ఈ పుస్తకంలో 35 కవితలున్నాయి. ఆగస్టు 7 వ తేదిన రాయలసీమ విద్యా వంతుల వేదిక, రాయలసీమప్రగతిశీల విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెనుకొండ శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి. ఆదిశేషారెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. ప్రధాన వక్తలుగా సడ్లపల్లి చిదంబర రెడ్డి గారు, శ్రీనివాసులు, (ఓపిడిఆర్) గారు, రైతుసంఘం నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి గారు తరిమెల అమర్ నాథ్ రెడ్డి గారు పాల్గొన్నారు. కవి చంద్రహాస, రాహుల్ సమన్వయం తో, వెంకటేష్, లక్ష్మి ల పాటలతో సభ మొదలైంది. నేను ఈ సభలో ఈ పుస్తకం పరిచయం చేశాను. కేవలం ఆ పరిచయానికి మాత్రమే ఇక్కడ పరిమితం అవుతున్నాను.
అనంతపురం కథా రచయిత ఉప్పరపాటి వెంకటేశులు గారి మొదటి కథా సంపుటి చిత్రావతి కథలు చదివా ఇదివరకు. ఇప్పుడు చంద్రహాస కవిత్వం. ఒకప్పుడు జీవనది గా ప్రకాశించిన చిత్రావతి నేడు ఆ నీటి జాడలను వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఆ జ్ణాపకాలను ఎందరో తమ రచనల్లో చెప్పి ఉంటారు. అయితే చంద్రహాస చిత్రావతి మిణుగురుల ద్వారా ఏమి చెప్పారు. నేను అర్థం చేసుకొన్న మేరకు అక్కడ హాజరయిన 200 మంది విద్యార్థులకు పరిచయం చేశాను.
చిత్రావతి మిణుగురులు కవిత్వం లో కవి ఉపయోగించిన ప్రతీకలు, సులభతరమైన వాడుక భాషతో పాఠకులను తమ అనుభూతిలో భాగం చేసుకొని, విభిన్నమైన భావోద్వేగాలతో సంభ్రమానికి గురి చేస్తాయి. ఈ కవిత్వానికి ప్రేరణ కవి అనుభవించిన జీవితం, తిరిగిన ప్రదేశాలు, మనసుతో మమేకమైన మట్టి మనుషులు, పొందిన జ్ఞానం, తన చైతన్యానికి దిక్సూచి అయి, తనను ప్రభావితం చేసిన వ్యక్తులు.. ఇదంతా అవసరమవుతుంది. కవిత్వం కేవలం చదివి కవిత్వం గా మాత్రమే చూస్తే చెప్పటానికి ఏముంటుంది. ఆ కవిత్వం రికార్డు చేసిన కాలంలో సంఘటనలు, సందర్భాలు, రాజకీయాలు, ప్రజల ఆకాంక్షలు, మెరుగైన జీవితం కోసం పడే తపన, సంఘర్షణలు, ప్రజలకోసం జీవితమంతా పనిచేసిన వేగుచుక్క లు ఈ కవిత్వానికి ప్రేరణ. ఈ కవిత్వానికి ముందు మాట లో డాక్టర్ నాగేశ్వరాచారి, కవి ఏ రాజకీయాల వైపు నిలబడ్డాడో, తన కవిత్వానికి ఆవేశం జీవనాడి గా ఎలా మారిందో చెప్పారు. నూతన సమాజం కోసం తన తొలి సంతకంగా చిత్రావతి మిణుగురులు అందించారు. అనంత విప్లవోద్యమంలో వేగుచుక్క, కవి, రచయిత అయిన తన తండ్రి లోచర్ల పెద్దారెడ్డి కవిత్వ వారసునిగా చంద్రహాస కలం పేరును అందుకున్నాడు చంద్రహాస.
చిత్రావతి మిణుగురులు మనకు ఏమి చెబుతాయి… ఏ చరిత్రకు దోవ చూపుతాయి. ఏ కలలు చిత్రావతి లో ఆవిరైపోయాయి. చంద్రహాస బాల్యం ఏ కథలను చెప్పింది…అది వడ్డించిన విస్తరా, లేకుంటే అలిశెట్టి ప్రభాకర్ కవితలాంటి బాల్యమా? ఏ జ్ణాపకాల వెలుగులను తనలో దాచుకున్న ది చిత్రావతి…. అక్కడ వెలిగినది బేలాపూల ఇంద్లధనుసా? ఏ పచ్చని మనుషులు కథలుగా చెప్పిన సాహస గాధలా చిత్రావతి మిణుగురులు ఆ చరిత్రను చదవమంటాయి. మన్ను తిన్న మట్టి మనుషులను చూడమంటాయి.
అసమ సమాజం పై యుద్ధం ప్రకటించిన ప్రముఖ కమ్యూనిస్టు లైన కామ్రేడ్ రవూఫ్ గారు, తరిమెల నాగిరెడ్డి గారు, లోచర్ల పెద్దా రెడ్డి గారు, కవికాకి జై సీతారాం గారు లాంటి వారిని గుర్తు చేసుకుంటూ ప్రజలకోసం మాట్లాడుతున్న మేధావులు, రచయిత లు ప్రొఫెసర్ సాయిబాబా, వి.వి. గారు, స్టాన్ స్వామి మొదలు కొని జైళ్ళలో నిర్భంధం లో అనామకంగా మగ్గిపోతున్న ఆదివాసీల వరకు ఈ కవితల్లో సూటిగా ప్రశ్నించారు. చంద్రహాస. గత పది సంవత్సరాల సంక్లిష్ట సామాజిక సందర్భాలను గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వినిపిస్తూ ఉన్న రాయలసీమ ఉద్యమ ఆకాంక్షలు నెరవెరే వరకూ తాను రాయల సీమ వైపే నని విస్పష్టంగా ప్రకటించారు. మేం రగడ చేస్తాం కవితలో. “తరాలుగా మాపై కరువుల బరువెత్తి/బండబతుకులుగా మార్చిన వికృత విధానాల పాలనపై/మేం రగడ చేస్తాం.” (పేజీ 28).
తెలుగు భాష పై ఎనలేని ప్రేమ “నా అక్షరాలకు ఆపద రాదు ” కవిత ద్వారా ప్రకటించారు. కరోనా కాలంలో అనుభవించిన గృహ నిర్బంధం గురించి రాస్తూ…మేధావులపై ఏండ్ల తరబడి కొనసాగుతున్న రాజ్య నిర్భంధం ను తలచుకొంటూ “మా ఇళ్ళు ఇప్పుడు జైళ్ళు/ మేంఖైదీలం/ నిర్భంధం ఎంత ఘోరమో తెలిసింది “అంటూ ఎప్పటికైనా మనిషికి మనిషే తోడు అంటూ జీవన విలువలు నేర్పిన కరోనా కు ధన్యవాదాలు చెప్తారు కవి. ప్రశ్నించే గొంతులను జైళ్ళలో పెట్టినా ప్రశ్న సజీవంగా ఉంటుంది. ఆలోచనలకు జీవం ప్రశ్న కవిత ద్వారా ధిక్కార స్వరం వినిపిస్తారు. పీడిత ప్రజల ఉరఫ్ అతడే అతడతడే రవూఫ్ గారికి లాల్ సలాం చెప్తాడు… రాయల సీమ విద్యా వేత్త, కవికాకి జై సీతారాం గారిని తలచుకుంటూ ఈ కరువు నేలలోంచి మొలుచుకొచ్చిన కవితా ఖడ్గం అంటూ తన చైతన్యానికి, సామాజిక స్పృహ కు మార్గం తండ్రి నడిచిన విప్లవోద్యమం అని ప్రకటించారు. ‘యస్’ అనే కవితలో ఇలా ప్రకటిస్తాడు ” యస్… మీరు నన్ను నక్సలైట్ కొడుకు అని అన్నప్పుడల్లా/నా కాలర్ ఎర్రజెండాలా ఎగురుతుంది…” అనే కవిత చాలా అందమైన కవిత. ఈ కవిత పాఠకులను తప్పకుండా ఆకట్టుకొంటుంది. (పేజి 34, చిత్రావతి మిణుగురులు).
అసలైన విషయం చిత్రావతి నది తనలో ఎన్ని పాయలుగా ప్రవహించి, రగిలించిందో చెప్పే చక్కని కవితలు న్నాయి. అతని చైతన్య తరంగాలకు, హృదయ స్పందనలకు కారణమైన చిత్రావతి గురించి… ‘నువ్వు…చిత్రవతి…నేను ‘ కవితలో “నా మెదడుకు కంప్యూటర్ను అనుసంధానిస్తే మానిటర్ పై మొదటగా ఆవిష్కృతంమయ్యేది చిత్రావతి జీవన చిత్రమే…” ‘అమ్మ…చిత్రావతి’ కవితలో ‘ఇప్పుడు అమ్మ లేదు /చిత్రావతి లేదు /ఇద్దరు నా హృదయంలో ప్రవహిస్తున్నారు’ అంటాడు చంద్రహాస. ఈ కవితలు చదువుతున్నపుడు అతని జ్ఞాపకాలను, చైతన్యాన్ని ఎంత గాఢంగా ప్రభావితం చేసి కాంతివంతమైన కవితలుగా మార్చిందో పాఠకులు తప్పకుండా ఈ కవిని, ఆయన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తారు. మరి సాహిత్యం రికార్డు చేసిన రెండు తరాల చరిత్ర కు ఆధారం గా ఈ మిణుగురులు దారి చూపుతాయి.
ఈ పుస్తకంలో ఏ కవిత చదివినా చంద్రహాస సృజనాత్మక శక్తి ని, సున్నితమైన భావ సౌందర్యాన్ని, సులభతరమైన పదబంధాల వాడుకను అర్థం చేసుకోవచ్చు. పాఠకుల ఆలోచనల్లో కొత్త చైతన్యంతో పాటు, ఈ ప్రాంత జీవనం పై ఆశావహ దృక్పథం కలిగిస్తుంది. దశాబ్దాల ఉద్యమాలు, అవి చూపిన దారులు, వేసిన ప్రశ్నలు పాఠకుల మనసులను సూటిగా తాకుతాయి. 59 పేజీల ఈ కవితా సంపుటి లో ప్రతి కవితా విశిష్టత కలిగినదే. అతనిలోని కవిని చిత్రావతి అందంగా రకరకాల రంగులతో అలంకరించి అలరించింది. చిత్రావతి పేరెత్తితే చాలు మనసు వెర్రెత్తి పోతుంది. బేలీపూల ఇంద్రధనుస్సు అవుతుంది అంటూ, అతని మాటల్లో నే గడిచిన బాల్యం, పేదరికం గురించి తలుచుకుంటూ పేదరికం త్యాగాల పెన్నిధి గా ఎలా అయిందో అర్థం చేసుకున్న గొప్ప సంస్కార కవితా సౌందర్యం ఈ సంపుటి.
Poverty is a grateful boon
It restores love and wisdom… అంటారు చంద్ర హాస.
‘డిక్లరేషన్ ‘ కవిత చదివితే మతములన్నియు మాసిపోవును, మానవత్వం నిలిచి వెలుగును…అనే కవిత స్ఫూర్తి గుర్తుకొస్తుంది. జర్మన్ మహాకవి గేథే అన్నాడు.”. True art cannot exist without emotion”. ఏ రూపం లో ఉన్న సాహిత్యం లేదా చిత్రకళ, ఇంకా మానవ సృజనాత్మక కళా రూపాలు మానవ అనుభవాలు, జీవన సంవేదనలు, సంఘర్షణలు, ఉద్వేగాలను ప్రతి ఫలిస్తే పాఠకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. తండ్రి కామ్రేడ్ లోచర్ల పెద్దా రెడ్డి గారు చంద్రహాస, బోధాయన, పెదయ్య వంటి పేర్లతో ఎన్నో కవితలు రాశారు ఆయన కవితల పుస్తకం,”రక్త సిక్తసోపానాలు” తరగని విలువల ఆదర్శమైన తండ్రి కి ‘కన్నీటి వందనం ‘ కవితలో వ్యక్తీకరించాడు. ప్రజల జీవన సంఘర్షణను, ఎందరో మహనీయులను, మృగ్యమైన మానవ విలువలపట్ల నిరసనను ఈ కవిత్వం రికార్డు చేసింది. అమరత్వం అనే పదానికి కొత్త అర్థం చెప్పింది. మనిషి సహజాతంగా సాటి మనిషి పట్ల, సమాజం పట్ల బాధ్యత గా స్పందిస్తూ మానవీయ విలువలతో జీవించడమే అని చెబుతున్న ఈ కవిత్వాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నా. తప్పకుండా చదవండి. నా పరిచయం వలన చంద్రహాస కొందరికైనా పరిచయం అవుతాడనే ఆశతో…
పుస్తకాలు దొరుకు చోటు.
P. Rajasekhar
Mitra Jyotsna Publications
H. No. 2–311,
Madakasira Road,
Near Vijay Residency,
Penukonda –515110
Mobile 9441508510.
శశికళ




