చుక్ ..చుక్ బండి వస్తోంది...
పక్కకి పక్కకి జరగండి..
ఆగినంకా ఎక్కండి... 
జో జో పాపా ఏడ్వాకు అయోధ్య లడ్డు తినిపిస్తా...
కమ్మటి పానకం తాపిస్తా !    
వెళదామా అయోధ్యకి?
అక్కడినుంచక్కడికే కాశీకి ?
రానుపోను రెండు వేలెనట చార్జీలు...
తిండీ.. పిండీ అన్నీ రైలె పెట్టుకుంటుందిట.
మీ జిల్లాకే వచ్చి మిమ్మల్ని తీసుకుపోతుందట
అరె పదండి... చు క్ చు క్ రైలు వచ్చింది..
ఎక్కేయండి!       
ఎలెక్షన్ల లోపు రెండు వేలే.. 
తరువాత ఒక్కో మనిషి కి ఇరవై వేల ఛార్జీలు..ఎక్కడ పెట్టుకుంటారు అంత?
ఇప్పుడైతే రాముడు ఇస్తాడు .
పాలస్తీనా జాతి హననం చేసిన ఇజ్రాయిల్ని గాడంగా కౌగలించుకుని..
ఇక్కడ అయోధ్య అక్షింతల మూటలు విప్పి...
ఇంటింటికీ అదేదో అమృత భోజనంలా పంచుతున్న ఈ దేశ పీ. ఎం ఇస్తాడు రైలు చార్జీలు !
అక్కడికెళ్లి పూనకాల తో ఊగి పోండి..
అయోధ్య రైలు ఎక్కి దేశ భక్తులై పోండి !
పంజాబ్ లో రైతుల్ని మాత్రం కలవధ్ధు.. మీకు అన్నం పెట్టే రైతుల్ని అస్సలు తలవధ్ధు.
బిల్కిస్ ను రేప్ చేసిన రేపిస్టులు విడుదలై లడ్లు పంచుకుంటుంటే...చూడలేని 
ఆమెకన్నీరు..అవమానం మీకెందుకు ?  
 మీరు కట్ట కట్టుకుని జై మాతా..సీతా..రామా అనుకుంటూ అయోధ్య రైలెక్కెయ్యండి !
పోనీ అయోధ్య రాముణ్ణే..ఎనిమిదేళ్ల పసి కూన ఫాతిమా ఖానుమ్ ని నీ గుళ్ళోనే 
నీ భక్తులే ఎందుకు హత్యాచారం చేసారు రామా అని అడగండి.. 
అయోధ్య రైలులో వస్తూ.. పోతూ 
మిమ్మల్ని తీసుకెళుతున్న ఆ రామ భక్తులనన్నా అడగండి !
25ఏళ్ల యువ రైతు గుండెల్లోంచి అయోధ్య కట్టించిన వాడు దించిన బులెట్  రక్తపుటేరులై పారుతోంది...ఆ తల్లుల కన్నీళ్లు  పంజాబ్ పొలాల్లోని ధాన్యాన్ని ఎర్రగా మార్చాయి.
అరె.. నీకు పాలస్తీనా పిల్లల రుధిరకన్నీళ్లు ఎందుకు...
నీకు అన్నం పెట్టే రైతుల మీద కురిసే తూటాలు తీసే ప్రాణాలు ఎందుకు...
పో..పోయి అయోధ్య బండి ఎక్కు...
ధర్నా చౌక్ లో రైతులకు నీళ్లు,కరెంట్  కట్ చేసినా ...
బస్సులు,రైళ్ళని ఆపివేసినా..
రైతుల్ని చచ్చేట్లు కొట్టినా...
నీకు మాత్రం అయోధ్య రైలులో ..
అయోధ్య వసతి గృహంలో అన్నీ సౌకర్యాలు ఉంటాయి.
నిన్ను హృదయానికి హత్తుకుని మరీ స్వాగతం చెబుతారు.
అది బడుగు ప్రజల రైలు కూడా..
అన్నం పెట్టి.. చాలా చవకగా తీసుకెళుతుంది.
రాముణ్ణి చూపిస్తుంది !
ఎక్కేయ్..అయోధ్య రైలు !
ఈ లోపల వాడు మళ్లీ
ఇంటి లోపలికి వచ్చి అక్షింతలు ఇస్తాడు...
నిన్ను రైల్వే స్టేషన్ కి నీ చేయి పట్టి తీసుకెళ్లి అయోధ్య బండి ఎక్కిస్తాడు.
ఇది దఫ దఫాలుగా నడుస్తూనే ఉంటుంది.
వాడు ఎంత గొప్ప పనులు చేస్తున్నాడని మరి ?
ఆకాశంలో విమానం లేకుండా ఎగురుతాడు..
నీళ్ళల్లో ఆక్సిజన్ లేకుండా మునుగుతాడు ...
మంత్రం వేసికొత్త  అయోధ్య భక్తులను చిటికెలో సృష్టిస్తాడు..
వాడొక కొంగ్రొత్త దానవుడు...
కనిపించని కోరలతో...అఘోరమై ప్రత్యక్షమవుతాడు.
వాడొక మాంత్రికుడు !
ఈ దేశంలో బలహీనులందరినీ..గుటుక్కున మింగేసి మాయం చేస్తాడు!
వాడు దేశమంతా తానే అయోధ్య రైలయి పోయి శర వేగంతో తిరుగుతుంటాడు...
దేశాన్ని అయోధ్య చుట్టూ తిప్పుతూ ఉంటాడు.
వాడు..ఆ మొండివాడు..
 కొన్ని కొత్త ఆచారాలు సృష్టిస్తాడు.
అయోధ్య అక్షింతలను ఉడికించి నీ పితృలకు పిండం పెట్టమంటాడు.
అయోధ్యలో పరమత సహనం కూడా పాటిస్తాడు !
 కానీ..వాడు నువ్వు అయోధ్య రైలు ఎక్కక పోతే..
వాడిచ్చిన అక్షింతలు తీసుకోక పోతే నీ కాళ్ళు చేతులు నరికినా నరుకుతాడు..
మెడ బట్టి మరీ అయోధ్య రైలు ఎక్కిస్తాడు.
వాడు నీకు అయోధ్యని అలవాటు చేస్తాడు..
నీ పక్కింటి రహీంకి..
కాలిఫోర్నియాఎయిర్పోర్ట్ లో రాబర్ట్ కి...
భగవత్గీత పంచుతూ... 
అయోధ్యని..అక్షింతల్ని విశ్వవ్యాప్తం చేస్తాడు...
కాశీ ఎందుకు ..ముందు అయోధ్యే అంటాడు.
వాడేం చేస్తారనుకున్నారు...
రాముడి కంటే ముందు కార్పోరేట్ తల మీద కిరీటం పెడతాడు.
వాడే మన రాముడని చెప్తాడు !
వాడు నీకు కొత్త కార్పోరేట్ రాముణ్ణి సృష్టించి చూపిస్తాడు. 
వాడు నీకు అయోధ్యని అలవాటు చేస్తాడు !
అయినా వాడు ..తనను తాను మహా బలవంతుడనుకున్న వాడు..
తిరుగే లేదనుకుని విర్రవీగుతున్నవాడు అర్థం చేస్కోవాల్సిందేంటంటే....
కొన్ని మహాద్భుతాలు..కూడా జరిగిపోతాయని !
ఇన్ని వందల అయోధ్య రైళ్ళని తప్పించుకుని...
ఒక చిన్న వీల్ చైర్ కూడా సడి లేకుండా వస్తుందని.,
అందులోనుంచి ., ఒక నూతన మానవుడు కోటి సూర్యప్రభలతో మెల్లిగా దిగుతాడని !
అరె.. పక్కకి పక్కకి జరగండి...చుక్.. చుక్ బండి వస్తోంది!
15.3.2024.

2 thoughts on “చుక్ చుక్ బండి వస్తోంది !

Leave a Reply