వందేమాతరం గేయం సూత్రప్రాయంగా దుర్గాదేవి వందనం. బంకించంద్ర ఈ గేయంలో భారతమాతను, దుర్గామాతను ఒకటిగా మార్చేశారు. ఇది ఆయన భాషా నైపుణ్యం, కావ్య కౌశలానికి నిదర్శనం. అయితే భాష వెనుక ఉన్న సత్యాన్ని దాచలేము. ఈ గేయం హిందూ దేవత అయిన దుర్గకు దేశం కంటే ఉన్నతమైన స్థానాన్ని ఇస్తూ, భారతమాతను దుర్గాదేవి రూపంలో ఊహిస్తుంది. గేయం మొదటి భాగం దేశం గురించి వివరిస్తుంది. అందులో నేల, నీరు, పంటలు, పచ్చదనం, మాతృభూమి సౌందర్యం ఉన్నాయి.
1937లో వివాదం తలెత్తిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాతీయ వేడుకల్లో దీని మొదటి రెండు చరణాలను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. నెహ్రూ ఈ ప్రక్రియ మొత్తానికి అంగీకరించారు. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్‌తో కూడా ఈ విషయాన్ని చర్చించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఎస్‌ఓపీ లో ఆరు చరణాల పూర్తి గేయాన్నే వందేమాతరం అధికారిక రూపంగా పేర్కొన్నారు. జాతీయ గీతం పాడేటప్పుడు దాని అధికారిక రూపాన్నే పాడాలని కూడా సూచించారు.
ఈ పూర్తి గేయంలోనే భారతమాత క్రమంగా హిందూ దేవత రూపాన్ని సంతరించుకుంటుంది, ఆపై నేరుగా “త్వమ్ హి దుర్గా దశప్రహరణధారిణీ” [పది ఆయుధాలను ధరించిన దుర్గవు నీవే] అని వర్ణిస్తారు.
కానీ భారతదేశం కేవలం దుర్గను పూజించేవారి దేశం మాత్రమే కాదు. ఈ దేశంలో ఆదివాసుల జనాభా అత్యధికంగా ఉంది, వారి సాంస్కృతిక స్మృతుల్లో మహిషాసురుడు రాక్షసుడు కాదు, వ స్వయానా వారి పూర్వీకుడు. దళిత-బహుజనుల్లోని ఒక వర్గం కూడా ప్రతి సంవత్సరం శరద్ పూర్ణిమ సమయంలో మహిషాసుర అమరత్వ సంస్మరణను జరుపుకుంటోంది.
ఇలాంటి సాంస్కృతిక నేపథ్యం నుంచే శిబూ సోరెన్ వంటి నాయకులు వచ్చారు. 2008లో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడానికి నిరాకరించారు. రావణుడిని తన “కులగురువు” అని సంబోధిస్తూ— మనం పూజించే కులగురువు దిష్టిబొమ్మను ఎలా తగలేస్తాం అని ప్రశ్నించారు.
మిజోరంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ విద్యార్థి సంఘం ‘మిజో జర్లాయ్ పావల్’ పాఠశాలల్లో పూర్తి గేయాన్ని పాడడాన్ని తప్పనిసరి చేయడాన్ని నిరసించింది. ముఖ్యమంత్రి లాల్‌దుహోమా కూడా మాట్లాడుతూ, అధికారిక, విద్యాపరమైన అవసరాల కోసం మొదటి రెండు చరణాలు మాత్రమే ఆమోదయోగ్యమని, తరువాతి చరణాలలో హిందూ దేవుళ్ల, దేవతల మతపరమైన ప్రస్తావనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఐజ్వాల్ విద్యాశాఖ అధికారి కూడా పాఠశాలల్లో మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలని ఆదేశించారు.
ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి గేయాన్ని అధికారిక రూపంగా మార్చినప్పటికీ, ఈ ఈశాన్య ప్రాంతాలలో దాని ఆరు చరణాల పూర్తి రూపం తీవ్రమైన సాంస్కృతిక-మతపరమైన నిరసనను ఎదుర్కొంటోంది. దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు, ర్యాలీలు జరుగుతున్నాయి.
ఈశాన్య భారతదేశం దేశంలో ఒక అంతర్భాగం, వారి ఈ స్వరాన్ని విస్మరించకూడదు. ఈ వివాదం దేశభక్తికి సంబంధించినది కాదు. బహుళ మతాలు, బహుళ కులాలు, బహుళ సంస్కృతులు ఉన్న దేశంలో కొన్ని కులాల మతపరమైన విశ్వాసాలను ఇతరులందరి సాంస్కృతిక సత్యంగా ఎందుకు రుద్దాలి? అసలు మునుపటి వ్యవస్థతో వచ్చిన ఇబ్బంది ఏమిటి? వందేమాతరంలోని మొదటి రెండు చరణాలు (ముఖ్యంగా దేశం గురించి ఉన్నవి) పాడితే దేశభక్తి తగ్గిపోతుందా? ఇతర సమూహాలు తమ దేశభక్తిని నిరూపించుకోవడానికి దుర్గ వంటి మతపరమైన సంకేతాన్ని ఆమోదించడం తప్పనిసరా?
ఒక కథలో ఒక వర్గానికి దుర్గ విజేత అయిన దేవత అయితే, అదే కథలో మరొక సమూహానికి చెందిన పూర్వీకుడు మహిషాసురుడుని చంపేస్తారు. ఈ ప్రశ్న దేశభక్తికి సంబంధించినది కాదు, సాంస్కృతిక సామ్రాజ్యవాదమూ దాని ప్రతిఘటనకు సంబంధించినది.
ఈరోజు, ఇదే సంఘర్షణ ఈశాన్య భారతదేశంలోని ఇతర మత-సాంస్కృతిక సందర్భాలలో కూడా చోటు చేసుకుంటోంది. నాగాలాండ్‌లో, విద్యాపర, ప్రభుత్వ కార్యక్రమాలలో వందేమాతరం తప్పనిసరిగా పాడటాన్ని నాగ స్టూడెంట్స్ ఫెడరేషన్ నిరంతరం నిరసిస్తూ వస్తోంది. నాగాలాండ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, వందేమాతరం వాయిస్తున్నప్పుడు కూర్చొని నిరసన తెలిపారు.
ప్రమోద్ రంజన్ హిందీ రచయిత. సామాజిక, సాంస్కృతిక అంశాలపై రాస్తారు.
https://www.themooknayak.com/discussion-interview/vande-mataram-a-question-of-cultural-imperialism
అనువాదం : కె. పద్మ




