నది తన మొండి దుఃఖాన్ని అలలు అలలుగా సముద్రంలో నిస్సహాయంగా కలిపేస్తున్న క్షణాల్లో ప్రియా
చుట్టూ కమ్ముకున్న గాఢంధకారం లోంచి నీ జ్ఞాపకం నన్ను కమ్మేస్తుంది
..
అనాథలా వదిలివేయబడ్డ ప్రాతః కాలంలో
ఓహ్ తిరస్కృతుడా ఇది నీ వియోగ సమయం!
నా హృదయం మీద మంచుపూలు తలలు తెగ్గొట్టుకొని వర్షంలా కురుస్తూనే ఉన్నాయి!
బహుశా శిథిల కూపంలో ధ్వంసమైన నౌకలాంటి నా హృదయం మీద రాలిపడే పూల రెమ్మలు!
..
నీ లోలోపల ఎన్ని యుద్ధాలు, ఇంకెన్ని ఓడిపోయి పారిపోవడాలు కిక్కిరిసి ఉన్నాయో?
నీ లోపలినుంచే కదా ప్రియా!
పాటల పక్షులు రెక్కలు విదుల్చుకుంటూ లేచి పైకి ఎగిరేవి?
చూడు నువ్వు మన ఇద్దరి మధ్య ఉన్న అన్నింటినీ మింగేశావు!
అచ్చం మన మధ్య ఉన్న తరగని దూరాలలాగా !
అంతులేని సముద్రం లాగా, ఎడ తెగని కాలం లాగా!
నీలోపలే నా సమస్తమూ మునిగిపోయింది చూడొక్కసారి!
....
ఆపుకోలేని ఉన్మత్తమైన వాంఛతో మోహపూరితమైన ముద్దూ
దాడి లాంటి కోరికా ఏకకాలంలో కలిగించిన అలౌకికానందపు క్షణాలు కదా అవి?
ఎగసి పడే సముద్రం మీది దగధగద్ధమాయమైన కాంతిని చిమ్మే దీపస్థంభం లాగా వెలిగిపోయిన మాంత్రిక గడియ అది మరి!
ఆ క్షణాల్లో పైకి ఎగరలేని పైలెట్ భయం, గుడ్డివాడైన సముద్రపు లోతుల్లో చిక్కిన డైవర్ ఆగ్రహంలాగా రెండూ ప్రణయోన్మాదపు అల్ల కల్లోల మైకంలో నీలోనే, కేవలం నీలోనే సుమా అంతా పూర్తిగా మునిగి పోయింది! ..
బాల్యపు పొగ మంచులో నా ఆత్మ రెక్కలు తొడుక్కుని మరీ గాయపడింది!
నిన్ను కోల్పోయాను!
ఓ, నా అన్వేషకురాలా!
చూసావా నీలోనే, నాది మాత్రమే అనుకున్నదంతా మునిగిపోయింది!
..
నువ్వు దుఃఖాన్ని ఆక్రమించుకుని,వాంఛని మాత్రం వదలక అంటిపెట్టుకునే ఉన్నావు!
నీదైన వేదన నిన్ను నిశ్చేష్టురాలిని చేసింది!
చూడు! ప్రియా నీలోనే నాదనుకున్నదంతా పూర్తిగా మునిగిపోయింది!
..
ఎంతో ప్రయాసపడి మన మధ్యని నీడల గోడల్ని కాసింత వెనక్కి తగ్గేలా చేశాను!
ఏం చేయను?
గత్యంతరం లేకండా కోరిక,కర్మలకు అతీతంగా నేను ముందుకే నడిచాను!
..
ఓహ్ దేహమా! నావైన రక్త మాంసాలు, తీవ్ర వాంఛలు నిండిన దేహమా!
ఓ నా స్త్రీ! నేను గాఢంగా ప్రేమించీ, నేను కోల్పోయిన ఓ నా ప్రియురాలా!
వణికించే ఈ చల్లని శీత వేళలో నిన్ను ఆవాహన చేస్తున్నాను!
రా ఇటు!చూడు నిన్ను వేదనతో పిలుచుకుంటు న్నాను!
నీ కోసం, ఒక్ఖ నీ కోసమే నేను పాటలు పాడతాను!
..
అచ్చం నువ్వు పాత్రలో నీ ప్రేమని,సున్నితత్వాన్ని నింపినట్లు అలా నీ కోసం నేను పాటల్ని పంపిస్తాను !
అయితే చిత్రమేమిటంటే నీ అంతులేని మరుపు నిన్ను ఒక నీటి కుండలా పగలగొట్టేసింది!
నువ్వు ముక్కలైపోయావు!
...
మన మధ్య ఎక్కడో ఒక చోట చిక్కటి నల్లని ఏకాంతపు ద్వీపాలుండేవి!
అక్కడ నా ప్రియురాలా, నీ చేతులు నన్ను లాక్కుని గాఢంగా హత్తుకున్నాయి!
అక్కడే దాహమూ ఆకలీ కూడా వేధించేవి!
అయితే ప్రియా నువ్వే నా ఆకలి తీర్చే ఫలానివి!
అక్కడే విషాదమూ , శిథిలాలూ రెండూ ఉండేవి!
కానీ అక్కడే అత్యద్భుతమైన నువ్వూ ఉండేదానివి!
..
ఓహ్! నా ప్రియురాలా!
నా స్త్రీ! నా దానా!
అసలు నువ్వు లోతైన నీ ఆత్మ అనే భూమి లోపల,
నీ వెచ్చని బాహువుల మధ్య నన్నెలా అదుపులో ఉంచుకుంటావో నాకైతే అర్థమే కాదు!
..
విచిత్రమేమిటంటే నీ పైన నా వాంఛ ఎంత ఉన్మత్తమైందో అంతే క్షణిక మైనది కూడా నమ్ముతావా?
అది ఎంత కఠినమో,అంతగా మైకం పుట్టించేది!
ఎంత ఉద్రిక్తమో అంత వెర్రిగా ఉర్రూతలూగించేది కూడా!
..
ఓహ్ !నువ్వొక ముద్దులు నిండిన శ్మశానానివి!
చూడు! నీ సమాధులలో ఇంకా అగ్గి ఎలా రాజుకుంటూనే ఉందో!
అక్కడ ఇంకా మండుతూ ఉన్న కొమ్మలపై పక్షులు వాలి పండ్లను పొడుస్తూనే ఉన్నాయి! ..
ఏం క్షణాలవి?
ఓహ్! తీవ్రమైన వాంఛతో నేను కొరికిన నీ లేత పెదాలు,చిన్ని నోరు, ఆత్రంగా ముద్దు పెట్టుకొన్న నీ చేతులు,ఆకలితో ఉన్న నా దంతాలు!
ఓహ్ ఏం చెప్పను తీవ్ర మోహావేశంతో పెనవేసుకున్న మన రెండు దేహాలు!
ఇద్దరం బలమైన వాంఛ తో, వెర్రి ఆశతో ఒకరిలో ఒకరం ఐక్యమైపోయామా?
అవలేక ఆగ్రహంతో నిస్పృహ చెందుతూ విడిపోయామా ఏమో.,ఏమో?
..
ఆమె దేహ సౌకుమార్యం తేలిపోయే నీరంత తేలికగా,కలిపిన పిండి అంత మెత్తగా!
ఇక పెదవుల మీది పలుకు మొదలవ్వక ముందే ఆమె మాట్లాడడం మొదలు పెట్టింది!
ప్రియుడా! ఇదే నా గమ్యం! నీలోనే ఉంది నా ఆకాంక్షల ప్రయాణం అంటూ!
నా మోహం,వాంఛా అంతా ఆమెలో నిండిపోయింది!
అవును ప్రియా!సర్వం నీలోనే మునిగిపోయింది!
..
ఓహ్ శిథిల కూపమా నా సమస్తమూ నీలో లయించిపోయింది!
ముందైతే నువ్వు ఏ దుఃఖాన్ని పైకి చెప్పలేదో చెప్పు!
నువ్వు నిండా మునిగిపోని వేదన అంటూ ఏదైనా ఉందా చెప్పు?
సముద్రంలో ఒక నీటి అల మరో నీటి అలని చేరే దాకా,ఓడ ముందరి సరంగులా నిలబడి నువ్వు పాడుతూనే ఉన్నావు!
ఆపకుండా నన్ను పిలుస్తూనే ఉన్నావు!
..
నువ్వు నా పాటలలో ఇంకా వికసిస్తూనే ఉన్నావు!
నా లోలోపలి ప్రవాహాలలో ఇంకా పారుతూనే ఉన్నావు!
..
ఓ శిథిలమైన గొయ్యి ముందు
నోరు తెరిచినట్లున్న చేదు నుయ్యిలాంటి నీలో,
ప్రేమికురాలా! నీలోకి ఎవరు ఇంకిపోలేదో చెప్పు?
పాలిపోయినట్లున్న గుడ్డి సముద్ర ఈతగాడు, దురదృష్టవంతుడైన వడిసెల వాడు,అంతెందుకు?సాక్షాత్తూ దారితప్పిన ఆ సృష్టికర్త,
వీళ్ళంతా నీలోనే, నిజం! ఒక్ఖ నీలోనే మునిగి,
నీలోనే కలిసి పోయారు చూడు!
..
పద నువ్విక! చూడూ,ఇది నిష్క్రమించే సమయం!
కఠినమైన చల్లని శీతల సమయం!
ఈ రాత్రి కూడా అన్ని కాల పట్టికలను పట్టి బంధించేసింది!
సముద్రపు అలల హోరు తీరాన్ని మహోగ్రంగా చుట్టి ముట్టింది!
ఇప్పుడిక చూస్తుండగానే చల్లని నక్షత్రాలు మెల్లిగా పైకి లేస్తాయి!
నల్లని పక్షులు రివ్వున వలస వెళ్ళిపోతాయి!
..
నిర్మానుష్యమైన రేవులాగా ఈ ప్రాతః కాలం నిశబ్దంగా ఉంది!
నా చేతుల్లో వణుకుతున్న నీడలు మాత్రమే మెలి తిరుగుతున్నాయి.
అన్నిటికంటే దూరంగా.,
అవును చాలా దూరంగా!
పద ఇక! ఓ తిరస్కృతుడా తప్పదు!
ఇది సరిగ్గా నిష్క్రమణకు సమయం!
~~
అనువాదం : గీతాంజలి
Related