ధర్నా ప్రాంతంలో నిఘా వర్గాలు పోలీసులు జర్నలిస్టులు స్వయం సేవకులు రూలింగ్ పార్టీ కార్యకర్తలు యెవరేంటో గుర్తు పట్టలేని విధంగా మందిలో కలిసిపోయి సమాచారం సేకరిస్తున్నారు.
ఒకరి చేతిలో మైక్ మరొకరి దగ్గర కాగితం కలం యింకొకరి చేతిలో దుడ్డుకర్ర వేరొకరి మెడలో కెమెరా అందరూ కాలికి వేలికి అడ్డువచ్చినవాడినల్లా గుచ్చి గుచ్చి ప్రశ్నలడుగుతున్నారు.
“ఎక్కణ్ణుంచి వచ్చావ్?”
“బిహార్ నుంచి”
“చూస్తే ఉద్యోగం సద్యోగం లేనోడిలా ఉన్నావ్. ఇంత దూరం వచ్చి యిన్ని రోజులు సిటీలో వుండటానికి పైసలు యాడ నుంచి వచ్చినయ్?
…
“అరేయ్ పిల్ల నాయాలా యిట్రా రా”
“సర్”
“వయసెంత రా”
“17 యేళ్లు సా”
“ఏం చదువుతున్నావ్?”
“నీట్ కి అప్పియర్ అయ్యాను. పేపర్ లీకైంది. మళ్ళీ పరీక్ష రాశా”
“అమ్మా బాబు యేం చేస్తారు? కోచింగ్ ఎక్కడ తీసుకున్నావ్? డబ్బులు ఎవరు కట్టార్రా”
…
“ఆగు”
“యస్ ప్లీజ్”
“చూస్తే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినట్టున్నారు. మీరెందుకు ఈ రొచ్చులోకి దిగారు?”
“అయామ్ ఎ ఫ్యాకల్టీ యిన్ లోకల్ యూనివర్సిటీ. ఐ హావ్ కం టూ ఎక్స్ప్రెస్ మై సాలిడారిటీ విత్ ది స్టూడెంట్స్”
“ఓ.. దటీజ్ యిన్టరెస్టింగ్. అర్బన్ నక్సలైట్ వి అన్నమాట. బై ద వే ఐ కెన్ సీ థ్రూ. రేటెంత? ఐ మీన్ వాటీజ్ ది ప్రైస్ ఆఫ్ యూవర్ బ్రాండెడ్ బ్రా? సొంతంగా కొనుక్కున్నావా? ఇక్కడ యెవడైనా కొనిచ్చాడా?”
…
*ఒరే నల్ల తుమ్మ మొద్దూ! ఎక్కడ నుంచి దిగావురా స్టైల్ మింగుతున్నావ్?”
“ప్లీజ్ మైండ్ యువర్ టంగ్”
“అబ్బో యింగ్లీషు. నీ మొహానికి నప్పలేదురా. యస్సీనా? చదువు యెక్కడ యెలగబెట్టావ్?”
“అవును, యస్సీనే. మహర్. కాలిఫోర్నియా యూనివర్సిటీలో పిహెచ్ డి చేశా”
“బలిసిందిరా మీకు. దళిత్ అయి అమెరికా వెళ్ళి వచ్చావా? ఫీజెవడు కట్టాడు?”
…
“నిరసన ఉద్యమం ఆర్గనైజర్ గా మిమ్మల్ని వొక ముఖ్యమైన ప్రశ్న అడగాలి”
“అడగండి, ప్రజాస్వామ్యానికి ప్రశ్నే కదా ప్రాణం”
“ఇది నా ప్రశ్న కాదు, ద నేషన్ వాంట్స్ టు నో. ఇన్ని రోజులు యింతమందితో యీ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేయడానికి మీకు ఫండ్స్ యెక్కడ నుంచి వస్తున్నాయి? అభివృద్ధి పథంలో నడుస్తున్న దేశాన్ని నాశనం చేయడానికి విదేశీ శక్తుల కుట్ర..”
ప్రశ్నలు అడుగుతున్న వాడి మాట పూర్తయ్యే లోపే వాడి వాలకం చూస్తున్న బక్క పలచని రివట లాంటి అమ్మాయి కెమెరా ముందుకు దూసుకొచ్చింది.
“బుల్ షిట్, స్టాప్ యువర్ బ్లడీ యింటరాగేషన్ ..
ఇప్పుడు నేను సూటిగా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.
స్విస్ బ్యాంక్ నుంచి బ్లాక్ మనీ యెంత తెప్పించారు?
నోట్ బందీ వల్ల దేశానికి యెంత సేవ్ అయింది? యెన్ని చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి?
కరోనాకి గంగలో కొట్టుకుపోయిన శవాలెన్ని? వేక్సిన్ కోసం చేతులు మారిన సొమ్మెంత?
దేవుడి గుడి కట్టడానికెంత వసూలు చేశారు? కట్టాక హుండీ నుంచి యెంత కాజేశారు?
పిఎం కేర్ కి యెన్ని కోట్లు జమైంది? దేనికి యెంత ఖర్చయింది?
దేశాధినేత విదేశీ ప్రయాణాలకి ప్రజల డబ్బు ఎంత దుర్వినియోగమైంది?
బ్యాంకుల్లో బడా బాబులకు రుణాలెన్ని లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు?
ఎలెక్షన్ బాండ్ల రూపంలో యే పార్టీకి యెంత ముట్టింది? ఇన్ రిటర్న్ బాండ్స్ కొన్నవాళ్ళకి యేం లాభం కలిగింది?
అడవి బిడ్డల్ని అడవి నుంచి తొలగించి యెన్ని వేల యెకరాలు యెవరికి కట్టబెట్టారు?
చివరిగా –
ఆర్ఎస్ఎస్ కి యెవర్నించి యెంత ముడుతుంది …
మంది సొమ్ముకి మీరు కదరా లెక్కలు చెప్పాల్సింది
నేషన్ వాంట్స్ ఫకింగ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ దిస్. పోయి మీ బాస్ ని అర్ధరాత్రి సెల్ఫీ వీడియోలో వీటికి సమాధానం చెప్పమని అడుగు” అని అరిచింది.
ఉద్రేకంతో యెర్రబడ్డ ఆ యువతి ముఖంలోకి చూడలేక పృచ్ఛకుడు అక్కణ్ణుంచి తోక ముడిచాడు.




