విప్లవం అనేది కేవలం బాహ్య పోరాటం మాత్రమే కాదు—అది అంతర్గత చైతన్యం, విద్య. తోటివారి మద్దతుకు సంబంధించిన విషయం కూడా. ఆయుధాలు చేపట్టిన మహిళల పోరాట మార్గంతోనూ, వారు ఆయుధాలు ధరించడాన్నీ మనం ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు. కానీ వారి జీవిత పోరాటాన్ని మనం తోసిపుచ్చలేము. ఉద్యమం, పోరాటం, ప్రతిఘటన సరైనవని నమ్మేవారు, పోరాటానికి లేదా ప్రతిఘటనకు ఒకే ఒక మార్గం ఉండదని గ్రహించాలి. ఏ ప్రాంతంలో ఉద్యమం ఎలా ఉంటుందనేది అక్కడి పరిస్థితులే నిర్ణయిస్తాయి. అంటే, అణచివేత స్వభావమే ప్రతిఘటన మార్గాన్ని కూడా నిర్దేశిస్తుంది. అందువల్ల, ఏ ఉద్యమాన్ని కూడా—ఉదాహరణకు మావోయిస్ట్ ఉద్యమాన్ని కూడా—అది ఆయుధాలు చేపట్టినంత మాత్రాన తోసిపుచ్చకూడదు. అక్కడ ఉన్న అణచివేత, ప్రతిఘటనలలో జీవితం ఎలా ఉంది? అనేది తెలుసుకోవడం అత్యవసరం. ఈ పుస్తకం అలాంటి మానవ సంబంధాల గురించి ఒక సంగ్రహావలోకనాన్ని మనకు అందిస్తుంది.

సమాజంలో అణచివేత ఉన్నచోట తిరుగుబాటు జ్వాల రగులుతుందనే కోణంలో కూడా మనం దీనిని చూడవచ్చు. ఎన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ఉన్నత విద్యనభ్యసించిన ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు, రచయితలు, పాత్రికేయులు అలాంటి ప్రాంతాలకు వెళ్లి తమ సేవలను అందించడానికి కారణం ఇదే కావచ్చు. తీవ్రమైన ప్రాణాపాయాన్ని సైతం లెక్కచేయకుండా వారు సహకరించడానికి కారణం బహుశా వారిలో ఉన్న ఆదర్శవాదం, మార్పు పట్ల ఉన్న ఆకాంక్ష, ప్రజలతో వారికున్న ప్రత్యక్ష అనుబంధమే కావచ్చు. సమాజం కేవలం విప్లవం ద్వారా మాత్రమే మారుతుందని నమ్మే మార్క్స్, లెనిన్, మావో మరియు భగత్ సింగ్ వంటి విప్లవకారులతో మనం పూర్తిగా ఏకీభవించడమే దీనికి ప్రధాన కారణం కావచ్చు.

ఇందులోని కొన్ని కథలను ఉన్నత విద్యనభ్యసించి, ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన మహిళలు రాశారు. మరికొన్ని కథలను దళాలతో అనుబంధం ఉన్న మహిళలు రాశారు. దీని కోసం వారు ఒక కొత్త భాషను నేర్చుకున్నారు. ఎనభైల దశకం నుండి మహిళల ప్రవేశంతో ఈ కథలు ప్రారంభమవుతాయి. వీటి భౌగోళిక సరిహద్దుల గురించి ఖచ్చితంగా చెప్పడం కష్టమే అయినప్పటికీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ సరిహద్దులే వీటి పరిధి అయి ఉండవచ్చు.

ఆదివాసీ సమాజ జీవనాన్ని కేవలం కాల్పనిక దృక్పథంలో చూసేవారి భ్రమలను ఈ పుస్తకం పటాపంచలు చేస్తుంది. పితృస్వామ్యం మన సమాజాన్ని ఏ విధంగానైతే గుల్ల చేస్తోందో, అక్కడ కూడా అదే రూపంలో ఉంది—ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ హింసాత్మకంగా ఉంది. కొత్త ఆలోచనల వెలుగులో అక్కడ మార్పులు కనిపిస్తున్నాయి. మహిళలు పితృస్వామ్యాన్ని తిరస్కరించి తమ జీవితాలను అర్థవంతంగా మలచుకున్నారు. కుటుంబ, పిల్లల, తమ జీవనోపాధి భద్రతకు బాధ్యత వహిస్తూ వారు సాధికారత సాధించారు.

అదేవిధంగా, మత అంధవిశ్వాసాల నుండి విముక్తి పొందుతున్న ఆదివాసీలు తమ సహజమైన దినచర్యను పాటిస్తూ విద్యకు ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఒకప్పుడు కొద్దిపాటి కూరగాయలు పండించుకుని పేకాట, జూదం, తమ ఇంటి సారాయితోనే కాలం గడిపేసిన ప్రదేశంలో, ఈ కొత్త ఆలోచనలు ప్రతి రంగంలోనూ వారి కుతూహలాన్ని, పనిచేసే సామర్థ్యాన్ని పెంచాయి. వీటన్నింటి ఫలితంగా వారు తమ మంచి చెడులను తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు వారిని భ్రమపెట్టడం లేదా మోసం చేయడం సులభం కాదు.

ఇప్పుడు సీమా ఆజాద్ జింకల శౌర్యగాథలు” అని పిలిచే ‘వియ్యుక్క’ కథల ప్రపంచంలోకి వెళదాం. అక్కడ విద్య లేదు, ఆరోగ్య సేవలు లేవు, న్యాయం లేదు. అక్కడ ఉన్న అభద్రతా వాతావరణంలో నిరపరాధుల అరెస్టులు, బాంబు పేలుళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా రకరకాల బయటి వ్యక్తుల బెదిరింపులు ఉన్నాయి. జీవితమే కథగా, కథే జీవితంగా మారినప్పుడు, బతుకుకి చావుకి మధ్య తేడా ఏమీ మిగలదు.

అసంఖ్యాక పోరాటాల రంగంలో తాము ఆయుధాలు పట్టడం గురించి మాట్లాడే నేను గెరిల్లాగా ఎందుకు మారాను?’ (రచయిత్రి బుధ్రీ)అనే కథలోని ఒక భాగాన్ని చూడండి—

మేము జమీందార్ల ఆధిక్యాన్ని నిరసించాము, వ్యాపారుల మోసాలను అడ్డుకున్నాము, జమీందార్ల నుండి భూములను తిరిగి తీసుకున్నాము. ఇవన్నీ మంచి విజయాలు, వీటిని కాపాడుకోవడానికి మనం ఆయుధాలు పట్టి పోలీసులతో పోరాడాల్సిందే.”

అన్యాయమూ, అవమానాలకి వ్యతిరేకంగా ‘ఎర్రజెండా’ అనే కథలోని ఈ భాగం చూడండి—

మనం సంఘాన్ని వదిలేస్తే, పోరాటాన్ని వదిలేస్తే మళ్లీ జమీందార్లు, సాహుకార్లకు బానిసలుగా మారిపోతాము. వారి కాళ్ల కింద కుక్కల్లా బ్రతకాల్సి వస్తుంది. వారి తిట్లు, దెబ్బలు భరించాల్సి వస్తుంది. అలాంటి జీవితం జీవించడం కంటే పోరాడి చావడమే మేలు…”

వెనుకబడిన ఆదివాసీల జీవితాల్లో సిద్ధాంతం ఏ విధంగా పనిచేస్తుందో ‘శిక్ష’ అనే కథలోని ఈ అంశం తెలియచేస్తుంది—

కామ్రేడ్! మన జనతన ప్రభుత్వం ఒక హింస లేని ప్రపంచాన్ని నిర్మించడానికి ఏర్పాటైంది. ఇది ఉన్నత విలువల కోసం పనిచేస్తుంది. కంటికి కన్ను అనే పాత పద్ధతి ఇప్పుడు చెల్లుబాటు కాదు, మనం చరిత్రను, ద్వంద్వాత్మక పద్ధతులను అర్థం చేసుకున్నవాళ్ళం. మనం కమ్యూనిస్టులం.”

ఈ సంకలనంలో అత్యంత ముఖ్యమైన కథ ‘ఎర్రజెండా’ —దీనిని కేవలం ఒక కథగా భావించే పొరపాటు చేయకూడదు. ఆదివాసీలపై జరిగే అణచివేత దారుణమైన యథార్థానికి సంబంధించిన ఒక అంశం ఇక్కడ గమనించదగినది—ఆందోళనగా గుండెలు బిగపట్టుకొని కూర్చున్న మహిళలు ఒకేసారి బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు,     చిన్న పిల్లలను ఎత్తుకుని, తిడుతూ పోలీసుల వెనకాలే పరిగెత్తారు. కానీ దాదాపు 200 మంది పోలీసుల ముందు కేవలం 25 మంది మహిళలు నిస్సహాయంగా ఉండిపోయారు. పోలీసులు తుపాకీ  మొనలతో ఆ మహిళలను, చిన్న పిల్లలను నిర్దయగా కొట్టారు.”

మన సమాజం అత్యాచారాన్ని ఒక సాధారణ ప్రక్రియగా ఏ విధంగానైతే అంగీకరించిందో—ఎల్లప్పుడూ ఎక్కడో ఒకక్కడ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు దాని కారణాలు, భయానకత, గుండెలను పిండేసే బాధ గురించి ఎంత మాట్లాడినా ఈ గణాంకాలు తగ్గేవి కావు—అదే రీతిలో ఆదివాసీ సమాజం కూడా అరెస్టులను, అమానుషమైన హింసను తమ జీవితంలో భాగమని అంగీకరించేసింది. ఒక అరెస్టు కథ’ అనే కథలోని ఈ చిన్న భాగం ఇదే విషయాన్ని తెలియజేస్తోంది—

వారు సుశీల కాళ్లను బంధించి, ఆమె చేతులు, కాళ్లు ఒకే దగ్గరకు వచ్చేలా పైకి వేలాడదీశారు. ఆమె గట్టిగా అరిచింది— ‘నాకు ఏమీ తెలియదు సార్!'”

ధిక్కారం’ అనే కథలోని ఈ రెండు భాగాలు కూడా గమనించదగినవి—

పోలీసులు కూడా మనుషులేనని ఆదివాసీలు భావించరు. క్రూరమైన అడవి జంతువులను ఎదుర్కోవడానికి అలవాటుపడిన వారు, పోలీసులను ఏ జంతువుతోనూ పోల్చలేరు. ముఖ్యంగా మహిళలు—ఎందుకంటే క్రూర జంతువుల వల్ల ప్రాణభయం ఉన్నప్పటికీ, అత్యాచార భయం ఉండదు.”

సిగ్గు. అవమానంతో తలదించుకుంటూ ఆమె తన రొమ్ము నుండి పాలను పిండి చూపించింది.”

పత్రికల్లో చదివే వార్తా శీర్షికలకు భిన్నంగా ‘రామ్కో’ అనే కథలోని ఈ భాగం చూడండి—

గడ్చిరోలి పోలీస్ సూపరింటెండెంట్ కి రణితను చూడాలనే కుతూహలం కలిగింది. ఉదయం నుండి ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టిన ఆ బలహీనమైన యవతి ఈమెయేనా? ఆమె యుద్ధ పాటవాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆమెను పడగొట్టడానికి 600 మంది సైనికులు, హెలికాప్టర్లు, ఎం.పి.పి లు, వేలాది తూటాలు, వందలాది బాంబులు (హ్యాండ్ గ్రెనేడ్లు) ఉపయోగించాల్సి వచ్చింది, అంతేకాక నలుగురు పోలీసులు మరణించారు, ముగ్గురు గాయపడ్డారు.”

పైన ఇచ్చిన ఈ చిన్న అంశాల వెనుక ఉన్న పూర్తి కథలలోని అమానుషమైన ఘటనలు గగుర్పాటు కలిగిస్తాయి. మావోయిస్ట్ ఉద్యమం ఆవలి వైపు ఉన్న మరో ప్రపంచ విశేషాలు ఇవి—ఈ వైపు ఉన్న ప్రజలకు, అంటే మనకు తెలియని విషయాలు.

ఈ కథలు ముఖ్యంగా నీరు, అడవి, నేల (జల్, జంగల్, జమీన్)ను కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటాలు. దోపిడీ, లాభాపేక్ష, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలు. ఈ కథలన్నీ అరుదైన కథల జాబితాలో అగ్రస్థానంలో ఉంటాయి, ఎందుకంటే మన వరకు చేరుకోవడానికి ఇవి ఎదుర్కొన్న దుర్భరమైన కష్టాలు, ప్రయాణించిన సుదీర్ఘ మార్గాన్ని మనం ఊహించలేము.

ఇవి కఠోర వాస్తవ గాథలు. కానీ ఇందులోని పాత్రలన్నీ నిజమైనవి. అన్యాయం, అవమానం, ఆకలి, కొట్టడం, నెత్తురు, అరుపులు, చిత్రహింసలు, నిరాశ—ఇవన్నీ కూడా నిజమైనవే. ఒక ఆరోగ్యకరమైన, అందమైన, విద్యావంతమైన, మానవీయ సమాజం అనే కల కోసం ఈ రచయిత్రుల జీవితం దృఢ నిశ్చయంతో, కఠినంగా, ఒక లక్ష్యానికి అంకితమై సాగింది. రచయిత్రి నిత్య అలాంటి ఒక విప్లవ నాయకురాలు, ఆమె ‘కామ్రేడ్ నర్మద’ అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఈ సంకలనంలోని రెండు ముఖ్యమైన కథలైన ‘బాలి’, ‘రామ్‌కో’లను ఆమె రాశారు. ఇప్పుడు ఆమె లేరు. 2022లో జ్యుడీషియల్ కస్టడీలోనే ఆమె చివరి శ్వాస విడిచారు.

పైన పేర్కొన్న కథలలోని  భాగాలు వరుసగా ఈ క్రింది కథల నుండి తీసుకొన్నాను. మొదటి భాగం— ‘నేను గెరిల్లాగా ఎందుకు మారాను?’ అనే కథ నుండి తీసుకొన్నా. దీని రచయిత్రి బుధ్రీ. రెండవ, నాల్గవ కథా భాగాలు ‘ఎర్రజెండా’ కథలోనివి, దీని రచయిత్రి శ్వేత. ఆమె అసలు పేరు అరుణ. అరుణ ఒడిశా సరిహద్దులో అమరురాలయ్యారు.

మూడవ కథా భాగం ‘శిక్ష’ కథ నుండి తీసుకొన్నాను.  దీనిని మిడ్కో రాశారు, దీనిని అసీమ్ సత్యదేవ్ అనువదించారు. మిడ్కో అసలు పేరు రేణుక. ఆమె న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. ఆమెపై 45 లక్షల రివార్డు ఉంది. మార్చి 2025లో ఆమెను హత్య చేశారు. ఆమె ఇతర పేర్లతో కూడా కథలు రాసేవారు. ఈ సంకలనంలోని ‘ధిక్కారం’ కథను కూడా ఆమే రాశారు. తెలంగాణలో ఆమె అంత్యక్రియలు జరిగినప్పుడు భారీ సంఖ్యలో రచయితలు, విద్యార్థులు, అనేక మానవ హక్కుల సంస్థల ప్రజలు అక్కడ హాజరయ్యారని చెబుతారు.

ఐదవ భాగం ‘ఒక అరెస్టు కథ’ అనే కథ నుండి తీసుకోబడింది. దీనిని భారతి రాశారు. ఈ కథలో దళం కోసం గ్రామం నుండి అన్నం, పప్పు తీసుకువస్తున్న ఇద్దరు మహిళా సభ్యుల అరెస్టు కథ ఉంది. ఈ కథను చదువుతుంటే పోలీసుల చిత్రహింసలు మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి, అందులో స్త్రీ-పురుషుల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.

ఆరవ భాగం ‘ధిక్కారం’ అనే కథ నుండి తీసుకోబడింది, దీనిని ఆసిఫా అనే పేరుతో మిడ్కో రాశారు. గెరిల్లా మహిళలు ఒక ప్రత్యేక సిద్ధాంతానికి కట్టుబడిన ప్రజా గెరిల్లాలని పోలీసులకు తెలుసు. వారు యుద్ధభూమిలో ఉంటారు. కానీ గ్రామాలు, బస్తీల్లో ఉన్న యువతులందరూ గెరిల్లాలే అని పోలీసులు ఒక సిద్ధాంతాన్ని అల్లారు. వారందరినీ అరెస్టు చేయాలి, అయితే పసిపిల్లలు ఉన్నవారిని విడిచిపెట్టవచ్చు. అలాంటి మహిళలను ఎలా గుర్తించాలి అని వారు నవ్వుతూ, వెక్కిరిస్తూ ఆనందిస్తారు. దీంతోపాటు ఒక తల్లి మాతృత్వమూ, మొత్తం మానవత్వమే సిగ్గుపడేలా, ఆమె రొమ్ముల నుండి పాలను పిండి చూపించాలని పోలీసులు అడుగుతారు.

ఏడవ భాగం ‘రామ్‌కో’ కథ నుండి తీసుకొన్నాను. దీనిని నిత్య అంటే కామ్రేడ్ నర్మద రాశారు. ఇందులో రణిత అనే తిరుగుబాటు మహిళ కథ ఉంది, ఆమె ‘చాంద్‌గావ్ ఏరియా జనతానా ప్రభుత్వం’ అధ్యక్షురాలిగా ఉండేది.

గొడ్డలి, చాకు, విల్లు-అమ్ములు, తుపాకులను పురుషుల గుర్తింపుగా భావిస్తారని నిత్య రాశారు. అదే సమయంలో చీపురు, చేట, మోపు, కొడవలి మహిళలకు సంబంధించిన వస్తువులుగా భావిస్తారు. రామ్‌కో ఈ ఆచారాలకు వ్యతిరేకంగా ముందుగా ఇంట్లో పోరాటం ప్రారంభించింది, ఆ తర్వాత దళంలో చేరింది.

‘వియుక్క’ కథల సంకలనంలోని కథలు ప్రకృతిని, జ్ఞాపకాలను కాపాడటానికి చేసే పోరాటం. అక్కడ ప్రకృతి తన సంపూర్ణ వైభవంతో ఉంటుంది. “నేను ఎందుకు గెరిల్లాగా మారాను” అనే కథ, నాల్కో (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్), ఇండాల్కో (హిందుస్తాన్ అల్యూమినియం కార్పొరేషన్ లిమిటెడ్ ) అనే బహుళజాతి కంపెనీలు మాలి, దేవమాలి పర్వత శ్రేణులను స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నాయని వెల్లడిస్తుంది. ఈ పర్వత శ్రేణులు సుమారు పదిహేడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతాల లోతుల్లో మూడు వందల మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. స్థానిక ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది పర్యావరణ కాలుష్య ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, నిర్వాసితులైన గ్రామస్థుల జీవితాలు, ఆచారాలు, సంప్రదాయాలను నాశనం చేసి, వారి ఉనికికే ముప్పు కలిగిస్తుంది.

ఆదివాసీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ పోరాటమే సాగుతోంది. ఇది వ్యక్తులు తమ స్వలాభం కోసం చేసే యుద్ధం కాదని, పీడిత ప్రజలందరూ తమ హక్కుల కోసం చేసే న్యాయమైన యుద్ధమని వారు అంటున్నారు. ఈ యుద్ధంలో పిల్లలు, వృద్ధులు అంతా భాగస్వాములే.

ఈ కథ చివరి భాగం చూడండి, ఒక సాధారణ యువతి గెరిల్లాగా ఎలా మారుతుందో—

నేను నాన్నను చూడటానికి అటువైపు తిరిగాను, ఆయనకు చివరి ‘లాల్ సలామ్’ చెప్పాను. ప్రజల ముందు నేను చేసిన ప్రమాణం నాకు గుర్తుకొచ్చింది— జీవించి ఉన్నంత కాలం పేదలు, శోషితుల వైపే నిలబడతానని. ఆ దృఢత్వంతో నా తండ్రి మాటలు నా మెదడులో మారుమోగుతున్నాయి. ఎలాంటి సంకోచం లేకుండా నేను టోపీ పెట్టుకున్నాను, నా తండ్రి ఇచ్చిన రైఫిల్‌ను భుజాన వేసుకున్నాను, మాలి కొండల వైపు సాగిపోతున్న దళంలో చేరిపోయాను.”

ఇప్పుడు నక్సలైట్ భయానక వాతావరణం ముగియబోతోందని దేశమంతా సంతోషిస్తోంది. 2026 నాటికి నక్సలైట్ హింస, నక్సలైట్లు, నక్సలిజం అంతమైపోవచ్చు. ఈ పోరాటం కూడా ముగిసిపోవచ్చు. కానీ ప్రశ్న ఏంటంటే— ఆదివాసీలు ఉన్న ప్రతిచోటా ఈ పోరాటం ఎందుకు ఉంది? పోరాట విరమణ జరుగుతున్న ఆ ఆదివాసీ ప్రజలను ప్రధాన స్రవంతిలో కలిపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఎప్పటికైనా వేగు చుక్క వెలుగులో వారి వనరులు సురక్షితంగా ఉంటాయని, వారి జొన్న, శనగ, రాగి చేన్లు పచ్చగా అలలాడుతుంటాయని మనం ఆశించవచ్చు. ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు మొదలైనవి ఏర్పాటవుతున్నాయి. వారి జీవితం సంతోషమయంగా మారుతోంది. వారి కలలు నిజమవుతున్నాయి. ఈ సంకలనం: ఇందులోని కథలు ఈ విప్లవాత్మక స్వప్నపు మట్టి సువాసనతో నిండి ఉన్నాయి.

Leave a Reply