2026 సెప్టెంబర్ 14

1978లో వచ్చిన ఎంతో ప్రశంసలు పొందిన ఆనంద్ పట్వర్ధన్ సంచలనాత్మక డాక్యుమెంటరీ చిత్రం ‘జమీర్ కే బందీ’ (ప్రిజనర్స్ ఆఫ్ కాన్షియెన్స్)లో ఎమర్జెన్సీ సమయంలో 1975 డిసెంబర్ 1నాడు ఉరితీసిన విప్లవకారులు భూమయ్య, కిష్టా గౌడ్ ల ప్రస్తావన కూడా ఉంది.

మాంటేజ్ అనే టెక్నిక్ ద్వారా, ఒక సన్నివేశంలో ఆ ఇద్దరి ఉరిశిక్షను గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తారు. దీని వెంటనే, రాజ్‌పథ్‌లో జరుగుతున్న అద్భుతమైన గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు దృశ్యం మారుతుంది. నేపథ్యంలో జాతీయ గీతం వినిపిస్తూ ఉంటుంది. ఈ శక్తివంతమైన 20-సెకన్ల మాంటేజ్‌లో, ఆనంద్ పట్వర్ధన్ ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తారు: లెక్కలేనంత మంది ఆదివాసీలు, దళితులు, భూమయ్య, కిష్టాగౌడ్ వంటి విప్లవకారుల ఛాతీలను తొక్కుకుంటూ మన గణతంత్ర పరేడ్ ముందుకు సాగుతుంది.

భూమయ్య, కిష్టాగౌడ్‌లను సికింద్రాబాద్‌లోని ముషీరాబాద్ జైలులో ఉరిశిక్ష కోసం ఉంచిన సమయంలో, విప్లవ కవి వరవరరావు కూడా కుఖ్యాత మీసా చట్టం, ‘సికింద్రాబాద్ కుట్ర కేసు’ కింద విరసంకు చెందిన ఇతర కామ్రేడ్‌లతో కలిసి బందీగా ఉన్నారు. అదే జైలులో, వంటగదికి ఎదురుగా ఉన్న ఉరికొయ్యపై భూమయ్య, కిష్టాగౌడ్‌లు ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్నారని తెలుసుకున్నప్పుడు, వారిని కలవాలనే తీవ్రమైన ఆవేదనకు ఆయన లోనయ్యారు. జైలర్‌ను అభ్యర్థించగా, జైలర్ వారికి కొద్దిసేపు కలిసే అవకాశాన్నిచ్చాడు.

భూమయ్య, కిష్టాగౌడ్‌లతో జరిగిన ఈ సమావేశాన్ని, స్వతంత్ర భారతదేశంలో జరిగిన ఈ మొదటి రాజకీయ ఉరిశిక్షను ఆధారంగా చేసుకుని, వరవరరావు రాజ్యాధికారానికి ఉండే స్వభావమూ, ఆనాటి విప్లవ-ప్రజాస్వామిక ఉద్యమమూ ఆయన రచనలకు విషయమయ్యాయి. అవి కవిత్వం, డైరీలు, జ్ఞాపకాలు, వ్యాసాల రూపంలో ఉన్నాయి.

ఈ అద్భుతమైన రచనలో, ఆ అల్లకల్లోల కాలం సజీవంగా మారడమే కాకుండా, భూమయ్య, కిష్టగౌడ్‌లు స్వయంగా మళ్లీ బతికివచ్చినట్లు అనిపిస్తుంది. ఈ రచనలు చదువుతుంటే, ప్రతి మాటలోనూ వారి వెచ్చని శ్వాసను దాదాపుగా అనుభవించవచ్చు; భూమయ్య, కిష్టగౌడ్‌ లాంటి విప్లవకారులు నిజానికి మరణించరని ఇది మనకు నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటుంది. వారు మరింత ఎక్కువ బలంతో, మన మధ్యకు మళ్లీ మళ్లీ తిరిగి వస్తుంటారు.

వరవరరావు శ్రీ శ్రీ తన కవితలలో ఒకదానిని ఉటంకిస్తూ ఈ విధంగా చెప్పారు:

“అమ్మా, నేను నీ గర్భంలో మళ్లీ జన్మిస్తాను

నా మెడకు పడిన ఉరి నీలి గురుతుల ద్వారా

నువ్వు నన్ను గుర్తించు.”

ఈ సంవత్సరం జూలైలో, తెలంగాణకు చెందిన విప్లవ ప్రచురణ సంస్థ ‘జనసాహితి’, వరవరరావు గారి రచనలను “ఈ హంతక వ్యవస్థను నిర్మూలిద్దాం” (‘లెట్ అస్ అబాలిష్ దిస్ ఎగ్జిక్యూషనర్స్ సిస్టమ్’) అనే పేరుతో ఒక పుస్తక రూపంలో ప్రచురించింది. వారి ప్రచురణ సంస్థ ప్రచురించిన దాదాపు అన్ని పుస్తకాలకు వరవరరావు గారు ముందుమాటలు రాశారన్న వాస్తవాన్ని బట్టి జనసాహితి ప్రాముఖ్యతను మీరు గ్రహించవచ్చు.

శీర్షిక స్పష్టం చేస్తున్నట్లుగా, వరవరరావు భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షను ఒక సాకుగా వాడుకుంటూ, అనాగరికమైన మరణశిక్షా వ్యవస్థనే ప్రశ్నిస్తున్నారు. ఆ ఇద్దరినీ ఉరితీసిన డిసెంబర్ 1వ తేదీని, ఈ క్రూరమైన శిక్షా విధానాన్ని నిర్మూలించే పోరాట దినంగా పాటించాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు.

మొత్తం 193 దేశాలలో కేవలం 53 దేశాలు మాత్రమే ఈ క్రూరమైన మరణశిక్ష వ్యవస్థను కొనసాగిస్తున్నాయి. ఇందులో అమెరికా మినహా మిగతా దేశాలన్నీ మూడవ ప్రపంచానికి చెందిన పేద దేశాలే.

అత్యాచారం, హత్య నేరాలకు పాల్పడినట్లు రుజువైన తర్వాత, 2004 ఆగస్టు 14న, తన 39వ పుట్టినరోజునాడే ఉరితీసిన ధనంజయ్ చటర్జీ ఉదంతాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత, ప్రఖ్యాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు—దేబాసిష్ సేన్‌గుప్తా, ప్రోబల్ చౌధురి, పరమేశ్ గోస్వామి—విస్తృత పరిశోధన చేసి, ‘కోర్టు-మీడియా-సొసైటీ అండ్ ది హ్యాంగింగ్ ఆఫ్ ధనంజయ్’ అనే పుస్తకాన్ని రాసి ధనంజయ్ నిర్దోషి అని నిరూపించారు. కానీ ఇక ఏమీ చేయలేని స్థితి. ధనంజయ్‌కు అప్పటికే మరణశిక్ష అమలైపోయింది.

మనం తిరిగి భూమయ్య, కిష్టాగౌడ్‌ల దగ్గరికి వద్దాం.

గోదావరి నదికి ఇరువైపులా నివసిస్తున్న భూమయ్య, కిష్టా గౌడ్, చారు మజుందార్ నేతృత్వంలోని నక్సల్బరీ ఉద్యమంలోనే కాకుండా, 1946–51 నాటి చారిత్రాత్మక తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న తెలంగాణాలోని వారి తరానికి చెందిన కొద్దిమంది వ్యక్తులలో ఒకరు. వీరు రెండు పోరాటాల సమయంలోనూ అణచివేతను ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కిష్టా గౌడ్ తొడలోకి దూసుకుపోయిన ఒక తూటా అక్కడే ఉండిపోయిందని వరవర రావు మనకు చెబుతున్నారు.

నక్సల్బరీ ఉద్యమ సమయంలో భూమయ్య, కిష్టాగౌడ్‌లపై వరుసగా ఒక భూస్వామిని, ఒక పోలీసును హత్య చేసినట్లు అభియోగాలను మోపారు. ఈ రెండు సంఘటనలు సామూహిక చర్యల్లో భాగంగా జరిగినందువల్ల, వారిద్దరిలో ఎవరిపైనా వ్యక్తిగతమైన ఆధారాలు లేవు. ఇక్కడే వరవర రావు ఒక ఆసక్తికరమైన వివరాలను అందిస్తారు: భూమయ్య, యు కిష్టాగౌడ్‌లకు మరణశిక్ష పడేలా చూడటం కోసం ఆ ప్రాంతంలోని భూస్వాములు అందరూ కలిసి సెషన్స్ జడ్జికి రూ. 30,000 ముట్టజెప్పారు.

పుస్తకంలోని మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ప్రసిద్ధ తెలుగు కవి శ్రీశ్రీని వరవర రావు ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకోవడం; ఆయన శక్తివంతమైన కొన్ని కవితలను ఉదాహరించడం. మరణశిక్ష కోసం ఎదురుచూస్తున్న భూమయ్య, కిష్టాగౌడ్‌లను కలవడానికి శ్రీశ్రీ స్వయంగా జైలుకు వెళ్ళారు. వారిని కలిసిన తర్వాత, ఆయన వారిని ‘భూమి’; ‘ఆకాశం’లతో పోల్చారు.

1975 డిసెంబర్ 2నాటి ఉదయం భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరితీసిన వార్త చదివి శ్రీశ్రీ తన శక్తివంతమైన కవితలో వారిని ఇలా స్మరించుకున్నారు –

” రోసెన్‌బర్గ్ దంపతుల్లా వాళ్ళు మేధావులు కాదు

సాకో-వాంజెట్టిల్లాగా మెతక మనుషులు కాదు

వాళ్ళిద్దరిలో ఒకరు భూమి,

మరొకరు ఆకాశం.”

“దున్నేవాడిదే భూమి” అనే నినాదం కింద తమ హక్కును కోరడమే ఈ ‘భూమి’, ‘ఆకాశాలను’ ఉరితీయడానికి కారణం కావడం ఎంతటి వైచిత్రమో అని వరవర రావు రాశారు.

శ్రీశ్రీ కేవలం కవిత్వం ద్వారా తన సంఘీభావాన్ని తెలపడమే కాదు. భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమం ఎంత బలపడిందంటే, దాని ప్రతిధ్వనులు భారతదేశం వెలుపల కూడా వినిపించాయి. నామ్ చోమ్స్కీ, జీన్-పాల్ సార్త్రే, తారిఖ్ అలీ వంటి మేధావులు భారత రాయబార కార్యాలయాల ముందు నిరసన తెలియచేసారు.

భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరితీసిన తర్వాత, భారీ వర్షంలో హుజురాబాద్‌లో జరిగిన ఒక భారీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రీశ్రీ రష్యాకు చెందిన గొప్ప రచయిత ఫెడర్ దోస్తోవ్‌స్కీని ప్రస్తావించారని వరవరరావు గుర్తుచేసుకున్నారు. ఆఖరి నిమిషంలో జార్ చక్రవర్తి కూడా దోస్తోవ్‌స్కీని క్షమించి ఉరికొయ్యల నుండి వెనక్కి తీసుకువచ్చాడని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ జార్ చక్రవర్తి కంటే క్రూరంగా కనిపించాలనుకుంటున్నారా?

అయితే, ఇది పూర్తిగా వాస్తవం కాదు. ప్రజల దృష్టిలో దయగలవాడిగా కనిపించడం కోసం జార్ చక్రవర్తి ఆ నాటకం ఆడాడు. దోస్తోవ్‌స్కీకి విధించిన అసలు శిక్ష సైబీరియాకు బహిష్కరణ. ఆ పేరుకే క్షమాభిక్ష లభించిన తర్వాత కూడా, ఆయన నిజంగానే సైబీరియాకు పంపించారు.

వరవర రావు మనకు మరో విషయం కూడా చెబుతున్నారు; భూమయ్య, కిష్టా గౌడ్ తమ చివరి కోరికగా కళ్లను దానం చేశారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఐప్టా) తో సంబంధం ఉన్న ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత కె.ఎ. అబ్బాస్, భూమయ్య, కిష్టా గౌడ్ కళ్ళు ఇప్పటికీ మనల్ని చూస్తూనే ఉన్నాయని తరువాత రాశారు.

భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షలతో ప్రభావితమై ఎంతో సాహిత్యం వచ్చింది; అనేక సినిమాలను తీసారు. అలాంటి ఒక సినిమా గురించి వరవర రావు ప్రస్తావిస్తూ, ఆంఖేన్ బోలే (కళ్ళు మాట్లాడుతున్నాయి) అనే చిత్రాన్ని ప్రస్తావించి, ఆ కాలంలో అది విస్తృతంగా నడిచిందని గుర్తుచేసుకున్నారు.

భూమయ్య, కిష్టాగౌడ్‌ల పోరాటాన్ని, త్యాగాన్ని మానవజాతి సర్వకాలిక ద్వంద్వాత్మక (డైలెక్టికల్) చారిత్రక సత్యంతో వరవర రావు అనుసంధానించారు. మరోసారి శ్రీశ్రీ కవితను ఉదాహరించారు:

” తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు,

నల్లవాడు నిన్ను నేడు నక్సలైటు అన్నాడు,

ఎల్లవారు రేపు నిన్ను వేగుచుక్క అంటారు!

భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష ఉదంతం ద్వారా, ఈ పుస్తకం భారతదేశ గొప్ప విప్లవ చరిత్రను మన ముందుకు తీసుకువస్తుంది కాబట్టి ఇది నేడు ప్రత్యేకించి ఎంతో ముఖ్యం—ఇది ప్రస్తుతం అత్యంత బలవంతంగా విస్మరిస్తున్న, ఉద్దేశపూర్వకంగా చెరిపివేస్తున్న చరిత్ర.

ఈ ఉక్కిరిబిక్కిరి చేసే కాలంలో, కామ్రేడ్ వరవరరావు, ఆయన అద్భుతమైన రచనలు ఇప్పటికీ మనతో ఉండటం మన అదృష్టం. ఆయన మాటల ద్వారా, మనం విప్లవ చరిత్ర గుండెచప్పుడు వినడమే కాకుండా, విశ్వాస వెచ్చదనాన్ని కూడా అనుభవించవచ్చు.

ఈ సమీక్షను ముగించడానికి బహుశా సరిపోయే అత్యంత సముచితమైనది, భూమయ్య, కిష్టాగౌడ్‌లపై వరవరరావు రాసిన స్వీయ కవితలోని కొన్ని లైన్లు:

“మీరు ఏ గోదావరి తీరం వెదురు వనంలో

 విచ్చుకున్న గెరిల్లా రైతులు?

 ఈ తరానికి పోరాట సంగీతం వినిపించడానికి

 మీ కంఠాలను ఉరికంబాలకెక్కిస్తున్నారు?”

మనీష్ ఆజాద్ రాజకీయ కార్యకర్త, కవి, రచయిత

తెలుగు: పద్మ కొండిపర్తి

https://countercurrents.org/2026/09/do-you-know-bhumaiah-and-kishta-goud

Leave a Reply