రాజ్యాంగ ఆశయాలకు వ్యతిరేకంగా నిలిచిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అందచేసే డిగ్రీలను తాము తీసుకోబోమన్న నల్సార్ విద్యార్థులు
స్నాతకోత్సవం ప్రతి విద్యార్ధి జీవితంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఆ క్షణాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా నిలవాలని అనుకుంటారు. అలా ఉంచుకోవడం చాలా మంది విద్యార్ధులు తమదైన శైలిలో రూపొందించుకుంటారు. కానీ గత కొంత కాలంగా ప్రపంచంలో అనేక చోట్ల విద్యార్ధులు పోరాడుతున్న ప్రజలకు మద్దతుగా, ప్రజలను అణచివేస్తున్న ప్రభుత్వాలకు తమ అసమ్మతిని వ్యక్తం చేయడానికి వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇది అమెరికా నుండి హైదరాబాద్ వరకు కొనసాగింది. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించడం నుండి కుల వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన సంఘటనలు మన ముందు ఉన్నాయి. తాజాగా ఈ వరుసలో హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్ధులు చేరారు.
తమ స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావడాన్ని ‘నల్సార్ లా’ యూనివర్సిటీ 2026 బ్యాచ్‌కు చెందిన అత్యధిక విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. నల్సార్‌లో సీజేఐ స్నాతకోత్సవ ప్రసంగం చేయడం కొంతకాలంగా ఒక సంప్రదాయంగా మారింది.
న్యూఢిల్లీలో జరిగిన నీట్ నిరసనల సందర్భంగా సీజేఐ ఇటీవల వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
జూలై 20నాడు పలువురు నల్సార్ విద్యార్థులు నీట్ నిరసనకారులకు, రియు జంతర్ మంతర్ వద్ద విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతూ, ఒక పూట భోజనం మానేసి నిరాహార దీక్ష చేపట్టడంతో ఇక్కడి క్యాంపస్‌లో తొలిసారిగా కనిపించింది.
అదే రోజున కాక్రోచ్ జనతా పార్టీ ‘చలో పార్లమెంట్’కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం నిరసనకారులపై పోలీసుల దురాగతాలకు సాక్ష్యంగా నిలిచింది.
ఢిల్లీలో జూలై 20న విద్యార్థి నిరసనకారులపై జరిగిన అణచివేత సమయంలో పోలీసులు దురాగతాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపైన జూలై 22న సుప్రీంకోర్టు సుమోటో విచారణ ప్రారంభించడానికి నిరాకరించింది. పోలీసుల క్రూరత్వానికి వీడియో ఆధారాలు ఉన్నాయని ఒక న్యాయవాది సమర్పించగా, కోర్టు సమయాన్ని “వృధా” చేయకూడదని చెబుతూ, ఆ వీడియోలను పరిశీలించడానికి సీజేఐ కాంత్ మౌఖికంగా నిరాకరించారు.
ఆ వ్యాఖ్యలు వెలువడిన మరుసటి రోజు విద్యార్ధులు యూనివర్సిటీ వీసీ కి రాసిన తమ మొదటి లేఖలో ఇలా పేర్కొన్నారు: “నిరసనకారులపై పోలీసుల క్రూరమైన చర్యకు సంబంధించిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించడానికి గౌరవనీయ సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించడం మా ఆందోళనలకు కారణమైంది. స్నాతకోత్సవం అనేది, రాజ్యాంగ హక్కుల పట్ల నిబద్ధత, న్యాయం పొందే హక్కు, సమస్యల పట్ల హేతుబద్ధమైన స్పందనలతో పాటు విశ్వవిద్యాలయానికి ఉండే స్వత: విలువలు అది తీసుకునే నిర్ణయాలలో స్పష్టంగా ప్రతిబింబించే ఘట్టంగా స్నాతకోత్సవ సందర్భం ఉండాలి. నిరసన చేస్తున్న పౌరులపైన పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను కొట్టిపారేస్తున్నట్లుగా ఇటీవల బహిరంగంగా ప్రవర్తించిన ఒక ప్రముఖుడి చేతుల మీదుగా మా డిగ్రీలను అందుకోవడం, నల్సార్‌లో మేం నేర్చుకున్న విలువలకు విరుద్ధంగా ఉందని మేము భావిస్తున్నాము. కాబట్టి, ఈ కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా పిలిచేవారి విషయంలో పునరాలోచించాలని; ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఆహ్వానం పంపాలన్నా ముందుగా పట్టభద్రులవుతున్న బ్యాచ్‌ను సంప్రదించాలని మేము కోరుతున్నాము. విద్యార్థి ప్రతినిధులతో సమావేశం ద్వారా లేదా విశ్వవిద్యాలయం తగినదిగా భావించే ఏ ఇతర మార్గం ద్వారానైనా పరిపాలనా విభాగంతో ఈ విషయమై మరింత చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ”
జూలై 23న, 2026 బ్యాచ్ వారు, పై వ్యాఖ్యలను ఉటంకిస్తూ, స్నాతకోత్సవానికి సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించే విషయాన్ని పునఃపరిశీలించమని కోరుతూ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, పరిపాలనా యంత్రాంగ విభాగానికి లేఖ రాశారు.
ఈ కార్యక్రమాన్ని మొదట ఆగస్టులో నిర్వహించాలని సూచించినప్పటికీ, పట్టభద్రులయ్యే విద్యార్థులకు స్నాతకోత్సవ తేదీని తెలియజేయలేదు. వారిలో కొందరు ఇప్పటికే విదేశాలలో ఉద్యోగాలలో చేరారు. అంతేకాకుండా, కార్యక్రమ ప్రణాళిక లేదా దాని నిర్వహణలో సహాయపడటానికి జూనియర్ బ్యాచ్‌ల నుండి స్వచ్ఛంద సేవకులను సమీకరించడం వంటి కీలకమైన సన్నాహాలు కూడా ఇంకా ప్రారంభం కాలేదు.
తమ పేర్లు వెల్లడించవద్దనే షరతుపై మాట్లాడిన విశ్వవిద్యాలయ అధికారులు, తరువాతి వారాలు కొన్ని తరగతులకు మధ్యంతర సెమిస్టర్ పరీక్షలు ఉండడం వల్ల ఈ నెలలో స్నాతకోత్సవం నిర్వహించడం అసంభవం అని సూచించారు.
తాము విశ్వవిద్యాలయం నుండి సమాధానాలు కోరడం కొనసాగిస్తామని, తమ ఆందోళనలను పరిష్కరించకపోతే, యాజమాన్యానికి వారం రోజుల ముందుగా తెలియజేసి నిరసన చేపడతామని విద్యార్థులు తెలిపారు.
అధికారులకు మొదటి వినతి పత్రాన్ని జూలై 23న, తమ కోర్సు పూర్తి చేసిన 2025 – 2026 అకడమిక్ సంవత్సరం LLB బ్యాచ్‌కు చెందిన 70 మంది విద్యార్థులు పంపారు. జూలై 25 నాటికి 2027, 2028, 2029, 2030; 2031 బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు — మొత్తం సుమారు 380 మంది విద్యార్థులు — ఆ ప్రకటనకు సంఘీభావం తెలుపుతూ, విశ్వవిద్యాలయ పరిపాలనకు వేర్వేరు లేఖలను సమర్పించారు.
2025 – 2026 బ్యాచుకు చెందిన విద్యార్థులు మొదటి లేఖ తర్వాత మరొక లేఖను యూనివర్సిటీ అధికారులకు పంపారు. ఈ లేఖలో “న్యాయశాస్త్ర విద్యార్థులుగా, ఆరోగ్యకరమైన, సమర్థవంతంగా పనిచేసే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం; ప్రభుత్వం నుండి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరాన్ని మేము ఆచరణాత్మకంగా నేర్చుకున్నాము. ప్రస్తుత ప్రభుత్వం వల్ల జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, జవాబుదారీతనం కోసం దేశవ్యాప్తంగానూ, ఇతర దేశాలలో కూడా విద్యార్థులు పోరాటం కొనసాగిస్తున్న వేళ, భారతదేశ అత్యున్నత న్యాయ పీఠం నుండి వచ్చిన ఇలాంటి ప్రవర్తన మన రాజ్యాంగ ఆశయాలకు ప్రతిరూపం కాదని, అలాగే నల్సార్ చరిత్ర పొడవునా పాటిస్తూ వచ్చిన విలువలకూ సరిపోలదని మేము నమ్ముతున్నాము.
అంతేకాకుండా, విద్యార్థి సమూహంలోని చాలామంది విద్యార్థులు ఈ విద్యార్థి నిరసనలకు సంఘీభావం తెలుపుతున్నారు, చాలామంది ప్రత్యక్షంగా శ్రమిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు. మన దేశపు ప్రాథమిక హక్కులను, విలువలను; యువత గౌరవాన్ని కాపాడటానికి ఈ విశ్వవిద్యాలయమూ, ఇక్కడి విద్యార్థులూ — కేవలం ఇప్పుడే కాక నల్సార్ చరిత్ర పొడవునా — చేసిన, చేస్తున్న కృషిని, ఈ విశ్వవిద్యాలయ అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొనడం దెబ్బతీస్తుందని మేము బలంగా నమ్ముతున్నాము.” అని రాశారు.
వీరికి మద్దతుగా ఆ తరువాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేయబోతున్న విద్యార్ధులు సంఘీభావాన్ని మద్ధతును తెలియచేశారు. “డిగ్రీలను ప్రదానం చేయడానికి ఆహ్వానించబడే వ్యక్తి కేవలం ఒక విశిష్ట అతిథి మాత్రమే కాదు. కాన్వొకేషన్‌లో ముఖ్య అతిథి అనే వ్యక్తి, విశ్వవిద్యాలయం వేడుకగా జరుపుకోవడానికి ఎంచుకునే ఆదర్శాలకు, తన విద్యార్థులు అలాగే విశాల న్యాయ రంగానికి ముందు ఉంచాలనుకునే నిబద్ధతకు కొంత మేరకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ దృక్పథం నుండే, పట్టభద్రులవుతున్న బ్యాచ్ లేవనెత్తిన ఆందోళనలతో ఏకీభవిస్తున్నాము. ఈ వినతిపత్రం కేవలం ఒక బ్యాచ్ తక్షణ ప్రయోజనాలకు అతీతంగా, నాల్సార్ (NALSAR) ప్రతిబింబించడానికి ప్రయత్నించే రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించిన అంశాలను లేవనెత్తుతుందని మేము నమ్ముతున్నాము. ప్రస్తుత రాజకీయ పరిస్థితి; విద్యార్థులపైన ప్రభుత్వం సాగించిన క్రూరత్వం పట్ల న్యాయమూర్తి చూపించిన నిమ్మకు నీరెత్తిన వైఖరిని దృష్టిలో ఉంచుకుని, మేము మా తోటి విద్యార్థులకు మద్దతుగానూ, సంఘీభావంగానూ నిలుస్తున్నాము.” అని వారు పేర్కొన్నారు.
ఈ క్రమంలో తాము విశ్వవిద్యాలయం నుండి సమాధానాలు కోరడం కొనసాగిస్తామని, తమ నిర్ణయానికి భిన్నంగా యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తే యాజమాన్యానికి వారం రోజుల ముందుగా తెలియజేసి నిరసన చేపడతామని విద్యార్థులు తెలిపారు.
ఒకవైపు విద్యార్ధుల ఆందోళనలు సాగుతున్న సమయంలోనే బి.సి.ఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఈ వ్యవహారంలోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో (డిగ్రీలు ఇవ్వడం) భారత ప్రధాన న్యాయమూర్తి (సి జె ఐ) జస్టిస్ సూర్య కాంత్ పాల్గొనడాన్ని నిరసిస్తూ చేపట్టిన ప్రచారానికి బాధ్యులైన 2026 బ్యాచ్ విద్యార్థులను రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో అడ్వకేట్లుగా నమోదు (ఎన్రోల్మెంట్) చేయకుండా నిరోధిస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) హెచ్చరించింది.
బిసిఐ అధ్యక్షుడు మన్నన్ కుమార్ మిశ్రా సంతకం చేసిన ఈ ఆదేశాలను నల్సార్ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవ రావుతో పాటు అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు పంపించారు. ఈ ప్రచారాన్ని ప్రారంభించడంలో, నిర్వహించడంలో లేదా సమీకరించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులపై నివేదిక సమర్పించాలని విశ్వవిద్యాలయాన్ని కోరారు.
“తర్వాతి ఉత్తర్వులు వచ్చే వరకు, 2026 సంవత్సరంలో నల్సార్ లా విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీ పొందిన ఏ విద్యార్థినీ ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా అడ్వకేట్‌గా నమోదు చేయకూడదు,” అని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
ఈ సర్క్యులర్ బయటకు వచ్చాక పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ప్రస్తుత న్యాయ నిపుణులతో సహా చాలా మంది ఈ చర్యను విమర్శించిన తర్వాత ఈ ఆకస్మిక యూ-టర్న్ చోటుచేసుకుంది.
వీరితో పాటు సీనియర్ న్యాయవాది; సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడైన వికాస్ సింగ్, గతంలో జారీ చేసిన ఉత్తర్వును తీవ్రంగా ఖండిస్తూ, దానిని ఉపసంహరించుకోవాలని కోరుతూ బిసిఐ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఆ ఉత్తర్వును ‘ఏకపక్షమైనది, చట్టవిరుద్ధమైనది, అసమానమైనది, ప్రాథమికంగా నిలవలేనిది’ అని పేర్కొంటూ, “వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే తమ ప్రాథమిక హక్కును వినియోగించుకుంటున్న న్యాయ విద్యార్థులను భయపెట్టే ప్రయత్నమే ఈ ఉత్తర్వు” అని “విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛా ఆలోచనలకు, నిర్భయ చర్చలకు వేదికలుగా ఉండాలి. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ అధికారం పట్ల అగౌరవపరిచే ఏ చర్యను నేను సమర్థించనని స్పష్టం చేస్తున్నాను… ఈ ఆదేశం, ఆర్టికల్ 19(1)(g) ప్రకారం పట్టభద్రులు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకునే ప్రాథమిక హక్కును కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది,” ” అని ఆయన అన్నారు.
“ఒక ప్రజాస్వామ్య దేశంలో, ప్రతి పౌరుడిలాగే విద్యార్థులకు కూడా తమ అభిప్రాయాలను, విభేదాలను వ్యక్తం చేసే హక్కు ఉంది” అని “కేవలం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు విద్యార్థులను ప్రవేశాన్ని నిరాకరిస్తామని లేదా నిరవధికంగా వాయిదా వేస్తామని బెదిరించడం “పూర్తిగా అనవసరం” అని, ఇది “సాటిలేని నిరంకుశత్వం” అని” బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా; బార్ కౌన్సిల్ ఆఫ్ కేరళ రెండింటిలోనూ సభ్యుడైన న్యాయవాది ఎన్. మనోజ్ కుమార్ ఈ చర్యపైన తన ఆవేదనను వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
వీరితో పాటు సిజెపి పార్టీ కూడా ఈ విషయంలో స్పందించింది. ఈ ఆదేశాన్ని వెనక్కి తీసుకోకపోతే రెండో విడత నిరసనలు చేపడతామని బొద్దింకల జనతా పార్టీ (సిజెపి) కూడా హెచ్చరించింది. “ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఈ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోకపోతే, న్యాయ విద్యార్థులు, న్యాయవాదులు, సీనియర్ లాయర్లు, మంచి మనసున్న యువ బొద్దింకలు అందరూ బార్ కౌన్సిల్ కార్యాలయం, మిశ్రా అధికారిక నివాసం బయట, వారి వారి రాష్ట్రాల్లో నిరసనలు చేస్తారు” అని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, “న్యాయ రంగంలోని బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది?” అని కూడా ప్రశ్నించారు.
ఈ నిరసనల నేపథ్యంలో, బీసీఐకి చెందిన మిశ్రా రెండవ ప్రకటనను జారీ చేశారు. అందులో, ఈ విషయంపై కౌన్సిల్ “సమగ్రంగా” చర్చించిందని, నల్సార్ 2026 ఉత్తీర్ణులలో “అత్యధిక శాతం” మంది “నిర్దోషులు” అని, సీజేఐ కాంత్ పట్ల ఎలాంటి “అగౌరవ చర్యలో” పాల్గొనాలని వారు ఉద్దేశించలేదని ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
మొదటి ఉత్తర్వును సవరిస్తూ, “విద్యార్థులందరూ తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్‌లలో నమోదు చేసుకోవడానికి అర్హులు,” అని ఆయన రాశారు. “ఏ విద్యార్థి కూడా తన తప్పు లేకుండా బాధపడకూడదు.”
అయితే, సీజేఐ కాంత్‌కు పంపిన ఆహ్వానం గురించి విద్యార్థులు జరిపినట్లు ఆరోపించబడిన “ప్రచారం”పై “మూడు రోజుల్లోగా” నివేదిక ఇవ్వాలని ఆయన నల్సార్ వైస్-ఛాన్సలర్‌ను ఆదేశించారు. విద్యార్థులను “తప్పుదోవ పట్టించడంలో, రెచ్చగొట్టడంలో, తప్పుదారి పట్టించడంలో” కొంతమంది ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించారని కూడా మిశ్రా తన ఉత్తర్వులో పేర్కొన్నారు.
రెండవ ఉత్తర్వు వెలువడిన కొన్ని గంటల తర్వాత, బీసీఐ ఛైర్మన్ మూడవ ప్రకటనను జారీ చేస్తూ, “సీనియర్ న్యాయవాదులు, బార్‌లోని విద్వాంసులు, న్యాయ విద్యార్థులు; ప్రజాహిత పౌరుల విజ్ఞప్తులు, ప్రతిస్పందనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, హైదరాబాద్‌లోని నల్సార్ 2026 బ్యాచ్‌కు ఎలాంటి ఆందోళన లేదా ఉద్యమంలో పాత్ర లేదని సంతృప్తి చెందింది కాబట్టి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విచారణను పూర్తిగా ముగించాలని నిర్ణయించింది. నల్సర్ అధికార యంత్రాంగంపైన తదుపరి చర్యలు అవసరం లేదు” అని పేర్కొన్నారు.
అయితే, “మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచండి, కానీ అవి గౌరవంతోనూ, సంస్థాగత మర్యాదతోనూ కూడి ఉండాలి. అత్యున్నత న్యాయ పదవి మనందరి సమిష్టి గర్వకారణం. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్వాగతం; రాజ్యాంగ సంస్థలను బహిరంగంగా ఎగతాళి చేయడం తరచుగా ప్రతికూల ఫలితాలనిస్తుంది” అని కూడా హెచ్చరించారు.
ఒక వైపు నిషేధాన్ని వెనక్కు తీసుకుంటూనే మరో వైపు బి సి ఐ ఛైర్మన్ “అమాయక విద్యార్థులను రెచ్చగొట్టడంలో కొద్దిమంది ఉపాధ్యాయులు, బయటి వ్యక్తులు కీలక పాత్ర పోషించారని కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది కాబట్టి. నల్సార్ వైస్-ఛాన్సలర్ గారు విచారణ జరిపి బార్ కౌన్సిల్ కు రిపోర్టు పంపించాలని, ఆ తర్వాత కారకులపై తగిన చర్యలు చేపడతామని కూడా అన్నది.
అందుకు సమాధానంగా నల్సార్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీ కృష్ణదేవరావు అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో “అభ్యర్థనకున్న స్వభావం దృష్ట్యా, అటువంటి విచారణను నిర్వహించడం అనేది విశ్వవిద్యాలయాలకు ఉన్న అధికారాల రాజ్యాంగబద్ధమైన వినియోగమా కాదా అని విశ్వవిద్యాలయం పరిగణించవలసి ఉంటుంది. విశ్వవిద్యాలయానికి సహాయపడటానికి, అటువంటి విచారణను నిర్వహించడం రాజ్యాంగబద్ధమైనదా? విశ్వవిద్యాలయ పాలనా నిబంధనల ప్రకారం అనుమతించదగినదా కాదా అని అంచనా వేయడానికి, ఈ విషయాన్ని విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన శాసనం ప్రకారం విశ్వవిద్యాలయ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి ముందు ఉంచి, కార్యనిర్వాహక మండలితో సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అదే విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలియజేస్తాం” అని రాసారు.
ఇంతకీ బి సి ఐ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న మన్నన్ కుమార్ మిశ్రా భారతీయ జనతా పార్టీ (బిజెపి) చెందిన అతను. మన్నన్ కుమార్ మిశ్రా బీహార్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నవాడు. ఆయన 2012 నుండి ఈ పదవిలో ఉన్నారు.
దీని మీద సీజేఐ కూడా స్పందించారు. విద్యార్ధులకు, తనకు మధ్య మీరేందుకు వస్తున్నారని బి సి ఐ ఛైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా ను ప్రశ్నించారు. కాని మళ్ళీ తన వాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు అని సీజేఐ మాట్లాడారు.
కాని ఈ మొత్తం సంఘటనలను ఎలా చూడాలి అన్నది మన ముందు ఉన్న ప్రశ్న. సిజెపి పార్టీ ఆవిర్భావం, ఆ తరువాత వెల్లువెత్తిన నిరసనలు, జంతర్ మంతర్, నల్సార్ సంఘటనలు ఏవి కూడా విడిగా చూసేవి కావు. అలా చూస్తే చెదురుమదురు ఘటనలుగా మిగిలిపోతాయి. వీటన్నిటినీ కలిపి చూసినప్పుడు దేశంలో నెలకొని ఉన్న వివిధ వర్గాల ప్రజల మధ్య నెలకున్న ఆందోళన, భవిష్యత్తు మీద ఉన్న అనిశ్చితికి ప్రతిస్పందనలు ఒక్కోరకంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ దేశపు పౌరసత్వాన్ని వదులకుని పరాయి దేశాలకు తరలిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. ప్రజాస్వామ్య విలువలు క్షీణత సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. రాజకీయ, ఆర్ధిక రంగాలలో చోటుచేసుకుంటున్న మోనోపోలి పట్ల అసంతృప్తి పెరుగుతోంది. ఇవి బయట పడటానికి సరైన వేదిక దొరకని సమయంలో సీజేఐ ‘బొద్దింకల’ వ్యాఖ్యలు ఒక క్రమంలో ఈ రూపంలో వ్యక్తం అయ్యాయి. ‘అకౌంటబిలిటీ’ దగ్గర మొదలైన నిరసన ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాల దగ్గరకు చేరాయి. ప్రశ్న, నిరసన అనేవి ప్రజాస్వామిక సమాజపు లక్షణాలు. ఇవి గత దశాబ్ద కాలంగా ‘ద్రోహంగా’ చూపుతున్న కాలంలో ఈ నిరసనలు బయలుదేరాయి. ఏ విలువలు అయితే ఈ దేశ ప్రజానీకం ప్రోధి చేసుకుంటూ వచ్చిందో వాటిని పూర్తి స్థాయిలో కోల్పోయే దశకు వచ్చిందో అక్కడ తిరగి విద్యార్ధులు వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఆ విలువలను కాపాడుకునే క్రమం మాత్రమే కాదు ఇప్పటివరకు ఏ వ్యక్తిత్వ ఆరాధన మీద ఆధారపడి బిజెపి అధికారంలోకి వచ్చిందో దానిని యువత బద్దలు కొడుతున్నారు. ఆ వ్యక్తిత్వపు ఇమేజ్ ను కాపాడుకోవడం కోసం ప్రధాని మొదలు సీజేఐ దాకా యాతన పడుతున్నారు. ఆ ట్రాప్ లో మిగతా పడకుండా చూడల్సిన అవసరం ఉంది. దీనిని మనం అందరం స్వాగతించి, అందులో మన వంతుగా పాల్గొనాల్సిన అవసరం ఉంది.




