1. వెన్నెల రాత్రులు – కొన్ని ఉషోదయాలు

నాన్న
ఈ వెన్నెల తాకి చూడు
ఎంత ముద్దగా ఉందో ఎంత ముద్దుగా ఉందో
ఈ చల్లని రాతిరి చూడు
ఆకుల అలల పై ఎలా తేలియాడుతుందో

ఔను
ఈ వెన్నెల సమీరాల్ని జేబులో వేసుకుని
నక్షత్రాల్ని ముగ్గులు గా అల్లుకుని
మేఘాల్లో మురిసి పోవాలి.

ఈ రాతిరి కీచురాళ్ళ సంగీతం లో మునిగి పోవాలి.

తెల్లారే పక్షుల తో తేలియాడుతూ
పనీ పాటలోకి వాలిపోవాలి.

నది ఒడ్డున కూర్చుని
ఇసుక పై తేలియాడే స్వచ్ఛమైన నీటిలా
మనసుని కడుగు కోవాలి.

ప్రకృతి ని హత్తుకోవాలే కానీ
రైతు జీవితం మనలో పులకిస్తుంది.

కోయిల రాగాలు వసంత చిగురులు
జీవితాన్ని ధ్వనిస్తుంటాయి.

వెన్నెల రాత్రులయినా
పూసిన నక్షత్రాల కోటలయినా
ఉషోదయదయాలైనా

పున్న మల్లె
మొగలి రేకుల పరిమళాలై
ఆనంద శోభిత మౌతాయి.

  1. చేలు ఎండిపోతున్నాయ్

ఆకాశాన్ని పిండి
కొన్ని చుక్కల వర్షం కురిపించాలనుంటుంది

ఎండ ముసురుతుంది కానీ
వానకురవదు

ఎన్ లినో కన్నెర జేసింది
మట్టి బీటల్లో బతుకు కురుకుపోతోంది.

ఇంకా లోతుల్లోకి
మట్టి నరాల వెంట బోర్లు
పరిగెత్తించినా నీటి చుక్క రాలటం లేదు.

అక్కడ మంచు పర్వతాలు ముంచుతున్నాయి.

ఇక్కడ చీకట్లు ముసురుతున్నాయి.
బతుకులు కన్నీళ్ళలో కొట్టుకు పోతున్నాయి.

కరువు కళ్ళళ్ళో కారం కొట్టి
బతుకు ని ఛిద్రం చేస్తోంది.

ఏం చెప్పమఃటావ్
సినుకు లేకుంటే
సూపు వలస పరిగెడుతోంది

మొలిసిన పంట ఎండిపోతోంది.
గుండె తడారిపోతోంది.

వ్యాపారులకు వింత ప్రశ్నలు ఎదురౌతున్నాయి.

మట్టిని నమ్ముకున్న బిత్తర చూపులు
పరిహాసానికి గురౌతున్నాయి.

కాలం కన్నీటిని నడుపుతుంటే
చేలు ఎండిపోతున్నాయ్
బతుకులు మండి పోతున్నాయ్

పోలవరం లాంటి ఆనకట్టలను
దాహం తీర్చమని చేలు వేడుకుంటున్నాయ్.

Leave a Reply