గోండీ-కోయ, గోండ్-కోయ ఆదివాసీ ప్రజలు మాట్లాడే భాష. తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్, అసిఫాభాద్ జిల్లాలలో, ఛత్తీస్ గఢ్ రాష్ట్రం అవిభాజిత బస్తర్ జిల్లాలలో, మహారాష్ట్ర గఢ్ చిరోలి జిల్లాలో ప్రధానంగా మాట్లాడే ఈ భాష భారతదేశంలో ఉన్న వందల ఆదివాసీ భాషలలో ఒకటి. ఏ భాషకు అయినా ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్యకర్తగా ఒక ఆదివాసీ భాషతో ఏర్పడిన పరిచయంతో దాని గురించి రాయాలని అనిపించింది. గోండీ భాషను కోయ భాష అని కూడా అంటారు. గోండ్ జాతి, కోయ జాతి అనేవి ఒకే జాతికి వివిధ ప్రాంతాలలో ఉన్న పేర్లు. నా మాతృభాష తెలుగు. కాబట్టి తెలుగుతో పోల్చుకుంటూ గోండీ నేర్చుకున్న క్రమంలో నాకు అర్థమయిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను.

గోండీ తెలుగుకు దగ్గరగా ఉంటుంది. గోండీ ద్రావిడ భాష అని, ఇది, తెలుగు ఒకే మూలాలు కలిగి ఉన్నాయని కొందరుభాషా శాస్త్రవేత్తలు రాసారు. అలాగే ఇది తమిళ, కన్నడ భాషలకు దగ్గరగా ఉంటుందని మరి కొందరు రాసారు. ఇరవై ఆరు ద్రావిడ భాషలలో తెలుగు, గోండీ (వివిధ మాండలికాలు కలిపి), కొండ, కుయి, కువ్వి, పెంగో, మాండా దక్షిణ-మధ్య ద్రావిడ భాషలు అని బద్రిరాజు కృష్ణమూర్తి గారు ‘ది ద్రవిడియన్ లాంగ్వేజెస్’ పుస్తకంలో పేర్కొన్నారు.

ఇతర ఆదివాసీ భాషల మాదిరిగానే గోండీ భాషకు అధికారికంగా లిపి లేదు. కొందరు గోండ్ ఆదివాసీ విద్యావేత్తలు, అలాగే కొందరు కార్యకర్తలు లిపి తయారు చేసినప్పటికీ అది ఎక్కువగా ప్రచారం పొందలేదు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రలలో దేవనాగరి లిపిలో, తెలంగాణాలో తెలుగు భాషలో గోండీ భాషను రాస్తున్నారు. ఏ భాషకయినా లిపి ఉండాలన్న భావంలో తప్పు లేదు కానీ, భాష ప్రచారానికి లిపి కొత్తగా రూపొందించనవసరం లేదు. లిపి తెలిస్తేనే భాష చదవగలిగే పరిస్థితి ఉంటే భాష ప్రజలలోకి వెళ్లే అవకాశాలు తక్కువయిపోతాయి. లిపి ఉన్న భాషలకు వ్యాకరణం రాసి ఉంటుంది. లిపి లేకపోయినా ఏ భాషకైనా ప్రధానంగా భూత, భవిష్యత్తు, వర్తమానాలు, ఏక, బహు వచనాలు, లింగం ఉంటాయి.

గోండీ భాషలో వ్యక్తి సంబోధనలో బహువచనం ఉండదు. ఎవరినైనా‘నిమ్మ’, అంటే ‘నువ్వు’అనే సంబోధిస్తుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు వారి గురించి చెప్పడానికి బహువచనం ఉంటుంది.‘మీటు’ అంటే ‘మీరు’. ‘ఓరు’ అంటే ‘వాళ్లు’.

గోండీ భాషలో లింగం విషయానికి వస్తే, తెలుగులో మాదిరిగానే పురుషులకు తప్ప మరి దేనికీ పుర్లింగం ఉండదు. అయితే ఇది బహువచనంగా ఉంటుంది తప్ప తెలుగులో మాదిరిగా ‘వచ్చాడు’, ‘వెళ్లాడు’ లాంటి పదం గానీ, అక్షరం గానీ ఉండదు. మహిళలకు, జంతువులు, పిట్టలు మరే ఇతర వస్తువులకు గానీ ఎక్కువ మంది, లేదా ఎక్కువ ఉంటే, బహువచనం వేరే పదాలతో ఉంటుంది. ఉదాహరణకు పురుషులు ఒక్కరు ఉన్నా గానీ, ‘మంతోర్’, అంటే ‘ఉన్నారు’ అని అంటారు. ఎక్కువ మంది ఉన్నా కూడా ఇదే పదం వాడాలి. అదే మహిళ ‘ఉంది’ అనాలంటే, ‘మంత’ అనాలి. అదే ఎక్కువ మంది మహిళలు ఉంటే ‘మంతాంగ్’ అనాలి. జంతువులు, పిట్టలకు కూడా మహిళల గురించి ఉన్న పద్ధతిలో ఏకవచనం, బహువచనం ఉంటాయి. అంటే పంది ‘ఉంది’ అనాలంటే, ‘మంత’, ఎక్కువ పందులు ఉంటే, ‘మంతాంగ్’ అనాలి. అయితే ఇందులో చివర ఉన్న ‘ఆంగ్’ అనేది గఢ్ చిరోలి ప్రాంతంలో స్పష్టంగా ఉచ్ఛరిస్తారు. ఇతర ప్రాంతాలలో స్పష్టంగా వినిపించదు. వస్తువులకు ఏకవచనం ‘మంత’నే కానీ బహువచనం మాత్రం ఇలా కాకుండా, ‘వెల్లయ్ మంత’ అంటే ‘చాలా ఉన్నాయి’ అని అంటారు.

గోండీ భాషకు భూత, భవిష్యత్తు, వర్తమానాలు ఉంటాయి. ఉదాహరణకు, ‘చేశాను’, ‘చేస్తున్నాను’, చేస్తాను’ అన్న పదాలకు ‘కీత్తన్’, ‘కీయమంతన్’, ‘కీయకన్’ అని అంటారు. ‘వచ్చాను’, ‘వస్తున్నాను’, ‘వస్తాను’అంటే, ‘వత్తన్’, ‘వాయమంతన్’, ‘వాయకన్’ అంటారు. అలాగే మరే క్రియా పదానికైనా ఇదే వర్తిస్తుంది.

గోండీ బాషలో పాసివ్ వాయిస్ లేదు. ‘ఆదివాసులు విస్థాపితం చేయబడ్డారు’ అనాలంటే, ‘ఆదివాసీర్ కిన్ విస్థాపిత్ కీత్తోర్’ అనాలి. అంటే, ‘ఆదివాసులను విస్థాపితం చేశారు’. అలాగే పాసివ్ వాయిస్ కాకపోయినా, ‘ఆమె చేత చేయించాను’ లాంటి వాక్యం ఉంటే, దీనిని గోండీలో ‘దాన్ కిన్ కీయ వేహత్తన్’ అంటారు. అంటే, ‘ఆమెని చేయమని చెప్పాను’ అని అర్ధం. ‘చేయించాను’ అనే పదానికి సమాన పదం గోండీలో లేదు. గోండీలో వాక్య నిర్మాణంలో సంక్లిష్టత ఉండదు. సూటిగా, సరళంగా ఉంటుంది.

‘ఆమె’, ‘అది’ రెండు పదాలు లేవు గోండీలో. ఉన్నదల్లా ‘అద్’ ఒక్కటే. అది మహిళల గురించి చెప్పాలన్నా, జంతువుల గురించి చెప్పాలన్నా, వస్తువుల గురించి చెప్పాలన్నా ఇదే వాడతారు.

తెలుగుతో పోలిక అర్ధం చేసుకోవడానికి కొన్ని వాక్యాలు – ‘కలప’ అంటే, ‘కలుపు’ అని అర్ధం. ‘అద్ నీకిన్ గావాలా?’, అంటే, ‘అది నీకు కావాలా?’ అని అర్ధం.

ఏ భాషలోనైనా ప్రాంతాన్ని బట్టి మాండలికం మారినట్టే గోండీ భాషకు కూడా మాండలికం ఉన్నది. బస్తర్ లో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు, తెలంగాణాను ఆనుకుని ఉన్న ప్రాంతంలో దీనిని కోయ భాష అంటారు. తెలంగాణాను ఆనుకుని ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం వారిని గుత్తి కోయలు అని కూడా వ్యవహరిస్తుంది. ప్రజలు కూడా తమ్ము తాము కోయతూరం, అంటే కోయవాళ్లం అని చెప్పుకుంటారు. ‘కోయతోర్’ అంటే మగవాళ్లు. ‘ఆస్కు’ అంటే ఆడవాళ్లు. మాడ్, అంటే నారాయణపూర్ జిల్లా, ఉత్తర బస్తర్, అంటే కాంకేర్ జిల్లా, అలాగే దీనిని ఆనుకుని ఉన్న మహారాష్ట్ర గఢ్ చిరోలి జిల్లాలలో గోండీ భాష అంటారు. ప్రజలు తమ్ము తాము గోండ్ జాతి వారుగా చెప్పుకుంటారు. ప్రభుత్వ దస్తావేజులలో కూడా గోండ్ అనే రాస్తారు. తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్ ప్రాంతంలో గోండీకి, బస్తర్ ప్రాంత గోండీకీ చాలా తేడా ఉంటుంది. బస్తర్ లో ప్రధానంగా మురియా, మాడియా గోండ్ జాతి ప్రజలు ఉన్నారు. మురియా మాండలికంలో ‘ఎలా’ అనడానికి ‘బేలె’ అంటే, మాడియా మాండలికంలో ‘బద్రం’ అంటారు. అలాగే,‘కూడా’ అనే పదానికి మాడియా మాండలికంలో ‘బరా’ అంటే, మురియా మాండలికంలో ‘వెండె’ అంటారు. అలాగే దక్షిణ బస్తర్ లో కుంట మొదలయిన ప్రాంతాలలో ‘మెండె’ అని అంటే, గఢ్ చిరోలిలో ‘వన్నె’, ‘వెన్నె’ అంటారు. ఉత్తర బస్తర్ లో ఇదే అర్ధంలో ‘గల’ అని అంటారు.

మాడ్ ప్రాంతంలో గోండీ భాష ఉచ్ఛారణలో తేడా ఉంటుంది. ఇక్కడి ప్రజలు తీసుకునే ఆహారం, వారి శరీర ఆరోగ్యం కారణాల వల్ల కావచ్చు, స్వర పేటిక సమగ్రంగా అభివృద్ధి కాకపోవడం వల్ల కావచ్చు, కొన్ని అక్షరాలు మడత పడినట్టుగా ఉచ్ఛారణ ఉంటుంది. ఉదాహరణకు గోండీలో నీళ్లను ‘ఏర్’ అంటారు. మాడియా మాండలికంలో ఉచ్ఛారణలో రెండో అక్షరమయిన ‘ర్’ నాలుక మీద నుంచి కాకుండా గొంతు లోపలి నుంచి మెలి దిరిగినట్టుగా పలుకుతారు.

గోండీ భాష నిలిచి ఉండాలి

గోండీ మాట్లాడే ప్రజలు దాదాపు 30 లక్షల మంది ఉంటారని పరిశోధకులు అంటారు. హిందీ, మరాఠీ, ఒడియా, ఛత్తీస్ గఢీ వంటి ఆదివాసీయేతర భాషల ప్రభావంలో గోండీ కనుమరుగు అయిపోతున్నదని పరిశోధకులు ఆత్రుత వ్యక్తం చేస్తున్నారు. గోండ్ ప్రజలలో 20 శాతం మాత్రమే తమ మాతృభాష మాట్లాడుతున్నారని అంటున్నారు. దీనికి కారణం స్పష్టమే. గోండీ భాషలో విద్యా బోధన లేదు. గోండీ భాషను గానీ, గోండ్ ప్రజల సంస్కృతిని గానీ పరిరక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. ఐక్య రాజ్య సమితి గోండీని విలుప్తమవుతున్న భాషగా గుర్తించిందని పరిశోధకుల పత్రాలు తెలియజేస్తున్నాయి. గోండీ మాత్రమే కాకుండా, ఇతర ఆదివాసీ భాషలు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయని చెప్పవచ్చు.

1940లో మునుపటి బిహార్ నుంచి ఆదివాసీ ప్రజల ప్రతినిధిగా ఉన్న జైపాల్ ముండా ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఆదివాసీ మహాసభ ప్రథమ కాంగ్రెస్ నిర్వహించారు. ఇది ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పని చేసే సంస్థ. భారత రాజ్యం ఆదివాసీ భాషలను, సంస్కృతిని గుర్తించాలని ఈ మహాసభ తీర్మానం చేసింది. 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యాంగ సభ నడుస్తుండగా, జైపాల్ ముండా ముండారీ, గోండీ, ఉరావ్ భాషలను రాజ్యాంగంలో 8వ షెడ్యూలులో చేర్చాలని, అధికారిక గుర్తింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. ముండారీ భాష 42 లక్షల మంది మాట్లాడుతున్నారని, 11 లక్షల మంది ఉరావ్ భాషను, 32 లక్షల మంది గోండీ భాషను మాట్లాడుతున్నారని, వారి భాషను గుర్తించడం ద్వారా ఆ ఆదివాసీ ప్రజల ప్రాచీన చరిత్రను వెలికి తీయవచ్చునని ఆయన చర్చించారు. ఆదివాసేతర భాషలను వారిపై రుద్దుతున్నారని కూడా మాట్లాడారు. ఈ చర్చ తరువాత కాలంలో ఏమైందో చూస్తూనే ఉన్నాం.

ఆదివాసీ భాషల గురించి, వారి సంస్కృతి గురించి తెలుగు రాష్ట్రాలలోను, ఇతర రాష్ట్రాలలోను పరిశోధనలు జరిగాయి. విద్యావేత్తలు పుస్తకాలు రచించారు. కానీ ఇప్పటికీ భారతదేశంలో ఆదివాసులు రెండో తరగతి పౌరులుగానే ఉన్నారు. అంతే కాదు. చాలా ప్రమాదకరంగా, వారి భాష, సంస్కృతి, మతాలను పరాయి భాషలు, సంస్కృతులు, మతాలూ మింగేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆదివాసులను హిందువులుగా చూపే ప్రయత్నం జరుగుతున్నది.

బస్తర్ గోండ్ ప్రజలలో పని చేస్తూ ఉన్న మావోయిస్టు పార్టీ గోండీ భాషలో స్కూళ్లు నడిపింది. అక్షరమాల, భాష, గణితం, సామాజిక, జీవ శాస్త్రాలు మొదలయిన అంశాలు, పార్టీ సైద్ధాంతిక, రాజకీయ, సైనిక సాహిత్యం గోండీ భాషలో ప్రచురించింది. భాషతో పాటుగా ప్రజల సంస్కృతిని పరాయి సంస్కృతులు మింగివేయకుండా విశేష చర్యలు చేపట్టింది. కళా ఖర్సడ్, అంటే కళల పండుగలు నిర్వహించింది. ప్రజలలో ఉన్న సామెతలు, పాటలు సేకరించింది. ‘ఝంకార్’ పేరిట నడిచే చేతనా నాట్య మంచ్ పత్రిక ద్వారా వీటిని నిక్షిప్తం చేసింది. యావత్తు కార్యక్రమాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు గోండీ భాషలోనే నడిచేవి. ప్రజా జీవనంలో భాగమయిపోయిన రాజకీయాలకు సంబంధించిన అంశాలనన్నింటినీ చేర్చుకుంటూ గోండీ భాష మరింత సమృద్ధం అయింది. రాజకీయాలు, నూతన సంస్కృతి, పద్ధతులు వారి జీవనాన్ని, సంస్కృతిని విప్లవీకరించాయి. భాషను కాపాడాయి.

బస్తర్, ఆదిలాబాద్ ప్రాంతాలలో ప్రజలు గోండీలోనే మాట్లాడుకుంటారు. తమ సంస్కృతి, ఆచారాల ప్రకారం పండుగలు జరుపుకుంటారు. అయితే ఇంత కాలం వీరి రాజకీయ హక్కులతో పాటుగా వీటిని పరిరక్షించేందుకు సాగిన ఉద్యమ నిర్మాణం, రాజకీయ, సాంస్కృతిక ప్రభావం సన్నగిల్లినప్పుడు, ఇతర ప్రభావాలు చొరబడే ప్రమాదం పెరుగుతుంది. ఇలా కాకుండా గోండీ భాషను, మరే ఇతర ఆదివాసీ భాషనైనా పరిరక్షించుకోవడం అవసరం. ఆదివాసీ ప్రజల చైతన్యం మీద, వారికి అందే మద్దతు మీదా ఇది ఆధారపడి ఉన్నది.

One thought on “గోండీ భాషను నిలుపుకుందాం

  1. గోండి భాషను గురించి దానిని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను వివరంగా తెలియచేసినందుకు అభినందనలు. అలాగే ఒడిస్సా ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని జాతాపు తెగ మాటాదే భాష కువ్వి, సవర తెగ భాష సవర కూడా అంతరించి పోతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఆ ప్రజలను అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు పేరుతో తెలుగు ఒరియా భాషలలో విద్యాభ్యాసం కల్పించడం ముఖ్యంగా వాళ్ళని వారి నివాస ప్రాంతాల నుండి జీవనోపాధి పేరుతో పల్లపు ప్రాంతాలకు వలస పోవడం వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ళు పట్టణాలలో స్థిరపడి వాళ్ళ పిల్లలు ఇక్కడి బడులలో చదువుకోవడం మొత్తం మీద ఏదో ఒక రకమైన విస్తపన వలన వారి భాషా సంస్కృతి అంతరించి పోతున్నాయి. మ్యూజియంలకు వారి బొమ్మలు అర్ధ నగ్నంగా సంస్కృతి పేరుతో నాగరిక సమూహాలు ఫోటోలకు పరిమితమై అంతరించి పోతున్నాయి. మరికొన్నాళ్లకు కార్పొరేట్ వికృత అభివృద్ధి నమూనాలో ఆదివాసీ ప్రాంతాలు సమూహాలు అంతరించి పోతాయి. పల్లపు మేధావులు అధికారులు వాళ్ళని అలా వదిలేసి ఉద్యమాలకు బలిస్తారా అని చెప్పే మాటలకు మౌనమే సమాధానముగా ఆ సమూహాలు అంతరించి పోతున్న పాలస్టీనా గాజా సిరియా లాంటి దేశాలు కార్పొరేట్ అమెరికను టూరిస్టు ప్రాంతాలుగా మనుషులు లేని పచ్చదనం హరించిన ఎడారులుగా మారుతాయి..దీనికి ఉద్యమానిది బాధ్యతే కదా. ఇప్పుడు శ్రద్ధాంజలి ఘటించడమే.

Leave a Reply