తానాషాహీ నహీ చలేగీ, నహీ చలేగీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
హమ్ నహీ డరేంగీ, నహీ డరేంగీ అనే యువతరం రణ నినాదాలతో జంతర్ మంతర్ దద్దరిల్లింది.
సంజయ్ దూబే అనే అడ్వకేట్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తనను సీనియర్ అడ్వకేట్ గా గుర్తింపు ఇవ్వాలని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. ఆ కేసు విచారణ సందర్భంగా 15 మే 2026 న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ దేశ పాలకులను సమర్ధిస్తూ, యువతను అవమానించే విధంగా వ్యాఖ్యానిస్తూ, “సమాజంలో ఇప్పటికే పరాన్న భుక్కులు ఉన్నారు. అటువంటి వారితో మీరు చేతులు కలప దల్చుకున్నారా? అక్కడ బొద్దింకలలాగా యువకులు ఉన్నారు. వారికి ఏ ఉద్యోగం దొరకడం లేదు, ఏ వృత్తిలోనూ స్థానం లేదు. వారిలో కొందరు జర్నలిస్టులు అవుతారు. కొందరు సామాజిక మాధ్యమాల్లోకి వస్తారు. మరి కొందరు సమాచార హక్కుల కార్యకర్తలవుతారు. మరికొందరు ఇతర కార్యకర్తలుగా మారుతారు. వాళ్ళు ప్రతి ఒక్కరి మీద దాడి చేయడం ప్రారంభిస్తారు” అని చీత్కరిస్తూ యువత దుస్థితికి వారే కారణమంటూ, వారి ఆత్మగౌరవం పై దాడి చేశాడు.
ఈ వ్యాఖ్యలకు నిరసనగా అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న మన దేశ యువకుడు అభిజిత్ దీప్కే వ్యంగ్యంగా ప్రారంభించిన అన్ లైన్ ‘జెన్ జి మూవ్ మెంట్’ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) లో వారం రోజుల వ్యవధిలోనే రెండు కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ చేరారు. ప్రశ్న పత్రాల లీక్, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు, ఐదుగురు విద్యార్థుల మరణాలకు కారణమైన కేంద్ర మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ 8 లక్షల మంది సంతకాలు సేకరించింది. ఈ పార్టీ తొలిసారిగా ఇచ్చిన పిలుపు మేరకు తేదీ 6 జూన్ న జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా విజయవంతంగా ధర్నా జరిగింది. నీట్ ప్రశ్నా పత్రం (National Eligibility cum Entrance Test Undergraduate) లీకవ్వడం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE) 12 వ తరగతి బోర్డు ఎక్జామ్లో జరుగుతున్న అవకతవకలు, సీయూఈటి, ఎస్ ఎస్ సి, జెఈఈ డేటా లీక్ లను లేవనెత్తుతూ, వీటికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ ధర్నాలో స్వచ్ఛందంగా పాల్గొన్న దాదాపు 30,000 మంది విద్యార్థులు, యువకులు, సామాజిక ఉద్యమకారులు, సాధారణ ప్రజలు డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, పర్యావరణ ఉద్యమకారుడు, శాస్త్రవేత్త సోనమ్ వాంగ్ చుక్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల, రంగాలకు ప్రాతినిధ్యం వహించే వివిధ విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థుల కుటుంబాలు, ప్రొఫెసర్లు, స్వతంత్ర జర్నలిస్టులు, పరిశీలకులు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొనడానికి అమెరికా నుండి ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన అభిజిత్, అంబేద్కర్ అత్మ కథ పుస్తకాన్ని చేతపట్టి బయటకు రాగా ఈ ధర్నాలో పాల్గొన్న వారందరూ అంబేద్కర్, భగత్ సింగ్, పూలే, సావిత్రి బాయ్ పూలే మొదలగు సామాజిక ఉద్యమకారుల చిత్రపటాలు, పుష్ప గుచ్చాలు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యా రంగాన్ని కార్పొరేటీకరించి, కాషాయికరించి భ్రష్టు పట్టించడమే గాక పోటీ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించకుండా, గత పదేళ్ళలో దాదాపు 90 సార్లు పశ్న పత్రాలు లీకైనా ఏ మాత్రం జవాబుదారీతనం లేకుండా కోట్లాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది. ఈ పశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో బిజెపికి చెందిన ప్రముఖులు ఉన్నారని దర్యాప్తు సంస్థలు బయటపెడుతున్నా, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుపడుతూ ఈ నిర్వాహకానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మన దేశ యువతను ఉద్దేశించి మనువాద భావజాలంతో అహంకారపూరితంగా చీఫ్ జస్టిస్ చేసిన అవమానకర వ్యాఖ్యలను నిరసిస్తూ ఐదు నినాదాలతో ప్రారంభమైన సిజెపి ఆన్ లైన్ సెటైరికల్ ఉద్యమంలో వారం రోజుల వ్యవధిలోనే రెండు కోట్ల మందికి పైగా యువతరం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చేరడం పెను సంచలనానికి దారి తీసింది. ఈ ఉద్యమం తీవ్రమౌతున్న తీరు, వేగానికి పాజిటివ్ గా స్పందించకుండా కేంద్రంలోని పిరికిగొడ్డు బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు ఆర్ ఎస్ ఎస్-బిజెపి ప్రభుత్వం ఈ ఉద్యమం కుట్రపూరితమైనదని, పాకిస్థానీల,ఉగ్రవాదుల, అర్బన్ నక్సలైట్ల, దేశ ద్రోహుల కుట్ర అని నిందా ప్రచారానికి దిగింది. సిజెపి, అభిజిత్ ల ఆన్లైన్, ట్విట్టర్ ఖాతాలను రద్దుచేసింది. అభిజిత్ ను అరెస్టు చేస్తామని, ఉద్యమం విరమించుకోకపోతే అతన్ని, అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడింది. ట్రంప్, భారత విదేశాంగ ఉన్నతాధికారులు సిజెపిని హెచ్చరిస్తూ మాట్లాడినట్లు నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారు. ఒక విద్యార్ధి వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ, ఆన్ లైన్ పార్టీని, ఉద్యమాన్ని ప్రారంభిస్తే మహాఘనత వహించిన విశ్వ గురువుగా ప్రచారం చేసుకుంటున్న మోదీ ప్రభుత్వం ఎందుకింత భయపడుతుంది? గజగజ వణికిపోతుంది? అంతేగాక తన ఐటీ సెల్, కేడర్ తో పాటు మొత్తం ప్రభుత్వ వ్యవస్థ లన్నింటినీ రంగంలోకి దించింది. అభిజిత్ ఇండియాలో కాలుమోపగానే అరెస్టు చేస్తారనే ప్రచారంతో సర్వత్రా ఉత్కంఠం నెలకొన్నది. ధర్నాకు అనుమతిచ్చినా వేలాది పోలీసులను, అర్ధ సైనిక బలగాలను, ధర్నాలో పాల్గొన్న వారి ఫోటోలు తీయడానికి 150 మంది ఫోటో గ్రాఫర్లను మోహరించింది. తన అరాచక కాషాయ మూకను కూడా ధర్నా వద్దకు పంపి, ఆందోళనకారులను రెచ్చగొట్టే విధంగా జై శ్రీరామ్, తుకుడే తుకుడే గ్యాంగ్ అంటూ నినాదొలిచ్చి, ఘర్షణ వాతావరణం సృష్టించినా ధర్నా విజయవంతం కావడంతో శాంతి ప్రియులు, ప్రజాస్వామికవాదులు ఊపిరి పీల్చుకున్నారు.
కేంద్రంలోని అర్ ఎస్ ఎస్ – బిజెపి ప్రభుత్వం భిన్నాభిప్రాయాలను సహించకుండా, విభజన రాజకీయాలకు, ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్న సందర్భంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటు వేలాదిగా సాధారణ జనం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ ధర్నాలో, ఉద్యమంలో భాగస్వాములు అవుతుండడం వల్ల దేశ వ్యాప్తంగా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ధర్నాలో పాల్గొన్న ఆందోళన కారులను ఉద్దేశించి అభిజిత్ దిప్కే మాట్లాడిన విషయాలు దేశ ప్రజలను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ “తమ పిల్లలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే ఏమవుతుందో అన్న భయం ఈ దేశంలోని ప్రతి తల్లికీ ఉంది. ఈ ప్రభుత్వానికి భయపడి ఎంతకాలం బతకాలి” అని నినదించడంతో ఆందోళనకారులు సిగ్గు సిగ్గు అని నినాదాలు చేశారు. ఆయన ఇంకా “హిందూ -ముస్లిం రాజకీయాల వల్ల దేశంలో ఎవరికైనా ఏమైనా ప్రయోజనం కలిగిందా, గత పది సంవత్సరాలుగా వాళ్ళు మనల్ని హిందూ -ముస్లిం రాజకీయాల లోకి లాగుతున్నారు. ఈ రాజకీయాల వల్ల ఇక్కడ ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? అని నిలదీశారు. ప్రశ్నా పత్రాలు లీకై ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే, నిరసన వ్యక్తం చేస్తున్న తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగించడం పై దృష్టి పెట్టారని అన్నారు. అందుకే సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మనది దీర్ఘకాలిక పోరాటమని, కాషాయ మూకలు ఉద్రిక్తతలు సృష్టిస్తే రెచ్చిపోవద్దని, ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా ఆందోళన నిర్వహించాలని పదే పదే ఆందోళనకారులకు విజ్ఞప్తి చేసి ధర్నాను విజయవంతంగా ముగించి పాలకులకు గట్టి హెచ్చరికలు పంపడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించడం సిజెపి ధృడ సంకల్పానికి నిదర్శనం.
ఒక ఆశగా, అవసరంగా ఒక దిగువ మధ్యతరగతి యువకుడు ఇచ్చిన పిలుపుకు ఇంత పెద్ద ఎత్తున కోట్లాది మంది దేశ యువత, ప్రజలు, ప్రజాస్వామికవాదులు స్పందించడంలో గల ఆంతర్యం మన వ్యవస్థ అనే అగ్ని పర్వత గర్భంలో రగులుతున్న అగ్ని, అది పేలి లావాలాగా ప్రవహించడానికి సిద్ధంగా ఉందని గుర్తించాలి. అది కుళ్ళి కంపు కొడుతున్న ఈ వ్యవస్థను దహించి వేయనుందని గుర్తించాలి. దీనికి తగ్గట్టుగా స్పందించడంలో ప్రతి పక్ష రాజకీయ శిబిరం విఫలమైంది. ఎంతసేపు ఓట్ల జాతరలో కుమ్ములాడుకుంటూ, నువ్వు దిగు నేనెక్కుతానంటూ పదవుల కోసం, ప్రజల లూఠీ కై పోటీపడుతూ జెన్ జీ ఆశలు, ఆకాంక్షలను పట్టించుకోకపోవడం లేదు. వీరితో పాటు ప్రజానుకూల రాజకీయ శిబిరం కూడా ప్రజలు ముఖ్యంగా జెన్ జీ దోపిడీ వర్గాల సంస్కృతి ప్రభావంలో పడి తప్పుదోవ పట్టి పోరాటాలకు సిద్ధంగా లేరని సిద్ధాంత రాద్ధాంతాలతో కాలయాపన చేస్తూ వెనుకబడింది. దేశంలో వందల రాజకీయ పార్టీలు, వేలాది ప్రజా సంఘాలు ఉండి, అడపాదడపా కొన్ని ఆందోళనలు చేస్తున్నా సిజెపికి ఇంత ఆదరణ లభించడానికి ముఖ్య కారణం అవి ప్రజల సమస్యలపై ముఖ్యంగా యువత జీవన్మరణ సమస్యల పై, వారి భవిష్యత్తు గురించి దృష్టి కేంద్రీకరించడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా సామ్రాజ్యవాదుల, కార్పోరేట్ కంపెనీల సేవలో తరిస్తున్న అధికార పక్షపు, ప్రతి పక్షపు పార్లమెంటరీ పార్టీలను, ప్రజా సంఘాలను జెన్ జీ విశ్వసించడం లేదు. ఈ పార్టీలన్నీ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాలలోనూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, నిరంకుశంగా అధికారాన్ని వెలగబెడుతూ ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నవే. అందుకే వీరిచ్చే పిలుపులకు పెద్దగా స్పందించడం లేదు. ఆర్ ఎస్ ఎస్ – బిజెపి ఫాసిస్టు రాజకీయాల విజృంభణ సందర్భంలో ఒక ఆశగా, ఉప్పెనలా ఎగిసిపడుతున్న జెన్ జీకి స్వాగతం. వీరికి అండగా ఉంటున్న ప్రజాస్వామికవాదులైన విద్యా వేత్తలకు, శాంతి ప్రియులకు జేజేలు. జెన్ జీ వర్ధిల్లాలి. జెన్ జీ ప్రజాస్వామిక ఉద్యమంలోని పాజిటివ్, నెగెటివ్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొంటూ, మరో కుట్రకు ఈ ఉద్యమం బలిగాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిది.
దేశం తీవ్రమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఈ ఉద్యమం బలపడి, డిమాండ్లు సాధించుకొని సర్వ రంగాలకు విస్తరించి, దేశాన్ని కాపాడాలని కోరుకుందాం.
ఈ సందర్భంగా విప్లవ కవి చెర కవిత్వాన్ని గుర్తు చేసుకుందాం.
యువతరమా నవతరమా
దేశానికి కళ్ళు నీవే, కాళ్ళు నీవే
యువతరమా నవతరమా
నీ మీదే మా ఆశలు
యువతరమా నవతరమా
తుఫానువలె ఆగ్రహించు,,,,
తేదీ.7-6-2026.




