‘వృద్ధి’, ‘అభివృద్ధి’ అనే పదాలు ఒకేలా కనిపించినప్పటికీ, వాటి అర్థాలు వేర్వేరు. నిజానికి వాటిని ఆర్థిక ప‌రిభాష‌లో వాటిని ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అని అనాలి. ఆర్థిక వృద్ధి అంటే ఒక దేశం యొక్క ఉత్పత్తిలో పరిమాణాత్మక పెరుగుదల, కాగా ఆర్థిక అభివృద్ధి అనేది మొత్తం ప్రజల జీవన ప్రమాణాలలో గుణాత్మక మెరుగుదల. ఆర్థిక వృద్ధి, అభివృద్ధి అనే పదాలను తరచుగా ఒకదానికొకటి పర్యాయపదాలుగా ఉపయోగిస్తారు, కానీ అవి అర్థశాస్త్రంలో వేర్వేరు భావనలను సూచిస్తాయి. ఆర్థిక వృద్ధి, అభివృద్ధి అనేవి ఒక దేశం యొక్క పురోగతికి, శ్రేయస్సుకు కీలక సూచికలు. వస్తు సేవల ఉత్పత్తిని అధికం చేస్తే జిడిపి పెరుగుతుంది. విద్యా సంబంధ కార్యక్రమాలపై వ్యయం చేస్తే నిపుణులైన ఉత్పాదకశక్తి కలిగిన శ్రామికు లు సిద్ధమవుతారు. మొదటిది ఆర్థిక వృద్ధి, అది పరిమాణాత్మకమైతే, రెండవది ఆర్థికాభివృద్ధి.. నాణ్యమై నది, దేశ దీర్ఘకాలిక శ్రేయస్సుకి దోహదపడుతుంది. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక, గుణాత్మక మార్పులకు కారణమవుతుంది. ఆర్థిక శాస్త్రంలో ఈ రెండు పదాల మధ్య వ్యత్యాసాలను పలువురు ఆర్థికవేత్తలు సమగ్రంగా విశ్లేషించారు.

ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే పదాలను అడం స్మిత్ కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. అయితే 1960 దశకం వరకు ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే భావనలు పర్యాయ పదాలుగా వాడుతున్నప్పటికీ హిల్స్, ఘంపీటర్ లాంటి ఆర్థికవేత్తలు వీటి మధ్య స్పష్టమైన తేడాలను చూపించారు. మైఖేల్ పీ తోడారో ప్రకారం.. ఆర్థిక వృద్ధి అనేది ఒక  స్థిరమైన ప్రక్రియ. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదన సామర్థ్యం నియత కాలంలో పెరుగుతుంది. ఫలితంగా జాతీయ ఉత్పత్తిలో, ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది. ఆర్థిక వృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ అని సైమన్ కుజ్‌నెట్స్ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి వస్తుసేవల పెరుగుదలను అంటే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను సూచిస్తుంది. ఆర్థికాభివృద్ధి దేశంలో ఆర్థిక వృద్ధితో పాటుగా వ్యవస్థాపూర్వక, సంస్థాగత, సాంఘిక, ఆర్థిక మార్పులను, ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను సూచిస్తుంది.  

ఆర్థిక వృద్ధి అంటే ఒక దేశం యొక్క వస్తువులు, సేవల ఉత్పత్తిలో  పెరుగుదల. దీనిని సాధారణంగా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) పెరుగుదల ద్వారా కొలుస్తారు. అయితే, అభివృద్ధి అనేది జీవన ప్రమాణాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆదాయ పరపిణీలో మెరుగుదలతో సహా ఒక విస్తృత దృక్పథాన్ని కలిగి ఉంటుం ది. ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థిక వృద్ధికంటే విస్తృతమైనది. ఒకదేశంలో వచ్చే సాంఘిక, ఆర్థిక, వ్యవస్థాప రమైన, ప్రగతిశీల మార్పులను ఆర్థికాభివృద్ధి సూచిస్తుంది. సాధారణంగా తలసరి ఆదాయం ఎక్కువ ఉండటాన్ని ఆర్థికాభివృద్ధికి సూచికగా భావిస్తారు. అభివృద్ధి అంటే కేవలం జిడిపిలో పెరుగుదల కాదు. మొన్నటి కంటే నిన్న, నిన్నటి కంటే నేడు జీవన ప్రమాణాలు ఎంత మెరుగుపడ్డాయి, సర్వమానవ సమానత్వాన్ని నిరాకరించే అనాగరిక ఆలోచనల్లోంచి బయటపడుతున్నామా లేదా అన్నవే పురోగతికి వాస్తవ కొలమానాలు. ఆ గీటురాళ్ల మీద గణిస్తే జనభారతం చేరుకోవాల్సిన ప్రగతి గమ్యాలు ఇంకా సుదూ రంగానే కనిపిస్తాయి. ఆర్థిక వృద్ధి పరిమాణాత్మక విస్తరణపై దృష్టి సారిస్తుండగా, అభివృద్ధి ప్రజల శ్రేయ స్సును పెంపొందించే గుణాత్మక మార్పులకు ప్రాధాన్యత ఇస్తుంది. 

ఆర్థిక వృద్ధి అనేది కాలక్రమేణా ఒక దేశం యొక్క వాస్తవ జాతీయ ఆదాయం లేదా తలసరి ఆదాయంలో పెరుగుదలను సూచిస్తుంది. దీనిని సాధారణంగా వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) లేదా తలసరి జిడిపిలో పెరుగుదల ద్వారా కొలుస్తారు. 

ఆర్థిక వృద్ధి యొక్క ముఖ్య లక్షణాలు : ఆర్థిక వృద్ధిని, కేవలం ధరల ద్రవ్యోల్బణం కారణంగా వచ్చే నామమాత్రపు ఆదాయ పెరుగుదలను కాకుండా, వస్తువులు, సేవల ఉత్పత్తిలో వాస్తవ పెరుగుదలను ప్రతిబింబించే వాస్తవ జాతీయ ఆదాయ పెరుగుదల ద్వారా అంచనా వేస్తారు. కాలక్రమేణా నిలకడగా కొనసాగడం, నిజమైన ఆర్థిక వృద్ధి అనేది దీర్ఘకాలంలో వాస్తవ ఆదాయంలో స్థిరమైన పెరుగుదలను కలిగి ఉంటుంది, ఇది స్వల్పకాలిక లేదా కాలానుగుణ హెచ్చుతగ్గుల నుండి దానిని వేరు చేస్తుంది. 

ఉత్పాదక సామర్థ్యం:  వృద్ధి సుస్థిరంగా ఉండాలంటే, అది సాంకేతిక పురోగతులు లేదా మెరుగైన మౌలిక సదుపాయాల వంటి ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యంలో మెరుగుదలపై ఆధారపడి ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సామర్థ్యంలో ఎక్కువ స్థాయి పెరుగుదల నమోదయినప్పుడు ఆర్థిక వృద్ధి ఉం టుంది. ఒక దేశ జాతీయాదాయంలో, తలసరి ఆదాయంలో వాస్తవిక తలసరి ఆదాయంలో, ఉత్పాదకత సామర్థ్యంలో పరిమాణాత్మక మార్పులను తెలిపేది ఆర్థిక వృద్ధి అని నిర్వచించవచ్చు.  

ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే కారకాలు :1) మానవ వనరులు- ఒక దేశ ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి బాధ్యత వహించే ఒక ప్రధాన అంశం ఇది. శ్రామిక శక్తి యొక్క నైపుణ్యాలు, సామర్థ్యాలలో పెరుగుదల రేటు అంతిమంగా ఒక దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. 2) మౌలిక సదుపాయాల అభివృద్ధి- రహదారులు, యంత్రాలు, కర్మాగారాలు వంటి భౌతిక మూలధనంలో మెరుగుదలలు, పెట్టుబడుల పెంపుదల, వ్యయా న్ని తగ్గించడం ద్వారా ఆర్థిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. 3) సహజ వనరుల ప్రణాళికాబద్ధమైన వినియోగం- ఖనిజ నిక్షేపాల వంటి అందుబాటులో ఉన్న సహజ వనరులను సక్రమంగా ఉపయోగిం చడం ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకతను పెంచడానికి సహాయపడుతుంది. 4) జనాభా పెరుగుదల- జనాభా పెరుగుదల వలన మరింత మానవ వనరుల లభ్యత ఏర్పడుతుంది, ఇది పరిమాణం పరంగా ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం. 5) సాంకేతిక పురోగతి- సాంకేతి కతలో అభివృద్ధి ఒక దేశ ఆర్థిక వృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల శ్రామిక ఉత్పాదకత పెరిగి, తక్కువ ఖర్చులతో ఆర్థిక వృద్ధి పురోగమి స్తుంది. 

ఆర్థిక వృద్ధి దశలు : ఆర్థిక వ్యవస్థ వివిధ కార్యకలాపాల దశల గుండా కదులుతుంది. ఈ కదలికను వ్యాపార చక్రం అంటారు. ఇది నాలుగు దశలను కలిగి ఉంటుంది. 1) విస్తరణః ఈ దశలో ఉపాధి, ఆదాయం, పారిశ్రామిక ఉత్పత్తి, అమ్మకాలు అన్నీ పెరుగుతాయి, వాస్తవ జిడిపి కూడా పెరుగుతుంది. 2) గరిష్ట స్థాయి : ఆర్థిక విస్తరణ దాని గరిష్ట స్థాయికి చేరుకునే సమయం ఇది. ఇది వాస్తవానికి ఒక మలుపు. 3) సంకోచం : ఈ దశలో విస్తరణలోని అంశాలన్నీ తగ్గడం మొదలవుతాయి. ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన క్షీణత ఆర్థిక వ్యవస్థ అంతటా వ్యాపించినప్పుడు అది మాంద్యంగా మారుతుంది. 4) అగాధం : ఆర్థిక సంకోచం అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు దీనిని అగాధం అంటారు.

ఆర్థికాభివృద్ధి అనేది సమాజం యొక్క భౌతిక శ్రేయస్సులో నిరంతర మెరుగుదలను కలిగి ఉండే ఒక విస్తృత భావన. ఇది కేవలం ఆదాయ పెరుగుదలకు అతీతంగా, మొత్తం పురోగతికి దోహదపడే సామాజిక, సాంస్కృతిక, సంస్థాగత మార్పులను కూడా కలిగి ఉంటుంది. దీర్ఘకాలంలో ఒకదేశంలో ఆదాయ వ్యత్యా సాలు లేకుండా తలసరి ఆదాయాలు క్రమంగా, ఒడిదుడుకులు లేకుండా పెరుగుతూ, ప్రజల జీవన ప్రమాణస్థాయి, అక్షరాస్యత, ఉద్యోగిత పెరుగుతూ వస్తువుల సముదాయంలో ఉత్పత్తి పద్ధతులలో సాంకే తిక, వ్యవస్థాపూర్వక మార్పులు జరిగే ప్రక్రియను ఆర్థికాభివృద్ధి అని నిర్వచించవచ్చు. 

ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే కారకాలు : 1) మౌలిక సదుపాయాల అభివృద్ధి- ఇది ప్రజల జీవన నాణ్య తను మెరుగుపరుస్తుంది. అందువల్ల, మౌలిక సదుపాయాల అభివృద్ధి రేటు పెరగడం దేశ ఆర్థికాభివృద్ధికి దారితీస్తుంది. 2) విద్య- అక్షరాస్యత- సాంకేతిక పరిజ్ఞానంలో మెరుగుదల వివిధ పరికరాల వినియోగంపై మెరుగైన అవగాహనకు దారితీస్తుంది. ఇది శ్రామిక ఉత్పాదకతను పెంచుతుంది, తత్ఫలితంగా, ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి దారితీస్తుంది. 3) మూలధనంలో మెరుగుదల-ఇది పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత పెరుగుతుంది, ఇది ఆర్థికాభివృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. 

ఆర్థికాభివృద్ధిలో నిర్మాణాత్మక మార్పులు : 1) ఆర్థికాభివృద్ధి దేశంలోని వివిధ రంగాల్లో వచ్చే నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది. 2) వృత్తిపరమైన నిర్మాణంలో మార్పులు వస్తాయి. 3) ఆర్థికాభివృద్ధి వల్ల ప్రాథమిక రంగంలో (వ్యవసాయం) శ్రామికశక్తి వాటా తగ్గి ద్వితీయరంగం (పారిశ్రామిక రంగం), సేవా రంగా ల్లో కార్మిక శక్తి వాటా పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి వల్ల విదేశీ వాణిజ్యంలో మార్పులు వస్తాయి. ప్రాథమిక రంగ వస్తువుల ఎగుమతులు తగ్గి, మూలధన వస్తువుల దిగుమతుల వాటాలో పెరుగుదల ఏర్పడుతుంది.

ఆర్థికాభివృద్ధి యొక్క లక్షణాలు : 1) గుణాత్మక అభివృద్ధి: మానవ అభివృద్ధి సూచిక(హెచ్‌డిఐ), అక్షరాస్య త రేట్లు, ఆరోగ్య సంరక్షణ అందుబాటు వంటి సూచికలను ఉపయోగించి అభివృద్ధిని కొలుస్తారు. 2020లో భారతదేశ మానవాభివృద్ధి సూచిక(హెచ్‌డిఐ) 0.645గా ఉంది. ఇది మధ్యస్థ మానవ అభివృద్ధిని సూచి స్తుంది.  2) దీర్ఘకాలిక దృక్పథం: ఆర్థికాభివృద్ధికి భిన్నంగా, అభివృద్ధి అనేది జీవన ప్రమాణాలను మెరుగు పరిచే దీర్ఘకాలిక నిర్మాణాత్మక మార్పులపై దృష్టి పెడుతుంది.  3) సమగ్ర విధానం: సమ్మిళిత పురోగతిని నిర్ధారించడానికి ఆర్థికాభివృద్ధి సామాజిక, పర్యావరణ, ఆర్థిక కారకాలను ఏకీకృతం చేస్తుంది.

ఆర్థికాభివృద్ధి సాధించడానికి భారత్ పెట్టుకున్న లక్ష్యాలు : 1) ఆర్థిక వృద్ధిరేటుతో ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడం 2) ఆర్థిక స్వయంపోషకత్వం సాధించడం 3) సామాజిక న్యాయం 4) ఆధునికీకరణ 5) ఆర్థిక స్థిరత్వం 6) సమ్మిళిత వృద్ధి.

సమగ్ర అభివృద్ధి : ఆర్థికాభివృద్ధిలో ఆదాయం, పొదుపు, పెట్టుబడి, సామాజిక-ఆర్థిక నిర్మాణాలలో మార్పులు ఉంటాయి. వీటితో పాటు సాంకేతికత, నైపుణ్యాలు, సంస్థాగత చట్రాలలో మెరుగుదలలు కూడా ఉంటాయి. 

గుణాత్మక, పరిమాణాత్మక మార్పులు:  ఆర్థికాభివృద్ధిలో జాతీయ ఆదాయంలో పరిమాణాత్మక వృద్ధి ఉన్న ప్పటికీ, ఇది మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన వంటి జీవన  నాణ్యత లో గుణాత్మక మెరుగుదలలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. 

సమానత్వం-సంక్షేమం : ఆర్థికాభివృద్ధి యొక్క లక్ష్యం మరింత సమానమైన ఆదాయ పంపిణీని సాధించడం. మెరుగైన ఉపాధి అవకాశాలు, సామాజిక సమానత్వం ద్వారా జనాభా మొత్తం శ్రేయస్సును పెంపొందించడం. 

వృద్ధి, అభివృద్ధి సూచికలు ఒక దేశం యొక్క ఆర్థిక పురోగతిని, మొత్తం ప్రజా శ్రేయస్సును అంచనా వేయడానికి సాయపడతాయి. ఆర్థిక వృద్ధిని సాధారణంగా స్థూల దేశీయోత్పత్తి(జిడిపి), తలసరి ఆదాయం, పారిశ్రామిక ఉత్పత్తి ద్వారా కొలుస్తారు. అయితే, వృద్ధి మాత్రమే జీవన నాణ్యతను లేదా వనరుల సమాన పంపిణీని ప్రతిబింబించదు. విస్తృత అభివృద్ధి సూచికలలో మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ), బహుముఖ పేదరిక సూచిక (యంపిఐ), లింగ అసమానత సూచిక (జిఐఐ), గిని గుణకం (ఆదాయ అసమానత కోసం) ఉంటాయి. అక్షరాస్యత రేటు, ఆయుర్దాయం, శిశు మరణాల రేటు, ప్రాథమిక సేవలకు ప్రాధాన్య‌త‌ అనేవి ఇతర కీలక సూచికలు. ఈ సూచికలు సామాజిక, ఆర్థిక, పర్యావరణ కోణాలను కలపడం ద్వారా సమగ్ర దృక్పథాన్ని అందిస్తాయి. సమర్థవంతమైన విధాన రూపకల్పనకు, మానవ సంక్షేమంలోని లోపాలను గుర్తించడానికి, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా పురోగతిని పర్యవేక్షించడానికి విశ్వసనీయ సూచికలు అత్యవసరం. అవే నిజ‌మైన‌ అభివృద్ధి సూచిక‌లు.

Leave a Reply