సెప్టెంబరు 19, ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నా సెంటర్‌లో ధర్నా
ఈనాడు సగం భారతదేశం ఖైదులో ఉంది. మరీ అంత జనాభా జైళ్లలో ఉందా అంటే గణాంకాల ప్రకారం లేకపోవచ్చు. కానీ, సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తూ, ప్రభుత్వ దాడులకు గురవుతున్న అణగారిన, పేద, దళిత ప్రజలు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలంతా నిర్బంధ చెరలోనే ఉన్నారు. ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, ఇతర మత మైనారిటీల సంఖ్య అత్యధికంగా లేని జైలు గత 70 ఏళ్లలో ఉమ్మడి ఏపీలోగానీ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గానీ ఒక్కటైనా మనం చూశామా? అందువల్లే రాజకీయ ఖైదీలకు సంబంధించిన చర్చను చట్టాలు, న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై నమ్మకంతో పనిచేస్తున్నవారికి మాత్రమే వదిలిపెట్టలేం. అక్కడ జరగాల్సిన కృషి బలంగానే కొనసాగాలి. న్యాయవాదుల భాగస్వామ్యమే రాజకీయ ఖైదీలకు, వారి కుటుంబాలకు భరోసాను, కేసులను ఎదుర్కొనే ధైర్యాన్ని అందించగలదు. అదే సమయంలో సమాజ నిర్దిష్టతను కూడా గమనంలోకి తీసుకోవాలి. కుల వ్యవస్థ, మెజారిటీ మతవాదం, చారిత్రక అసమానతలతో కూడిన సామాజిక వ్యవస్థలో మూలాలను వెతకాలి. అంటే, బహుళ అస్తిత్వాలు, భిన్న ఆచరణలు, ప్రత్యేక ఆర్థిక జీవనం, వేర్వేరు ఉత్పత్తి క్రమాలను కలిగిన సామాజిక ఆవరణలోకి ఈ చర్చను తీసుకుని రావాలి. ఈ మొత్తం నుంచి రాజకీయ ఖైదీల విడుదల సమస్యను చూడాలి. నిజానికి, ప్రజల్లోంచి పుట్టే న్యాయభావనకు చట్టపరిధిని నిర్ణయించడం సాధ్యం కాదు. అన్యాయాలకు, దోపిడీకి వ్యతిరేకంగా గొంతు ఎత్తడం, సమానత్వం కోసం మాట్లాడటం ఎవరో నిర్దిశిస్తేనే జరిగేదో, వద్దంటే ఆగేదో కాదు. న్యాయం, స్వేచ్ఛ, విముక్తి గురించిన వాంఛ సహజాతి సహజమైన మానవ వ్యక్తీకరణ. వాటిని సాధించే క్రమాలు, మార్గాలు ఆ తర్వాత గానీ ఉనికిలోకి రాలేదు. వాటి వెంటే తిరోగమన భావాజాలాలు, జైళ్లు, కోర్టులు, , చట్టాలు, లాఠీ తదితర అణచివేత సాధనాలూ వచ్చాయి. నిజానికి, చట్టాలు కూడా నాగరిక క్రమాల్లోంచే ఉనికిలోకి వచ్చి, వాటికి ఒక ఆర్డర్‌ను ఇవ్వడంలో కీలకంగా పనిచేశాయి. అయితే, కేంద్రంలో 12 ఏళ్లుగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో ఈ చట్టాలు ప్రజా అణచివేత స్వభావాన్ని మరింతగా సంతరించుకున్నాయి. సమాజాన్ని, ఉద్యమాలనే కాదు. మౌలికంగా రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసే స్థితికి అవి చేరుకున్నాయి. ఈ క్రమంలో రాజ్యాంగ పరిరక్షణ కోరుకునే శక్తులు కూడా రాజకీయ ఖైదీల సమస్యపై కలిసి రావాల్సిన అవసరం ఏర్పడింది.
దాదాపు మూడు వందల ఏళ్లు వలస పాలన కింద ప్రత్యక్ష ఖైదుగా ఉన్న దేశం మనది. అందువల్ల ఇక్కడి జైళ్ల పరిస్థితులు, రాజకీయ ఖైదీల సమస్యలపై కాస్త మెరుగ్గా మన పాలకులు ఆలోచించి ఉండొచ్చు. మరణశిక్ష రద్దు చేయకపోయినా, అమలును నిలిపివేసిన దేశాలు కొన్ని కనిపిస్తున్నాయి. కనీసం వాటి సరసన మన దేశం కూడా చేరొచ్చు. కానీ, కుల వ్యవస్థ అనే సామాజిక అడ్డంకి, చారిత్రకంగా రూపొందిన నిర్దిష్ట రాజకీయార్ధిక దోపిడీ వ్యవస్థ కారణంగా భారత పాలకవర్గం భావజాలంలో రియాక్షనరీగా, ఉపఖండ రాజకీయాల్లో విస్తరణవాదిగా తయారైంది. అందువల్ల రాజకీయ ఖైదీల సమస్య, ఆ మాటకొస్తే ఖైదీలందరి సమస్యను విస్తార వేదికపైనే గ్రహించగలం. ప్రైవేటు ఆస్తి రద్దు అయి అందరికీ అన్ని హక్కులు, స్వేచ్ఛలు లభించినప్పుడే, బూర్జువా కోర్టులు, జైళ్లు మూతబడతాయి. ఈనాడు రాష్ట్రంలో రాజకీయ ఖైదీలంటే.. ప్రధానంగా ఆదివాసీలే. మనిషి కనీస అవసరాలయిన “కూడు, గుడ్డ, నీడ“ లేనివారు. మనుగడ కోసం, మంచి పర్యావరణం, ఆవాస నివాసం కోసం, జీవించే హక్కు కోసం మావోయిస్టులతో కలసి నడచినవారు. ఈ కారణంతో సంవత్సరాల తరబడి వారిని కఠినమైన, అణచివేత చట్టాల ద్వారా రాజకీయ ఖైదీలుగా మార్చి నిర్బంధించడం న్యాయం, ధర్మం కాదు.
రెండున్నరేళ్లు సాగిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా, దానికి ముందూ ఆదివాసీలను పెద్దెత్తున అరెస్టులు చేసి విచారణ, ఇతర న్యాయ సహాయాలను దూరం చేస్తూ, సుదీర్ఘ కాలం జైళ్లలో కుక్కారు. ఈ కారణంగా కూడా.. ప్రజాసంఘాల నాయకులు, విప్లవ పార్టీల కార్యకర్తల కంటే ఇప్పుడు వీరి సంఖ్యే మన రాష్ట్ర జైళ్లలో అధికంగా ఉంది. ప్రస్తుతం దాదాపు 70 మంది వరకు ఉన్నట్టు అంచనా. దేశవ్యాప్తంగా ఏడు వేల మంది ఉంటారు. మరోవైపు కోర్టులు విధిస్తున్న అన్యాయమైన షరతుల వల్ల బెయిల్ వచ్చి విడుదలైన ఎందరో జైలు బయట కూడా ఆర్థిక, ఆరోగ్య పరమైన సమస్యలతో తమ వాళ్ళకు దూరంగా ఉండాల్సి వస్తోంది. విప్లవ కవి వరవర రావు, కిరణ్, సాధనాల రామకృష్ణ.. ఇలా ముంబయి, కోల్‌కతాలో ప్రచ్ఛన్న నిర్బంధం అనుభవిస్తున్నారు. కేఎన్‌పీఎస్ నాయకుడు దుడ్డు ప్రభాకర్, ఆర్ కె సహచరి కందుల శిరీష, మహిళా ఉద్యమ కార్యకర్త బెల్లాల పద్మ, తెలంగాణ సీఎల్‌సీ నేత రాజేశం తదితరులు బయట రాష్ట్రాల్లోని జైళ్లలో నాలుగైదు ఏళ్లుగా ఉన్నారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా మహిళా కార్యకర్తలు దేవేంద్ర, శిల్ప,స్వప్నలకు ఇటీవల విశాఖ ఎన్ఐఏ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. 2007లో అరెస్టు అయిన చక్ర కృష్ణ ( తెనాలి), లీలా కృష్ణ (తెనాలి దగ్గర మూల్పూరు), రాణి (జూలకల్లు, పిడుగురాళ్ల), సతీష్ (తెలంగాణ), దున్న డాంగే (బ్రాహ్మణకోడూరు, పొన్నూరు) ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ జైలులో ఉన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల కు చెందిన కంభంపాటి చైతన్య గత ఏడేళ్ల నుంచి కేరళ జైల్లో మగ్గిపోతున్నారు. ప్రగతిశీల కార్మిక సమాఖ్య కార్యకర్త చంద్ర విశాఖ జైల్లో ఉన్నారు. వీరంతా.. అల్లూరి సీతారామ రాజు లా ఆదివాసుల జీవితాల్లో మార్పుకోసం మైదానాలు, పట్టణాల నుంచి వెళ్లి పోరాడిన ఉద్యమ కార్యకర్తలు. ఇలాంటివారు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో మూడు నుంచి ఐదు శాతం మంది దాకా ఉన్నారు.
ఒకనాడు జైళ్లలోని పరిస్థితులను, అక్కడి సాధారణ ఖైదీలపై జరుగుతున్న అన్యాయాలను రాజకీయ ఖైదీలు, వారి వెనుక ఉన్న రాజకీయ ఉద్యమం ప్రశ్నించేది. నిరాహార దీక్షల ద్వారా రాజ్యంపై ఒత్తిడి తెచ్చి జైలు మ్యానువల్ ప్రకారం సౌకర్యాలు అందేలా చూసేవారు. కానీ, ఈనాడు రాజకీయ ఖైదీల గురించే మాట్లాడాల్సిన పరిస్థితిలోకి నెట్టబడ్డాం. రాజకీయ సమస్యలు, వాటిపై పోరాటాలు, నిర్బంధాలు ఉండేవే. వేరే రూపాల్లో అవి ఎప్పుడూ ఎగసిపడుతూనే ఉంటాయి.
విప్లవోద్యమ నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ లో పై చేయి సాధించాక ఇదంతా ఆగుతుందని అనుకున్నారు. ఆ ఆపరేషన్.. ఇప్పుడు దిమాగీ నక్సల్స్‌పై వేట రూపంలో తిరిగి తెరపైకి వచ్చింది. దిమాగీ నక్సల్స్ అంటే రాజ్యం ఇచ్చే నిర్వచనం వేరు.. కానీ, వాస్తవంలో దిమాగీ నక్సల్స్ పేరిట ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, ఇతర మత మైనారిటీలను లక్ష్యం చేసుకుంది. దళితులను బెదరగొట్టడానికి భీమాకోరేగావ్ కుట్ర కేసు, ఎన్ ఆర్ సీ ఉద్యమంపై ఉక్కుపాదంతోపాటు ఆ ప్రక్రియతో నష్టపోతున్న ముస్లిం సమాజానికి నాయకత్వం లేకుండా చేయడానికి ఢిల్లీ కుట్ర కేసులను రచించారు. ఏడేళ్లుగా ఉమర్ ఖలీద్ తీహార్ జైలులోనే ఉన్నారు. కేరళకు చెందిన రిజాజ్ మూడేళ్లుగా జెయిల్లో ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడి శ్రామికవర్గానికి ఉత్తేజాన్ని ఇచ్చిన నోయిడా కార్మికులు, ఆ ఉద్యమ మద్దతుదారులు జైల్లోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా గొప్ప ప్రజా సంచలనంగా మారిన జెన్ జి విద్యార్థులపై నిర్బంధం ప్రభుత్వ స్వభావాన్ని తెలియజేస్తోంది.
రాజకీయ ఖైదీల సమస్యలూ, అవి సమాజాన్ని కదిలించే తీరు చట్టంలో జరిగే మార్పులూ మారుతున్న రాజకీయార్థిక విధానాలతోపాటు మారుతూ వస్తున్నాయి. 1947కు ముందు జాతీయోద్యమ నాయకులపై దేశద్రోహ చట్టాలను ప్రయోగించారు. 1975 ఎమర్జెన్సీలో, దానికి ముందూ మీసా కింద ప్రతిపక్షాల నాయకులు, విప్లవ కార్యకర్తలు, రచయితలు, పేదలు, దళితులను జైళ్లకు పంపారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఎన్ఐఏ చట్టాల కింద ఇప్పుడు వేలాదిమంది ఖైదు చేస్తున్నారు. ఎన్ఐఏ తీసుకునే కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేవు. కేంద్ర హోంశాఖ పరిధిలో వాటి పర్యవేక్షణ ఉంటుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపా కేసులు, ఆదివాసీల కేసులను అత్యధికంగా ఎన్ ఐ ఏ విచారిస్తోంది. అందువల్ల రాజకీయ ఖైదీలకు న్యాయం చేయాలంటూ మనం చేసే ఒత్తిడి రాష్ట్రాల పరిధిని దాటాల్సి ఉంది. అందువల్లే అన్నివిధాలా మనం ఇప్పుడు పూర్తి భిన్నమైన వాతావరణంలో రాజకీయ ఖైదీల విడుదల కోసం మాట్లాడుతున్నాం. వెతికితే ఇక్కడే కొన్ని సానుకూలతలు కూడా కనిపిస్తాయి. ఒకప్పుడు ఏదో ఒక విప్లవ పార్టీకి చెందిన రాజకీయ సమస్యగా ఈ అంశం ఉండేది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసమ్మతి స్వరాలను మూసివేయడం, భిన్నాభిప్రాయాలను తొక్కిపెట్టడం, రాజ్యాంగం అమలును సైతం దుర్లభంగా మార్చివేయడం పెరిగింది. దీంతో రాజకీయ ఖైదీల అంశం ఇప్పుడు విశాల ప్రజాస్వామిక స్వభావం సంతరించుకుంది. అయితే, పటిష్ఠ నిర్మాణం, సొంత యంత్రాంగం, కార్యకర్తల బలం కలిగిన రాజకీయ పార్టీలు, సంస్థలు ముందుకు రాకుండా, నాయకత్వం అందించకుండా ఈ పరిస్థితిలోని సానుకూలతను సంఘటితపరచలేం. ఏపీ జైళ్లలోని చివరి రాజకీయ ఖైదీని కూడా విడుదల చేయించడం లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుదాం. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 19, విజయవాడ ధర్నా సెంటర్‌లో రాజకీయ ఖైదీల సమస్యపై ఏర్పాటుచేసిన ధర్నాను విజయవంతం చేసుకుందాం.
10.9.2026




