ఓటు దగ్గర ఖైదీకి సంకెళ్లు..
అధికార పీఠం దగ్గర పోటీకి రెక్కలు!
పౌరుడికి ఒక్క గడపే ప్రజాస్వామ్యం..
నాయకుడికి రెండు గడపలా రాజ్యాంగం!
ఉద్యోగానికి అర్హతల అగ్నిపరీక్ష!
అధికార పీఠానికి అర్హతలే అరణ్యవాసం!
డిగ్రీలు ఉన్నవాడికి నిరీక్షణల సంకెళ్లు…
పీఠమెక్కేవాడికి ప్రమాణాలే బానిసలు!
పట్టాల పంట పండించిన యువతకు
నిరుద్యోగమే నిత్యకృత్యం!
చదువుకు చుక్కాని పట్టని చేతులకు
పాలనా నౌకపై సారథ్యం!
ముప్పై ఏళ్ల సేవకు పెన్షన్ పడిగాపులు!
ఐదేళ్ల పదవికి జీవితాంతం రాజభోగాలు!
శ్రమజీవి బతుకుకు షరతుల సంకెళ్లు…
అధికారానికి జీవితకాల వరాల పల్లకి!
ప్రజల చెమటకు పన్నుల కొలమానం…
పదవుల సుఖాలకు ఖజానా కానుకలు!
పైసా పైసాకు పౌరుడిపై లెక్కల కొరడా…
పదవీ వైభవానికి జవాబులే జారుడుబండ!
ప్రజల సంపాదనకు
పన్నుల పద్దుల్లో అంకెల ఆర్భాటం!
అధికార వైభవానికి ఖజానా హారతి
జవాబుదారీతనానికి పుటలే కరువా?
నేరారోపణల నల్లమేఘాల కింద
అధికారపు సూర్యోదయాలా?
సామాన్యుడి అడుగుకు ఆంక్షల వలయం,
పాలకుడి పరుగుకు పూలబాటలా?
రాజ్యాంగం రాసిన సమానత్వం
పుస్తకపు పుటలో పూర్ణచంద్రుడు!
అధికారపు ఆవరణలోకి అడుగుపెట్టగానే
అమావాస్యగా మారే విచిత్రమేమిటి?
ప్రజల పునాదులపై ప్రజాస్వామ్య ప్రాసాదాలకు
ప్రత్యేక ద్వారాలెందుకు?
ప్రజలే దేశానికి అసలైన యజమానులైతే
పాలకులకెందుకు మినహాయింపుల మకుటం?
ఓ న్యాయదేవతా!
ధనబలానికి త్రాసు ముల్లు లొంగిపోతే
ధర్మపు గంతలెందుకు?
బలహీనుడి వంతుకొస్తే న్యాయానికి ఆంక్షలెందుకు?
చట్టం పౌరుడి మెడలో
బాధ్యతల హారమై వేలాడాలి!
నాయకుడి భుజంపై మాత్రం
అధికారపు కవచమై మెరవాలా?
వ్యక్తుల కోసం వంగే చట్టం
వ్యవస్థకు వెన్నెముక కాలేదు!
పదవుల ముందు మోకరిల్లే న్యాయం
ప్రజల ముందు నిలబడలేదు!
ప్రశ్నించే గొంతు
ప్రజాస్వామ్యపు ఊపిరితిత్తి!
ప్రతిఘటించే అక్షరం
మార్పు రథానికి చక్రం!
ప్రజల సంతకం లేని అధికారం
చరిత్ర పుటలో చెల్లని శాసనం!
పెన్షన్ పదవికి బహుమానమా?
ప్రజాసేవకు ప్రతిఫలమా?
ప్రజల జీవితాలను తీర్చిదిద్దే పాలన
ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పాలి!
ప్రతిభకు పట్టాభిషేకం
అధికారానికి జవాబుదారీ పరీక్ష!
ప్రజాధనానికి లెక్క చెప్పాలి!
ప్రజాతీర్పుకు తలవంచాలి!
ఓటువేలిపై సిరాచుక్క
పౌరుడి సార్వభౌమ సంతకం!
బ్యాలెట్లో జారిన కాగితం
పీఠాల పునాదుల్ని ప్రశ్నించే
జనచైతన్య అస్త్రం!
నాయకుడికో న్యాయం,
పౌరుడికో న్యాయమా.!
ఈ ద్వంద్వ ధర్మశాస్త్రానికి
ప్రజాస్వామ్య సభలో స్థానమెక్కడ?
త్రాసు రెండు పళ్లెల్లో
మనుషుల హోదాలు తూచకండి!
చట్టం ముందు అందరినీ నిలబెట్టి
న్యాయాన్ని ఒక్కటిగానే తూచండి!
ప్రజలే అధికారానికి కొలమానం!
రాజ్యాంగమే పాలనకు దిక్సూచి!
వ్యక్తి పెత్తనం వ్యవస్థను మింగితే
జనచైతన్యమే అంతిమ శాసనం!




