పరీక్షా పే రచ్చ ప్రోగ్రామ్ లో వెనక వరసలో కూర్చొన్న వేదాన్తకి చాలా అసహనంగా వుంది
తాను అసలే ఫిజిక్స్ లో కొంచెం వీక్
రివైజ్ చేసుకోవాల్సినదెంతో వుంది
దాదాపు మూడు గంటలకి పైగా దేశ్ కా నేతా ని కలవడానికి టైం వేస్ట్ అవుతూన్నందుకు చిరాగ్గా వుంది
సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ హాల్ ఏమంత హాయిగా లేదు
బయట సెక్యూరిటీ వాళ్ళు ఫిజిక్స్ పుస్తకం లోపలికి తెచ్చుకోనీయనందుకు కోపంగా కూడా వుంది
తన పేరులో సనాతనమ్ ధ్వనించడం వల్ల తండ్రి విశ్వగురు భక్తుడు కావడం వల్ల యీ ప్రోగ్రామ్ కి తనను సెలెక్ట్ చేశారు
చివరికి ఖరీదైన అటైర్ లో తెల్లటి గడ్డంతో పెద్దాయన పై నుంచి దిగి వచ్చాడు
అందరూ నిలబడి జై శ్రీరామ్ అని విష్ చేశారు
అదే మన సంస్కృతి అని ఆర్గనైజర్స్ ముందే చెప్పి వుంచారు
ఆయన ముందుగా అందరికీ మెలోడీ చాక్లెట్లు పంచాడు
ఒకరిద్దరు తినబోతే చేతులు ముందుకు కట్టుకొని గోడలకు ఆనుకొని బొమ్మల్లా నిలబడ్డ అధికారులు వారించారు
దేశనాయకుడు కావాలనుకోడానికి ముందు ఆయన టీచర్ కావాలనుకున్నాడు
చేతిలో బెత్తంతో అందరినీ కంట్రోల్ చేయడం ఆయనకి యిష్టం
గంభీరంగా ముఖంపెట్టి మీరు మీ తల్లిదండ్రుల కోసం యీ పరీక్షలు రాయడం లేదు అన్నాడు సాలోచనగా
వీడియోల్లో అంతా రికార్డవుతోంది అది లైవ్ షోనో కాదో అక్కడ కూర్చున్న పిల్లలకు తెలీదు
టైట్ గా జడలు వేసుకున్న వొకమ్మాయి తెలుసు సార్ మేం మా కోసం రాస్తున్నాం అంది చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది
కాదు అన్నాడాయన మార్మికంగా
పిల్లలు బిత్తరపోయారు
కెమెరాల క్లిక్ క్లిక్ చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దం
దేశం కోసం ధర్మం కోసం అన్నాడాయన మేఘం వురిమినట్టు
అందుకని రోజూ పరీక్షల్ని యజ్ఞంలా భావించామన్నాడు
రోజూ తప్పకుండా యోగసాధన చేయాలనీ ధ్యానం చేయమనీ చెప్పాడు
చర్చకి అవకాశం లేక అందరూ శ్రద్ధగా వింటున్నారు
వేదాల్లో ప్లాస్టిక్ సర్జరీ విమానాల టెక్నాలజీ వుందనీ యిలా అరగంటకి పైగా ప్రాచీన విద్యల్ని శ్లాఘించాడు టెలీ ప్రాంప్టర్ చూసుకుంటూ
పరీక్షల టైంలో సెల్ ఫోన్ కి దూరంగా వుండమని ఆయన సలహా యిచ్చాడు
రోజుకో గంట మాత్రం వాట్సాప్ యూనివర్సిటీని విజిట్ చేయొచ్చని రాయితీ యిచ్చాడు
తాను చదువుకొనే రోజుల్లో స్మార్ట్ ఫోన్లో గడిపినందుకు అమ్మ కోప్పడి ఫోన్ ని మసిలే యెసట్లో పడేసి వుడకేసిందని గట్టిగా నవ్వాడు
ఆ నవ్వుకి పిల్లలు భయపడ్డారు
ఆడ పిల్లలు సంప్రదాయ దుస్తులు వేసుకోవాలనీ మగపిల్లలు చొక్కా గుండీలన్నీ పెట్టుకోవాలనీ ఆడ మగా తేడా లేకుండా అందరూ తలకి నూనె రాసుకుని నున్నగా దువ్వుకోమనీ సరళంగా వుపదేశించాడు
ఆయన చెప్పడం ఆగింది అయినా ఫోటో గ్రాఫర్లు అనేక భంగిమల్లో ఆయన్ని ఫ్రేముల్లో బంధిస్తూనే వున్నారు
వేదాన్త కొంచెం బిడియంగానే లేచి నిలబడి మీరు చెప్పినవన్నీ తప్పకుండా చేస్తాం సార్ కానీ నాదో చిన్న రిక్వెస్ట్
స్క్రీన్ ప్లే లో లేని యీ హఠాత్తు రిక్వెస్ట్ కి ఆర్గనైజర్స్ తడబడ్డారు ముచ్చెమటలు పోశాయి గానీ పెద్దాయన కనుసైగతో సర్దుకున్నారు
మరేం లేదు సార్ పరీక్ష పేపర్ లీక్ కాకుండా చూడండి సా
వేదాన్త మాట పూర్తయ్యేలోపే ఎన్ ఐ ఏ పోలీసులు ఆ విద్యార్థిని చుట్టుముట్టి బయటికి యెత్తుకుపోయారు
దేశద్రోహానికి పూనుకున్నందుకు ఉపా కింద లోపలేశారు
ఆ విద్యార్థి పాకిస్తాన్ ఏజెంట్ అన్నారు ఎన్ టి ఏ అధికారులు
యాంటీ నేషనల్ అని గోడలు ప్రతిధ్వనించాయి
ఏం జరుగుతుందో పిల్లలకి అర్థమయ్యే లోపల
భారత్ మాతా కి జై అని దేశ్ కా నేతా హడావిడిగా అక్కడినుంచి నిష్క్రమించాడు
_(అల్పికలు బుల్పికలు అల్లిన బజరాకు కృతజ్ఞతలతో..)_




