నాకు నదుల గురించి బాగా తెలుసు!
ప్రపంచమంత ప్రాచీనమైనటువంటి,
ఇంకా చెప్పాలంటే,మానవ ధమనులలో ప్రవహించే రక్తం కంటే కూడా పురాతనమైన నదులను నేను చూశాను! ~~
నా ఆత్మ నదులంత లోతుగా పెరిగింది!
ప్రాతఃకాలపు ఉదయాలు లేతగా ఉన్నప్పుడు,
నేను యుఫ్రటిస్ నదిలో స్నానం చేశాను !
~~
నేను కాంగో నది దగ్గర నా గుడిసె కట్టుకున్నాను!
అది నన్ను జోకొట్టి నిద్రపుచ్చింది!
నేను నైలు నదిని చూశాక దానిపై పిరమిడ్లను నిర్మించాను!
అబే లింకన్ న్యూ-ఆర్లియన్స్ కి వెళ్ళినప్పుడు
ఆయన కోసం మిసిసిపి నది ఆనందంగా పాడిన గానాన్ని నేను కూడా విన్నాను !
~~
అంతేనా ఆ నదుల దగ్గర సూర్యాస్తమయాల్లో బురదతో నిండిన నది వక్షస్థలం బంగారు రంగులోకి మారడం చూసాను!
~~.
నాకు నదుల గురించి బాగా లోతుగా తెలుసు!
ప్రాచీనమైనటువంటి, సంధ్య వేళ చీకటిలాగా మసకబారిన నదులు!
ఎందుకంటే నా ఆత్మ నదులంత లోతుగా పెరిగింది మరి!

Leave a Reply