాస్తే దానికి కొనసాగింపుగా 2024న రాయలసీమ నీటివ్యథలపై “మాకు ఒక నది కావాలి” రాశాడు. అదే పరంపరలోనే ‘మట్టి తంబూర ‘శీర్షికతో మరో కావ్యాన్ని వెలువరించాడు. ఈ మట్టి తంబూర కేవలం సామాజిక అనుభూతి కవితల కలబోతనే కాక తాత్విక, ఆత్మగాన, అన్వేషపూరక అక్షర శిల్పరీతులతో సాగే ఒక గొప్ప కవిత్వధార కూడాను. ఈ పుస్తకంలో ఇంకా కొన్ని అదనపు విషయాలు కనిపిస్తాయి. అవే ఈ పుస్తకం తెలుగు సాహిత్యంలో గొప్ప పుస్తకంగా బాసిల్లడానికి కారణమయ్యాయి. మరి అదనంగా ఏమి రాశాడు ఈ కవి? తన ఊరిని గురించి, ఆ ఊరిని చుట్టుకొని ఉన్న మానవ సంబంధాలను గురించి, ముఖ్యంగా తన మూలాలను గురించి, ప్రకృతిని గురించి, మట్టితో మనిషి పోగొట్టుకుంటున్నా మమతల్ని అలా ఒడిసి పట్టుకొని వాటిని ఇలా మన హృదయాల్లోకి వంపడానికి తన కవిత్వంతో పరితపిస్తాడు.

ఈ మట్టి తంబూర తాను వినిపించే స్వరాలలో మనిషి మూలాలను వెతుకుతుంది.

మట్టిని చూడు/ నేల పొరల్లో/ దట్టంగా అల్లుకున్న/ వేర్ల తంత్రులేవో/ మ్రోగుతాయి/ మట్టి తంబూరలో/ దాగివున్న/ అనాది ఆదిమ స్వరాలివి/ ఇది కవి అంతరాంతరాల్లో నుండి పుట్టుకొచ్చిన కవిత్వం. ఇది తనదైన సొంత బాణీనుండి పుట్టుకొచ్చిన కవిత్వం. మానవ జీవననాధాల్ని మట్టితో కలగలిపిన కవిత్వం. సహస్రవృత్తుల జీవన సౌందర్యాన్ని ఈ కవిత్వం బహురూపాలుగా ఎత్తి పట్టింది. ఒక పరిపక్వ పండులా పరిపూర్ణ సూత్రీకరణ చేసిన కవిత్వం ఇది.

అన్నపానాదులు మనిషి జీవితంలో ఎలా భాగం అవుతాయో నడవడం మాట్లాడడమూ అంతే. ఇవి చైతన్యానికి ప్రతీక. అందుకే మనం మాట్లాడాలి. ఎవరి పక్షాన మాట్లాడాలి? అన్యాయానికి, దోపిడీకి, పీడనకు గురి అయ్యే వారి పక్షాన నిలబడి మాట్లాడాలి. మరి మనం మాట్లాడుతున్నామా? దశాబ్దాలుగా పీడనకు గురి అవుతున్న దగాకు గురి అవుతున్న రాయలసీమ సమస్యలపై ఈతి బాధలపై ఒక్కసారైనా మాట్లాడమా? అయితే ఇక్కడి కవులు మాట్లాడారు. ఇక్కడి రచయితలు మాట్లాడారు. ఆ మాట్లాడిన కవుల్లో ముందు వరుసలో ఉండే కవి మల్లెల నరసింహమూర్తి. ఆ క్రమంలో ఇలా అంటాడు..

ఎల్లమ్మ గుడిలో/ వేపచెట్టుకున్న పసుపు కుంకుమలు పెట్టుకొని/ మట్టి గాజులు, నిమ్మకాయల దండేసుకుని/ నాలుక బయటపెట్టి/ పొట్లిని గావు పట్టి /ఊరి కథలు చేదు నిజాలు మాట్లాడాలి/ రాయలసీమలో/ నీళ్లు పారాలని/ నీళ్ల తిరుణాల జరగాలని/ రాతి గుండెలు కరిగేలా/ రాళ్లు మాట్లాడాలి. ఈ కవితలో మల్లెల గారి పలవరింత అంతా నీళ్ల గురించే దశాబ్దాలుగా వానలు కురవక పంటలు పండక క్షామంతో చస్తున్న రాయలసీమ ప్రాంత దాహార్తిని గోడును వెళ్లబోస్తూ తన ఉద్దేశాన్ని చెబుతాడు. ఏ నాగరికతకైనా నీళ్లే మూలం. రాయలసీమ బతుకంతా నీళ్ల చుట్టూ అల్లుకున్నదే. ఆ నీళ్లు స్వప్నాల వుతూ, ఆ నీళ్లు చర్చలవుతూ, ఆ నీళ్లు సాంకేతిక మేధస్సు అవుతూ, ఆ నీళ్లు సాహిత్య ప్రక్రియలవుతూ, ఆ నీళ్లు ఉద్యమ రూపాంతరం చెందాల్సిన ఆవశ్యకతను ఈ మాట్లాడాలి కవితలో బలంగా చెప్పాడు మల్లెల.

రూపం లేకుండా సారం, సారం లేకుండా రూపం ఉండవు. రూప భేదాన్ని పాటిస్తూ ‘రూపభేదం’ అనే కవితనల్లాడు

నన్ను ఒక అక్షరం అనుకుంటారు/ నేనొక మహాకావ్యాన్ని/ నన్ను ఒక బిందువు అనుకుంటారు/ నేనొక సముద్రాన్ని/ నన్ను ఒక పక్షి అనుకుంటారు/ నేను ఆకాశాన్ని/ ఇలా అనేక రూప భేదాలు/ అయినా సారంలో/ నేనొక విశ్వరూపాన్ని/ కవిని కన్న భూమిని/ మృణ్మయ రూపాన్ని అని చివరకు సారాన్ని చేరుకోవడంతో కవితకు పరిపూర్ణత అబ్బుతుంది. అనంతపురం పట్టణ నడిబొడ్డున టవర్ క్లాక్ ఉంది. ఆ టవర్ క్లాక్ పై ‘పెద్ద గడియారం’ అనే కవిత రాశాడు. తెలుగు కవితాలోకంలో చిరస్థాయిగా నిలిచిపోయే కవిత ఇది.

ఉదయాన్నే లేచి మొట్టమొదట/ అమ్మ ముఖం చూడాలనుకుంటాం/ అనంతవాసులం/ అమ్మలాంటి పెద్ద గడియారమ్మను/ కల్లారా చూసి మురిసిపోతాం/ కష్ట నష్టాలు కాసేపు మరచి పోతాం.

పొద్దున్నే నిద్రలేచిన వెంటనే ఎవరైనా అమ్మ ముఖం చూడడానికి ఇష్టపడతారు. అనంతవాసులకు పెద్ద గడియారమ్మను చూడకపోతే ఆ రోజంతా ఏదో తెలియని వెలితిగా అనిపిస్తుంది. ఒకరోజు గడియారాన్ని చూడకపోతే నిమ్మలంగా ఉండదు. గడియారమ్మే కాదు ఈ పుస్తకంలోని మరో కవితలోగాలిని గాలమ్మ అంటాడు. గడియారాన్ని గడియారమ్మ అంటాడు. అంటే మనిషి గుణాలను వస్తువులకు ఆపాదించడమే గాక వాటికి కొత్త కొత్త పేర్లు పెడుతూ కొన్ని ప్రయోగాలు చేశాడు తన కవిత్వంలో మల్లెల నరసింహమూర్తి. అలా అనంతపురం వాసులంతా ఆ పెద్ద గడియారాన్ని వీక్షిస్తూ సంతోషంగా తమ దైనందిన జీవితంలోకి వెళుతూ ఉంటారు అంటాడు. ఇంకా ….

మా ఊరి పిల్లలు/ పిల్లప్పటినుంచి/ పెద్ద గడియారమ్మ కొంగు పట్టుకు తిరుగుతూ తిరుగుతూ పెరుగుతారు/ స్కూలుకు పోతూ పోతూ/ తిరిగి ఇంటికి వెళుతూ వెళుతూ/ టాటా బైలు చెబుతూ చెబుతూ/ పెద్ద వాళ్ళు అవుతారు. అక్కడి పిల్లలు, అక్కడి విద్యార్థులు పెద్ద గడియారమ్మ కొంగు పట్టుకుని పెరుగుతా పెద్ద వాళ్ళు అవుతారంట. స్కూల్‌కి కాలేజీకి వెళ్తూ వస్తూ టాటా బై బై లు చెప్పుకుంటూ ఆ గడియారమ్మ పరిసరాల్లో తిరుగుతూ పెరుగుతారంట ఒక ప్రదేశంతో ఒక కట్టడంతో ఉన్న అనుబంధాన్ని ఇంత గొప్పగా చిత్రీకరించడం మల్లెలకు మాత్రమే సాధ్యం.

పట్టణమైన పల్లెటూరైన పుట్టినూరైనా పెరిగిన ఊరైన దానితో పెనవేసుకుపోయిన తీయని జ్ఞాపకాలని అనుబంధాలను రూపు కట్టించడం మల్లెల నరసింహమూర్తి కవిత్వం ప్రత్యేకత. ఈ భావనతో రాయబడిన కవితే కట్లపొయ్యి.

కట్లపొయ్యి మనందరికీ తెలుసు కదా! ఈ కవితను చదువుతుంటే చిన్నప్పుడు మన అమ్మ వంట చేసే కట్లపొయ్యి మన కళ్ళ ముందు మెదులుతుంది. ప్రతి ఒక్కరిని ఆ బాల్యం తాలూకు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే చక్కటి కవిత. ఒక ఆమె తన భర్త కోసం చింతచిగురు పప్పు చేస్తోంది. ఆ పప్పు చేసే విషయాన్ని ఎంత గొప్పగా దృశ్యీకరించాడో చూడండి.

మాయమ్మ కట్లపొయ్యి మింద కుండ పెట్టి/ ఎసిట్లోకి ఇన్ని కంది బ్యాళ్లు పోసి/ ఇంత సింతాకేసి బాగా ఉడికినంక దింపి/పప్పు గిత్తితో బాగా ఎనిపి/ ఉప్పు కారమయిందా లేదా అని రుసి సూస్తాండే/ కుండ చుట్టూ ముసురుకోనుండే/ పిల్లోళ్లకి అరచేతుల్లోకి యేసి/ రుసి చెప్పమంటాడే

 పప్పు ఎనిపేటప్పుడు పిల్లల చేతుల్లోకి రవ్వంత పప్పు వేసి ఉప్పు కారం సరిపోయాయా లేదా అని రుచి అడగడం ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది కదా కవిత్వం. ఆనంక తెల్ల వాయి/ సెని క్కాయ నూనె గెంటిలో వేసుకొని/ ఆవాలు జిలకరేసి పప్పుకు తిరగబాత పెడతాండే /తిరగబాత వాసన/ పక్కింటి పుల్లమ్మ అత్తయ్య/ ముక్కుపుటాలకు తగులుతాండె/ ఏమే/ ఎల్లమ్మ క్వాల్లీ/తిరగబాత జోరుగా పెట్టినవే అంటే/ అవునత్తా సింతాకు పప్పు చేసిన/ రాగి సంగటి గెలికిన/ రా నువ్వు ఒక ముద్ద తినిపోదువు గాని..

ఎంత సహజ వర్ణన. ఎంత ముచ్చటైన వర్ణన. ఇదిగో ఇక్కడ మల్లెల నరసింహమూర్తి గుండె లోతులూ విచ్చుకుంటాయి. కవిత అంతా ఒక ఎత్తు అయితే ఆ తినిపోదువు రా అనే వాక్యం ఉందే అది ఎంత గొప్ప వాక్యం. ఈ వాక్యం కవితకు ఒక మలుపు. ఈ వాక్యం కవితకు ఒక మెరుపు. ఒక చిన్న విషయాన్ని కూడా గొప్పగా దృశ్యీకరించడం ద్వారా అందులోను తన మాండలికాన్ని తన నుడికారాన్ని చూపించడం ద్వారా అద్భుతమైన కవితగా రూపాంతరం చెందింది ఈ కవిత.

మల్లెల నరసింహమూర్తి తనకు తారసపడిన పలు సందర్భాలను విలక్షణ పదచిత్రాలుగా కవిత్వీకరిస్తాడు. జీవన పోరాటంలో సతమతమయ్యే వాళ్లను అక్కున చేర్చుకుని బాధామయమైన వాళ్ళ జీవితాలను కవిత్వంలో సౌందర్యీకరిస్తాడు. ఆయన డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసే సమయంలో వికలాంగురాలైన ఒక విద్యార్థిని వాళ్ళ అమ్మ మోసుకొచ్చి తరగతి గదిలో దించుతూ ఉండేది. ఆ అమ్మాయి తన శారీరక అసౌకర్యాన్ని పక్కనపెట్టి చదువులలో లీనమయ్యేది. ఆ అమ్మాయికి చదువు పట్ల ఉన్న జిజ్ఞాసకు తన్మయుడైన కవి ఆమెపై ‘శిల్పతరంగిని’ అనే కవిత రాశాడు. ఈ కవితను చదువుతూ ఉంటే పాఠకుడికి కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ పాప తల్లి ఆమెను మోసుకొచ్చి తరగతి గదిలో దించే దృశ్యాన్ని ఎంత హృద్యంగా రాశాడో!

 పాప వాళ్ళ అమ్మ/ రోజు తన గుండె జోలెలో/ పదిలంగా తీసుకొచ్చి/ తరగతి నది అలలపై /పచ్చటి ఆకుల దోనెపై పండుకోబెట్టిపోతుంది/ పాప నది వీచే ప్రతి అలను/ ఓ పాఠంలా పాడుకుంటుంది.

ఈ వర్ణన రెక్కాడితే గాని డొక్కారని కూలి పని చేసుకునే చంటి బిడ్డ తల్లి తన బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి పనిచేయడానికి వెళ్లి పని అయిపోగానే వచ్చి ఆ బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకొని హత్తుకుంటూ ఎలా మురిసిపోతుందో ఆ దివ్యాంగురాలు తల్లి కూడా. అంతే ఆ అమ్మాయిని ఒక చంటి బిడ్డలా ట్రీట్ చేస్తూ ఆమె బాగోగులన్నీ చూసుకుంటుంది. క్లాసులు అయిపోగానే చంటి బిడ్డను ఎత్తుకున్నట్లు ఎత్తుకొని ఇంటికి వెళ్తుంది. తల్లి మనసుని దివ్యాంగురాలి ఆత్మవిశ్వాసాన్ని కళ్ళకు కట్టిన కవిత. విద్యార్థులకు ఇన్స్పిరేషన్ ఇచ్చే కవిత. తల్లిదండ్రులు ఆరుగాలం కష్టపడుతూ మనల్ని చదివిస్తుంటే మనం చదువుకుంటున్నామా అనే ప్రశ్నను వేసే కవిత. నేటి యూత్ చాలామంది సోషల్ మీడియాకి సెల్ ఫోన్‌లకు అడిట్ అవుతూ పాఠ్యాంశాలపై, చదువుపై దృష్టి నిలపకుండా కాలయాపన చేసే యువతి యువకులకు మార్గనిర్దేశం చేసే కవిత ఇది.ఈ కావ్యం ఇంకా మానవ సంబంధాల పట్ల ఒక అనురక్తిని, సజీవమైన సంబంధాల పట్ల ఒక తహతహను ప్రదర్శిస్తుంది. మల్లెలపై గుంటూరు శేషేంద్ర శర్మ ప్రభావంతో పాటు ఇస్మాయిల్ అనుభూతి వాదం కొంత కనిపిస్తున్నప్పటికీ తనదైన యూనిక్ శైలిలో తనదైన యూనిక్ థీంతో ప్రతి కవితను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇందులో దాదాపుగా 57 కవితలు ఉన్నాయి. ప్రతి కవిత మన హృదయాలను హత్తుకుంటుంది. ఇది పది కాలాలపాటు నిలిచిపోయే కవిత్వం. ఇంత మంచి కావ్యాన్ని సమాజానికి అందించిన మల్లెల నరసింహమూర్తి నిలువెల్లా కవి.

  • డా. బావికాటి రాఘవేంద్ర

తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల

 ఆలూరు, కర్నూలు జిల్లా.

Leave a Reply