ఇటీవల ప్రత్యేక ఎన్‌ఐ‌ఏ కోర్టు 2013 నాటి జీరంఘాటీ కేసులో 10 మంది ఆదివాసులకు మరణశిక్ష వేసిన విషయం తెలిసిందే. శిక్ష పడిన వారిలో ఎనిమిది మంది పురుషులు, ఇద్దరు మహిళలు. ఈ శిక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొంత మంది ఇప్పటికే స్పందించారు. ఈ శిక్ష గురించి వినగానే నాకు వెంటనే మరొక ఉరిశిక్ష పడిన కేసు గురించి గుర్తొచ్చింది. అది ఝార్ఖండ్ లోని 2007 నాటి చిల్కారీ ఘటన కేసు. ఈ రెండు కేసులకి చాలా సారూప్యతలు ఉన్నాయి. ఈ రెండు కేసులలోనూ మెజారిటీ నిందితులు మావోయిస్టు పార్టీ సభ్యులని ఆరోపించబడిన ఆదివాసీలు.
జీరంఘాటీ కేసు గురించి మాట్లాడే ముందు ఆ ఘటన గురించి కూడా సంక్షిప్తంగా ప్రస్తావించడం అవసరం. ఎందుకు జరిగిందో కూడా గుర్తు చేసుకోవడం మరింత ముఖ్యం. ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ సంపదలను దళారీ బడాబూర్జువాలకు, సామ్రాజ్యవాదులకు కట్టబెట్టడం కోసం అనేక కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనిని స్థానిక ఆదివాసి ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. వారి పోరాటాన్ని అణిచివేయడానికి 2005 జూన్ లో బస్తర్లో ప్రజలపై ప్రభుత్వం, యుద్ధాన్ని తలపెట్టింది. భూస్వామ్య పెత్తందారీ శక్తుల నాయకత్వంలో గూండా బలగాలను సమీకరించి, వేలాది పోలీసుల సంరక్షణలో ప్రజలపై భయంకరమైన దాడి చేసింది. దానిపేరే సల్వాజుడుం. దీనికి అప్పటి ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహేంద్ర కర్మ నాయకత్వం వహించాడు. గూడేల మీద దాడులు, సజీవ దహనాలు, హత్యలు, స్త్రీలపై అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసం, గృహ దహనాలు, పంటల విధ్వంసం వంటి ఎన్నో దుర్మార్గాలకు సల్వాజుడుం వొడిగట్టింది. బీజాపూర్, భైరాంగఢ్ బ్లాకులను పైలెట్ బ్లాకులుగా ఎంచుకొని అక్కడి వందలాది గ్రామాలను ధ్వంసం చేసి, నిరాశ్రయులైన వేలాది ఆదివాసులను నాజీ క్యాంపులను తలపించే రాహత్ శిబిరాలకు తరలించారు. ఆ క్యాంపుల్లోని మహిళలపై నిత్యం అత్యాచారాలు, యువకులపై చిత్రహింసలు అమలు అయ్యాయి. ప్రభుత్వం దొడ్డిదారిన చేసిన ఈ అఘాయిత్యాలపై ఏ కేసూ లేదు. ఏ విచారణా లేదు. ఎవరినీ అరెస్టు చేసింది లేదు. అప్పటికి ఎనిమిదేళ్ళుగా నిత్యం నరకం చూస్తున్న ప్రజలు తాము ఏర్పాటు చేసుకున్న జనతన సర్కార్లు, ప్రజాసైన్యం సాయంతో మహేంద్ర కర్మను 2013 మేలో దాడి చేసి అంతం చేశారు. ఇదే జీరంఘాటి ఘటన.
ఈ ఘటనలో 27 మంది చనిపోయారు ఇందులో ప్రధాన టార్గెట్ మహేంద్ర కర్మ అయినప్పటికీ బహిరంగ స్థలంలో కాంగ్రెస్ కాన్వాయ్ మీద దాడి జరగడం వల్ల అతనితోపాటుగా మరి కొంతమంది చనిపోయారు. ఈ ఘటనలోని తప్పుల గురించి వెంటనే ఏదైనా అనేసే ముందు ఎవరైనా ఆలోచించవలసింది ఏమిటంటే ఈ ఘటనకు దారి తీసిన అనేకమంది ఆదివాసీల చావుల గురించి ఏమంటారు? ఆదివాసులకు రక్షకులుగా ప్రకటించుకున్న ప్రభుత్వమే అట్లా వ్యవహరిస్తే వారికి మరణశిక్షలు ఎవరు వేయాలి? ఆదివాసులపై జరుగుతున్న మారణకాండను ఎవరు ఆపాలి అని. అది ప్రజలు తమ శక్తి సామర్ధ్యాల మేరకు చేసిన తిరుగుబాటులో నిందితులకు విధించిన శిక్ష. వాళ్లకు రాజ్యానికి ఉన్నంత యంత్రాంగం లేదు కనుక అందులో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఇవి తప్పక నివారించవలసినవే. అయితే బాధ్యతగా ఉండవలసిన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఘటనాస్థలి కుంట బ్లాక్ లో ఉంది కాబట్టి అక్కడి గ్రామాల ప్రజలను ఇంకొంత చుట్టుపక్కల గ్రామాలను వాళ్లతో కలిపి 37 మందిపై కేసు పెట్టింది. ఇందులో ఇద్దరు తప్ప తక్కిన వారంతా ఆదివాసీలే. అందులో పది మందికి ఎన్‌ఐ‌ఏ కోర్టు 2026 సెప్టెంబర్ 25న శిక్ష వేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును హైకోర్టు ఖరారు చేయవలసి ఉంటుంది.
ఇందులో శిక్ష పడినవారు ప్రమీల మొడియం, సుమిత్ర పూనెం, బంజామి సన్నా, ఆయతా మడ్కాం, ముక్కా మండావి, ముక్కామండావి, మడ్కామి దేవా, చైతు లేకమ్, కవాసి కోసా, మహాదేవ నాగ్, జోగా మడ్కామి ఉన్నారు. వీరంతా ఇప్పుడు జగదల్ పూర్ కేంద్రకారాగారంలో ఉన్నారు.
ఇక్కడ మనం ఒకసారి చిల్కారి ఘటన గురించి కూడా గుర్తు చేసుకుందాం. ఝార్ఖండ్ లోని ఆదివాసులు జల్ జంగల్ జమీన్ కోసం, ఆదివాసీలకే సహజసంపదలు దక్కాలనే లక్ష్యంతో, ఆదివాసి చట్టాలను అమలు చేయాలని పోరాటం చేస్తున్నారు. వారికి విప్లవోద్యమం మద్దతు లేకుండా చేయాలనే ఉద్దేశంతో అప్పటి బిజెపి ప్రభుత్వం మద్దతుతో సరిగ్గా బస్తర్లో సల్వాజూడుం మొదలుపెట్టినట్టే ఝార్ఖండ్ లో “నాగరిక సురక్ష సమితి” అనే సంస్థ, ఇంకా ఇటువంటి వేరు వేరు సంస్థలు ఏర్పడ్డాయి. అప్పటి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తమ్ముడు నూనూలాల్ మరాండీ ఈ సంస్థ వెనుకనున్న ప్రధాన వ్యక్తి. ఈ సంస్థ అక్కడ విప్లవోద్యమం మీద, ప్రజల మీద అనేక దాడులకు, హత్యలకు పాల్పడింది. దాంతో అతనిని ప్రధానంగా టార్గెట్ చేస్తూ గిరిఢీ జిల్లాలోని చిల్కారిలో జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్ అనంతర వేడుకల్లో అతనిపై దాడి జరిగింది. ఈ ఘటనలో నూనూలాల్ తప్పించుకున్నా, బాబూలాల్ మరాండీ కొడుకుతో సహా 20 మంది చనిపోయారు. ఈ ఘటన 2007 అక్టోబర్ 26న జరిగింది.
ఈ కేసులో 2011 జూన్ లో గిరిఢీ సెషన్స్ కోర్టు నలుగురికి మరణశిక్ష విధించింది. ఇందులో కూడా ప్రధాన నిందితులు అంతా ఆదివాసీలే. మరణశిక్ష పడిన నలుగురు, జీతన్ మరాండీ, చత్రపతి మండల్, మనోజ్ రాజ్వార్, అనిల్ రామ్. ఇందులో జీతన్ మరాండీ సాంస్కృతిక కళాకారుడు. ఝార్ఖండ్ అభేన్ సంస్థకు అధ్యక్షుడు. 2006 మార్చిలో రాంచీలో “ఆదివాసీల జన జీవితం – పోరాటాలు అనే అంశం పైన జరిగిన రెండు రోజుల అఖిల భారత స్థాయి సదస్సుకు నేను హాజరైనప్పుడు అక్కడ జీతన్ బృందం అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చింది. ఝార్ఖండ్ అభేన్, నిషేధిత సంస్థ కాదు. సాయుధ పోరాటం చేస్తున్న సంస్థ కూడా కాదు. జీతన్ మరాండీ అప్పటికే ప్రజాదరణ కలిగిన సాంస్కృతిక కళాకారుడు. ఈ ఘటనతో అతనికి గాని, తక్కిన ముగ్గురికి గాని ఏ సంబంధమూ లేదు. అయినా ఎవరో ఒకరిని అరెస్టు చేయాలి అనుకుని అరెస్టు చేశారు. ఘటన జరిగినపుడు వేదిక మీద రక్షణగా ఉన్న సెక్యూరిటీ గార్డులు సైతం పాల్గొన్న వారెవరో గుర్తుపట్టలేము, అని చెప్పినప్పటికీ ఏ సాక్ష్యాధారాలు లేకుండానే ఉరిశిక్ష వేశారు. ఈ శిక్ష విధించినప్పుడు నేను ఝార్ఖండ్ లోని హజారీబాగ్ కేంద్రకారాగారంలో ఉన్నాను. జీతన్ మరాండీతో పాటు శిక్ష పడిన నలుగురిని గిరిఢీ నుంచి హజారీబాగ్ జైలుకు తీసుకువచ్చారు. అప్పుడు మేమంతా ఈ ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేశాము.
జీతన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రజాసంఘాల వారికి కూడా సాంస్కృతిక కళాకారుడిగా పరిచయం ఉండడం వల్ల ఇక్కడ కూడా చాలా ప్రచారం జరిగింది. ఉరిశిక్షను రద్దు చేయాలని అనేక కార్యక్రమాలు కూడా జరిగాయి. దేశ్యవ్యాప్తంగా జరిగిన విస్తృత క్యాంపెయిన్ వల్ల మరణ శిక్ష రద్దు మరొకసారి చర్చలోకి వచ్చింది. చివరికి డిసెంబర్ 2011లో కోర్టు వాళ్ళ నలుగురిని నిర్దోషులుగా తేల్చి విడుదల చేసింది. సరిగ్గా ఈ కారణం గురించే ఈ కేసు గురించి మాట్లాడడం. ఇలా నిర్దోషులైన వారికి మరణశిక్ష అమలుచేసిన తర్వాత ఎప్పుడో వాళ్ళు నిర్దోషులని తెలిస్తే వారి ప్రాణాన్ని వెనక్కి తీసుకురాగలరా అనేది మొదటి విషయం.
జీరంఘాటీ కేసులో కూడా అనేక లొసుగులు ఉన్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేకుండానే వారి వాంగ్మూలాల ఆధారంగానే శిక్ష విధించారు. పోలీసు కస్టడీలో వాంగ్మూలాలు ఎలా తీసుకుంటారో చాలామందికి తెలిసే ఉంటుంది. వాటిని పోలీసులే రాస్తారు. వాటి మీద సంతకాలు చేయమని చిత్రహింసలు పెట్టొచ్చు. వారు ఏ రకమైన అండదండలూ లేని బడుగు జీవులైతే చేసే పని ఇదే. లేదా ఏమైనా చేస్తామని బెదిరించవచ్చు. చైతన్యం కలిగిన రాజకీయ ఖైదీలు సంతకాలు చేయడానికి నిరాకరిస్తే దానికి ఇప్పుడు ఒక కొత్త పద్ధతి కనిపెట్టారు. అసలు ఒప్పుకోలు మీద సంతకం పెట్టమని అడగకుండా తామే తీసుకువచ్చిన సాక్షుల సమక్షంలో ఒప్పుకోలు జరిగిందని వాళ్లతో సంతకం పెట్టించుకోవడం ఇటీవలి కాలంలో నాతో సహా అనేకమంది కార్యకర్తల కేసుల విషయంలో జరిగింది. ఈ ఒప్పుకోళ్ళు చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లవు. ఒకవేళ స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇవ్వదలుచుకుంటే అది కూడా మెజిస్ట్రేట్ ముందే రికార్డు చేయాలి. ఈ స్వచ్ఛందం అనేది అన్ని సార్లూ స్వచ్ఛందంగా ఉండదనేది కూడా ఒక వాస్తవం. అలాంటి ఒప్పుకోళ్ళ ఆధారంగా ఏకంగా మరణశిక్ష వేసేయడం అంటే న్యాయస్థానాలకు చట్టాలలో ఏం ఉందనే దానితో పనిలేదని అర్థం.
ఈ కేసులో చట్టపరమైన ఇతర విషయాల లోకి నేను వివరంగా పోవడం లేదు. 185 పేజీల తీర్పు చదివి న్యాయనిపుణులైన మిత్రులు ఎలాగూ వాటి గురించి రాస్తారు. ఉదాహరణకు ఒకటి రెండు విషయాలు మాత్రం ప్రస్తావిస్తున్నాను. నిందితులందరినీ సమానంగా బాధ్యులను చేసి అందరికీ మరణ శిక్ష వేయకూడదు. అది వారు ఆ ఘటనలో నిర్వహించిన పాత్రను బట్టి ఉంటుంది. వాళ్ళు ప్రవేశపెట్టిన సాక్షులలో కొందరికి గోండి భాష రాదు అని చెప్పారు. మరొక చోట ఘటన జరుగుతున్నపుడు నిందితులు తమలో తాము మాట్లాడుకొంటుంటే విన్నాం అంటూ ఆ గోండి రాదన్న సాక్షులు చాలా విషయాలు చెప్పారు. ఈ వైరుధ్యాలన్నీ ఉన్నా జడ్జి శిక్ష వేయదలుచుకొన్నాడు కాబట్టి వేసేశాడు.
ఇకపోతే అసలు మరణశిక్ష అనే శిక్షనే రద్దు చేయాలనేది మరొక కోణం. అనేక దేశాలు ఇప్పటికే మరణశిక్షను రద్దు చేశాయి. ఇండియాలో ఆ క్యాంపెయిన్ ఎప్పటి నుండో నడుస్తోంది. మాజీ న్యాయమూర్తులు కూడా ఎంతోమంది మరణశిక్ష రద్దును సమర్థిస్తూ మాట్లాడారు.
మరణశిక్షను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసే వారి వాదనలు వేరువేరుగా ఉండొచ్చు. ఉదాహరణకు జస్టిస్ వి. ఆర్. కృష్ణ అయ్యర్ “మరణశిక్షలు హత్యలను అంతం చేయగలవు అనేది ఇక ఎంత మాత్రమూ పనికిరాదనే వాదనతో నేను ఏకీభవిస్తాను. జీవితం దేవుడు ఇచ్చినది. చాలా విలువైనది. గాంధీజీ అన్నట్టు దానిని తీసివేసే హక్కు ఎవరికీ లేదు. నేను ఆ అభిప్రాయాన్ని సమర్థిస్తాను. అనేక ఇతర దేశాల వలనే ఇండియా కూడా మరణశిక్షను రద్దు చేస్తుందని ఆశిస్తున్నాను” అని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుడు పేరరి వాలన్ విడుదల కోసం చేసిన విజ్ఞప్తి సందర్భంగా అన్నారు.
ఈ సందర్భంగా మరణశిక్షకు వ్యతిరేకంగా జరిగిన క్యాంపెయిన్ గురించి, మరణశిక్ష రద్దు గురించి అనేకమంది ప్రముఖుల వాదనల గురించి తెలుసుకొని ఈ క్యాంపెయిన్ను ముందుకు తీసుకుపోవడానికి “ఉరికొయ్య అంచు నుండి” రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు పేరరి వాలన్ స్వయంగా రాసిన విజ్ఞప్తి, ఆవాదనను సమర్ధిస్తూ చేసిన ఇతరుల వాదనల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. (ఈ వాదనలన్నీ పుస్తక రూపంలో వచ్చాయి. వాటిని తెలుగులో 2022లో మలుపు ప్రచురణగా వచ్చింది.) ఈ పుస్తకంలోని ఒక విషయం గురించి మాత్రం ఇక్కడ తప్పక ప్రస్తావించాలి.
2006లో ముంబైలో ఖదీర్ బర్గీర్ అనే పోలీసు ఇన్స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సూసైడ్ నోట్ లో రాసిన విషయం ఏంటంటే, 1995లో అతను పని చేస్తున్న ఓసివారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అత్యాచారం జరిగింది. ఏ ఆధారమూ లభించలేదు. రేపటికంతా నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టకపోతే నిన్ను తీసేస్తాను అని ఎస్పీ చేసిన బెదిరింపులకు భయపడి చిత్తు కాగితాలు ఏరుకునే ఆర్ముగం అనే అమాయకుడిని పట్టుకొని అరెస్టు చేసి సాక్ష్యాలు సృష్టించాడు. దాంతో అతనికి జీవిత ఖైదు పడింది. దాంతో అపరాధ భావనతో నలిగిపోయిన ఇన్స్పెక్టర్ ఆత్మహత్య చేసుకుంటూ ఇవన్నీ వివరంగా రాశాడు. అప్పటికి ఆ ఆర్మూగం పదకొండేళ్లు జైల్లో గడిపాడు. ఒకవేళ ఇన్స్పెక్టర్ను అంతరాత్మ ప్రేరేపించక పోయి ఉంటే! మన తెలుగు రాష్ట్రాలకే చెందిన ఆయేషా మీరా కేసులో సత్యంబాబు అన్యాయంగా తొమ్మిదేళ్లు జైల్లో గడపడం మనకు తెలిసిందే.
అయితే నిజంగా దోషులైతే కూడా మరణ శిక్ష వేయకూడదా, అంటే వేయకూడదు. శిక్షాస్మృతి నేరస్తులలో పరివర్తన తీసుకురావాలని కోరుతుంది. భారతదేశంలో కూడా! అందుకే జైళ్లను జైళ్ళు అనడం మానేసి కరెక్ష్నల్ హోమ్స్ (పరివర్తన గృహాలు) అనాలని ప్రభుత్వమే నిర్ణయించింది. ఒక వ్యక్తి ఏ నేరం చేశాడో/ చేసిందో ఆ నేరం చేసే అవకాశం లేకుండా జైల్లో పెట్టడం ద్వారా ఆ నేరాలు నియంత్రించాలని శిక్షాస్మృతి ఉద్దేశం. జైలు జీవితం ఆ వ్యక్తి జీవితంలో పరివర్తన తీసుకురావాలని శిక్షాస్మృతి చెపుతుంది. కాలం చెల్లిపోయిన శిక్షలను ఈ మధ్యకాలంలో విపరీతంగా విధిస్తున్నారు. ‘అత్యంత అరుదైన వాటిలో కెల్లా అరుదైన ఘటనలో మాత్రమే మరణశిక్ష విధించాలి’ అన్న మాటకి అర్థం లేకుండా పోయింది.
జీరంఘాటి కేసులో ఇంకొక కోణం కూడా చర్చించవలసింది ఉన్నది. ఇదే కేసులో మొత్తం 37 మంది ఉండగా 10 మంది మాత్రమే అరెస్టు అయ్యారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ ఘటన జరిగిన తరవాత కొందరు ఆదివాసీలను అరెస్టు చేసి వారి మీద ఈ కేసు పెట్టారు. అందులో మరొక 27 మందిని చేర్చారు. ఈ కేసులో అరెస్టు అయిన పదిమందికీ మరణశిక్ష విధించి 27 మందిని పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. జడ్జిమెంట్ ఇచ్చే నాటికి వారిలో ఒకరైన పాక హనుమంతు ఎన్కౌంటర్ హత్యకు గురికాగా తక్కిన 26 మంది లొంగి పోయారు. అయితే లొంగి పోయారు కాబట్టి వారి మీద కేసును ప్రభుత్వం నడపదల్చుకోలేదు. మంచిదే. ఆహ్వానించదగ్గ విషయమే. అయితే ఒక కేసుని అలా నడపదల్చుకోనప్పుడు ఆ కేసులో 13 ఏళ్ళ క్రితమే అరెస్ట్ అయి జైలు జీవితం గడిపిన వారికి కూడా దానిని వర్తింప చేయాలి కదా. కనీసం ఈ 13 యేళ్ళ శిక్ష కాలంగా భావించి అయినా విడుదల చేయవచ్చు. నిజానికి వాస్తవాలు మాట్లాడుకుంటే సల్వాజూడుం లేకపోతే జీరంఘాటి కూడా ఉండేది కాదు. కాబట్టి సల్వాజుడుం నేరాలకు పాల్పడిన వారిని శిక్షించని ప్రభుత్వానికి జీరంఘాటి నిందితులను శిక్షించే నైతిక హక్కు లేదు. దశాబ్దాల క్రితమే భారతదేశ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం సడలిపోయింది. అందుకు సజీవ సాక్ష్యాలుగా నిత్యం సలుపుతూనే ఉండే “గుజరాత్ గాయాలు” వంటివి అనేకం ఉంటూనే ఉన్నాయి. ‘ఊనా’ లూ, కారంచేడులూ కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయం ఎలాగూ లేదు. పోనీ చట్ట ప్రకారం అయినా ఏమైనా జరుగుతుందా అంటే అదీ లేదు. నిందితుల నేరం నిరూపించలేకపోయినప్పుడు వారిని శిక్షించే హక్కు అసలు లేదు. జీరంఘాటి మరణశిక్షను రద్దు చేయడమే కాదు వారందరినీ విడుదల కూడా చేయాలి. జైళ్ళలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి. మరణశిక్షను రద్దు చేయాలి.

Leave a Reply