అంతిమ ప్రకటన
ప్యారిస్, డిసెంబర్ 20-21, 2025
2025 డిసెంబర్ 20–21 తేదీలలో పారిస్‌లో జరిగిన “రాజకీయ ఖైదీలకు మద్దతుగా అంతర్జాతీయ సదస్సు”కు పాలస్తీనా, కుర్దిస్తాన్, టర్కీ, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, ఫ్రాన్స్, బ్రిటన్, భారతదేశం, ట్యునీషియా, చిలీ, ఆస్ట్రియా, ఫిలిప్పీన్స్, కెమరూన్, ఇరాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, పెరూ, గ్రీస్, మెక్సికో దేశాలకు చెందిన విప్లవకర, పోరాట సంస్థలు, వక్తలు హాజరయ్యారు. ఈ సదస్సు ముగింపు తీర్మానంతో—ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఖైదీలతో అంతర్జాతీయ సంఘీభావాన్ని తెలియచేస్తూ, ప్రజలు సాగిస్తున్న పోరాటాలు, ప్రతిఘటనల మార్గాన్ని వెలిగించే ఒక ప్రాథమిక శక్తిగా తీర్చిదిద్దడానికి మా ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము.
సామ్రాజ్యవాద సంక్షోభం, ఫాసిజం విజృంభణ; అణచివేత పాలనలు
సామ్రాజ్యవాదం తీవ్రమైన, నిర్మాణాత్మక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విస్తృత పేదరికం, దుర్భర పరిస్థితులు, ప్రతీఘాతుక యుద్ధాలు, నరమేధం, ఆక్రమణలు, తిరుగుబాట్లు, ప్రతిఘటనల రూపంలో ఈ సంక్షోభం వ్యక్తమవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఆయుధ పోటీని; మూడవ ప్రపంచ యుద్ధం కోసం జరుగుతున్న సన్నాహాలను; రాజకీయ స్వేచ్ఛలను క్రమపద్ధతిలో హరించడాన్ని మనం చూస్తున్నాము. పితృస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజల ప్రాథమిక అవసరాలను, స్వేచ్ఛా వాంఛలను తీర్చడంలో స్పష్టంగా విఫలమైంది; తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఇది మరింతగా హింస, అణచివేత, దౌర్జన్యాలనే అమలుచేస్తోంది.
పెట్టుబడిదారీ విధానపు నిరంతర సంక్షోభం ఫలితంగా, అనేక దేశాలలో ఫాసిస్ట్ ఉద్యమాలు బలాన్ని పుంజుకుంటున్నాయి; అధికారంలోకి వస్తున్నాయి లేదా ప్రభుత్వ వ్యవస్థలలో నిర్ణయాత్మక స్థానాలకు చేరుకుంటున్నాయి. ఈ పరిణామంతో పాటు అణచివేత విధానాలు, పోలీసు హింస, నిఘా వ్యవస్థల విస్తరణ పెరుగుతోంది. పెరూ, భారతదేశం, టర్కీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇతర దేశాలలో, విప్లవ వ్యతిరేక ప్రభుత్వ వ్యూహాలలో తీవ్రవాద నిరోధక చట్టాలు ప్రాథమిక ఆయుధాలుగా మారాయి.
రాజకీయ ఖైదీలే మన ప్రతిఘటనకు స్ఫూర్తి
రాజకీయ ఖైదీలతో ఆచరణాత్మక, వ్యవస్థీకృత సంఘీభావం అనేది సమాజ మార్పు కోసం పోరాడే విప్లవ శక్తులన్నింటి పోరాటంతో విడదీయరానిది. చరిత్రలోని ఈ కీలకమైన ఘట్టంలో ఈ ఖైదీలు ప్రతిఘటనకు నిలువెత్తు రూపాలుగా నిలుస్తున్నారు.
రాజకీయ ఖైదీలు ఒంటరి నిర్బంధాన్ని, శారీరక, మానసిక దాడులను, సమాచార మార్పిడిపైన ఆంక్షలను, వైద్య సంరక్షణ నిరాకరణను, నగర బహిష్కరణలను, లైంగిక దాడులను, అన్ని రకాల చట్టవ్యతిరేక చర్యలను ప్రతిఘటిస్తున్నారు. దశాబ్దాల తరబడి జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా వారి విడుదలను క్రమపద్ధతిలో ఆలస్యం చేస్తున్నారు. ఖైదీలకు సంఘీభావం తెలిపే వారిపైన నేరారోపణలను మోపుతున్నారు; వారి హక్కుల కోసం పోరాడే వారిపైన కూడా అదే రకమైన అణచివేత చర్యలను ప్రయోగిస్తున్నారు.
జియోనిస్ట్ వలసవాద పాలన అమలుచేస్తున్న అత్యంత ప్రత్యక్ష, క్రూరమైన రూపాన్ని ఎదుర్కొంటూ, పాలస్తీనా ఖైదీలు హింస, ఏకాంత నిర్బంధం, వైద్య నిర్లక్ష్యం, లైంగిక దాడులను తట్టుకుని జియోనిస్ట్ జైళ్ళను సామూహిక నిరోధక కేంద్రాలుగా మార్చారు. జియోనిస్ట్ ఇజ్రాయెల్ పాలన వందలాది మంది పాలస్తీనా బాల ఖైదీలను కూడా ఇదే రకమైన క్రూరత్వానికి గురిచేస్తోంది.
ముఖ్యంగా పాలస్తీనా ప్రజలపైన జియోనిస్ట్ రాజ్యం సాగిస్తున్న నరమేధ విధానాల నేపథ్యంలో, ఖైదీలు ఎదుర్కొంటున్న దాడులను, హింసను అంతం చేయడానికి వెంటనే అంతర్జాతీయ స్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిస్తున్నాము.
టర్కీలో విప్లవకర ఉద్యమాలు, కుర్దిష్ ప్రజల స్వేచ్ఛా పోరాటం, సామ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ఫాసిస్ట్ ప్రభుత్వం సాగిస్తున్న పూర్తిస్థాయి యుద్ధంలో జైళ్లు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. కొత్తగా నిర్మించిన “బావి లాంటి జైలు”(వెల్-టైప్ జైళ్ల)1 వంటి వాటి ద్వారా తీవ్రమైన ఏకాంత నిర్బంధానికి, ఏకపక్ష హింసకు గురవుతున్నప్పటికీ, తమను దిగజార్చడానికి. నాశనం చేయడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు లొంగకుండా ఖైదీలు దృఢంగా నిలబడుతున్నారు.
ఖైదీలందరికీ వారి మాతృభాషలోనే విద్య, న్యాయరక్షణ, సమాచార మార్పిడి హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. 26 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్లా ఓజలాన్ పైన అమలు చేస్తున్న “ప్రత్యేక చట్టాన్ని”2 రద్దు చేయాలని, విడుదలకు అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని, రాజకీయ ఖైదీలందరికీ “ఆశా హక్కు” (రైట్ టు హోప్)3 మంజూరు చేయాలని; ఫాసిస్ట్ ఆంక్షలు, చట్టాలను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇరాన్‌లో కార్మికుల, ప్రజల, మహిళల స్వేచ్ఛా పోరాటం అనేది అభ్యుదయ మానవాళి చేస్తున్న ఉమ్మడి స్వేచ్ఛా పోరాటం. సామ్రాజ్యవాద, జియోనిస్ట్ జోక్యాలకు వ్యతిరేకంగా కూడా ఈ పోరాటం సాగుతోంది. ఇరాన్‌లోని ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ ఖైదీలు చేపడుతున్న ‘మంగళవారం నిరసన చర్యలకు’4, నిరాహార దీక్షలకు మా సదస్సు వందనాలు అర్పిస్తోంది. ఇరాన్ తదితర దేశాలలో మరణశిక్షలకు వ్యతిరేకంగా సాగించే పోరాటం, రాజకీయ ఖైదీలతో అంతర్జాతీయ సంఘీభావం తెలిపే అత్యంత అత్యవసరమైన అంశాలలో ఒకటిగా నిలుస్తుందని నొక్కి చెబుతోంది.
ఐరోపాలో నూతన ఫాసిస్ట్ ఉద్యమాల ఆవిర్భావం, కేంద్ర ప్రభుత్వాలతో ఏర్పడుతున్న ఫాసిస్ట్ కూటములు, రాజకీయ వాతావరణంలో సంభవిస్తున్న మితవాదపక్ష మార్పులు మొదలైనవి జాతివివక్షకు, ఫాసిస్ట్ విధానాల అమలుకు దారితీస్తున్నాయి. ప్రతిఘటనా ఉద్యమాలను అణచివేయడానికి తీవ్రవాద నిరోధక చట్టాలను ఉపయోగిస్తున్నారు. అలాగే వలసదారులు, విప్లవకారులు, సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులపైన అణచివేతను తీవ్రతరం చేస్తున్నారు. పాలస్తీనాకు సంఘీభావం తెలపడాన్ని “నేరం”గా ప్రకటిస్తూ, ప్రదర్శనలను నిషేధిస్తున్నారు; రాజకీయ కార్యకలాపాలను అణచివేస్తున్నారు.
ఉత్తర ఆఫ్రికాలో, ముఖ్యంగా ఈజిప్ట్, మొరాకోలలో రాజకీయ స్వేచ్ఛ కోసం సాగుతున్న పోరాటం తీవ్రమైన దాడులకు గురవుతోంది. అదే సమయంలో మెక్సికోలో జైళ్లు—ఆదివాసులు, విప్లవ సంస్థలు, సామాజిక వ్యతిరేక పక్షాలపైన రాజ్య హింసకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. అణచివేతకు, విభేదించే హక్కు5ను నిర్మూలించడానికి పెరూ ప్రభుత్వం జైళ్లను ఒక ఆయుధంగా ఎలా ఉపయోగిస్తుందో “పెర్సియో కేసు”6 వంటి రాజకీయ కేసులు స్పష్టం చేస్తున్నాయి.
కెమరూన్ వంటి దేశాలలో తిరుగుబాటులలో పాల్గొంటున్న ప్రజలను అరెస్టు చేసి వారి నోళ్లను నొక్కుతున్నారు; పెట్టుబడిదారీ విధానపు లాభాపేక్ష వల్ల జరిగే పర్యావరణ వినాశనానికి వ్యతిరేకంగా, తమ ప్రకృతి, జీవన స్థలాల కోసం పోరాడుతున్న ఆదివాసీలను, కార్యకర్తలను నిర్బంధిస్తున్నారు; అరెస్టులు, హత్యలు చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ, ప్రతిఘటించేవారు వీధుల్లో అణచివేత పాలనలను సవాలు చేస్తూనే ఉన్నారు.
భారతదేశంలోకగార్ ఆపరేషన్; ఫిలిప్పీన్స్ లోనూ చూసినట్లుగా, ప్రతిఘటించి, పోరాడే విప్లవ శక్తుల పైన ప్రపంచ బూర్జువా వర్గం నిర్మూలనా దాడులను చేసినప్పటికీ, ఈ శక్తులు జైళ్లలోనూ, ప్రతిఘటనా రంగంలోనూ ముందుండి తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి..
సామ్రాజ్యవాద-పెట్టుబడిదారీ వ్యవస్థ పితృస్వామ్యం, హెటెరోసెక్సిజం7లను తమ అణచివేతకు నిర్మాణాత్మక వ్యవస్థలుగా ఉపయోగించుకుంటుంది. అందువల్ల మహిళలు, ఎల్ జిబిటి+ వ్యక్తులు బహుళ దోపిడీ, హింస, వ్యవస్థీకృత తిరస్కరణకు లక్ష్యంగా మారారు. మహిళా, ఎల్ జిబిటి+ ఖైదీలు జైళ్లలో జరిగే లైంగిక దాడులను, అణచివేతను ప్రతిఘటించడం ద్వారా పితృస్వామ్య హింసాత్మక ఆయుధాలను సవాలు చేస్తున్నారు.
ఖైదీలపై జరిగే లైంగిక హింస, అత్యాచారాలకు వ్యతిరేకంగా జరుగుతున్నపోరాట ప్రయత్నాలను ఉధృతం చేయాలని మేము పిలుపునిస్తున్నాం; అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో లైంగిక హింసను అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
అంతర్జాతీయ సంఘీభావం; ఉమ్మడి పోరాటం
అంతర్జాతీయ సంఘీభావమే మన సామూహిక ప్రతిఘటనకు పునాది. మనం ఎలాంటి పరిస్థితుల్లో పోరాడుతున్నప్పటికీ, అణచివేత పరిస్థితులకు, వాటి హింసాత్మక సాధనాలకు వ్యతిరేకంగా మనం సాగించే ఉమ్మడి పోరాటమే మనల్ని ఏకం చేస్తుంది. పాలస్తీనా ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవ పోరాటానికి మద్దతుగా ఎగిసిపడిన “గ్లోబల్ ఇంతిఫాదా”8 లో ఈ సంఘీభావం అత్యంత స్పష్టంగా వ్యక్తమవుతోంది.
కేవలం మధ్యప్రాచ్యంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ‘కుఫియా’ 9 విముక్తికి సార్వత్రిక చిహ్నంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలకు మా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. దశాబ్దాల జైలు శిక్ష తర్వాత స్వేచ్ఛను పొందిన కామ్రేడ్ అరేనాస్, జార్జెస్ ఇబ్రహీం అబ్దల్లా, లియోనార్డ్ పెల్టియర్‌లకు అభినందనలందచేస్తున్నాం. విడుదలైన తర్వాత కూడా పోరాటాన్ని కొనసాగిస్తూ వారు ప్రదర్శిస్తున్న సామూహిక గౌరవప్రదమైన వైఖరి మనకు శక్తినీ, మనోధైర్యాన్ని ఇస్తుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థ చెరసాలల్లో ప్రతిరోజూ, ప్రతి కోర్టు విచారణలోనూ, ప్రతి అన్యాయమైన తీర్పు ఎదుట తమ ప్రతిఘటనను మరింత బలోపేతం చేస్తున్న రాజకీయ ఖైదీలందరికీ మేము విప్లవాభినందనలు తెలుపుతున్నాం. అహ్మద్ సాదత్, మర్వాన్ బర్గౌతీ, ముమియా అబు-జమాల్, జైనాబ్ జలాలియన్, డిమిట్రిస్ చాట్జివాసిలియాడిస్, నికోస్ మాజియోటిస్, డేనియలా క్లెట్టే, ఫిగెన్ యుక్సేక్డాగ్, హతీజ్ డెనిజ్ అక్తాస్, ఫిల్టన్ 24; మేము అందరి పేర్లు చెప్పలేకపోతున్న, లెక్కలేనంత మంది ఇతర రాజకీయ ఖైదీలు మన నిరంతర ప్రతిఘటనకు స్ఫూర్తిప్రదాతలు.
నిరసనలు, వ్యవస్థను నగ్నంగా చూపే ఆత్మరక్షణ వాదనలు, సృజనాత్మక కార్యకలాపాలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షల ద్వారా అన్ని రకాల నిర్మూలనా విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ ఖైదీల ప్రతిఘటన జీవితాన్ని రక్షించుకుంటుంది. వారి ప్రతిఘటనే మన ప్రతిఘటన.
ముఖ్యంగా మార్చి 8, మార్చి 18, ఏప్రిల్ 17, జూన్ 19, డిసెంబర్ 3 వంటి రాజకీయ పోరాటాల ముఖ్యమైన రోజులలో సంఘీభావ చర్యల సమన్వయాన్ని మరింత పెంచాలని మా సదస్సు పిలుపునిస్తోంది.
రాజకీయ ఖైదీలకు మద్దతుగా జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సు “రాజకీయ ఖైదీల సంఘీభావం కోసం అంతర్జాతీయ సమన్వయ కమిటీ” ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజకీయ ఖైదీలతో అంతర్జాతీయ సంఘీభావాన్ని విస్తరించడం, పోరాటాన్ని బలోపేతం చేయడానికి సమాచార మార్పిడిని, సహకారాన్ని పెంచడం, అలాగే ఈ సమన్వయ కమిటీ సమీప భవిష్యత్తులో తన రాజకీయ, ఆచరణాత్మక కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ఈ చొరవకున్న ముఖ్య ఉద్దేశం.
ఈ సదస్సు అందించిన ఐక్యత, ఉత్సాహంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఖైదీలందరికీ మేము దృఢమైన సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం.
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి!
అంతర్జాతీయ సంఘీభావం వర్ధిల్లాలి!
ప్రిసనర్స్ వాయిస్ ప్లాట్ఫాం (టి ఎస్ పి)
2025 డిసెంబర్ 21
ఫుట్ నోట్స్:
1. “బావి తరహా” జైళ్లు అనేవి అధిక భద్రత కలిగిన ఒక నిర్మాణ నమూనా. వీటిని ప్రధానంగా 2020 సంవత్సరం నుండి టర్కీలో అమలు చేయడం ప్రారంభించారు. ఒక లోతైన బావి అడుగున నివసించినట్లుగా, తీవ్రమైన సామాజిక ఒంటరితనం, శాశ్వత ఏకాంత నిర్బంధం, యు తీవ్రమైన ఇంద్రియ నిరోధం ఉండేలా వీటిని రూపొందించారు. మూడు అంతస్తుల నిర్మాణాలు, వీటిలో ఒక వ్యక్తి ఉండే సెల్‌లు (చాలా తక్కువ సంఖ్యలో ముగ్గురు ఉండే సెల్‌లు) సుమారుగా 12 నుండి 13 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. ఖైదీలు రోజుకు 22.5 నుండి 23 గంటల పాటు ఈ సెల్స్‌లో బంధించబడి ఉంటారు. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇంటర్‌కామ్ వ్యవస్థల ద్వారానే మాట్లాడుకుంటారు. ఆరుబయట వ్యాయామ సమయం రోజుకు 1 నుండి 1.5 గంటలకు పరిమితమై ఉంటుంది. ఈ వ్యాయామ సమయంలో పైకప్పుకు తీగ జాలీ ఉన్న ఇరుకైన, ఎత్తైన గోడలు గల కాంక్రీట్ ఆవరణలలో (సుమారు 63 చదరపు మీటర్లు) గడపాలి; ఇక్కడ ఆకాశంలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. నిరంతర నిఘా: పలువురు ఖైదీలు ఉండే సెల్‌లలో నిరంతర కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. ఈ పద్ధతి గోప్యతా హక్కులను ఉల్లంఘిస్తుందని న్యాయ నిపుణులు, మానవ హక్కుల సంస్థలు వాదిస్తున్నాయి.
చట్టపర, నైతికపర విమర్శ: కాంటెంపరరీ లాయర్స్ అసోసియేషన్ వంటి మానవ హక్కుల సంస్థలు, సంఘాలు, బావుల తరహా జైళ్లను “జైలులోపల మరో జైలు”గా అభివర్ణిస్తాయి. తీవ్రమైన, దీర్ఘకాలిక ఏకాంతవాసం దేశీయ రాజ్యాంగ రక్షణలను, మానవ గౌరవ చట్టాలను, ఖైదీల పట్ల వ్యవహరించాల్సిన ఐక్యరాజ్యసమితి ప్రామాణిక కనీస నియమాలతో (మండేలా నియమాలు) సహా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.
2. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పికెకె) వ్యవస్థాపకుడు అబ్దుల్లా ఓకలాన్‌కు వర్తింపజేసిన “ప్రత్యేక చట్టం”; అసాధారణ నిర్బంధ పాలన అనేవి, 1999 నుండి టర్కీలోని ఇమ్రాలీ ద్వీప జైలులో ఏకైక ఖైదీగా ఆయనను నిర్బంధించిన కఠినమైన, అనుకూలీకరించిన ఏకాంతవాస నియమాలను సూచిస్తాయి. మానవ హక్కుల సంఘాలు; కుర్దిష్ అనుకూల రాజకీయ నాయకులు ఆయన సుదీర్ఘ ఏకాంత నిర్బంధాన్ని, న్యాయవాదులను, కుటుంబాన్ని కలుసుకోవడంలోగల పరిమితులను; ఇటీవలి షరతులతో కూడిన క్షమాభిక్ష చట్టం నుండి మినహాయింపును విమర్శించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
ప్రత్యేక నిర్బంధ పాలన స్వభావం:
ఏక-ఖైదీ సౌకర్యం: 1999లో అతడిని పట్టుకున్న తర్వాత, ప్రత్యేక అత్యవసర సిబ్బంది పర్యవేక్షణలో ఒక విశిష్టమైన పరిపాలనా-భద్రతా వ్యవస్థ కింద అతడిని ఉంచడానికి ఇమ్రాలీ ద్వీపాన్ని ప్రత్యేకంగా పునర్వ్యవస్థీకరించారు
3. “ఆశించే హక్కు” అనేది మానవ హక్కుల చట్టంలోని ఒక న్యాయ సూత్రం. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు విడుదలయ్యే వాస్తవిక అవకాశమూ; వారి శిక్షను సమీక్షించే అవకాశమూ తప్పనిసరిగా ఉండాలని ఇది పేర్కొంటుంది. స్వేచ్ఛకు ఉండే ఎలాంటి అవకాశాన్నైనా నిరాకరించడం అంటే మానవ గౌరవాన్ని, క్రూరమైన ప్రవర్తనపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.
చట్టంలో మూలం
యూరోపియన్ కోర్టు: ఈ భావన యూరోపియన్ మానవ హక్కుల న్యాయస్థానంలోనికేసుల నుండి ఉద్భవించింది, ముఖ్యంగా 2013లోవింటర్ వర్సెస్ యునైటెడ్ కింగ్‌డమ్ కేసుతో ఇది ప్రారంభమైంది.
ఆర్టికల్ 3: తగ్గించలేని జీవిత ఖైదులు—అంటే సమీక్ష లేకుండా మరణించే వరకు నిర్బంధించడం—యూరోపియన్ మానవ హక్కుల ఒడంబడికలోని ఆర్టికల్ 3ని ఉల్లంఘిస్తాయని కోర్టులు తీర్పునిచ్చాయి. మానవ గౌరవం: ఒక వ్యక్తి తీవ్రమైన నేరాలు చేసినప్పటికీ, వారి నుండి అన్ని ఆశలను దూరం చేయడం వారిలోని మానవత్వాన్ని నిరాకరించడమేనని న్యాయమూర్తులు వాదిస్తారు.
4 “ఇరాన్‌లో మంగళవారం చర్యలు” అనేది సాధారణంగా కొనసాగుతున్న “ఉరిశిక్షలు లేని మంగళవారాలు“ (సె-షాన్బేయే నా బే ఎరామ్) ప్రచారాన్ని సూచిస్తుంది—ఇది ఇరాన్ యొక్క అపఖ్యాతి పాలైన నిర్బంధ కేంద్రాలలో రాజకీయ ఖైదీలు మరియు పౌర హక్కుల కార్యకర్తలు ప్రతి మంగళవారం నిర్వహించే వారపు నిరాహార దీక్ష మరియు నిరసన ఉద్యమం, దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయుల సంఘీభావ ర్యాలీల మద్దతు లభిస్తుంది.
ఇరాన్ లోపల: జైలు నిరసనలు
- వారపు నిరాహార దీక్షలు: వివిధ భద్రతా జైళ్లలోని ఖైదీలు ప్రతి మంగళవారం సమన్వయంతో నిరాహార దీక్షలు చేపడుతున్నారు.
- ప్రధాన డిమాండ్లు: మరణశిక్షను తక్షణమే రద్దు చేయడం, ప్రభుత్వ ఆమోదంతో జరిగే ఉరిశిక్షలను నిలిపివేయడం, మరియు రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయడం.
- పెరుగుతున్న భాగస్వామ్యం: ఇరాన్ న్యాయవ్యవస్థ తీవ్రతరం చేసిన అణచివేతలను ధిక్కరిస్తూ, ఈ ఉద్యమం వరుస వారాలుగా నిలకడగా వృద్ధి చెందింది.
5. విభేదించే హక్కుప్రభుత్వ విధానాలు, చట్టాలు లేదా చర్యలతో పౌరులు చట్టబద్ధంగానూ, శాంతియుతంగానూ విభేదించడానికి అనుమతించే ఒక ప్రధాన ప్రజాస్వామ్య సూత్రం. భారతదేశం వంటి రాజ్యాంగ వ్యవస్థలలో, దీనికి వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశ స్వేచ్ఛ కింద రక్షణ కల్పించబడింది
6. “పెర్సియో కేసు” అనే పదం ప్రధానంగా వ్యవస్థీకృత నేరాలను లక్ష్యంగా చేసుకున్న ప్రధాన ఇటాలియన్ మాఫియా వ్యతిరేక పోలీసు కార్యకలాపాలను ( ఒపెరాజియోన్ పెర్సియో ) సూచిస్తుంది.
7. హెటెరోసెక్సిజం అంటే హెటెరోసెక్సువల్ (ఒక పురుషుడు ఒక స్త్రీ పట్ల ఆకర్షితుడవడం, లేదా ఒక స్త్రీ ఒక పురుషుడి పట్ల ఆకర్షితురాలవడం) కాని వ్యక్తుల పట్ల వ్యవస్థాగత పక్షపాతం, దురభిప్రాయం లేదా వివక్ష
8. “గ్లోబలైజ్ ది ఇంతిఫాదా” అనేది ఇంతిఫాదా (అంటే “తిరుగుబాటు” లేదా “విదిలించుకోవడం”) అనే అరబిక్ పదం నుండి ఉద్భవించిన ఒక రాజకీయ నినాదం. దీనిని పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, కార్యకర్తల టూల్‌కిట్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉపయోగిస్తారు
9. కెఫియే అంటే మధ్యప్రాచ్యానికి చెందిన సాంప్రదాయ చతురస్రాకార వస్త్రపు తలపాగా. ఇరాక్, పాలస్తీనా వంటి ప్రదేశాలలో గ్రామీణ రైతులు, ఎడారి సంచారుల ఆచరణాత్మక దుస్తులుగా ప్రారంభమైంది. రాజకీయ సంఘీభావం, స్వేచ్ఛ, పాలస్తీనా ప్రతిఘటనకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన చిహ్నంగా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ వస్తువుగా లేదా మానవ హక్కులకు మద్దతు చిహ్నంగా ధరిస్తారు.
https://prisonersvoice.org/wp-content/uploads/2025/12/DSC00879-scaled.jpg
అనువాదం : కె. పద్మ


