600కి పైగా హత్యలు, అరెస్టులు: గనుల తవ్వకం
బస్తర్‌లో భారత ప్రభుత్వ ఉక్కుపాదం
అడవి మౌనంగా ఉంది
కానీ ఆ మౌనంలో
నరికివేతకు గురైన వేలాది చెట్ల హాహాకారాల సమాధి
– లాపతా జంగిల్, సుధీర్ ధవాలే
‘ఆపరేషన్ కగార్’ పైన తమ తాజా నివేదికను 2026 జూన్ 11నాడు, పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ విడుదల చేసింది.
2024 జనవరి నుండి 2026 మార్చి మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన భద్రతా చర్యల సమాహారమే ఈ ఆపరేషన్ కగార్. ఈ పదానికి అర్థం ఏదైనా ఒక అంచుకు కుదించడం. ప్రధానంగా ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో ‘నక్సలిజం’ లేదా ‘వామపక్ష ఉగ్రవాదం’ ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రభుత్వం చేపట్టిన అత్యంత శక్తివంతమైన చర్యలలో ఇది ఒకటిగా నిలిచింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాలపైన పియుడిఆర్ నివేదిక దృష్టి పెట్టింది. ఆపరేషన్ కగార్ కారణంగా వెలుగులోకి వచ్చిన హత్యలు, అరెస్టులు, లొంగుబాట్లను పరిగణనలోకి తీసుకుంటూ, ప్రభుత్వ జవాబుదారీతనం ఏ స్థాయిలో ఉందనే అంశాన్ని ఈ నివేదిక నమోదు చేసింది.
సంవత్సరాల తరబడి సాగుతున్న ప్రతిఘటనపైన అణచివేత
దేశం నుండి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించటానికి 2026 మార్చి 31 చివరి గడువు అని హోంమంత్రి అమిత్ షా 2025 ఫిబ్రవరిలో ప్రకటించారు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమా బల్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న స్థానిక భద్రతా బలగాలు వంటి అనేక భద్రతా బలగాలను సమన్వయం చేస్తూ ఒక వ్యూహాన్ని రూపొందించడానికి ఇది దారితీసింది.
సమగ్ర మావోయిస్టు ఉద్యమంపైన ప్రభుత్వం చేపట్టిన అత్యంత వ్యూహాత్మకమైన దాడిగా ఆపరేషన్ కగార్ పనిచేసింది.
బ్రిటీష్ వలస పాలకులు అడవి సంపదను చేజిక్కించుకోవడానికి ఆదివాసీ సముదాయాలను వారి భూముల నుండి వెళ్లగొట్టిన నాటి నుండి ఆదివాసీలకు, రాజ్యానికి మధ్య శతాబ్దాల నాటి ఘర్షణ కొనసాగుతూనే ఉంది.
స్వాతంత్ర్యం తర్వాత కూడా ప్రైవేట్ కార్పొరేషన్లు అటవీ సంపదను వెలికితీసేందుకు వివిధ ప్రభుత్వాలు మరింత అవకాశాలు కల్పించడంతో ఈ పరిస్థితి కొనసాగింది. అడవి పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యం అత్యంత దోపిడీకి గురవుతున్న తరుణంలో, ఆదివాసీ సముదాయాలు తమ స్వంత భూమిని నిరంతరం కోల్పోతున్నాయి.
ఆదివాసీల హక్కుల క్రమబద్ధమైన ఉల్లంఘనకు వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.
దేశం నుండి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించటానికి 2026 మార్చి 31 చివరి గడువుగా ఉంటుందని హోంమంత్రి అమిత్ షా 2025 ఫిబ్రవరిలో ప్రకటించాడు.
600కి పైగా హత్యలు, అరెస్టులు; పారదర్శకత లోపం
2024 జనవరి 1 – 2026 మార్చి 31 మధ్య కాలంలో వార్తాపత్రికలలో వచ్చిన హత్యలు, అరెస్టులు, లొంగుబాట్ల నివేదికల ఆధారంగా ఆదివాసీలపైన సాయుధ సంఘర్షణ తాలూకు ‘ఖర్చులు; పరిణామాల’ దృక్కోణం నుండి పియుడిఆర్ నివేదిక ఆపరేషన్ కగార్‌ను విశ్లేషించింది.
ఒకవైపు మావోయిస్టులు, మరోవైపు రాజ్య బలగాల మధ్య హింసాత్మక ఘటనలు (ఎక్కువగా రాజ్య బలగాలే ప్రారంభించినవి) అధికంగా జరగడం వంటి; ఆపరేషన్ కగార్‌ను చుట్టుముట్టిన అసాధారణ పరిస్థితులను గుర్తించడంతో నివేదిక మొదటి భాగం ప్రారంభమవుతుంది.
ఈ హింసాకాండను, ఛత్తీస్‌గఢ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సహకారంతో హోంమంత్రిత్వ శాఖ సమన్వయం చేసింది. ఇటువంటి హత్యలు, లొంగుబాట్ల గురించి సమాచారం ప్రధానంగా పోలీసు లేదా ప్రభుత్వం అందించిన సమాచారంపైనే ఆధారపడి ఉంది. ఇక్కడ ఏమి జరిగిందనే దానిపైన స్వతంత్ర సమాచారం లేదు. అలాంటి కేసులలో చట్టపరమైన పరిణామాలపైన ఎటువంటి ఫాలో-అప్ లేదు.
2024 జనవరి 1 నుండి 2026 మార్చి 31 వరకు 516 మంది మావోయిస్టులు, 36 మంది రాజ్య బలగాలకు చెందినవారు, 55 మంది పౌరులతో కలిపి మొత్తం 607 మంది హత్యకు గురైనట్లు ఈ నివేదిక నమోదు చేసింది.
న్యాయ విచారణకు ఆదేశించిన ఏకైక కస్టడీ మరణం మినహా చట్టాతీత హత్యలపైన ఎటువంటి అధికారిక లెక్కలు లేవు; అటువంటి విచారణల పురోగతి లేదా ముగింపు గురించి వార్తాపత్రికలలో ఎలాంటి ఫాలో-అప్స్ లేవు.
మావోయిస్టులుగా ముద్రపడిన వ్యక్తులను ఏ ప్రాతిపదికన గుర్తించారు; అలాంటి వారిపైన ఏవైనా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయా అనే దానిపైన సంపూర్ణ సమాచారం లేకపోవడాన్ని కూడా నివేదిక ఎత్తి చూపింది. మరణించిన వారి నుండి రాజ్యం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న సందర్భాలలో, అటువంటి రికవరీలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పింది. ఎలాంటి రికవరీలు జరగని సందర్భాలలో, అరెస్టు చేయడం అనేది మరింత హేతుబద్ధమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నప్పుడు అలాంటి హత్యల అవసరం ఏమిటనే ప్రశ్నలను ఇది లేవనెత్తుతుంది.
అరెస్టులకు సంబంధించి, 2024 జనవరి 1 నుండి 2026 మార్చి 31 మధ్య కాలంలో 487 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు నివేదిక నమోదు చేసింది. అయితే, ఈ అరెస్టులలో అరెస్టు చేసిన నిర్దిష్ట ప్రదేశం, అరెస్టుకు దారితీసిన పరిస్థితులు లేదా ఎఫ్ఐఆర్ నంబర్ల ప్రస్తావన వంటి సమాచారం ఏదీ లేదు.
బస్తర్ ప్రాంతంలో లొంగుబాట్లకు సంబంధించి ఆ కాలావధిలో 1,496 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు రికార్డులు చూపుతున్నాయి. బలగాల చేతిలో హతమవ్వడానికి బదులుగా లొంగుబాటు ఒక్కటే ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం లొంగుబాటు-పునరావాస విధానాన్ని అమలు చేస్తోంది. హత్యలు, అరెస్టులు, లొంగుబాట్ల సంఘటనలపైన ప్రధానంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఏకపక్ష సమాచార ప్రవాహం వల్ల.. ప్రతి ఆపరేషన్‌లోనూ హత్య అవసరమా? అరెస్టులను సమర్థించే గట్టి ఆధారం ఉందా? అదుపులోకి తీసుకున్నవారి హక్కుల పరిరక్షణ జరిగిందా? అనే దానిపైన అనుమానాలు కలుగుతున్నాయి.
పోలీసు ఎన్కౌంటర్లపైన సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ v. మహారాష్ట్ర ప్రభుత్వం (2014) కేసులో, ‘పోలీసు ఎన్కౌంటర్లలో జరిగే హత్యలకు స్వతంత్ర విచారణ అవసరం; ఎందుకంటే ఇవి చట్టబద్ధమైన పాలన, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ విశ్వసనీయతపైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. మరణాలకు దారితీసిన పోలీసు ఎన్కౌంటర్ల విషయాలను దర్యాప్తు చేయడానికి కోర్టు కొన్ని ముఖ్యమైన అవసరాలను నిర్దేశించింది: ‘పోలీసులు నిఘా సమాచారాన్ని రికార్డ్ చేయడం, సీఐడీ లేదా వేరే పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు బృందం ద్వారా ఎన్కౌంటర్పైన స్వతంత్ర దర్యాప్తు, మేజిస్టీరియల్ విచారణ; కోర్టుకు నివేదిక సమర్పించడం, ఎఫ్ఐఆర్, డైరీ ఎంట్రీలు, స్కెచ్ మొదలైనవి ఎటువంటి ఆలస్యం లేకుండా సంబంధిత కోర్టుకు పంపడం, అనుమానిత నేరస్థుడు / బాధితుడి బంధువులకు వీలైనంత త్వరగా సమాచారం అందించడం, ఎన్కౌంటర్లో మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించడం; వారి శౌర్యం సందేహాలకు అతీతంగా నిరూపించబడితే తప్ప సంబంధిత అధికారికి ఎలాంటి త్వరిత పదోన్నతులు ఇవ్వకుండా చూసుకోవడం’.
బస్తర్ ప్రాంతంలో చట్టాతీతహత్యల కేసులలో కోర్టు నిర్దేశించిన ఈ ప్రాథమిక అవసరాలు నెరవేరాయా లేదా అనే విషయాన్ని అంచనా వేయడానికి తగిన రికార్డులు అందుబాటులో లేవని పియుడిఆర్ నివేదిక స్పష్టంగా పేర్కొంది.
అరెస్టు అయిన వారి గురించిన వివరాలు, వారి అరెస్టుకు దారితీసిన పరిస్థితులు లేకపోవడంతో, ఇది ఏకపక్ష అరెస్టుల సంభావ్యతను కూడా సూచిస్తుంది. ‘ఉగ్రవాద సంస్థలతో సంబంధం – మద్దతు’ అనే అస్పష్ట నిర్వచన ఉపా చట్ట సెక్షన్ల పరిధిలోకి రాజకీయ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, నిందితుల తరపున వాదించే న్యాయవాదులను ఇరికించడంతో బస్తర్ వంటి ప్రాంతంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967 (ఉపా) మరింత బలపడింది. ‘మావోయిస్టు సాహిత్యం’ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొనడం కూడా అత్యంత అస్పష్టంగా ఉంది, అటువంటి సామాగ్రిని కలిగి ఉండటాన్ని నిషేధించే స్పష్టమైన ఉత్తర్వులు లేవు లేదా నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీతో ఆ వ్యక్తికి ఉన్న సంబంధాన్ని లింక్ చేయడంలో ఎలాంటి పొందిక లేదు.
‘తెలియని నక్సలైట్ల’పై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం వంటి వ్యవస్థాగత సమస్యలతో ఈ అరెస్టులు సతమతమవుతున్నాయి. పేర్లు అందించిన సందర్భాలలో కూడా ఆ పేర్లు తరచుగా గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులకు సంబంధించినవిగా ఉంటున్నాయి. ఇది అంతిమంగా అత్యంత తక్కువ దోష నిర్ధారణలకు దారితీస్తోంది. 2024 నాటి క్విల్ ఫౌండేషన్ నివేదికను ప్రస్తావిస్తూ, గడ్చిరోలి జిల్లాకు చెందిన 141 క్రిమినల్ కేసుల్లో అంతిమంగా 140 కేసులు నిర్దోషులుగా విడుదల కావడానికి దారితీశాయని నివేదిక ఈ అసాధారణమైన తక్కువ దోష నిర్ధారణ రేటును రుజువు చేసింది.
లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం విషయంలో కూడా ఒక ఆందోళనకరమైన ధోరణిని గమనించింది. పునరావాస భావన కింద ప్రతిపాదించిన సహాయం చాలా ఆలస్యంగా అందుతోంది; దీనిని ‘ధృవీకరించబడిన మంచి ప్రవర్తన’ అనే షరతుతో ముడిపెట్టారు. లొంగిపోయిన వారికి ఆశ్రయం కల్పించే పునరావాస కేంద్రాలను ‘నిర్బంధ కేంద్రాలు’ గా మీడియా నివేదిక స్పష్టంగా పేర్కొన్నట్లు ఈ నివేదిక ప్రస్తావించింది. లొంగిపోయిన వారి కుటుంబాలను కేంద్రాల వద్దకు రానివ్వకపోవడం, ఇతర క్రియాశీల మావోయిస్టుల నుండి వారికి రక్షణ కల్పిస్తున్నామనే పేరుతో నెలల తరబడి వారిని నిర్బంధించడం, లొంగిపోయిన వారికి సమాజంలోకి తిరిగి ప్రవేశించడానికి వీలుగా ఎలాంటి వృత్తిపరమైన శిక్షణ ఇవ్వకుండా కేవలం పారిశుధ్య లేదా నిర్మాణ పనులకు సంబంధించిన పనులను వారితో చేయించడం జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకారం మావోయిస్టు ఉద్యమాన్ని లేదా వామపక్ష ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించినప్పటికీ, పోలీస్, అర్ధసైనిక, ఆర్మీ క్యాంపులు పుట్టగొడుగుల వలె పెరిగిపోవడాన్ని కూడా పియుడిఆర్ ఎత్తిచూపింది.
ఆపరేషన్ కగార్ తర్వాత, ఛత్తీస్‌గఢ్‌ను ముంచెత్తిన అంతం లేని పర్యావరణ దోపిడీ
ఆదివాసీ సమాజ అభివృద్ధికి మిగిలిన ఏకైక పెద్ద అడ్డంకులలో మావోయిస్టు ఉద్యమం ఒకటని పేర్కొంటూ, దానిని పూర్తిగా నిర్మూలించడంలో విజయం సాధించామని రాజ్యం ప్రకటించిన తరుణంలో ఆపరేషన్ కగార్ అనంతర పరిణామాలతో నివేదిక రెండో; చివరి భాగం వ్యవహరిస్తుంది. ఆదివాసీ సమాజ హక్కులపై ఎప్పటికీ నిలిచి ఉండే ప్రశ్నలను, ఆదివాసులకు, యు రాజ్యానికి మధ్య వనరుల కోసం జరిగే పోరాటాన్ని ఈ నివేదిక ప్రస్తావిస్తుంది.
మావోయిస్టు ఉద్యమం అంతం కావడంతో, మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించడంపైన ప్రభుత్వ పట్టుదల గురించిన ఆందోళనలు ముందంజలోకి వచ్చాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పారిశ్రామిక విధాన 2024-2030 నివేదిక ఫార్మా, టెక్స్టైల్, ఐటీ, రక్షణ, ఇతర రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రస్తావిస్తోంది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి ప్రణాళికలలో సింహభాగాన్ని కేటాయించారు. ఇందులో ఏకంగా 98 శాతం పెట్టుబడులు గనుల తవ్వకాలకు లేదా దానితో ప్రత్యక్ష సంబంధం ఉన్న కార్యకలాపాలకు మళ్ళిస్తున్నారు.
ప్రభుత్వ దృష్టి ఇప్పుడు తిరిగి ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలను తీవ్రతరం చేయడంపైకి మళ్లడంతో, ఆదివాసి సముదాయాల భయాలు మునుపెన్నడూ లేనంతగా వాస్తవ రూపం దాల్చాయి. ఒకప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీ అడుగుపెట్టని ప్రాంతంగా పేరుగాంచిన బైలాదిలా కొండలను ఇప్పుడు మైనింగ్ లీజుల ద్వారా ప్రైవేట్ రంగాలకు అందుబాటులోకి తెచ్చారు. బైలాదిలా కొండలలో మైనింగ్ కారణంగా బస్తర్ ప్రాంతంలోని ఇంద్రావతి నది ఉపనదులలోకి నల్ల ఇనుప లోహపు వ్యర్థాలు ప్రవేశించి, దశాబ్దాల తరబడి సాగు భూములు, నీటి వనరులు కలుషితమయ్యే ముప్పును ఆదివాసి సమాజాలు ఎదుర్కొంటున్నాయి.
భారత ప్రభుత్వం అనుసరిస్తున్న మైనింగ్ పర విధానాన్ని కూడా నివేదిక ఎత్తి చూపింది. మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) సవరణ చట్టం-2025ను తీసుకురావడం ద్వారా ప్రభుత్వం దీనిని ప్రతిబింబించింది. ఇది గరిష్ట పరిమితిని విధించకుండా ప్రాస్పెక్టింగ్ లైసెన్స్, మైనింగ్ లీజులకు సంబంధించి ప్రాంత పరిమితులను పెంచింది. అలాగే మైనింగ్ లీజుల కాలవ్యవధిని 20-30 సంవత్సరాల నుండి అదనంగా మరో 20 సంవత్సరాలకు పొడిగించింది. జిల్లా ఖనిజ నిధిని కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా మైనింగ్ లీజు పొందిన కంపెనీలో స్థానిక సముదాయానికి 26 శాతం ఈక్విటీని అందించాలనే ప్రతిపాదనను చేసారు. అయితే, దీనిని కంపెనీ నేరుగా జిల్లా ఖనిజ నిధికి 33 శాతం రాయల్టీ చెల్లించే ఏర్పాటుగా మార్చారు. తద్వారా అసలైన భాగస్వాములైన ఆదివాసీ సముదాయాన్ని ఈ మొత్తం వ్యవహారం నుండి పూర్తిగా తొలగించారు. వనరుల వినియోగానికి సంబంధించిన నిర్ణయాలలో ఆదివాసీ సముదాయ భాగస్వామ్యాన్ని క్రమంగా తప్పిస్తూ పోవడం వల్ల, వారు అనివార్యంగా ప్రభుత్వ, దాని అధికారుల దయకు బలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
1996 నాటి T.N. టి. ఎన్. గోదవర్మన్ తిరుముల్పద్ v. భారతదేశ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నీరుగార్చే విధంగా 2023లో అటవీ సంరక్షణ చట్టం-1980కి చేసిన సవరణలను కూడా నివేదిక నమోదు చేసింది. ఆ తీర్పు ‘అడవి’ అనే పదానికి విస్తృతమైన అర్థాన్ని ఇచ్చింది. అయితే, 2023 సవరణ ఈ నిర్వచనాన్ని 1927 నాటి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కింద ప్రకటించిన; నోటిఫై చేసిన అడవికి మాత్రమే పరిమితం చేసింది; 1980 అక్టోబర్ 2 న 5లేదా ఆ తర్వాత ప్రభుత్వం అడవిగా రికార్డ్ చేసిన భూమికే దీనిని పరిమితం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకారం మావోయిస్టు ఉద్యమం లేదా వామపక్ష ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించినప్పటికీ, పోలీసు, అర్ధసైనిక, యు ఆర్మీ క్యాంపులు పుట్టగొడుగుల వలె పెరిగిపోవడాన్ని కూడా పియుడిఆర్ ఎత్తిచూపింది. నక్సలిజానికి వ్యతిరేకంగా యుద్ధం ముగిసిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోని అబుజ్ మాడ్ ప్రాంతం నుండి దాదాపు 9,000 మంది గ్రామస్తులను నిర్వాసితులను చేస్తూ.. ఇండియన్ ఆర్మీ సుమారు 53,000 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే అవకాశంతో పాటు, సీఆర్పీఎఫ్ బీజాపూర్ జిల్లాలో 700 హెక్టార్ల ప్రధాన అటవీ ప్రాంతాన్ని కవర్ చేస్తూ బెటాలియన్ స్థాయి కౌంటర్-ఇన్సర్జెన్సీ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది.
ఈ నివేదిక వెల్లడించిన అంశాల వెలుగులో, మానవ హక్కుల ఉల్లంఘనలు; పర్యావరణ దోపిడీకి వ్యతిరేకంగా జవాబుదారీతనంపైన ఇది లేవనెత్తిన అనేక ప్రశ్నల దృష్ట్యా స్పష్టమయ్యేది ఏమిటంటే.. సైనిక విజయమనే పొగతెర వెనుక, వామపక్ష ఉగ్రవాదం; మావోయిస్టు ఉద్యమం పుట్టుకకు ప్రారంభంలో కారణమైన “జల్, జంగిల్, జమీన్” అనే మూల సమస్యలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దానితోపాటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243; షెడ్యూల్ V కింద అందించిన స్వపరిపాలన హక్కును భారతదేశపు ఆదివాసీ సమాజాలపైన నిజంగా ప్రతిష్టించే అసంపూర్ణ ప్రాజెక్ట్ కూడా అలాగే కొనసాగుతోంది.
- అనన్య గుంజన్. 2026 జూలై 25
తెలుగు: పద్మ కొండిపర్తి




