గంధమర్దన్, డియోమాలి, నియాంగిరి, తిజిమాలి అనేవి ఒకప్పటి ఒడిశాలోకి తొంగిచూసే నాలుగు కిటికీలు. ఇక్కడ అడవులు, సెలయేళ్లు, జంతువులు, నేల, పవిత్ర శిఖరాలతో ఆదివాసీలకున్న సంబంధాల ద్వారా మానవ గుర్తింపు ఏర్పడింది.
ఆ కొండలకి యజమాని ఎవరు? అనేది ఇక వాయిదా వేసి తప్పించుకోలేని ప్రశ్న. కేవలం ఒక భౌగోళిక నిర్మాణం, ప్రభుత్వ రిజిస్టర్లో నమోదైన ఖనిజాలున్న భూభాగం, వేలం వేయడానికి, వెలికితీతకు అందుబాటులో ఉన్న ఒక వనరు మాత్రమేనా? లేక అది పూర్వీకులకు చెందినదా, ఒక పవిత్రమైన ప్రదేశమా, ఒక సజీవ భాండాగారమా? ఒక నాగరికతకు పునాదా? మనం గంధమర్దన్, డియోమాలి, నియమగిరి, తిజిమాలిలను చూసినప్పుడు ఈ ప్రశ్న మరింత అత్యవసరమైనదిగా మారుతుంది. ఇవి కేవలం నాలుగు కొండలు కావు. అడవులు, సెలయేళ్లు, జంతువులు, నేల, పూర్వీకులు, పవిత్ర శిఖరాలతో ఉన్న సంబంధాల ద్వారా మానవ గుర్తింపు ఏర్పడిన ఒక పూర్వ ఒడిశాలోకి చూడటానికి నాలుగు విభిన్న కిటికీలు.
ఆధునిక చట్టం యాజమాన్యంతో మొదలవుతే, ఆదిమ నాగరికత అనుబంధంతో మొదలవుతుంది. ఆ వ్యత్యాసమే ఆదివాసులకు ఉన్న సమస్యకు మూలం. తరతరాలుగా, ఆదివాసీ సముదాయాలు ఆ కొండల్ని ఆధునిక పెట్టుబడిదారీ విధానంలోలా ఒక ఆస్తిగా భావించలేదు. ఆ కొండలు వారి భూమి, వంశవృక్షం, పుణ్యక్షేత్రం, జీవనాధారం, జ్ఞాపకం, నైతిక అధికారం కూడా.
సమకాలీన ప్రభుత్వం భూమిని అటవీ భూమి, రెవెన్యూ భూమి, ప్రభుత్వ భూమి లేదా ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతంగా వర్గీకరించవచ్చు. ఖనిజ నిక్షేపాన్ని చూసి ఒక కంపెనీ దాని వాణిజ్య విలువను లెక్క వేయవచ్చు. కానీ శతాబ్దాలుగా ఆ కొండతో కలిసి జీవిస్తున్న ప్రజలు పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తారు. అది ఒక సజీవ బంధువు, దాన్ని నాశనం చేయడం అంటే తాము నాశనం అవడమే.
ఈ ప్రత్యామ్నాయ రాజకీయ తత్వానికి నియాంగిరి అత్యంత స్పష్టమైన వ్యక్తీకరణను అందిస్తుంది. డోంగ్రియా కొంధ్ ప్రజలకు, నియాంగిరి పూజ్య దైవిక పూర్వీకుడు, నైతికతా స్వరూపమైన నియంరాజా నుండి విడదీయరానిది. ఆ కొండతో వారి సంబంధం కేవలం ఆర్థికపరమైనది కాదు. డోంగ్రియా ప్రజలు కొండలు, అడవులు, సెలయేళ్లతో గాఢంగా మమేకమై ఉంటారు. వారి సాంప్రదాయ ఆచారాలు ఆ ప్రకృతి దృశ్యంలో పాతుకుపోయి ఉన్నాయి. ఆ సమాజ సంప్రదాయాలు, కొండతోనూ, దాని వనరులతోను తమకున్న సంబంధానికి నియం రాజానే మూలమని వర్ణిస్తాయి. (ఇ–ట్రైబల్ ట్రిబ్యూన్). అందువల్ల, వారు కేవలం నియాంగిరి నివాసులు మాత్రమే కాదు; వారి గుర్తింపు నియాంగిరి ద్వారానే ఏర్పడుతుంది.
ఇది ఆధునిక అభివృద్ధి పరిభాషకు ఒక తీవ్రమైన సవాలును విసురుతుంది. ఒక పర్వతం ఏకకాలంలో దేవుడు, పూర్వీకుడు, భూభాగం; జీవనాధారం అయినప్పుడు, దానిని “ఖనిజ నిక్షేపం” అని పిలవడంలో అర్థం ఏమిటి? ప్రసిద్ధ నియాంగిరి వివాదం ఈ జ్ఞానశాస్త్రాల ఘర్షణను కచ్చితంగా ప్రదర్శించింది. పారిశ్రామిక దృక్కోణం నుండి బాక్సైట్ ఉన్న భూభాగంగా కనిపించినది, డోంగ్రియా ప్రజలకు వారి సామూహిక ఉనికిని నిలబెట్టే పవిత్ర భూభాగంగా కనిపించింది.
వివాదాన్ని పరిహారం ఇవ్వడానికి, ఉపాధి కల్పించడానికి మాత్రమే కుదించకుండా, ప్రభావిత వర్గాలు తమ మతపరమైన, సాంస్కృతికపరమైన హక్కులను వ్యక్తీకరించడానికి గ్రామ సభ ప్రక్రియ వీలు కల్పించింది కాబట్టి చివరికి చారిత్రాత్మకంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే నియమగిరిని ఒక విడి గాథగా పరిగణించకూడదు. గంధమర్దన్ అదే ప్రశ్నను మరో చారిత్రక భాషలో అడుగుతున్నారు. ఆ కొండ మతపరమైన జ్ఞాపకాలు, వైద్య పరిజ్ఞానం, పర్యావరణ ప్రాముఖ్యత. ప్రజా ప్రతిఘటన వంటి అనేక పొరలను తనలో ఇముడ్చుకుంది. పర్యావరణం, జీవనోపాధి; సాంస్కృతికవారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో ఒక కొండ కూడా ఒక రాజకీయ సమాజానికి కేంద్రంగా మారగలదని గంధమర్దన్ ఉద్యమం నిరూపించింది. ఈ ఉద్యమంపై జరిగిన విద్వత్ పరిశోధనలు, సాంప్రదాయ జీవనోపాధులు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్థానిక ప్రజలు పారిశ్రామికీకరణకు వ్యతిరేకంగా ఎలా సమీకృత మయ్యారో తెలియజేస్తున్నాయి. (సేజ్ జర్నల్స్)
అందువల్ల, గంధమర్దన్ కేవలం ఒక పర్యావరణ ఉద్యమానికి స్థిమితమవకుండా ఒక గొప్ప విషయానికి ప్రతీకగా నిలుస్తుంది. అది ఒక ప్రజాస్వామిక అంశంగా మారగల అవకాశానికి ప్రతీక. ఒడిశాలో పర్యావరణ ప్రతిఘటన బయటి నుండి దిగుమతి చేసుకున్న పర్యావరణ పదజాలం నుండి రాలేదని దాని చరిత్ర మనకు చెబుతుంది. అది గ్రామాలు, మత సంప్రదాయాలు, జీవనోపాధి వ్యవస్థలు, ఆ ప్రాంతంపైన ఉన్న లోతైన అవగాహన నుండి ఉద్భవించింది. పరిరక్షణ భాష రాకముందే ఆ కొండను జ్ఞాపకాల ద్వారా రక్షించారు.
తరువాత తూర్పు కనుమలలో వెలసిన ఒడిశాలోని ఎత్తైన పర్వత శిఖరం డియోమాలి వస్తుంది. అధికారిక కోరాపుట్ జిల్లా నివేదిక 1,762 మీటర్ల ఎత్తుతో డియోమాలిని రాష్ట్రంలోనే ఎత్తైన పర్వతంగా గుర్తించి, ట్రెక్కింగ్ తదితర కార్యకలాపాలకు అనువైన సహజ ప్రకృతి దృశ్యంగా దాని ప్రాముఖ్యతను కూడా అంగీకరించింది. కానీ కేవలం పర్యాటకపరమైన వర్ణన సరిపోదు. దక్షిణ ఒడిశాకు సంబంధించిన సాంస్కృతిక భౌగోళిక కోణంలో కూడా డియోమాలిని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆదివాసీ సముదాయాల జీవితాలు, వ్యవసాయ పద్ధతులు, మౌఖిక సంప్రదాయాలు, పర్యావరణ పరిజ్ఞానంలో కొండలు పెనవేసుకుపోయాయి.
ప్రభుత్వం ఒక కొండను కేవలం ప్రతీకాత్మకంగా కీర్తించవచ్చు, కానీ అదే సమయంలో ఆ కొండతో చారిత్రక సంబంధాన్ని కలిగి ఉండి, దానికి అర్థాన్నిచ్చే సముదాయాలను గుర్తించడంలో విఫలం కావచ్చు. కేవలం అద్భుతమైన ఎత్తులో ఉంది కాబట్టి ఒక కొండను కేవలం ఒక పర్యాటక ప్రదేశంగా మార్చలేము. డియోమాలి నిజమైన వారసత్వం దాని ఎత్తులో మాత్రమే కాకుండా, దాని వాలుల చుట్టూ పోగుపడిన మానవ జ్ఞానంలో కూడా ఉంది.
తిజిమాలి ఈ వైరుధ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. స్థానికంగా తిజిమాలిగా పిలిచే, అధికారికంగా సిజిమాలి అనే బాక్సైట్ ప్రాజెక్ట్‌తో ముడిపడి ఉన్న ఈ కొండ ప్రాంతం, మైనింగ్, అడవులు, హక్కులు, అభివృద్ధిల గురించి జరుగుతున్న సమకాలీన చర్చలో ఒక భాగంగా మారింది.
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ ఇటీవల వెలువరించిన ఒక నివేదిక ప్రకారం, ప్రధానంగా ఆదివాసీ జనాభా ఉన్న ఐదవ షెడ్యూల్ ప్రాంతాలైన రాయగడ, కలహండిలలోని అటవీ, ప్రభుత్వ, ప్రైవేట్ భూములలో భారీ స్థాయిలో బాక్సైట్ వెలికితీత ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంటుంది. ఇక్కడ యాజమాన్య హక్కుకు సంబంధించిన పాత ప్రశ్న అసాధారణమైన స్థాయిలో తిరిగి తలెత్తుతుంది.
ఒడిశాకు ఖనిజాలు అవసరమా కాదా అన్నది కీలకమైన ప్రశ్న కాదు. అవసరమే. అభివృద్ధి ఆవశ్యకమా కాదా అన్నది కూడా ప్రశ్న కాదు. అవసరమే. అభివృద్ధిని నిర్వచించే అధికారం ఎవరికి ఉంది, దాని మూల్యాన్ని ఏ నాగరికత చెల్లించాలి? అనేదే అసలు ప్రశ్న.
చాలా కాలంగా, ఖనిజ సంపదతో నిండిన ఆదివాసీ భూభాగాలను, పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న ఖాళీ ప్రదేశాలుగా వెలికితీత రాజకీయ ఆర్థిక వ్యవస్థ పరిగణిస్తోంది. కానీ ఈ భూభాగాలు ఖాళీవి కావు. వాటిలో భాషలు, సమాధులు, పవిత్ర స్థలాలు, వైద్య పరిజ్ఞానం, వ్యవసాయ పద్ధతులు, మౌఖిక చరిత్రలు, సామాజిక సంస్థలు, ఇంకా అతి ముఖ్యమైన జ్ఞాపకాలు ఉన్నాయి. వీటికి డబ్బు ప్యాకేజీల ద్వారా తగిన పరిహారం అందించలేము.
అందువల్ల, “ఆదిమ పూర్వీకులు” అనే పదాన్ని జాగ్రత్తగా వాడాలి. ఆదివాసీ సముదాయాలు చరిత్రకు అతీతంగా స్తంభించిపోయిన అవశేషాలు కావు. అలాగే ప్రతి కొండకి ప్రతి ఆదివాసీ సమాజమే అక్షరాలా మొదటి జనాభా అని ఒకే సార్వత్రిక వాదన చేయలేము. నిర్దిష్ట భూభాగాలతో వారి చారిత్రక సంబంధాలు విభిన్నంగా ఉంటాయి. కానీ వారి శాశ్వతమైన హక్కు శక్తివంతమైనది. భూభాగంతో వారి సంబంధం సమకాలీన పరిపాలనా యంత్రాంగానికి, దోపిడీ రాజ్యానికి పూర్వపుది. వారి చట్టబద్ధత కేవలం స్వాధీన పత్రాల నుండి మాత్రమే కాకుండా, తరతరాల నివాసం, సంరక్షణ, ఆచారాలు, సామూహిక జ్ఞాపకాల నుండి వస్తుంది.
ఇక్కడే భారతదేశం యాజమాన్యం గురించి పునరాలోచించుకోవాలి. అటవీ హక్కుల చట్టం, షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన రాజ్యాంగ చట్రం సామాజిక ప్రయోజనాలకు ముఖ్యమైన చట్టపరమైన గుర్తింపును అందిస్తున్నాయి, కానీ అవసరమైన లోతైన పరివర్తన తాత్వికమైనది. మనం యాజమాన్యం నుండి ధర్మకర్తృత్వానికి, వెలికితీత నుండి పరస్పర ప్రయోజనానికి; సంప్రదింపుల నుండి అంగీకారానికి మారాలి.
ఒక కొత్త కొండకు సంబంధించిన హక్కుల చట్రం నాలుగు సూత్రాలను గుర్తించగలదు. మొదటిది, ప్రతి పవిత్రమైన ఆదివాసీ పర్వతాన్ని కేవలం ఖనిజ భూభాగంగా కాకుండా, ఒక సాంస్కృతిక భూభాగంగా పరిగణించాలి. రెండవది, పర్యావరణ, సాంస్కృతిక విషయాలపైన సాంప్రదాయ సంస్థలకు అర్థవంతమైన నిర్ణయాధికారం ఉండాలి. మూడవది, వ్యక్తిగత మైనింగ్ అనుమతులను పరిగణనలోకి తీసుకునే ముందు, సంచిత పర్యావరణ, సాంస్కృతిక ప్రభావాలను అంచనా వేయాలి. నాలుగవది, పూర్వీకుల జ్ఞానాన్ని కేవలం సాధారణ జానపద కథలుగా కాకుండా, ఒక రకమైన మేధో, పర్యావరణ వారసత్వంగా గుర్తించాలి.
గంధమర్దన్, డియోమాలి, నియమగిరి, తిజిమాలి ఈ విధంగా కొత్త ఒడిశా విధానానికి నాలుగు ప్రయోగశాలలుగా మారగలవు.
గంధమర్దన్ స్మృతికి, ప్రతిఘటనకు ప్రతీక. డియోమాలి పర్యావరణానికి, సాంస్కృతిక కొనసాగింపుకు ప్రతీక. నియమగిరి పవిత్ర సార్వభౌమత్వానికి, సమాజ సమ్మతికి ప్రతీక. తిజిమాలి వెలికితీత, అభివృద్ధికి సంబంధించిన అపరిష్కృత భవిష్యత్తుకు ప్రతీక.
అంతిమంగా, “పర్వతం ఎవరికి చెందింది?” అనే ప్రశ్న సరైనది కాకపోవచ్చు. దానికి బదులుగా అడగాల్సిన సరైన ప్రశ్న: పర్వతం భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఎవరికి ఉంది?
సమాధానం కేవలం ప్రభుత్వానికి, కార్పొరేషన్‌కు లేదా మార్కెట్‌కు మాత్రమే సంబంధించి ఉండదు. అలాగే, చట్టపరమైన హక్కు ఎవరికి ఉందో నిర్ణయించడం ద్వారా మాత్రమే చరిత్రను పరిష్కరించలేము. ఆ పర్వతం కంపెనీలు రావడాని కంటే ముందే ఉంది, బహుశా వాటి తర్వాత కూడా నిలిచి ఉంటుంది. దానితో కలిసి జీవించినవారు, దానిని పూజించినవారు, దాని వాలులను సాగు చేసినవారు, దాని ప్రవాహాలను రక్షించినవారు, దాని జ్ఞాపకాలను వారసత్వంగా పొందినవారు, దానికి ఏమి జరుగుతుందో నిర్ణయించడంలో నిర్ణయాత్మకంగా చెప్పగలిగి ఉండాలి.
బహుశా ఒడిశాకు చెందిన అత్యంత పురాతన రాజకీయ జ్ఞానం దాని పర్వతాలలో దాగి ఉంది: భూమి మనకు చెందినది కాదు, మనమే భూమికి చెందినవాళ్ళం.
ఆ జ్ఞానాన్ని గంభీరంగా తీసుకుంటే, గంధమర్దన్, డియోమాలి, నియాంగిరి, తిజిమాలి కేవలం గనుల తవ్వకానికి సంబంధించిన ప్రశ్నలుగా మాత్రమే మిగిలిపోవు. అవి నాగరికతకు సంబంధించిన ప్రశ్నలుగా మారతాయి.
రచయిత ఒడిశాలోని ఆదివాసి పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (CARD) డైరెక్టర్.
అనువాదం: కె. పద్మ




