బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికలలో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత, తన ఫాసిస్ట్ పాలనా వేగాన్ని పెంచింది. అందులో భాగంగానే 2025 లో బీహార్ రాష్ట్ర ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ ఐ ఆర్) పేరుతో ముస్లిం, క్రిస్టియన్ మొదలగు మైనారిటీ ఓట్ల తొలగింపుతో పాటుగా దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల ఓట్లను కూడా తొలగించి, బీహార్ లో మరల ఎన్ డి ఏ కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. ఇదే ప్రయోగాన్ని 2026లో జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు కూడా చేసి, బెంగాల్ లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో సహా ఐదు రాష్ట్రాల లో జరగబోవు ఎన్నికలు సందర్భంగా దేశవ్యాప్తంగా ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను ప్రారంభించి, 13 కోట్ల 30 లక్షల ఓట్లను గల్లంతు చేయడం జరిగింది. ఈ అక్రమాలన్నింటికీ భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సహకరించడం జరిగింది. ఇదే విషయాన్ని 2026 సెప్టెంబర్ ఆఖరి వారంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కథనాలు రావడం జరిగింది. ఈ కథనాలతో దేశంలో గల ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, కాక్రోచ్ జనతా పార్టీ మొదలగువారు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుంచి నిరసన కార్యక్రమాలను ప్రారంభించారు. అవి నేటికీ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ ఓటు హక్కు ఉద్యమంలో ప్రధాన డిమాండ్లు ఏమిటంటే, ” భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ ఐ ఆర్ ప్రక్రియను రద్దుచేసి, పాత ఓటర్ల జాబితాలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు ఒక సాధనం. ఎన్నికల ద్వారా ఈ దేశ పౌరుడు రాజకీయ సమానత్వం కోసం ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఎన్నిక కాబడిన ప్రభుత్వం ప్రజా ఆమోదం పొందటానికి పౌరులకు ఓటు హక్కు ఒక ప్రధాన ఆయుధం. అటువంటి ఆయుధాన్ని అక్రమ వలసదారుల మిష తోనూ, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోష్యంగాల పేరుతోను ఆర్ఎస్ఎస్, బిజెపి పై అసమ్మతి గల పౌరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫారం 7 ను ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలు అక్రమ పద్ధతులకు వినియోగిస్తూ, దేశంలో గల ముస్లిం మైనారిటీ వర్గాలకు, దళిత బహుజన కులాలకు చెందిన పౌరుల ఓట్లను తొలగించడానికి చర్యలు చేపడుతున్నారు. మరోవైపు 18 సంవత్సరాలు నిండిన ముస్లిం మైనారిటీ వర్గాల, దళిత బహుజన కులాల ఓట్లను చేర్చకుండా ఫారం -6 లో ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటూ కఠిన నిబంధనలు జారీ చేశారు. ఈ అసంబద్ద నిర్ణయాలపై భారత ఎన్నికల సంఘం లోని మిగిలిన ఇద్దరు కమీషనర్లు 14 సార్లు రాతపూర్వక అభ్యంతరాలను చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ కి తెలియజేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక్కడ ఫారం 6 కి అనుబంధంగా చేర్చబడిన ఒక అసంబద్ధమైన నిబంధన ఏమిటంటే, ” ఒక ఓటర్ పేరును చేర్చడానికి అతని తల్లిదండ్రులు, తాత నాన్నమ్మలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఓటర్లుగా ఉన్నారు, గతంలో జరిగిన ఎన్నికలలో ఎక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనే వివరాలను నింపితే గాని, వారికి ఓటరుగా నమోదు కాదు.” అదేవిధంగా ఫారం -7 లోని అభ్యంతరాలను బిఎల్ఓ ల పరిశీలనతో సంబంధం లేకుండా, వాస్తవాలను నమోదు చేయకుండా ఈ ఆర్ ఓ లు ఏకపక్షంగా ఓట్లను తొలగించారు. కనీసం ఓటు తొలగించబడిన వ్యక్తులకు సమాచారం కూడా తెలియజేయడం లేదు. ఇంత అప్రజాస్వామికంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని తయారు చేసుకున్న భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బిజెపి కూటమి ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా మారారు. అంతేకాకుండా భారత ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులలో మెజారిటీగా ఉన్న మిగిలిన ఇద్దరు కమీషనర్ల అభిప్రాయాలకు, అభ్యంతరాలకు విలువ లేకుండా పోయింది.
ఆర్ఎస్ఎస్ దీర్ఘకాలిక ఎజెండాలోని ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే జాతి ఒకే పౌరసత్వం, భారతదేశంలో హిందూమత రాజ్య స్థాపన, ప్రస్తుత భారత రాజ్యాంగాన్ని కాదని ఆర్ఎస్ఎస్ సిద్ధాంత హిందూ మత ఆధిపత్య నూతన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం మొదలగు విషయాలను సాధించడానికే, వారికి అనుకూలమైన పౌరులతో ఓటర్ల జాబితాలను తయారు చేసుకోవడం, ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని పాలనను ఆర్ఎస్ఎస్ గుప్పిటలో ఉంచుకోవడానికి ఎస్ ఐ ఆర్ వంటి తప్పుడు ప్రక్రియను చేపట్టారు. అయితే ఈ ప్రక్రియ సాధ్యా సాధ్యాలను పక్కన పెడితే, 1952 నుంచి ఇప్పటివరకు భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల విధానం గూర్చి మనం కొంత మాట్లాడుకోవడం అవసరం. భారత జాతీయ ఉద్యమ ప్రభావంతో తొలినాళ్ల లో జరిగిన ఎన్నికలు నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానమంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగినంత కాలంలో ఎంతో కొంత బూర్జువా ప్రజాస్వామ్యం అమలు కాబడింది. 1966 తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావడం, ఆమె రాజకీయ ప్రాబల్యం కాంగ్రెస్ పార్టీలో పెరిగిన పిదప, తదుపరి జరిగిన ఎన్నికలు డబ్బు, మద్యం ప్రభావంతోనూ, ఓట్ల రిగ్గింగ్ తోనూ, కుల, మత, ప్రాంతీయ తత్వాలతోనూ బ్రష్టు పట్టిపోయాయి. వీటన్నింటి పరిణామమే ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. పర్యవసానంగా 1975 జూన్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, ఇందిరాగాంధీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఇందుకు ప్రతిగా జై ప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో చేసిన “ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం”. తదనంతరం జనతా పార్టీ ఏర్పాటు,1977 ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక ప్రతిపక్ష కూటమి విజయం. ఈ కూటమిలో అప్పుడు జన సంఘ్ పేరుతో ఉన్న నేటి బిజెపి పార్టీ కూడా ఉంది. అయితే ఈ కూటమి రెండున్నర సంవత్సరాలలో అతుకుల బొంతలా విడిపోయి, మరల ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 1980 లో అధికారంలోనికి వచ్చింది. తదనంతరం జరిగిన ఎన్నికలలో గ్రామస్థాయి సర్పంచ్ ఎన్నికలు నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు డబ్బు, మద్యం, కులం, మతం, ప్రాంతీయ తత్వాలు తో నిండిపోయి, భారత పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థ దిగజారిపోయింది. ఈ ఊబిలో కూరుకుపోయిన వారిలో పార్లమెంటరీ వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాలలో అధికారం చేపట్టిన వామపక్ష కూటమి ప్రభుత్వాలు కూడా మినహాయింపు కాదు.
ఇక 2019 ఎన్నికలు నుంచి ఈవీఎం ల మేనేజ్మెంట్ పై ప్రతిపక్ష పార్టీలు బిజెపి పై ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎస్ ఐ ఆర్ పేరుతో బిజెపి కూటమి ప్రభుత్వం ఓటర్ల జాబితాలనే తారుమారు చేస్తూ, అర్హులకు ఓటు హక్కు లేకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది. మొదటిలో ఆధిపత్యాన్ని చలాయించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అక్రమాలలో నియంతృత్వ పోకడలు అవలంబించినా, పార్లమెంటరీ వామపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపి కూటమిలోని పాలకవర్గ పార్టీలను ఎదుర్కోవడానికి ప్రతిగా ఎన్నికలలో తప్పుడు విధానాలను అవలంబించినా, ఇప్పటి బిజెపి లాగా మరీ బరితెగించలేదు. నేటి బిజెపి కూటమి ప్రభుత్వ బరితెగంపు ఎన్నికల వ్యవస్థను పూర్తిగా ఫాసిస్టుగా మార్చి వేసింది. పౌరుల ప్రశ్నించే తత్వాన్ని, ప్రజల అసమ్మతిని, ప్రజాస్వామిక విధానాలను చిదిమి వేయడానికి బీజేపీ కూటమి ప్రయత్నిస్తుంది. ఈ చర్యలు బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పాలకవర్గ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు, వామపక్ష పార్టీలు, వాటి యువజన, విద్యార్థి సంఘాలు, కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలోని విద్యార్థులు, యువత ఈరోజు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. ఇది 1975 అత్యవసర పరిస్థితి నాటి స్థితిని మరోసారి పునరావృతం చేస్తున్నది.
చివరిగా ఒక మాట, “భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసిన, ఎస్ ఐ ఆర్ రద్దు కాబడిన, ఓటర్ల జాబితాలు పునరుద్ధరించబడిన, గత ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికల అక్రమాలు, అప్రజాస్వామిక విధానాలు రూపు మాసిపోవు. ” భారత పాలకవర్గాలు, వాటి పాలకవర్గ పార్టీలు అధికారాన్ని చేజెక్కించుకోవడానికి అడ్డదారులు తొక్కుతూనే ఉంటారు. కావున వీటన్నింటి పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండి, ఉచిత విద్య, వైద్యం కోసం పోరాడాలి. అంబేద్కర్ గారు చెప్పినట్లుగా భూమి, పరిశ్రమలు ప్రభుత్వ అధీనంలోనే ఉండి, పీడిత వర్గాలకు, కులాలకు ఉపాధి అవకాశాలు కోసం ప్రజలు, ప్రజాసంఘాలు పోరాడుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఎన్నికలు డబ్బు, పలుకుబడి, కుల మతాలకు అతీతంగా నిర్వహింపబడతాయి. సమర్థులు, పాలనా దక్షత గలవారు ప్రభుత్వ అధికారంలోనికి వస్తారు. ఆ దిశగా ఈ దేశ యువత, విద్యార్థులు, మనమంతా ఆలోచన చేయాలి.
——- పేడాడ కృష్ణారావు,
జిల్లా కన్వీనర్,
ప్రజా సంఘాల ఐక్యవేదిక, శ్రీకాకుళం.
తేది. 09-10-2026.




