ప్రతి ఏడాది ఆగస్టు 9 నాడు ప్రపంచ ఆదివాసీ హక్కుల దినం జరుపుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు, హక్కులను కల్పిస్తూ వారి సంరక్షణ కోసమని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 49/214 అనే తీర్మానాన్ని 23 డిసెంబర్ 1994 న చేసి ప్రతి ఏటా ఆగస్టు 9 న ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది. ఈ తీర్మానానికి ఆహ్వానంలో పాల్గొన్న 143 దేశాలలో 125 దేశాలు ఆమోదించాయి. 14 మంది తటస్త వైఖరి తెలుపగా, నలుగురు వ్యతిరేకించారు. ఆనాటి నుండి ఆదివాసీల హక్కులు వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఏటేటా ప్రభుత్వాలు, కార్పోరేట్ శక్తులు ఆదివాసీలపై జరుపుతున్న వలసవాద దురాక్రమణ పూరిత దాడుల వల్ల వారి మనుగడే ప్రశ్నార్థకమౌతున్నది. విషాదమయమౌతున్న వారి జీవితాల్లో వెలుగులు నిండేదెప్పుడో అని ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడింది.
అంతర్జాతీయంగా వివిధ దేశాలలో 5000 తెగలుగా, 7000 భాషలు మాట్లాడే,476 మిలియన్ ల ఆదివాసీలు జీవిస్తుంటే, ఆఫ్రికా ఖండం తరువాత అత్యధికంగా మనదేశంలో 697 తెగలతో కూడిన 104 మిలియన్ల (8.6) ఆదివాసీ జనాభా తమ మనుగడ కోసం పాలకులతో యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. అడవి-ఆదివాసి విడదీయలేని పర్యాయ పదాలు. అడవితో పాటే పుట్టి, దాన్ని కాపాడుతూ, సహజీవనం చేస్తున్న శాంతి ప్రియులైన మూలవాసులు. ప్రత్యేక ఆర్థిక, రాజకీయ జీవన విధానం, సమిష్టి సంస్కృతి, ప్రజాస్వామిక విలువలు గలిగి స్వేచ్ఛ, సమానత్వం, స్వయం గౌరవం అనే భావాలు వారి విశిష్ట సంస్కృతిలో భాగంగా ఓ మేరకు ఇక్కడే బతికున్నాయి. స్వంత ఆస్తి భావనలు గల ఆధిపత్య నాగరికులు వీరిని అణగదొక్కడానికి జరుపుతున్న అనాగరిక దురాక్రమణ పూరిత, వలసవాద దాడులకు వ్యతిరేకంగా తరాలుగా వారి సామాజిక జీవితాలు సంఘర్షణామయంగా మారిపోయాయి. ఫలితంగా గత వేయి సంవత్సరాల కాలంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన రెండు వందల తిరుగుబాట్లను చేసారు. తమ స్వపరిపాలన, అడవి, ఖనిజ సంపద రక్షణ, స్వయం గౌరవం కోసం సాగిన, సాగుతున్న పోరాటాలన్నీ అత్యంత క్రూరమైన అణచివేతలను ఎదుర్కొంటున్నాయి.
ఇండియా భౌగోళిక ప్రాంతంలో నేటి అడవులు 25 శాతం. ఇందులో మూలవాసులు 10 కోట్లకు పైగానే ఉంటారు. బ్రిటిష్ – నిజాం ప్రభుత్వాలు పైసా పెట్టుబడి పెట్టకుండానే అపారమైన లాభాలు వచ్చే ప్రాంతంగా గుర్తించి 1868 లో “శాస్త్రీయ అటవీకరణ” పేరుతో అటవీశాఖను ఏర్పాటు చేసి అడవిని తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. ఇక్కడి నుండే అటవీ ప్రాంతాలు “భారతీయ అటవీ చట్టం “1865, 1927 ల ప్రకారం ప్రభుత్వ నియంత్రణలో ఉండే ” రక్షిత”, “సురక్షిత” అడవులుగా మారిపోయాయి. 1947 తరువాత ప్రభుత్వ అటవీ విధానంలో వలసవాద భావనలను కొనసాగించడానికి నిర్ణయించి 1952 లో ఆమోదించిన అటవీ విధానం తీర్మానంలో గత బ్రిటిష్ ప్రభుత్వం అవలంబించిన మౌలిక సూత్రాలు సరిగానే ఉన్నాయని, కాకపోతే కొత్త విధానం పేరుతో దీనికి కొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానంలో ప్రజల ఉపయోగార్థం అని ఉన్నచోట “జాతీయ ప్రయోజనం” కోసం అని మార్చాలని నిర్ణయించి అమలు జరిపారు. అప్పటి నుండి 1980 వరకు 43 లక్షల హెక్టార్ల అటవీ భూమిని అడవులకు ఏ మాత్రం సంబంధంలేని పనుల కోసం ధ్వంసం చేశారు.
బడా భూస్వాములు, బడా పెట్టుబడిదారులు లాభాలవేటలో గనులు తవ్వడం, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, పరిశ్రమల స్థాపన వంటి అవసరాల కోసం అడవిలోని ప్రతి భాగాన్ని ధ్వంసం చేసి అంతులేని సంపదను పోగేసుకున్నారు. మైదాన ప్రాంతాల నుండి వలసలను ప్రోత్సహించి మూలవాసుల భూములను దురాక్రమించి వారిని కూలీ జనంగా మార్చివేసారు. ఈ ప్రక్రియలో 670 లక్షల హెక్టార్ల అటవీ భూమి ప్రభుత్వం, భూస్వాములు, కార్పొరేట్ శక్తుల పరమైంది. అంటే అడవి ప్రాంతంలో ప్రభుత్వమే ఒక పెద్ద వలస భూస్వామిగా ఎదిగింది. ఆ మేరకు మూలవాసులు అడవుల నుండి తరుమబడి పరాయీకరించ బడ్డారు. ప్రపంచీకరణ పథకాలు మొదలైన తర్వాత ప్రభుత్వం కొత్త దళారీగా మారింది. అనేక బహుళజాతి, కార్పొరేట్ కంపెనీలకు అటవీ ఖనిజ సంపదను, భూమిని రహస్య, బహిరంగ ఒప్పందాల ద్వారా అప్పజెప్పింది. నేడు ఈ కంపెనీలు పెద్ద పెద్ద జమీందార్లుగా అభివృద్ధి చెందాయి. దళారీ ప్రభుత్వం ఆదివాసులకు నామమాత్రపు నష్టపరిహారాలు అంటగడుతూ బలవంతంగా భూసేకరణకు పాల్పడుతూ రియల్ ఎస్టేట్ పాత్రను కూడా నిర్వహిస్తుంది. అంగీకరించని ప్రజలను సామూహికంగా కాల్చి చంపుతున్నది. భూముల నుండి ప్రణాళికా సంఘం అంచనా ప్రకారం 1952-1990 ల మధ్య కాలంలో 2 కోట్ల 13 లక్షల మంది ప్రజలు అభివృద్ధి ప్రణాళికల మూలంగా నిర్వాసితులవ్వగా వీరిలో మూలవాసులే 85.4 లక్షల మంది అని ప్రకటించింది. వీరిలో కేవలం 21 లక్షల మంది మాత్రమే “ పునరావాసం” పొందారు. మిగతా వారు ఎక్కడ, ఏ స్థితిలో బతుకుతున్నారో తెలియదట.
బ్రిటిష్ వలస పాలన అనంతరం తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేసిన మూలవాసులు చివరకు తమ అటవీ ప్రాంతాలను రాజ్యాంగానికి లోబడి ప్రత్యేక ప్రతిపత్తితో స్వయం పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చనే బూటకపు హామీతో మోసగించబడ్డారు. రాజ్యాంగంలో పేర్కొనబడిన 5,6 షెడ్యూల్స్ ఈనాటికీ అమలుకాకపోవడమే గాక వారి వనరుల దోపిడీ, ఆధిపత్యం, అణచివేత మునుపెన్నటి కంటే కూడా తీవ్రమైంది. ఒక ఎత్తుగడగా నైనా ప్రత్యేక షెడ్యూల్స్ ద్వారా కల్పించబడ్డ పాలనాధికారం ఆదివాసీల స్వతంత్ర ఆర్ధిక, ప్రజాస్వామిక సంస్కృతి, సమిష్టి జీవన విధానం, పరిపాలనా, అడవి ప్రాంతాలపై వారి సాంప్రదాయిక హక్కును రుజువు చేస్తుంది. ఆదివాసుల పోరాట ఫలితంగా ఎన్నో చట్టాలు రూపొందినా ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. వారికున్న సాంప్రదాయిక హక్కులన్నీ ప్రమాదంలో పడిపోయాయి. ప్రశాంతతకు నెలవుగా ఉండే ఆదివాసీ అటవీ ప్రాంతాలన్నీ యుద్ధ రంగాలుగా మార్చివేయబడ్డాయి. ప్రతి రోజు వందలాదిగా అత్యంత క్రూరమైన పద్ధతులలో హత్య చేయబడుతున్నారు. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నేడు ఆదివాసులు ఎదుర్కొంటున్న దుస్థితి ఇది.
1990 ల నుండి భారత పాలకులు ప్రజా ప్రయోజనాలు – అభివృద్ధి” ముసుగులో సామ్రాజ్యవాదుల అభివృద్ధి మోడల్ ప్రపంచీకరణ పథకాలను అమలు జరుపుతున్నారు. గనులు, డ్యాములు, రహదార్లు, అభయారణ్యాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ప్లాంటేషన్ లు, తోటలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు మొదలగునవి చేపడుతున్నారు. ఈ పథకాల వల్ల మూలవాసుల జీవనం, అడవి, ప్రకృతి, పర్యావరణం కోలుకోలేనంతగా నిత్యం విధ్వంసానికి గురవుతుంది. ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా మూలవాసుల పోరాటం ఫలితంగా అనేక చట్టాలు, జిఓలు ఉనికిలోకొచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి భారత అటవీ చట్టం (1878), భూసేకరణ చట్టం (1894), అటవీ నిషేధ చట్టం (1917), భారత అటవీ చట్టం (1927) తో పాటు ట్రైబల్ ఏరియా రెగ్యులేషన్ చట్టం (1949), షెడ్యూల్డ్ ఏరియాల ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ (1959), భూ బదలాయింపు నిషేధం కోసం 1/70, నూతన అటవీ విధానం (1986), పెసా చట్టం(1996), అటవీ హక్కుల గుర్తింపు చట్టం (2006), నూతన భూసేకరణ చట్టం 2013), మొదలైనవన్నీ మూలవాసుల అడవిని, అడవితో వారికున్న మానసిక బంధాన్ని, చరిత్రను, జీవితాలను, సంస్కృతిని, హేళనకు ఎగతాళికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వాలు, పార్లమెంటరీ నాయకులు అభివృద్ధి ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారనే చైతన్యం మూలవాసులలో పెరిగింది. పాలకవర్గ నాయకులు మాట్లాడుతున్న భాష రాజ్యాంగానిదైతే దాన్ని అమలు జరిపే శక్తి రాజ్యాంగ యంత్రానిదని, ఇది అణచివేత సాధనమని ఈనాటికీ అనేక మంది మూలవాసులు గ్రహించక పోయినా, మూలవాసులలో చిన్న పాటి వర్గ విభజన ఉన్నా, కొందరికి చట్టాలపై భ్రమలు ఉన్నా, చట్టం పరిధిలో హక్కుల అమలు సాధ్యం కాదనే విషయం మూలవాసీలు గ్రహించగలిగారు. నక్సల్బరీ ప్రేరణతో కార్మికవర్గ దృక్పథాన్ని చేపట్టడంతో వారి పోరాటాలు సరికొత్తగా మిలిటెంట్ రూపాన్ని సంతరించుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
రాజ్యాంగంలోని 5 వ అధికరణం ఆర్టికల్స్ 244,244 ఏ మూలవాసీ సమూహాలు భూమి, అడవి మొదలగు వనరులపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకొనే హక్కుతో పాటు వాటిపై అధికారం, నియంత్రణా స్వేచ్ఛను కలిగి ఉంటాయి. ఆర్టికల్ 371 కింద ఆరవ షెడ్యూల్లో పేర్కొన్న ఇతర నిబంధనలు ఈశాన్య రాష్ట్రాలలోని మూలవాసీ ప్రాంతాలకు వర్తిస్తాయి. కానీ దేశ పాలకులు ఆదివాసీలకు అడవిపై హక్కే లేదంటున్నారు.” ఇటీవల ఆదివాసీల ఊచకోతతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా మొదలగు రాష్ట్రాలలో అభివృద్ధి పేరుతో అదానీ, అంబానీ, వేదాంత, లాయిడ్ వంటి ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ఖనిజ సంపదను తవ్వుకు పోవడానికి విచ్చలవిడిగా అనుమతులిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై బలప్రయోగం చేస్తూ విస్తాపనకు బలిచేస్తున్నది. అసలు మీరు ఈ దేశ ప్రజలు అవునో కాదో ఆధార్ కార్డు చూపమంటున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో వనరులకు కొరత లేదు. కానీ వాటిని వినియోగించుకునే అధికారం వారి చేతిలో లేకపోవడం వల్ల, భారత రాజ్యపు దురాక్రమణ పూరిత విధానాల వల్ల ఆదివాసీలు దారిద్య్రం, అణచివేతకు బలౌతున్నారు. సామ్రాజ్యవాదుల ఆర్ధిక సంక్షోభభారాన్ని, యుద్ధ అవసరాలను తలకెత్తుకున్న పాలకులు ఆదివాసీ ప్రాంతాల్లోని అపారమైన ఖనిజ సంపదను దోచి పెట్టడానికి పూనుకుంటున్నారు. ఇందుకోసం ఆదివాసీలపై ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారు.
ఆదివాసుల సమిష్టి జీవన విధానం, సంస్కృతిపై, వారి హక్కులపై సామ్రాజ్యవాద, బ్రాహ్మణీయ హిందూత్వ విష సంస్కృతి దాడి తీవ్రమైంది. మూలవాసులు తమ జీవనాధారాన్ని కోల్పోవడమే గాక సంస్కృతి పరాయీకరణకు బలౌతున్నరు. అడవి నుండి గెంటివేయబడుతున్నారు. ఇందువల్ల వారు హిందూత్వ దాడికి – కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడక తప్పని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ఏ పాలక పార్టీ, ప్రభుత్వం అధికారంలో ఉన్నా మూలవాసుల హక్కుల విషయం అటుంచి, వారిని అడవి నుండి గెంటివేయడం లేదా నిర్మూలించడం వంటి చర్యలే ప్రధానమైన సందర్భంలో ఆదివాసులకు రాజ్యాధికారం లేనిదే అడవిపై వారి సాంప్రదాయిక హక్కును కాపాడుకోవడం గానీ, అభివృద్ధి చెందడం గానీ సాధ్యం కాదు. ఈ కీలకాంశాన్ని గుర్తించే ఆదివాసులు పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసుల పోరాటాలను అర్ధం చేసుకొని సామాజిక మార్పును కోరుకునే ప్రజలు, ప్రజాస్వామిక వాదులందరూ ఐక్యమై మూలవాసుల పోరాటాలకు అండగా నిలబడాలి.
09-08-2026




