1967 – 71 వరకు జరిగిన శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాట ఫలితంగా ఏర్పడిన ఐటీడీఏలు ఆదివాసీ ప్రజలకు విద్య, ఉపాధితో పాటుగా ఆదివాసీల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాయని పాలకులు హామీ ఇచ్చారు. కానీ అందుకు విరుద్ధంగా మొదట జీవో -3 ను రద్దు చేయడం ద్వారా ఉద్యోగ రంగంలో ఉపాధి అవకాశాలను దెబ్బతీయగా, ఇప్పుడు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో ఆదివాసి ప్రాంతాలలోని కొన్ని ఆశ్రమ పాఠశాలల స్థాయి తగ్గింపు, మరికొన్ని ఆశ్రమ పాఠశాలల మూసివేత ప్రక్రియకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోవైపు 1/70 చట్టాన్ని రద్దు చేయడం కోసం గిరిజనేతరుల చేత 17 కేసులను సుప్రీం కోర్టు వరకు నెట్టుకు వచ్చి, అవి విచారణ దశలో ఉన్నాయి. ఏ క్షణంలోనైనా సుప్రీంకోర్టు తీర్పు ఆదివాసీలకు వ్యతిరేకంగా వచ్చినా, కూటమి ప్రభుత్వం 1/70 చట్టాన్ని రద్దు చేసే ప్రమాదం పొంచి ఉన్నది. గతంలో కూడా జీవో- 3 రద్దు విషయంలో కూడా ఇదే కుట్ర జరిగింది. నేటికీ ఆ జీవో పునరుద్ధరణ జరగలేదు. ఫలితంగా షెడ్యూల్ ప్రాంతంలోని ఉద్యోగాలను పూర్తిగా ఆదివాసీ విద్యావంతులు పొందలేకపోతున్నారు. ఇప్పుడు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల మూసివేత ప్రక్రియ ప్రారంభమైతే, వారు విద్యకు కూడా దూరం కావడం జరుగుతుంది.
2026 మే 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి రాష్ట్రంలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల బలోపేతం పేరుతో హేతుబద్ధీకరణ కోసం నియమ నిబంధనలను విడుదల చేశారు. పేరుకి ఆశ్రమ పాఠశాలల బలోపేతం అని చెప్పినా గానీ, 2020 నూతన విద్యా విధానం అమలు కోసం అని చెప్పినా కానీ, ఆచరణలో కొన్ని ఆదివాసీ ప్రాంతాలలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు మూసివేయడం, ఉపాధ్యాయ పోస్టులు తగ్గించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ప్రపంచ బ్యాంకు షరతుల ప్రకారంగా ఇప్పటికే మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభం కాబడి పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయ పోస్టుల కుదింపు జరుగుతున్నది. ఇప్పుడు ఆ ప్రక్రియ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వంతయింది. 2026 – 27 విద్యా సంవత్సరంలో ఒక్క పలాస నియోజకవర్గంలోనే మూడు ఆశ్రమ పాఠశాలలు, పాతపట్నం నియోజకవర్గం లో ఒక ఆశ్రమ పాఠశాల, రాష్ట్రం మొత్తంగా 47 ఆశ్రమ పాఠశాలలు మూతపడే పరిస్థితి దాపరిస్తోంది. మరికొన్ని ఉన్నత పాఠశాల స్థాయి ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయికి, మరికొన్ని ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయి ప్రాథమిక పాఠశాలల స్థాయికి కుదించబడడం జరుగుతుంది. ఫలితంగా ఆదివాసీ ప్రాంత విద్యార్థులు విద్యకు దూరం కావడం జరుగుతుంది. ఇదే అంశంపై జూన్ 26న శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో దళిత, ఆదివాసీ, ప్రజాసంఘాలు జరిపిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తుత హేతుబద్ధీకరణ పై ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది . గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మే 15న విడుదల చేసిన మెమోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతుంది.
పై విధంగా కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ఆదివాసి ప్రాంతాలలోని ఆశ్రమ పాఠశాలలను మూసివేసి, వారిని విద్య కు దూరం చేయాలని చూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జీవో 3 ని రద్దుచేసి, షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీ విద్యావంతులకు ఉపాధి అవకాశాలను ఉద్యోగ రంగంలో దెబ్బతీస్తున్నారు. ఇక వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రద్దు కాబడితే వారి ప్రాంతంలోని భూమి కూడా వారికి కాకుండా, భూస్వామ్య, పెట్టుబడిదారుల పరం కాబోతుంది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలలో మైనింగ్ పేరుతో అడవులను నాశనం చేస్తున్నారు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించి, ఆదివాసీలను నిరాశ్రయులను చేస్తున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలు ఏ శ్రీకాకుళ పోరాట ఫలితంగా విద్య, ఉపాధి, భూమిపై హక్కులు పొందారో, నేటి పాలకుల ఆదివాసి వ్యతిరేక విధానాలు ఫలితంగా ఆ ఫలాలు వారికి దూరం కావడం జరుగుతుంది. అవి దూరం కాకుండా ఉండాలంటే దళిత, ఆదివాసీ, ప్రజా సంఘాలు బలమైన ఐక్య ఉద్యమాలను చేసినప్పుడే పాలకుల కుట్రపూరిత విధానాలను నిలువరించడం సాధ్యమవుతుందని ఆశిద్దాం.
——– పేడాడ కృష్ణారావు, గౌరవాధ్యక్షులు,
డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, శ్రీకాకుళం.




