పచ్చదనాన్ని ప్రేమించు…
అడవిని హృదయానికి అద్దుకో
అనంతమైన ప్రకృతిని ఆరాధించు
తప్పులేదు, కానీ
ఒక్కో చెట్టును కౌగిలించుకోకు
వాటి ఎత్తునూ వైశాల్యాన్ని మరేదో
మరేదో అదనాలను అస్సలు మెచ్చుకోకు, నొచ్చుకోకు-

మాయమైపోయిన
ఓ మహా వృక్షం గురించి గానం చేయి న్యాయమే
అది అందించిన పరిమళాన్ని ఫలాల్ని నీడని, వసివాడని వారసత్వాన్ని
లెక్కించు లిఖించు పఠించు
విశ్లేషించు అవసరమే సమాదరణీయమే

సముద్రం మధ్యలో నిలబడి
లోతుల లెక్కల్ని విడమర్చి చెప్పకు
వ్యక్తుల్ని తరంగాల్ని చేసి,
తరంగాలను వ్యక్తులని భావించి
లెక్కించే పిచ్చిపని అస్సలు చేయకు
మొత్తాన్ని కలిపి చూడ్డంలోనే
సారం సమగ్రమని మర్చిపోకు
ఏమరుపాటుగానైనా అష్ట దిగ్గజాలనో
సప్త ఋషులనో సర్వస్వంగా భావించకు
ఆకాశపు ఔన్నత్యం లో
కోటి నక్షత్రాల వెలుగుల కింద
అలరారే మురిపాల చందమామను ప్రేమిద్దాం…

Leave a Reply