కర్బన ఉద్గారాల వలన ఏర్పడిన భూతాపం, దీని కారణంగా ఏర్పడుతున్న మార్పుల మొత్తాన్ని, వాతావరణ మార్పు అంటాం. ఈ మార్పును వాతావరణ శాస్త్ర సహాయంతో అర్థం చేసుకుంటూ, ఒక అవకాశంగా తీసుకుని సరైన విధంగా మలుచుకోగలిగితే మానవాళి పరిరక్షణకు సుస్థిర భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.
కర్బన ఉద్గారాలు పరిమితి దాటి పెరగడం మూలాన, ఈ వాయువులు విపరీతంగా పెరిగి భూమి ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరుగుతుంది. భూ ఉపరితల ఉష్ణోగ్రత 19వ శతాబ్దంలో 1.1°c ఉండింది. గత 40 సంవత్సరాలలో భూతాపం బాగా పెరిగింది.
ప్యారిస్ అగ్రిమెంట్: 2015లో ప్రపంచ దేశాలు (ఐక్యరాజ్యసమితి లోని సభ్య దేశాలు) ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు పైన ప్యారిస్ లో జరిగిన సదస్సు లో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అన్ని దేశాలు భూతాపాన్ని 1.5°c ఉండేట్టుగా 2030 వరకు కర్బన ఉద్గారాలు తగ్గిస్తామని ఒప్పందం చేసుకున్నాయి.
వాతావరణ మార్పు ప్రభావం:
అననుకూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన జరిగిన సంఘటనలను ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. వాతావరణం వేడెక్కడమే కాకుండా, అధిక వర్షపాతం, వడగాలులు వరదలు కరువులు, తీవ్రమైన వాతావరణ సంఘటనలు (గాలి వానలు తుఫానులు) ఎక్కువైనాయి. అధిక ఉష్ణోగ్రతల వలన మంచు కరుగుతున్నది. సగటున 150 నుంచి 280 బిలియన్ టన్నుల మంచు (పర్వతాలు) సంవత్సరానికి కరుగుతున్నది. ప్రపంచంలోని హిమానీనదాలు, ఆల్ఫ్స్, హిమాలయాలు రాకీస్ కరుగుతున్నాయి. వీటిలో కొన్ని 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు, కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ఆర్కిటిక్ సముద్రం విస్తీర్ణం మందం కూడా తగ్గి పోతుంది. సముద్రమట్టం పెరగడానికి ప్రధాన కారణం ఈవిధంగా మంచు కరగడమే. ఇలా వాతావరణ మార్పులు మానవ ఆరోగ్యం పైన తీవ్రమైన, హానికరమైన ప్రభావాన్ని చూపు తున్నాయి. ఇది ప్రజా ఆరోగ్యానికి పెద్ద సవాలుగా మారింది.
అధిక ఉష్ణోగ్రత వలన వడదెబ్బ, తీవ్రమైన డీహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలు పెరిగి వర్షాలు అపరిశుభ్రత వలన వ్యాధుల విస్తరణ (మలేరియా, డెంగ్యూ, చికున్ గుణ్యా, జికా )లాంటి వైరల్ జ్వరాలు, శ్వాసకోశ సమస్యలు (ఆస్తమా దగ్గు ఊపిరితిత్తుల సమస్యలు నీటి కాలుష్యం వలన జీర్ణకోశ వ్యాధులు, అతిసారా టైఫాయిడ్ కడుపు నొప్పులు) ఈ వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గి పంట దిగుబడి దెబ్బతిని ఆహార కొరత ఏర్పడి ప్రజల్లో పోషకాహార లోపమూ తలెత్తుతుంది.
మనదేశంలో వాతావరణ పరిస్థితుల ముప్పు 40% జిల్లాలకు ఉంది. ఇది ఇప్పుడు ప్రజారోగ్యానికి ఒక పెద్ద సవాలుగా మారింది. వ్యాధుల తీవ్రతను పెంచడమే కాకుండా, ఆరోగ్య వ్యవస్థలను ఇది దెబ్బతీస్తుంది. పూర్తిగా కొత్త వ్యాధులను సృష్టించదు కానీ ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తుంది. తీవ్రమైన ఎండల కారణంగా 2021లో 160 బిలియన్ల పనిగంటలు వృధా అయ్యాయి. అధిక వేడికి గురికావడం వల్ల నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే ప్రమాదం 16% పెరిగింది.
వాయు కాలుష్యం వల్ల మెదడులో వాపు వస్తుంది. ఆలోచనా శక్తి తగ్గుతుంది. ఇవి కొత్తగా వెలుగులోకి వస్తున్న ఆధారాలు. ఈ ప్రభావాలు అన్నీ గ్రామీణ జనాభా అసంఘటిత కార్మికులు (భవన నిర్మాణ కార్మికులు వీధి వ్యాపారులు) మహిళలు పిల్లలు, అట్టడుగు వర్గాల ప్రజలు బాధితులు. వీరికి వాతావరణ మార్పులను తట్టుకునే ఆర్థిక స్తోమత వనరులు ఉండవు.
వాతావరణ ఆరోగ్య పాలనల సవాళ్లు:
వాతావరణ పరిస్థితులకు వ్యాధులకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపే స్థానిక డేటా లేకపోవడంతో ప్రమాదాలను అంచనా వేయడం సరిగ్గా జరగట్లేదు. రాత్రిపూట ఉండే వేడి ముప్పును పట్టించుకోవడం లేదు,వేడిని తట్టుకునే ప్రణాళికలు లేకుండానే నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
వాతావరణ మార్పుకు కారణాలు:
భూమిని స్థిరంగా ఉంచడానికి దానికి తొమ్మిది సహజ వ్యవస్థలు ఉన్నాయి. అవి ఎలా కలిసి పని చేస్తాయో భూగ్రహ సరిహద్దుల చట్రాన్ని 2009లో జోహాన్ రాక్ స్ట్రామ్ నేతృత్వంలోని 28 మంది శాస్త్రవేత్తల బృందం ప్రవేశపెట్టింది. ఈ తొమ్మిది సహజ వ్యవస్థలలో ఏడు సహజ వ్యవస్థలు ప్రస్తుతం పరిమితిని దాటి ఉన్నాయి. అందుకే ఈ వాతావరణం మార్పులు.
1. వాతావరణ మార్పుతో కార్బన్ డయాక్సైడ్ నిరంతరం పెరుగుతూ పరిమితిని దాటిపోయింది.
2. ప్లాస్టిక్, రసాయనాలు, జన్యుపరంగా మార్పు చెందిన పదార్థాలు ప్రకృతిలోకి ప్రవేశపెట్టడం జరిగింది, వీటి భద్రతను సరిగ్గా పరీక్షించలేదు. ఈ పరిధి ఇప్పుడు అధిక ప్రమాద మండలం లో ఉంది.
3. గతంలో రసాయనాలు కలిగించిన తీవ్ర నష్టం నుంచి ఓజోన్ పొర, ప్రపంచవ్యాప్త ప్రయత్నాల వలన ఇప్పుడు సురక్షిత పరిమితిలో ఉంది.
4. వాతావరణ ఏరో పోల్స్, ఇవి ఇప్పటికీ రుతుపవనాల వంటి వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నప్పటికీ ఈ పరిధి ఇప్పటికీ సురక్షిత పరిమితుల్లోనే ఉన్నట్లు పరిగణించ బడుతున్నది.
5. సముద్ర ఆమ్లతత్వం గణనీయంగా పెరగడంతో గవ్వలను నిర్మించుకునే జీవుల కు హాని కలిగిస్తుంది. ఈ పరిమితి ఇప్పుడు దాటిపోయింది.
6. నత్రజని మరియు ఫాస్ఫరస్ ఈ పోషకాలు అధిక మొత్తంలో అవసరాన్ని మించి పర్యావరణ వ్యవస్థలోకి ముఖ్యంగా సముద్రాలలోకి ప్రవేశిస్తున్నాయి. ఇది సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఈ పరిమితి కూడా దాటిపోయింది.
7. ఉపరితల జలాలు (నదులు సరస్సులు) మరియు నేలలోని తేమ రెండూ దెబ్బతిన్నాయి. ఈ మార్పులు, జీవావరణ వ్యవస్థలు, వాతావరణం మరియు జీవవైవిధ్యం పై ప్రభావం చూపుతాయి. ఈ పరిమితి కూడా దాటబడింది.
8. ప్రపంచవ్యాప్తంగా అటవీ ప్రాంతాలు సురక్షిత స్థాయిల కంటే దిగువకు పడిపోయాయి. ఈ హద్దులూ అతిక్రమించ బడినాయి.
9. జీవావరణ సమగ్రత (జీవవైవిధ్య నష్టం) జన్యు వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యం రెండూ ఇప్పుడు సురక్షిత పరిమితులను దాటిపోయాయి. ఇది అత్యంత తీవ్రమైన ఆందోళనలలో ఒకటిగా మారింది.
ఒకేసారి ఇన్ని పరిమితులను దాటడం భూవ్యవస్థ స్థిరత్వానికి మొత్తానికి ప్రమాదాన్ని పెంచుతుంది. ఓజోన్ క్షీణత మరియు వాతావరణ ఏరో పోల్స్ ల్యాండింగ్ వంటివి ఈ రెండు పరిమితులు ఇప్పటికీ సురక్షితమైన పరిధిలోనే పరిమితిలోనే ఉన్నాయి. ఏడు వ్యవస్థలు పరిమితులు దాటడం మూలాన, పారిశ్రామిక విప్లవానికి పూర్వపు పరిస్థితులలో కార్బన్డయాక్సైడ్ వాతావరణంలో 288 ppm ఉండేది, ప్రస్తుతం 420 ppm ఉంది.
-ప్రపంచవ్యాప్తంగా 934 మిలియన్ల రైతులు ఉంటే అందులో 46% ప్రతి సంవత్సరం పురుగు మందుల వల్ల విష ప్రయోగానికి గురౌతున్నారు. అయినా పురుగు మందుల వినియోగం సంవత్సర సంవత్సరానికి పెరుగుతున్నది. 3.8 మెట్రిక్ టన్నుల వినియోగం 2023లో జరిగింది. ఇది 1990 తో పోల్చితే దిగుణీకృతమైంది.
– వాతావరణ మార్పు పర్యావరణ మార్పుతో అనుసంధానం చేయబడింది. సామాజిక పర్యావరణ ఘర్షణ జరుగుతున్నది. తీరప్రాంతాలలో వనరులను ఉపయోగించడం దుర్వినియోగం చేయడం, ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అయినా ప్రభుత్వాలు తీరప్రాంతాలలో జరిగే పనుల వలన పెరిగిన ప్రభావాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
-అంతర్గత వలసలు పెరుగుతున్నాయి. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే 1.16 లక్షల మంది వలస పోయారు. ఉత్తరప్రదేశ్ లో 1,10490 మంది, పశ్చిమ బెంగాల్లో 80,000 మంది. 2025 వ సంవత్సరంలో ఈ మూడు రాష్ట్రాల సంఖ్య 28 రాష్ట్రాల వలసల సగం సంఖ్య కంటే ఎక్కువ.
-తీవ్రమైన వాతావరణ సంఘటనలు 58 రోజులు అక్టోబర్ మరియు డిసెంబర్ 20 25 వ సంవత్సరంలో ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో 62 రోజులు నమోదయినాయి.
-మనదేశంలో 20 24 సంవత్సరంలో 88% రోజుల్లో తీవ్ర వాతావరణ సంఘటనలు నమోదయినాయి. 3,393 మంది చనిపోయారు. 3.61 మిలియన్ హెక్టార్లు పంట నష్టపోయారు. 20 25 సంవత్సరంలో 99% రోజులు తీవ్ర వాతావరణ సంఘటనలు సంభవించాయి. 4,419 మంది చనిపోయారు. 17.41 మిలియన్ హెక్టార్లలో పంట నష్టం జరిగింది.
-వాయు నాణ్యతా పర్యవేక్షణా కేంద్రాలకు,15% మంది ప్రజలు పది కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు.
మిగిలిన 85% అంటే 1.2 బిలియన్ల ప్రజలకు ఎలాంటి నాణ్యత పర్యవేక్షణ లేదు.
వాతావరణ మార్పు అనేది దూరంలో లేదు. ఇది మన నదులను, నగరాలను మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. మనతోనే ఉంది. భవిష్యత్తు సుస్థిరంగా ఉండాలంటే ప్రకృతిని పరిరక్షించుకునే విధంగా విధానాలు ఆచరణ అభివృద్ధి ఉండాలి.
బాన్ కి మూన్ గారు చెప్పినట్టు,”మన గ్రహాన్ని కాపాడటం, ప్రజలను పేదరికం నుండి బయటపడవేయడం ఆర్థిక వృద్ధిని సాధించడం ఇవన్నీ ఒకే పోరాటం. వాతావరణ మార్పు నీటి కొరత ఇంధన కొరత ప్రపంచ ఆరోగ్యం ఆహార భద్రత మరియు మహిళా సాధికారత మధ్య ఉన్న సంబంధాన్ని మనం గుర్తించాలి. ఒక సమస్యకు పరిష్కారాలు, అన్ని సమస్యలకు పరిష్కారాలుగా ఉండాలి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మార్పులు తేవాలి. తీర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అందరూ వాయు పరిరక్షణలో ఉండాలి. వరదలను దృష్టిలో ఉంచుకొని ఇండ్ల నిర్మాణాలు ఉండాలి. తక్కువ వర్షపాతం కరువు ఉండే ప్రాంతాలలో వాటిని తట్టుకుని పండే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి. వర్షపు నీటిని వడిసి పట్టుకోవాలి. గుర్తించిన వైల్డ్ ఫైర్ ఏరియాలను పరిరక్షించుకోవాలి. సోలార్, విండ్, హైడ్రో, జియో థర్మల్ విద్యుత్తును పెంచాలి. అడవులను అభివృద్ధి చేయాలి. ప్రజలు ప్రభుత్వాలు ఎన్జీవోలు అందరూ సంఘటితంగా పనిచేయాలి. ప్రజలు కూడా ఏ పార్టీలయితే ఏ రాజకీయ నాయకులయితే వాతావరణ మార్పును ప్రధాన సమస్యగా పరిగణించి పనిచేస్తారో వారికే ఓటు వేయాలి. ప్రభుత్వాలు మేధావులు ఉపాధ్యాయులతో కమిటీలు వేసి, వాతావరణ మార్పులపైన గ్రామాలలోని రైతులకు ,నగరాలలోని శ్రామికులకు అవగాహన కల్పించి జాగ్రత్తలు తెలియజేయాలి. ప్రభుత్వ పాలసీగా నిరంతరం ఈ చర్చ జరగాలి.




