ఏమి ఊహాతీత ప్రపంచం ఇది
కలలకి వాస్తవానికి మధ్య
ఊగిపోవాల్సి వస్తోంది….
అసలు నేను నిర్మించే క్షణాలు ఎవరివి
నావనే కాదు గా…
ఇప్పుడు చూడు
ఈ నగరం లో నా చుట్టూ
పరుగులతో ఎగసిపడే సంద్రాన్ని
సందర్శచాల్సి వస్తోంది.
ఈ రణగొణ ధ్వనుల్లో
విలవిలలాడే ప్రాణాల్ని వీక్షిస్తున్నాను..
మనిషి యంత్రంలా పరుగిడినప్పుడే
అలసిపోయిన జీవికల్ని పరామర్శిస్తున్నాను
ఇక జారే క్షణాలని వలవేసి చూస్తే
కొన్ని సార్లు ఒంటరి క్షణాలే బాగుంటాయి
కొన్ని సార్లు ఒంటరి వానలే స్వేచ్ఛనిస్తాయి
కిటికీ లోకి తొంగి చూస్తే
లేత గాలులు మెత్తగా తడుముతూ ఉంటాయి
నిజం చెప్పనా
ఒంటరితనం బాధే కావచ్చు
అది ఒక బహుమతి కూడా…
మొదటి ఆఖరి ఒంటరి తనాల నడుమ
పోరాటం బహు గొప్పది
ఒకరు లక్ష్యం కోసం పోరాడుతారు
ఇంకొకరు సుఖం కోసం ఏడుస్తారు
అర్థం కాని సందర్భాల్లో
ఊపిరి నలిగి పోతుంది
ఇప్పుడు పెదవి విప్పి
ఏది కావాలని అడిగాను..
మౌనం ఇచ్చే ఒంటరితనంలో
ఆకాశమంత ప్రాపంచిక ఆనందాన్ని
నాలో వొంపుకుంటాను
కాలాలకి కొలమానం లేని
యుధ్ధ వీరుడు లా
సంగ్రామం లో కదిలిపోతుంటాను
నాకైతే ఆశయం ఆనందాన్ని ఇస్తుంది
కొందరికి క్షణాలు రంగుల హరివిల్లులైతే
చాలనిపిస్తుంది
ఎవరి లోకంలో వాళ్ళు
ఉబలాట పడుతున్నవాళ్ళే ..!
ఊహల్లో ఉన్నతిలో ఉన్న వాళ్ళే…!!




