2026 మే 27
ఒడిశా ప్రభుత్వం కొన్నేళ్లుగా తన బాక్సైట్ నిల్వలపై కన్నేసింది. దానికి ఒక ముఖ్యమైన అడ్డంకి ఎదురైంది. అదే, అత్యంత విలువైన ఆ బాక్సైట్ నిల్వల పైన ఉన్న అడవులు. రక్షిత ప్రాంతాలను తవ్వకాలకు తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వన్యప్రాణి సంరక్షణ మండలి ఎలా కలిసి పనిచేశాయో మా పరిశోధన వెల్లడిస్తుంది.
[సంపాదకీయ గమనిక: బాక్సైట్‌పైన ఒడిశా ప్రభుత్వానికి ఉన్న ప్రేమను, ఆ బాక్సైట్ నిల్వలపైన నివసిస్తున్న ఆదివాసీ సముదాయాలపైన ఉన్న ప్రేమగా చిత్రీకరిస్తున్నారు. కార్లపట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉన్న బాక్సైట్ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి, ఆ క్రమంలో తమ జీవితాలను ఈ అడవుల నుండి పెకిలించివేయడానికి ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తూ దళిత, ఆదివాసీ గ్రామస్థులు తిరుగుబాటు చేసినప్పుడు ఈ కథ జాతీయ దృష్టిని ఆకర్షించింది. చాలా మందిని నిర్బంధించి, పోలీస్ స్టేషన్లను శుభ్రం చేయమని ఆదేశించారు. ఖనిజం కోసం ఒడిశాకు ఉన్న అత్యాశ, ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దులను పునర్వ్యవస్థీకరించడానికి ఎలా దారితీసిందో మా రెండు భాగాల సిరీస్ వెల్లడిస్తుంది. భవిష్యత్ మైనింగ్ కార్యకలాపాలకు ఆటంకాలు లేకుండా చూసేందుకు, వన్యప్రాణుల రక్షణపై జాతీయ అత్యున్నత సంస్థ ఒక ప్రతిపాదనను రూపొందించడంలో సహాయపడింది. ఇది ఆ సిరీస్‌లోని మొదటి భాగం.]
2023లో, బాక్సైట్ సమృద్ధిగా ఉన్న అటవీ భూములలోని వన్యప్రాణుల సంరక్షణను తొలగించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసింది.
రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు సుమారు 450 కిలోమీటర్ల దూరంలో, దక్షిణ ఒడిశాలోని రక్షిత ప్రాంతమైన కార్లపట్ వన్యప్రాణుల అభయారణ్యం నుండి గనుల తవ్వకాల కోసం 4.32 చదరపు కిలోమీటర్ల భూమిని తొలగించడానికి ఒడిశా అటవీ శాఖ దరఖాస్తు చేసింది.
ఆ దరఖాస్తులో వాస్తవాలను వక్రీకరించింది. తొలగిస్తున్న అటవీ భూమి “క్షీణించిందని”, సమీప గ్రామాలు, జంతువుల ఒత్తిడి కారణంగా అలా జరుగుతోందని ఒడిశా అటవీ శాఖ పేర్కొంది. భూమి క్షీణత కారణంగా తొలగించడం లేదనేది స్పష్టమైంది.
రెండు సంవత్సరాల చర్చల కాలంలో, అటవీ భూమి కింద ఉన్న బాక్సైట్ గురించే ఎల్లప్పుడూ ప్రధాన అంశంగా ఉంది. ప్రజల నుండి ఒత్తిడి అనేది కేవలం ఒక సాకు మాత్రమే.
భారతదేశ అడవులను పరిరక్షించే బాధ్యత కలిగిన అత్యున్నత సంస్థ, ప్రధానమంత్రి నేతృత్వంలోని జాతీయ వన్యప్రాణి బోర్డు (నేషనల్ బోర్డ్ ఫర్ వర్ల్డ్ లైఫ్-ఎన్‌బిడబ్ల్యూఎల్), దీనిని వ్యతిరేకించలేదు. దానికి బదులుగా, అది ఒక అడుగు ముందుకు వేసి, భవిష్యత్తులోని అన్ని గనుల తవ్వకాల ఆకాంక్షలను ఈసారి పరిగణనలోకి తీసుకుని, ప్రతిపాదనను తిరిగి పంపించమని రాష్ట్ర అటవీ శాఖకు సలహా ఇచ్చింది. మైనింగ్ కోసం అభయారణ్యం సరిహద్దులను మరింత మెరుగ్గా ‘హేతుబద్ధీకరించమని’, లేదా తిరిగి గీయమని రాష్ట్రానికి చెప్పింది.
కార్లపట్ అభయారణ్యానికి దక్షిణాన ఉన్న అడవులు ఆసియా ఏనుగులకు కీలకమైన వలస మార్గం. అవి కూడా అనేక బాక్సైట్ బ్లాక్‌ల పైనే తిరుగుతూంటాయి; జీవిస్తాయి.
కార్లపట్ సరిహద్దుల్లో మార్పులు చేయడం వల్ల కనీసం రెండు బాక్సైట్ బ్లాక్‌లు ఏర్పడ్డాయని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ధృవీకరించింది. ఈ ‘హేతుబద్ధీకరణ’ తర్వాత అభయారణ్యంకి చెందిన పర్యావరణ సున్నిత మండలాలలో (ఇఎస్‌జెడ్) వచ్చిన మార్పుల వల్ల, ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలకు వేలం వేసిన, మరింత దక్షిణాన ఉన్న బ్లాక్‌లకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం కొత్త రక్షిత ప్రాంత అక్షాంశ రేఖాంశాలను బహిరంగపరచకపోవడం వల్ల, దాని ప్రభావ పరిధిని అంచనా వేయలేకపోయాం.
బాక్సైట్ కోసం ఒడిశా ప్రభుత్వానికున్న దురాశ, ఆకాంక్ష గురించి రాస్తున్న రెండు కథనాలలో ఇది మొదటిది. అదే రాష్ట్ర ప్రభుత్వం, మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్‌తో కలిసి పనిచేస్తూ, ఒకే మైనింగ్ ప్రాజెక్టును రెండు వేర్వేరు అనుమతి దరఖాస్తులుగా ఎలా విభజించిందో, ఆపై అడవులను నరికి ప్రజలను నిర్వాసితులుగా చేయడానికి బుల్డోజర్లను ఎలా పంపిందో రెండవ కథనం చూపిస్తుంది. అంతేకాకుండా, ఇది నిర్వాసితులైన సముదాయాలకే ప్రయోజనం చేకూరుస్తుందని వాదిస్తూ ఈ పని చేసింది.
వన్యప్రాణుల అభయారణ్య దక్షిణ సరిహద్దు వెంబడి లింగపదర్, కార్లపట్, కిషన్మాలి అనే మూడు బాక్సైట్ బ్లాక్‌లు ఉన్నాయి. ఈ బ్లాక్‌లన్నీ అభయారణ్య పర్యావరణ సున్నిత ప్రాంతం పరిధిలోకి వస్తాయి.
అభయారణ్యం సరిహద్దులను తిరిగి గీయడం ద్వారా, దాని కింద ఉన్న కార్లపట్ బాక్సైట్ బ్లాక్‌ను మైనింగ్ కోసం తెరిచారని తిరిగి గీసిన మ్యాప్‌లపైన మా విశ్లేషణ ఆధారంగా మేము నిర్ధారణకు వచ్చాం. దీనివల్ల కిషన్మాలి అనే మరో బ్లాక్ అభయారణ్యానికి మరింత దూరంగా ఉందని కూడా నిర్ధారితమైంది.
కార్లపట్ బ్లాక్‌కు మరింత దక్షిణంగా, సిజిమాలి, కుట్రిమాలి అనే మరో రెండు బాక్సైట్ బ్లాక్‌లను ఇటీవల వేదాంత, అదానీ గ్రూపుల వంటి ప్రైవేట్ మైనింగ్ సంస్థలకు లీజుకు ఇచ్చారు.
కార్లపట్ బ్లాక్ ఒడిశాలోని అతిపెద్ద; అత్యంత నాణ్యమైన బాక్సైట్ నిక్షేపాలలో ఒకదానికి నిలయం. ఈ పీఠభూమి 3,113.25 హెక్టార్లలో విస్తరించి ఉంది. అభయారణ్యానికి సమీపంలో ఉన్న ఈ నిక్షేపాలు ‘పర్యావరణ సంఘర్షణ’ను ఎదుర్కొంటున్నాయి. గత రెండు దశాబ్దాలుగా, ఒడిశా ప్రభుత్వం ఈ బాక్సైట్ బ్లాక్‌లలో తవ్వకాలు జరపాలని చూస్తోంది. 2004లో, రాష్ట్ర మైనింగ్ సంస్థ అయిన ఒడిశా మినరల్ కార్పొరేషన్, కార్లపట్‌లో తవ్వకాలు జరిపి, వేదాంత త్వరలో స్థాపించనున్న అల్యూమినియం రిఫైనరీకి అల్యూమినియం ధాతువును సరఫరా చేయడానికి లీజు కోసం దరఖాస్తు చేసుకుంది.
ఈ బ్లాక్‌లను మైనింగ్ కోసం తెరవడానికి గతంలో కూడా పలుమార్లు ప్రయత్నాలు జరిగాయి. ఉదాహరణకు, 2021 సెప్టెంబర్‌లో, కార్లపట్ బ్లాక్‌ను ప్రైవేట్ సంస్థలకు వేలం వేయాలన్న ప్రయత్నాన్ని ఒడిశా హైకోర్టు కొట్టివేసింది.
కోర్టు ఉత్తర్వుకు కొన్ని నెలల ముందే, ఒడిశా అటవీ శాఖ ఈ బ్లాక్‌లలో మైనింగ్ కోసం ఒక కొత్త ప్రతిపాదనను రూపొందించింది. అభయారణ్యం సరిహద్దులను రెండు ప్రదేశాలలో “లోపలికి” జరపాలని ఆ శాఖ ప్రతిపాదించింది. ఈ మార్పుచేయడం వెనుక ఉన్న ఆకాంక్షలను బహిరంగంగా వెల్లడించనప్పటికీ, బాక్సైట్ బ్లాక్‌లను మైనింగ్ కోసం తెరవడమే దీని లక్ష్యమని స్పష్టమైంది.
ఈ కొత్త ప్రతిపాదన 4.32 చదరపు కిలోమీటర్ల సంరక్షిత భూమిని గనుల తవ్వకం కోసం అందుబాటులోకి తెస్తుంది. 2023 మే నెలలో, సరిహద్దులను తిరిగి గీయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వేలంపాటకు అధికారిక ఆమోదం లభించింది. కానీ దీనికి వీలు కల్పించిన ప్రక్రియ దాదాపు రెండు సంవత్సరాల ముందే ప్రారంభమైంది.
భారతదేశంలోనే అతిపెద్ద బాక్సైట్ నిల్వలు – 40 శాతానికి పైగా – ఒడిశాలోనే ఉన్నాయి. అలాగే, వేదాంత గ్రూప్‌కు చెందిన దేశంలోనే అతిపెద్ద అల్యూమినా రిఫైనరీ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతంలో బాక్సైట్ నిల్వలు, శుద్ధి కర్మాగారాలు ఉండడం వల్ల , బాక్సైట్ తవ్వకాలను ప్రైవేట్ రంగానికి తెరవడంలో పారిశ్రామిక, రాజకీయ వర్గాల ఆసక్తి ఉంది. ఇది మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ నాయకుడు నవీన్ పట్నాయక్ ముందుకు తెచ్చిన అజెండా. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకువెళ్తోంది.
మైనింగ్ కోసమే ప్రత్యేక రూపకల్పన
చట్టం ప్రకారం, వన్యప్రాణుల అభయారణ్యం నుండి భూమిని తొలగించాలంటే, కనీసం మూడు స్థాయిలలోని పలు అధికార సంస్థల ఆమోదం అవసరం ఉంటుంది. ఈ తనిఖీలలో స్థానిక అటవీ అధికారి, రాష్ట్ర వన్యప్రాణి బోర్డు, ఎన్‌బిడబ్ల్యుఎల్ ఉంటాయి.
ఈ క్రమానుగత వ్యవస్థలో అంతిమ మధ్యవర్తి అయిన సుప్రీంకోర్టు, ఎన్‌బిడబ్ల్యుఎల్ నిర్ణయాలను రద్దు చేయగలదు. 2025 ఆగష్టులో సరిస్కా టైగర్ రిజర్వ్ విషయంలో అది సరిగ్గా అదే చేసింది. మార్బుల్ మైనింగ్‌ను సులభతరం చేయడానికి రిజర్వ్ సరిహద్దులను తిరిగి గీయడాన్ని ఆమోదించినందుకు సుప్రీంకోర్టు ఎన్‌బిడబ్ల్యుఎల్‌ను తీవ్రంగా మందలించింది. కేవలం 48 గంటల్లోనే తన ఆమోదాన్ని తెలియజేయడం ద్వారా ఆ బోర్డు “ఒక పోస్ట్ ఆఫీసులా వ్యవహరిస్తోంది” అని కోర్టు పేర్కొంది. అయితే, కార్లపట్ కేసులో, కోర్టు హేతుబద్ధీకరణ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది.
సరిస్కా కేసులో మాదిరిగానే, 2022 డిసెంబర్‌లో ఎన్‌బిడబ్ల్యుఎల్ స్టాండింగ్ కమిటీ, అభయారణ్యానికి ఆనుకుని బాక్సైట్ నిల్వలు ఉన్న ప్రాంతాన్ని మినహాయించడాన్ని ఆమోదించింది.
కానీ కార్లపట్‌లో, కమిటీ ఒక అడుగు ముందుకు వేసింది. బాక్సైట్ నిల్వల గురించి కేవలం ప్రస్తావన మాత్రమే చేసిన రాష్ట్ర ప్రణాళికకు ప్రతిస్పందిస్తూ, భవిష్యత్ బాక్సైట్ తవ్వకాలు; ఖనిజ రవాణాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అది సిఫార్సులు చేసింది.
” గనుల తవ్వకాలలో భవిష్యత్‌లో జరగబోయే అభివృద్ధి అభయారణ్యంపైన ప్రభావం చూపకుండా ఉండేలా ఏకీకృత ప్రతిపాదనను రూపొందించాలి” అని కమిటీ స్పష్టం చేసింది.
2021 సెప్టెంబర్‌లో మొదటిసారిగా కమిటీ ముందుకు వచ్చిన ఈ ప్రతిపాదనను, ఏడాది పాటు జరిగిన చర్చల ప్రక్రియలో తీర్చిదిద్దేందుకు ఒడిశా అటవీ శాఖకు కమిటీ మార్గనిర్దేశం చేసింది.
ఈ కమిటీ విస్తృత ప్రభావాలను కలిగించే ఒక సిఫార్సును కూడా చేసింది. భవిష్యత్ మైనింగ్ లీజులను, అలాగే అభయారణ్య పర్యావరణ సున్నిత మండలంలో చేయాల్సిన మార్పులను కూడా ఇదే ఏకీకృత ప్రణాళికలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సరిహద్దులను తిరిగి గీసే తమ తొలి ప్రణాళికలో, పర్యావరణ సున్నిత మండలాన్ని మార్చడం గురించి రాష్ట్ర అటవీ శాఖ ఎటువంటి ప్రస్తావన చేయలేదు.
కార్లపట్‌తో సహా మూడు బాక్సైట్ బ్లాక్‌లు అభయారణ్య దక్షిణ అంచున, దాని పర్యావరణ సున్నిత మండల పరిధిలోనే ఉన్నాయి.
వన్యప్రాణుల ప్రాంతాల సమీపంలో హానికరమైన కార్యకలాపాలు జరగకుండా చూడటమే పర్యావరణ సున్నిత మండల పరిధిలను ఏర్పాటు చేయడంలోని ఉద్దేశ్యం. సాధారణంగా, వన్యప్రాణుల అభయారణ్యం లేదా జాతీయ పార్క్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిని పర్యావరణ సున్నిత మండలంగా నిర్వచిస్తారు. ఈ మండలాలు పర్యావరణ పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తాయి; వీటిలోపల ఎటువంటి పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతి లేదు. పర్యావరణ సున్నిత మండలాలను సవరించడం ద్వారా మాత్రమే, ఒక రాష్ట్రం గనుల తవ్వకం వంటి పారిశ్రామిక కార్యకలాపాల కోసం ఈ ప్రాంతాలను వినియోగించుకోగలదు. అటువంటి మార్పులు చేయడానికి ఉన్న అభ్యంతరాలను తెలుసుకోవడానికి, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, గెజిట్ ఆఫ్ ఇండియాలో ముసాయిదా సవరణ నోటిఫికేషన్‌ను ప్రచురించాలి.
2019 ఆగస్టు 9న, పర్యావరణ మంత్రిత్వ శాఖ, బాక్సైట్ బ్లాక్‌ల సమీపంలోని కొన్ని ప్రాంతాలలో కార్లపట్ అభయారణ్య పర్యావరణ సున్నిత మండలాన్ని పది కిలోమీటర్ల నుండి సున్నా కిలోమీటర్లకు తగ్గించాలని ప్రతిపాదిస్తూ ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రచురించింది. అయితే, ఈ సవరణకు ఇంకా తుది రూపం ఇవ్వలేదు.
2022 మార్చిలో జరిగిన తన రెండవ సమావేశంలో ఎన్‌బిడబ్ల్యుఎల్ స్థాయీ కమిటీ ఈ విషయాన్ని అంగీకరించింది. అది ఇలా పేర్కొంది; “తుది నోటిఫికేషన్ జారీ చేయకపోవడం వల్లనూ, అభయారణ్యం కోసం పర్యావరణ సున్నిత మండలాన్ని ప్రతిపాదించకపోవడం వల్లనూ లేదా నోటిఫై చేయకపోవడం వల్లనూ, అభయారణ్యం సరిహద్దును హేతుబద్ధీకరణ చేయాలనే ప్రతిపాదనను, దాని ప్రతిపాదిత పర్యావరణ సున్నిత మండలాలు- ఈ రెండింటినీ కలిపి ఒక ఏకీకృత ప్రతిపాదనను ఎస్‌సిఎన్‌బిడబ్ల్యుఎల్‌కు సమర్పించాలని సిఫార్సు చేయబడింది.”
ఫలితంగా, సంవత్సరాలుగా ఈ పర్యావరణ సున్నిత మండలాన్ని ఆమోదించడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, తిరిగి గీసిన సరిహద్దు అనే దొడ్డిదారి ద్వారా ఎన్‌బిడబ్ల్యుఎల్ రెండవ అవకాశాన్ని అందించింది.
ఎన్‌బిడబ్ల్యుఎల్ ఇచ్చిన అభిప్రాయాలన్నింటినీ ఒడిశా అటవీ శాఖ పొందుపరిచింది. “సర్వే పనులు పూర్తయ్యాయి; అభయారణ్యం, పర్యావరణ సున్నిత మండలం – రెండింటికీ సంబంధించిన సవరించిన ప్రతిపాదనను డిఎఫ్‌ఒ, కెఎమ్‌ఎల్[మ్యాప్] ఫైళ్లతో పాటు సమర్పించారు. మైనింగ్ విభాగాన్ని సంప్రదిస్తున్నారు; సవరించిన ప్రతిపాదనను ఒక నెలలోగా మంత్రిత్వ శాఖకు సమర్పిస్తారు” అని 2022 జూన్‌లో జరిగిన కమిటీ మూడవ సమావేశంలో, ఒడిశా ముఖ్య అటవీ సంరక్షణాధికారి (వన్యప్రాణి) కమిటీకి తెలియచేసింది
ఎన్‌బిడబ్ల్యుఎల్ చేసిన అనేక పరిశీలనలలో, సరిహద్దు మార్పులోని ఒక భాగం “మ్యాప్‌పై ఒక సరళ రేఖలా” కనిపిస్తోందని ఎత్తిచూపడం ఒకటి. మైనింగ్ బ్లాక్‌లను సాధారణంగా సరళ రేఖ బహుభుజులుగా మ్యాప్ చేస్తారు. ఈ సరిహద్దును “భూభాగానికి ఉన్న సహజ ఆకృతులను” అనుసరించేలా తిరిగి గీయాలని వారు సిఫార్సు చేశారు. ఇది అభయారణ్యం మ్యాప్‌ను తిరిగి గీయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని కనిపించకుండా దాచడానికి సహాయపడుతుంది.
సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత, 2022 డిసెంబర్ 29 న కొత్త ఏకీకృత ప్రతిపాదనకు ఆమోదం లభించింది. తిరిగి గీసిన సరిహద్దులను 2023 మే 1 న చట్టబద్ధంగా నోటిఫై చేశారు.
పర్యావరణ సున్నిత మండలాలకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను ఎన్నడూ ప్రచురించలేదు. పర్యావరణ సున్నిత మండలంలో ప్రతిపాదిత మార్పులకు ఎన్‌బిడబ్ల్యుఎల్ ఆమోదం తెలిపినప్పటికీ కూడా ఇది జరిగింది. ఆ జోన్‌కు చేసిన తుది సవరణలను కలెక్టివ్ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.
పర్యావరణ సున్నిత మండల స్థితి, వాస్తవాలను వక్రీకరించడం; సరిహద్దుల హేతుబద్ధీకరణ ప్రక్రియను నడిపించడంలో వన్యప్రాణి బోర్డుల పాత్రకు సంబంధించి సవివరమైన ప్రశ్నలను పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఒడిశా అటవీ శాఖ; ప్రాంతీయ అటవీ అధికారికి పంపాం.
సమాధానం అందిన తర్వాత వివరాలు చేరుస్తాం.
ఒక భౌగోళిక సమాచార వ్యవస్థ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) నిపుణుడి సహాయంతో, ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ మైనింగ్ బ్లాక్‌ల డిజిటల్ మ్యాప్‌లను తిరిగి వేయించాం. వన్యప్రాణి సంరక్షణ కేంద్ర కొత్త, పాత సరిహద్దుల డిజిటల్ మ్యాప్‌లను సంపాదించాం. వీటితో, గనుల తవ్వకందారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఫైళ్ల నుండి వన్యప్రాణి ప్రాంతాలను ఎలా తొలగించారో స్వతంత్రంగా ధృవీకరించడానికి ప్రయత్నించాము.
వాస్తవాలను దాచడం
బాక్సైట్ నిల్వలకు ప్రవేశం కల్పించడానికి సంరక్షణ కేంద్రం సరిహద్దును తిరిగి గీస్తున్నారని స్పష్టంగా తెలిసినప్పటికీ, ఒడిశా అటవీ శాఖ, కనీసం ప్రారంభంలోనైనా, మినహాయింపు కోసం గుర్తించిన వన్యప్రాణి ప్రాంతం క్షీణించిందని; “జీవ ఒత్తిడి”కి గురైందని పట్టుబట్టింది. ఈ పదాన్ని ప్రజల వల్ల ఆ ప్రాంతం తగ్గిపోతోందని సూచించడానికి ఉపయోగిస్తారు. రాష్ట్ర శాఖ వాస్తవాలను ఎలా వక్రీకరించిందో స్టాండింగ్ కమిటీ చర్చల రాతపూర్వక వివరాలు (మినిట్స్) తెలియచేస్తున్నాయి.
రాష్ట్ర వన్యప్రాణి బోర్డు 2021 మార్చిలో జరిగిన ఒకే సమావేశంలో, ఎలాంటి వ్యత్యాసాలను ఎత్తి చూపకుండా దీనిని ఆమోదించింది. అభయారణ్యం సరిహద్దుల నుండి భూమిని తొలగించడానికి, అటవీ శాఖ అనేక సమర్థనలను ఇచ్చింది.
“వన్యప్రాణుల సంచారం, వృక్ష సాంద్రత, గ్రామస్థుల వల్ల కలిగే జీవ సంబంధిత ఒత్తిడి, బాక్సైట్ నిల్వల ఉనికిని పరిగణనలోకి తీసుకుని, అభయారణ్య దక్షిణ సరిహద్దును రెండు ప్రదేశాలలో లోపలికి మార్చాలని ప్రతిపాదన వచ్చింది; దీని ద్వారా అభయారణ్యంలోని 4.32 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని మినహాయించాల్సి ఉంటుంది” అని చెప్పారు.
ఆ సమావేశంలో, రాష్ట్ర వన్యప్రాణి బోర్డు స్వతంత్ర నిపుణుడైన బివాష్ పాండవ్, మినహాయింపులకు బాక్సైట్ నిల్వలను ఒక “సమస్య”గా ఎత్తి చూపితే, రాష్ట్ర అధికారులు, “మినహాయింపునకు నిల్వలు ప్రధాన కారణం కాదని,” బదులుగా “జీవ సంబంధిత ఒత్తిడి, క్షీణించిన ప్రాంతం” మినహాయింపునకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
అయినప్పటికీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య రెండు సంవత్సరాలకు పైగా జరిగిన చర్చలలో, బాక్సైట్ నిల్వల ఉనికియే ప్రధాన వివాదాంశంగా మిగిలిపోయింది. గ్రామస్థులు, జంతువుల నుండి వచ్చే జీవ సంబంధమైన ఒత్తిడిగా కప్పిపుచ్చినప్పటికీ, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఏకైక ఒత్తిడి బాక్సైట్ నిల్వలను తవ్వకాలకు తెరవడమేనని క్రమంగా స్పష్టమైంది.
అభయారణ్య పునఃరూపకల్పన పటంలో చేర్చిన భాగాల కంటే, మినహాయించాలని ప్రతిపాదించిన ప్రాంతం చాలా దట్టమైన, మంచి అడవులతో ఉందని గూగుల్ ఎర్త్‌లోని ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం, అభయారణ్యం నుండి తొలగించదలచిన భూమిని ఆ ప్రాంతపు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ స్వయంగా తనిఖీ చేయాలి. అటవీ శాఖ వాదనలను ధృవీకరించడానికి ఇది ఒక తప్పనిసరి చర్య. అయితే, తొలగిస్తున్న భాగాలకు సంబంధించి ఎటువంటి స్థల తనిఖీ నివేదికను కూడా, కేంద్ర ప్రభుత్వం తన ‘పరివేశ్’ పోర్టల్‌లో బహిర్గతం చేసే తప్పనిసరి దరఖాస్తుతో పాటు పెట్టలేదు.
రాష్ట్ర బోర్డు గానీ, ఎన్‌బిడబ్ల్యుఎల్ గానీ ఈ లోపాన్ని గుర్తించలేదు.
మినహాయింపునకు గల చట్టపరమైన సమర్థనను ఎన్నడూ భౌతికంగా ధృవీకరించలేదు.
అధికారులను ‘ది కలెక్టివ్’ తప్పిపోయిన క్షేత్ర తనిఖీ నివేదిక గురించి కూడా అడిగింది. ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి ఎలాంటి సమాధానం రాలేదు.
రాష్ట్ర అటవీ శాఖ ఒక తనిఖీ నివేదికను అప్‌లోడ్ చేసింది, కానీ అది బాక్సైట్ గనుల పైన ఉన్న భూభాగాలను తొలగిస్తున్నప్పుడు, అభయారణ్యానికి కొత్తగా జోడిస్తున్న ఐదు భూభాగాలకు మాత్రమే సంబంధించినది.
అదే డిఎఫ్‌ఓ చేసిన తనిఖీ నివేదిక నుండి మరో తప్పుడు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆ ఐదు కొత్త భూభాగాలు “నివాసయోగ్యం కానివని, వాటిపై ఎటువంటి అటవీ హక్కుల ఉల్లంఘన క్లెయిమ్‌లు పెండింగ్‌లో లేవని” ఆ అధికారి ఎన్‌బిడబ్ల్యుఎల్‌కు తెలిపారు. అతని మునుపటి నివేదికలో, ఆ ఐదు భూభాగాల సమీపంలో తొమ్మిది గ్రామాలు ఉన్నట్లు నమోదైంది. ఆ తొమ్మిదింటిలో, కనీసం ఒకటి కొత్తగా చేర్చిన ప్రాంతంలోనే ఉంది.
ఎన్‌బిడబ్ల్యుఎల్‌కు సమర్పించిన ప్రతిపాదనలోని అతని సిఫార్సులో ఈ కీలకమైన అంశం లేదు.
2021 సెప్టెంబర్ లో, ఆ ప్రతిపాదన ఎన్‌బిడబ్ల్యుఎల్‌కు చేరిన తర్వాత, అది కూడా స్వయంగా క్షేత్ర తనిఖీ నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్‌బిడబ్ల్యుఎల్ కమిటీ సభ్యుడు ఆర్. సుకుమార్, ఒక ఏనుగుల నిపుణుడు, ఒడిశా అటవీ శాఖ అధికారితో కూడిన ఒక సంయుక్త తనిఖీ బృందం ఆ ప్రదేశానికి వెళ్ళింది.
ఈ క్షేత్ర తనిఖీ నివేదికను బహిరంగపరచలేదు.
కానీ, ఆ తనిఖీ నివేదిక ఆధారంగా, భవిష్యత్తులో సాధ్యమైనన్ని గనులను తెరవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అభయారణ్యం, పర్యావరణ సున్నిత మండలాన్ని కుదించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఎన్‌బిడబ్ల్యుఎల్ స్థాయీ కమిటీ సమావేశ వివరాలలో (మినిట్స్) రాసారు.
ఇప్పటికి, అంచనా ప్రకారం 153 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్న కనీసం ఒక బాక్సైట్ బ్లాక్‌ను వన్యప్రాణుల సరిహద్దుల నుండి ‘విడుదల’ చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పర్యావరణ సున్నిత మండలాన్ని కూడా కుదించినప్పుడు, మరో రెండు బ్లాక్‌లను కూడా గనుల తవ్వకందారుల కోసం తెరిచే అవకాశం ఉంది.
ఒదిశా రాష్ట్ర ప్రభుత్వమూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాక్సైట్ గనితవ్వకం దారులు గెలిచారు.
– ఆయుషీ కర్; రిపోర్టర్
ఆయుషి ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ కోసం భారతదేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థపై డేటా పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆమె గతంలో ‘ది హిందూ బిజినెస్‌లైన్’లో టెక్, టెలికాం రిపోర్టర్‌గా పనిచేశారు. ఆమె యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో చదువుకున్నారు. తన తీరిక సమయంలో కల్పనా సాహిత్యం రాస్తారు.
తెలుగు: పద్మ కొండిపర్తి
https://www.reporters-collective.in/trc/odisha-altered-a-wildlife-map-to-open-bauxite-mining




