“జైలు అవశేషాలు” (ప్రిజన్ రిమైన్స్) అనేది సాంస్కృతిక కార్యకర్త రమేష్ గైచోర్ రచించిన ఒక సిరీస్. దీనిని మరాఠీ నుండి హర్షాలి పొద్దార్ అనువదించారు; ప్రొఫెసర్ హానీ బాబు సంపాదకత్వ మార్గదర్శకత్వాన్ని అందించారు. విచారణ ఖైదీగా దాదాపు తొమ్మిదేళ్ల పాటు జైలులో గడిపిన అనుభవంతో, గైచోర్ జైలు గోడల వెనుక ఉన్న ప్రజల గురించి, వారి దైనందిన జీవితాల గురించి రాసారు. వ్యక్తుల చిత్రణలు, కథనాత్మక వ్యాసాలు, విశ్లేషణల ద్వారా, కులం, పేదరికం, రాజ్యాధికారాలు ఖైదును ఎలా ప్రభావితం చేస్తాయో ఈ సిరీస్ పరిశీలిస్తుంది. అదే సమయంలో, జైలులో నిలిచిపోయే మానవ సంబంధాలు, హాస్యం, పరస్పర సంరక్షణ; ప్రతిఘటనలను కూడా ఇది ప్రతిబింబిస్తుంది.
అనువాదకురాలి వివరణ
ఈ భాగాన్ని అనువదించడం నిజంగా ఒక సుసంపన్నమైన అనుభవం. రచయితకు వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితమైన, తన స్వీయానుభవాలతో కూడిన చిత్రం ద్వారా ఆయన ప్రపంచంలోకి ప్రవేశించడం వల్ల, అనువాదంలో నాకు పూర్తిగా భిన్నమైన కోణం లభించింది. రచయిత తన సొంత అనుభవాలను, జ్ఞాపకాలను వివరించిన తీరు ఎంత బలంగా, సజీవంగా ఉందంటే, ప్రతి సంఘటనను అనువదిస్తున్నప్పుడు ఒక అనువాదకురాలిగా ప్రతి భావన నాకు ఆసక్తికరంగా అనిపించింది.
ఒక విధంగా ఒకదానితో ఒకటి గాఢంగా ముడిపడి ఉన్న వివిధ జీవన కథలను నేను అనువదిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఈ కథలు మూడు విభిన్న ప్రపంచాలకు చెందినవి, ప్రతి ప్రపంచానికీ దాని స్వంత భాష, ప్రత్యేకత ఉన్నాయి. మొదటి ప్రపంచం ‘ది షాషాంక్ రిడెంప్షన్’ సినిమా ప్రపంచం; రెండవది మొత్తం బయటి ప్రపంచం; మూడవది తలోజా సెంట్రల్ జైలు. ఇక్కడ రచయిత విచారణ ఖైదీగా రెండు సుదీర్ఘ కాల జైలు శిక్షలను అనుభవించారు. ప్రతి ప్రపంచానికి దాని స్వంత భాష ఉంది; అది ఈ వ్యాసం అంతటా మిగిలిన ప్రపంచాల భాషలతో కలసిపోతుంది.
రచనలోని కవితాత్మక స్వభావాన్ని, రూపపర, వాస్తవికప్రక్రియను, అలాగే సినిమా కథాంశాన్ని ఏ మాత్రం చెడకుండా – ఈ మూడింటి మధ్య అనువాదాన్ని సమతుల్యం చేయడమే అసలైన సవాలు. నేను ఈ కథలను, అలాగే రచయిత జైలులో ఎదుర్కొన్న వ్యక్తిగత, రాజకీయ అనుభవాలను చాలాకాలంగా వింటూ ఉండటం వల్ల, చాలా వరకు సందర్భాన్ని అర్థం చేసుకోగలిగాను. అయినప్పటికీ, నాకు అర్థం కానప్పుడు, రచయిత ఓపికగా నా సందేహాలను నివృత్తి చేసి విషయాలను స్పష్టం చేశారు.
నేను ఈ రచన మొత్తాన్ని మరాఠీ నుండి ఆంగ్లంలోకి అనువదించినప్పటికీ, పదాల ఎంపిక, వాక్య నిర్మాణంపైన ప్రొఫెసర్ హనీ బాబు గారి అభిప్రాయం, సమీక్ష, తుది సవరణ సహాయం లేకుండా ఇది చాలా కష్టమయ్యేది. ఈ అనువాదాన్ని చూసిన ఇతరులు మెరుగుపరిచిన కొద్దీ, అనేక ఇతర కోణాలు కూడా మరింత మెరుగుపడ్డాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రం, ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా ఆయనకున్న అనుభవం మాత్రమే కాకుండా, ఆయన కూడా రమేష్ గైచోర్ సహ నిందితుడిగా అదే తలోజా సెంట్రల్ జైలులో ఐదు సంవత్సరాలకు పైగా రాజకీయ ఖైదీగా మగ్గడం వల్లనే ఈ అనువాదం ఈ రూపం సంతరించుకుంది. మేము ఈ వ్యాసంపై పనిచేస్తున్నప్పుడు ఆయన తన సమయాన్ని ఎంతగానో కేటాయించి మాకు సహాయం చేసి, మార్గదర్శనం చేశారు. అందువల్ల, ఈ అనువాద ప్రక్రియ నాకు రమేష్ గైచోర్, ప్రొఫెసర్ హనీ బాబు ఇద్దరి నుండి ఒక విభిన్నమైన అభ్యాస ప్రక్రియగా మారింది.
జైళ్లు సజీవంగా ఉంటాయి; సంకెళ్లు వర్ధిల్లుతాయి
విప్లవకారులు బ్రతికి ఉన్నంత కాలం, సంకెళ్లు వికసించి వర్ధిల్లుతాయి
… తిరుగుబాటుదారులతో ఉన్న సంకెళ్లు తెంచుకున్నప్పుడు ఏం జరుగుతుంది?
– హఫీజ్ మేరథీ
నేను రాస్తున్నప్పుడు హఫీజ్ మీరాఠీ రాసిన ఈ పంక్తులు నా మదిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇటీవల, గాయపడి, రక్తసిక్తమైన భారతీయ విద్యార్థుల చిత్రాలతో సోషల్ మీడియా వేదికలు నిండిపోయాయి. భారతదేశంలోని అవినీతిమయ విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న జెన్ జెడ్ విద్యార్థులపై పోలీసులు బాష్పవాయువు, నీటి ఫిరంగులను ఉపయోగించారు.
మేకులు దింపిన లాఠీలతో వారిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు; మహిళా విద్యార్థులను సైతం వదల్లేదు, వారి బట్టలు చిరిగిపోయేంత వరకు పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఇంతటి అణచివేత ఎదురైనప్పటికీ, విద్యార్థులు, నిరసనకారులు, ఇంకా వివిధ అంబేద్కర్ వాద-వామపక్ష-ఉదారవాద సంస్థలు దృఢంగా నిలబడ్డాయి.
వారి ఆశాభావపు పరిమళం వివిధ పోరాటాల రూపంలో భారతదేశంలోని ప్రతి మూలకూ వ్యాపించింది. ఈ ఆశావాద భావనతోనూ, అది రేకెత్తించే తిరుగుబాటుతోనూ నాకు ఒక పురాతనమైన, గాఢమైన అనుబంధం ఉంది కాబట్టి ఆ పరిమళం నాలోనూ వ్యాపించింది. ఆ అనుబంధం 25 సంవత్సరాల క్రితం నాటిది; నేను కబీర్ కళా మంచ్ ద్వారా కుల, వర్గ, పితృస్వామ్య నిర్మూలన ఉద్యమంలో ప్రవేశించినప్పటిది.
ప్రస్తుత జెన్ జెడ్ నిరసనలు, ఢిల్లీ-హర్యానా రహదారిపైన సింఘు సరిహద్దు దగ్గర జరిగిన రైతాంగ నిరసన, సిఏఏ-ఎన్ఆర్సిలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ నిరసనలు లేదా రోహిత్ వేముల, జిషా, చంపా, పాయల్ తడ్వి, అనితల వ్యవస్థీకృత హత్యల తర్వాత ఉద్భవించిన విద్యార్థి ఉద్యమాలు లేదా ఖైర్లాంజి, హత్రాస్, జావ్ఖేడాతో సహా దళిత మారణకాండలకు ప్రతిస్పందనగా తలెత్తిన కుల నిర్మూలన ఉద్యమాలు కావచ్చు —ఈ పోరాటాలన్నీ వేర్వేరు ప్రదేశాలలో, వేర్వేరు సమయాలలో, వేర్వేరు వర్గాలలో, వేర్వేరు రూపాలు, మాధ్యమాలను ఉపయోగించి ఆవిష్కృతమయ్యాయి. అయినప్పటికీ, ప్రస్తుత వ్యవస్థను ప్రతిఘటించవచ్చు, మార్చవచ్చు అనే రాజకీయ పట్టుదలతో అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.
ఇజ్రాయెల్, అమెరికా దేశాల క్రూరమైన సామ్రాజ్యవాద హింసకుఎదురుతిరిగి పోరాడుతున్న పాలస్తీనా, గాజా ప్రజలు మనకు ఎంతగా ప్రేరణనిస్తున్నారో మనం ఎల్లప్పుడూ గుర్తించలేకపోవచ్చు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటే వాటిని మార్చవచ్చని, సామూహిక ప్రతిఘటన ద్వారా ప్రపంచాన్ని పునర్నిర్మించవచ్చని వారి పోరాటం మనకు గుర్తు చేస్తుంది.
ఈ ఆశాభావమే రెండు సుదీర్ఘ జైలు శిక్షల కాలంలో: మొదట 2013 నుండి 2017 వరకు, ఆపై 2020 నుండి 2026 వరకు నన్ను నిలబెట్టింది. ఈ రెండు సందర్భాలలోనూ, భిన్న స్వరాలను అణచివేయడానికి పదేపదే ఉపయోగిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక చట్టమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA), 1967 కింద నన్ను ఖైదు చేశారు.
మొదటిసారి బెయిల్‌పై విడుదలైన తర్వాత నేను ‘ది షాషాంక్ రిడెంప్షన్’ సినిమా చూశాను. నా రెండవ అరెస్టు ఎల్గార్ పరిషద్–భీమా కోరేగావ్ కేసులో జరిగింది. ఈ కేసులో ఉపా కింద 16 మంది కార్యకర్తలు, విద్యావేత్తలు, న్యాయవాదులను అరెస్టు చేశారు. ఆ రెండవసారి జైలులో ఉన్నప్పుడు, ఆ సినిమా నాకు చాలా ముఖ్యమైనదిగా మారింది: స్వేచ్ఛావకాశాన్ని ఖైదులో నిర్బంధం ఎప్పటికీ తుడిచిపెట్టలేదనే అనే దృఢ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి, స్థిరంగా ఉండటానికి అది నాకు సహాయపడింది. 1994లో విడుదలైన ‘ది షాషాంక్ రిడెంప్షన్’ సినిమా తన ఓర్పు, స్నేహం, ప్రతిఘటన కథతో లెక్కలేనంత మంది ప్రేక్షకులకు స్ఫూర్తినిచ్చింది.
సంస్కరణ గృహమా లేక వధశాలనా?
‘ది షాషాంక్ రిడెంప్షన్’ చిత్రం అమెరికాలోని షాషాంక్ జైలు నేపథ్యంలో సాగుతుంది; నేను మహారాష్ట్రలోని తలోజా సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాను. వాటి మధ్య సాంస్కృతిక, భౌగోళిక దూరం ఉన్నప్పటికీ, ఆ రెండు జైళ్లు వాటి అమానవీయత, అవినీతి విషయంలో పెద్దగా భిన్నంగా లేవు: జైలు పరిపాలనా యంత్రాంగ అధికారం, అక్రమ వ్యాపారాలు, నిర్బంధంలోని ఊపిరాడకపోవడం, ఖైదీలపై మానసిక క్షోభ. కొన్ని మినహాయింపులు తప్ప, తలోజా జైలు సూపరింటెండెంట్లు, అదనపు సూపరింటెండెంట్లు సినిమాలో క్రూరమైన, అమానవీయమైన, స్వార్థపరులైన, అవినీతిపరులైన వారితో తమ ప్రతిరూపాలను పోలి ఉన్నారు.
కొత్తగా శిక్ష పడిన ఖైదీలు షాషాంక్లోకి ప్రవేశించే అత్యంత బాధాకరమైన దృశ్యంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. వారిని కించపరచడానికి, అమానవీయంగా తయారుచేయడానికి ప్రవేశ ప్రక్రియను రూపొందించారు; చిత్రం దీనిని యథాతథంగా చిత్రీకరించినప్పటికీ, దాని పూర్తి తీవ్రతను కేవలం చదవడం ద్వారా లేదా తెరపై చూడటం ద్వారా అర్థం చేసుకోలేము. ఇతరుల ముందు బట్టలు విప్పి, ఒక వృత్తాకారంలో తిరగమని ఆదేశించినప్పుడు దాని అసలు అనుభూతి తెలుస్తుంది. మొదటిసారి జైలులోకి ప్రవేశించే వ్యక్తికి, ఆ ఆ దిగ్భ్రాంతిని తట్టుకోవడం అంత సులభం కాదు.
ప్రారంభ సన్నివేశంలో, కొత్తగా వచ్చిన ఒక ఖైదీ, ప్రవేశ ప్రక్రియను, ప్రతికూల వాతావరణాన్ని చూసి తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోతానని ఏడుస్తాడు. అతనికి సహాయం చేయడానికి బదులుగ, “సంస్కరణ గృహం” అని పిలువబడే సంస్థకు ప్రతినిధులైన సీనియర్ జైలు అధికారులు అతన్ని బలవంతంగా నేలపైకి నెట్టి, తన్ని, కొట్టి, దాదాపు చంపినంతపని చేస్తారు. రాత్రంతా నొప్పితో మెలికలు తిరుగుతూ జైలు ఆసుపత్రిలో మరణిస్తాడు. ఈ దారుణమైన హత్య సినిమాలో అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ దాదాపు ఒక దశాబ్దం జైలు శిక్ష ద్వారా నాకు ప్రత్యక్షంగా తెలిసిన వాస్తవాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
.ఇలాంటి అమానవీయ సంఘటనలు ఎన్నో చూశాను. తన పెంపుడు జంతువుల పట్ల అమితమైన ప్రేమను చూపే జైలు అధికారి ఖైదీల పట్ల కనికరం చూపకపోవచ్చు. అనేక మరణాలు తీవ్రమైన అనారోగ్యంతో కాకుండా, జైలు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సంభవిస్తున్నాయి.
నా పక్క బ్యారక్‌లోని ఒక వృద్ధ ఖైదీ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆ రాత్రి, ఖైదీలు పదేపదే వైద్య సహాయం కోసం పిలిచినా, ఏ డాక్టరూ రాలేదు. చాలా ఆలస్యంగా నర్సింగ్ ఆర్డర్లీ వచ్చి అతనికి నొప్పి తగ్గడానికి మాత్ర ఇచ్చాడు. తరచుగా, ఖైదీలకు పారాసెటమాల్ లేదా డైక్లోఫెనాక్ వంటి నొప్పి నివారణ మందులు ఇచ్చి, అక్కడితో సరిపెట్టేస్తారు. ఈ మందులు ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోవడంతో, ఆ ఖైదీని జైలు ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో, సరైన చికిత్స కోసం అతడిని జైలు బయట ఉన్న ఒక పెద్ద ఆసుపత్రికి అత్యవసరంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండింది.
అయితే, జైలు అధికారులు ఏమీ చేయలేదు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అదే సమయంలో, డబ్బు ఉండి లంచాలు ఇవ్వగల ఇతర ఖైదీలను బయటి ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ఆ ఖైదీని మూడు రోజుల పాటు నరకయాతనకు వదిలేసారు. చివరికి అతను జైలు ఆసుపత్రిలోనే మరణించాడు
అతని మరణాన్ని కప్పిపుచ్చే స్పష్టమైన ప్రయత్నంలో భాగంగా, అతను మార్గమధ్యంలోనే మరణించాడనే అభిప్రాయాన్ని కలిగించడానికి, తెల్లవారుజామున అతని మృతదేహాన్ని బయటకు తీసి జైలు బయట ఉన్న ఆసుపత్రికి పంపారు. ఏం జరిగిందో తెలుసుకుని, ఆ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, ఆ తర్వాత ఒక ఖైదీ మరణానికి డాక్టరును, సూపరింటెండెంట్‌ను బాధ్యులను చేయాలని కోరుతూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశాను. అయితే, ఎవరిపై ఫిర్యాదు చేశానో నేను అదే జైలు యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్బంధంలో ఉండటం వల్ల ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. సమాచార హక్కు చట్టం కింద నేను అడిగిన పత్రాలను నాకు ఇవ్వలేదు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు జరిగే విచారణ తేదీలను ఉద్దేశపూర్వకంగా నాకు తెలియకుండా దాచిపెట్టారు. సాక్షులుగా ఉన్న నా తోటి ఖైదీలపైన రకరకాల ఒత్తిళ్లు తెచ్చారు. ఫలితంగా, ఆ కమిషన్ ముందు ఆ ఫిర్యాదును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లలేకపోయాను.
అదేవిధంగా, ఎల్గార్ భీమా కోరేగావ్ కేసులో నా సహ నిందితుడు, మానవ హక్కుల పరిరక్షకుడైన ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీలో మరణించడం కూడా ఒక వ్యవస్థాగత హత్యే. మేము జైలులో కలిసినప్పుడల్లా, ఆయన తన చేతిని పైకెత్తి, పిడికిలి బిగించి, వణుకుతున్న గొంతుతో, “లడెంగే, జితెంగే”—“మేము పోరాడతాము, మేము గెలుస్తాము” అని అనేవారు. ఈ వ్యవస్థాగత హత్యకు నిరసనగా, ఎల్గార్ ఖైదీలమైన మేము ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టి, ఆయన మరణానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ఫిర్యాదు చేశాము. అయితే, ఆ ఫిర్యాదు వల్ల చెప్పుకోదగ్గ ఫలితమేమీ రాలేదు.
ఖైదీల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తే వారికి జైలు శిక్ష అంటే ఏమిటో అర్థం కాదని జైలు యంత్రాంగం తమ క్రూరత్వాన్ని సమర్థించుకుంటుంది. అలా చేస్తున్నప్పుడు, ఆ శాఖను అధికారికంగా “మహారాష్ట్ర జైళ్లు- దిద్దుబాటు సేవలు ” అని పిలుస్తారనీ, దాని అధికారిక నినాదం “సంస్కరణలు-పునరావాసం” అనీ అధికారులు సౌకర్యవంతంగా మర్చిపోతారు. అయినప్పటికీ, క్రమశిక్షణ, అంతర్గత భద్రతల పేరుతో యంత్రాంగం ఏకపక్షంగానూ, క్రూరంగానూ వ్యవహరిస్తుంది.
ఉదాహరణకు, తలోజా సెంట్రల్ జైలులో ఒక అధికారి రాత్రి సమయంలో అగరుబత్తి ప్యాకెట్లతో తయారు చేసిన పేకాట ఆడుతున్న కొంతమంది ఖైదీలను చూశాడు. మరుసటి రోజు ఉదయం, అతను వారిని లాఠీతో దారుణంగా కొట్టాడు. ఒక ఖైదీ తీవ్రంగా గాయపడి రెండు రోజుల తర్వాత మరణించాడు. పోస్ట్ మార్టం నివేదికలో అతను జారిపడి మరణించాడని నమోదు చేశారు, దీనివల్ల నేను హత్యగా భావించే దాన్ని యంత్రాంగం కప్పిపుచ్చుకోగలిగింది. ఇటువంటి కప్పిపుచ్చుకునే చర్యలు బాధ్యులైన అధికారులలో ఎలాంటి పశ్చాత్తాపాన్ని కలిగించకపోగా అవి వారిని మరింత నిర్దయులుగా, నిర్భయులుగా మారుస్తాయి.
బైకుల్లా మహిళా జైలులో ఒక మహిళా ఖైదీపై జరిగిన దారుణమైన దాడి తర్వాత ఆమె మరణించడంతో, ఒక అధికారిని, పలువురు కానిస్టేబుళ్లను జైలుపాలు చేసిన సంఘటనలాంటిది చాలా అరుదుగా జరిగింది. కానీ అటువంటి కేసులు అసాధారణంగానే ఉంటాయి. ఎందుకంటే కస్టడీ మరణాలను తరచుగా కప్పిపుచ్చుతారు కాబట్టి పరిపాలనా యంత్రాంగ బలగాలు ఖైదీలను కొట్టడమే సర్వసాధారణంగా జరుగుతుంది.
జైలు జీవితంలోని ప్రతి క్షణం సానుకూలత, ప్రతికూలతల మధ్య జరిగే సంఘర్షణతో నిండి ఉంటుంది. జైలులో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త, సమస్యాత్మకమైన సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ పరిమితమైన ప్రపంచంలో, అతి చిన్న విషయాల కోసం కూడా పోరాడాల్సి ఉంటుంది. ‘ది షాషాంక్ రిడెంప్షన్’ నవలలో, ఆండీ డఫ్రెస్నే జైలు అధికారులను పుస్తకాలు అడుగుతాడు, కానీ అతనికి ఎలాంటి సహాయం అందదు. అతను ఆరేళ్లపాటు పట్టుదలతో ప్రభుత్వానికి లేఖలు, దరఖాస్తులు రాస్తూనే ఉంటాడు. చివరికి, అతని ప్రయత్నాల ఫలితంగా ఒక చిన్న గ్రాంటు, పాత పుస్తకాలు వస్తాయి.
2013 నుండి 2017 వరకు నా మొదటి జైలు శిక్ష సమయంలో, నేను చదవాలనుకున్న పుస్తకాలను నా సొంత ఖర్చుతో కూడా కొనుక్కోవడానికి సూపరింటెండెంట్ అనుమతించలేదు. అనుమతి కోసం నేను ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. గ్రంథాలయంలో అప్పటికే తగినన్ని పుస్తకాలు ఉన్నాయని పేర్కొంటూ జైలు అధికారులు నా దరఖాస్తును వ్యతిరేకించారు. కానీ న్యాయమూర్తి వారు సమర్పించిన జాబితాను పరిశీలించి, అది పూర్తిగా సరిపోదని భావించి నా అభ్యర్థనను అనుమతించారు.
ఆ ఉత్తర్వును జారీ చేసిన న్యాయమూర్తి జస్టిస్ బి. హెచ్. లోయా. రాజకీయంగా సున్నితమైన సోహ్రాబుద్దీన్ షేక్ కేసును విచారిస్తున్న సమయంలో 2014లో ఆయన మరణించడం, ప్రజా వివాదానికి, విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లకు కారణమైంది. ఇంతటి వివేకం, హేతుబద్ధత కలిగిన న్యాయమూర్తి తారసపడే అదృష్టం ఎల్లప్పుడూ లభించదు. ఈ సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా, ఒకసారి ఒక జైలర్ జైలు గేటు వద్ద ఒక పుస్తకాన్ని ఆపి, కేవలం దాని శీర్షికలో “బానిసత్వం,” “తిరుగుబాటు” వంటి పదాలు ఉన్నాయనే కారణంతో దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ వింతైన, ఊపిరాడనీయని వాస్తవంలో, పుస్తకాలు అందుబాటులో లేకపోవడం అనేది మరో రకమైన లేమిగా మారుతుంది—దీనికి ప్రతిఘటన అవసరం, కొన్నిసార్లు ఆండీలా ఒంటరిగా, మరికొన్నిసార్లు సామూహికంగా.
“బ్రూక్స్ ఇక్కడే ఉన్నాడు”
ఈ చిత్రంలో, వృద్ధుడైన, అందరి గౌరవం పొందిన ఖైదీ బ్రూక్స్ హాట్లెన్ పాత్ర చిత్రం ముగిసిన తర్వాత కూడా చాలా సేపు మనసులో నిలిచిపోతుంది. బ్రూక్స్ షాషాంక్ జైలు లైబ్రరీని ఎంతో శ్రద్ధగా, అంకితభావంతో నిర్వహిస్తాడు, క్రమంగా అదే అతని సర్వస్వంగా మారుతుంది. బ్రూక్స్ కు జైలులో తాను పెంచుకునే జేక్ అనే కాకితో మంచి అనుబంధం ఉంటుంది. బయటి ప్రపంచంలో ఒక జంతువును లేదా పక్షిని తోడుగా ఉంచుకోవడం సాధారణ విషయంగా కనిపించవచ్చు. కానీ జైలులో, దానికి పూర్తిగా భిన్నమైన అర్థం ఉంటుంది. బయిట తమ కోసం ఎవరూ బంధువులు, స్నేహితులు లేదా సహచరులు ఎవరూ లేని ఖైదీలకు, ఒక జంతువు లేదా పక్షి ఒంటరితనంలో తోడుగా మారుతుంది—మాట్లాడుకోవడానికి, ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఒక సన్నిహిత ఉనికిగా నిలుస్తుంది.
దాదాపు అర్ధ శతాబ్దం పాటు జైలులో గడిపిన బ్రూక్స్ కు పెరోల్ మంజూరైనప్పుడు, విడుదల కాబోతున్నాడనే ఆలోచనే అతన్ని తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తుంది. జైలు ఏ విధంగా పూర్తిగా తన శాశ్వత ఆశ్రయంగా, ఇల్లుగా మారిపోయిందనేది అప్పుడే అతనికి అర్థమవుతుంది; బయటి ప్రపంచం అతనికి చాలా వింతగా అనిపిస్తుంది. నిరాశతో, తాను మళ్ళీ నేరం చేస్తే తనకు తిరిగి శిక్ష పడి, జైలులోనే ఉండటానికి అనుమతిస్తారనే నమ్మకంతో, అతడు మరో ఖైదీ మెడకు కత్తి పెడతాడు, కానీ ఇతర ఖైదీలు అతడిని వారిస్తారు. మరుసటి రోజు, నిస్సహాయంగా, ఇష్టం లేకపోయినా, బ్రూక్స్ తన సామానంతటినీ ఒకే బ్రీఫ్‌కేసులో సర్దుకుని జైలు నుండి బయటకు నడుస్తాడు.
బ్రూక్స్ విడుదలయ్యేనాటికి, బయటి ప్రపంచం అతన్ని వదిలి ముందుకు సాగిపోయింది. అతను ఒక డిపార్ట్మెంటల్ స్టోర్‌లో శ్రద్ధగా పనిచేస్తాడు, కానీ అతని సాయంత్రాలు, రాత్రులు భరించలేనివిగా మారాయి. తాను ఆకాశంలోకి వదిలిన ‘జేక్’ అనే కాకి, ఏదో ఒక విధంగా తిరిగి వస్తుందేమోనన్న ఆశతో దాని కోసం ఎదురుచూస్తాడు. పక్షుల గుంపుల మధ్య దాని కోసం వ్యర్థంగా వెతకడం వృధా ప్రయాస అవుతుంది.
“బ్రూక్స్ ఇక్కడ ఉండేవాడు”
ఒకప్పుడు అతన్ని నిలబెట్టిన సాధ్యతా భావన క్షీణించిపోయింది, దానిని తిరిగితేవడానికి అతని చుట్టూ ఎవరూ లేరు. ఒంటరితనమూ, దిక్కుతోచని స్థితితో కుంగిపోయి, జీవించడానికి ఏమీ మిగలకపోవడంతో, బ్రూక్స్ చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. అలా చేయడానికి ముందు, అతను ఒక చెక్క దూలంపైన “బ్రూక్స్ ఇక్కడ ఉండేవాడు” అని చెక్కుతాడు.
బ్రూక్స్ మరణానికి ఎవరు బాధ్యులు? బాధ్యతను ఆపాదించాల్సి వస్తే, అది ఒక అమానవీయ అధికార వ్యవస్థలోనూ, తీవ్రంగా స్వార్థపూరితంగా, వ్యక్తివాదంగా మారిన పెట్టుబడిదారీ సామాజిక వ్యవస్థలోనూ ఉంది. అది ఒక వ్యక్తిని సంపూర్ణ మానవుడిగా గౌరవించదు; అది మనుషులను వారి భావాలు, అంతర్గత జీవితం లేని రోబోలుగా చూస్తుంది. అటువంటి వ్యవస్థకు ఒక వ్యక్తి సంపూర్ణ వికాసం, చైతన్యం లేదా భావోద్వేగ శ్రేయస్సు పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉండదు. అది తన కార్యకలాపాలను కొనసాగించడానికి బ్రూక్స్ వంటి వ్యక్తుల శ్రమ మాత్రమే అవసరం. ఈ యాంత్రిక ప్రపంచంలో బ్రూక్స్ భావోద్వేగాలకు చోటు లేదు. అది అతని వైఫల్యం కాదు; అతని కోసం ఒక మానవీయమైన, సహాయక వాతావరణాన్ని సృష్టించలేకపోయిన అధికార వ్యవస్థ వైఫల్యం.
వ్యక్తిగతం రాజకీయమైనది
ఇటువంటి బహిరంగ వ్యవస్థీకృత, నిర్మాణపరమైన హింస, అలాగే జైలులో, ఆ తర్వాత ఎదురయ్యే అమానవీకరణ మనల్ని నిస్సహాయుల్ని చేస్తుంది. కానీ రాజకీయ భావజాలం పట్ల నిబద్ధత కారణంగా మా లాంటి రాజకీయ ఖైదీలు ఈ నిస్సహాయతను అధిగమించడం అలవాటు చేసుకున్నారు. ఈ సినిమా అటువంటి రాజకీయ నిబద్ధతకు ఎలాంటి ఉదాహరణను చూపదు. అయినప్పటికీ, “వ్యక్తిగతమూ రాజకీయం” అనే నినాదాన్ని నమ్మే నాకు, అనేక సన్నివేశాలు, సంభాషణలు పూర్తిగా రాజకీయమైనవిగా అనిపించాయి.
ఒక అద్భుతమైన సన్నివేశంలో, కథానాయకుడు ఆండీని ఒక జైలు అధికారిక కార్యాలయంలో పని చేయడానికి పంపుతారు. వార్డెన్ గదితో సహా ఆఫీసంతా ఖాళీగా ఉందని అతను గ్రహించినప్పుడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. తనకు పని కేటాయించిన అధికారిని బాత్రూమ్లో బంధించి, టర్న్ టేబుల్‌పై మోజార్ట్ సంగీత రికార్డును ప్లే చేస్తాడు. [అద్భుతమైన, మరపురాని సంగీతాన్ని, పాలక వర్గ విశేషాధికారాలను తెలివిగా ఎగతాళి చేసే సాహసోపేతమైన, చమత్కారమైన కథతో కలపడం వల్ల వోల్ఫ్‌గ్యాంగ్ అమేడియస్ మోజార్ట్ పాట ‘ది మ్యారేజ్ ఆఫ్ ఫిగరో’ ప్రసిద్ధి చెందింది.
అధికారి బెదిరింపులను లెక్కచేయకుండా, ఆండీ వాల్యూమ్‌ను పెంచి, మొజార్ట్ ‘ది మ్యారేజ్ ఆఫ్ ఫిగారో’ (ఫిగారో వివాహం’)లోని యుగళగీతమైన “సుల్’ఏరియా”ను జైలు లౌడ్‌స్పీకర్ ద్వారా ప్రసారం చేస్తాడు. అప్పటివరకు ఆ లౌడ్‌స్పీకర్ వ్యవస్థ కేవలం ఖైదీలను క్రమశిక్షణలో పెట్టడానికి, నియంత్రించడానికి ఉద్దేశించిన ఆదేశాలను మాత్రమే ప్రసారం చేసేది.
జైలు అంతటా, ఖైదీలు తాము చేస్తున్న పనిని ఆపి ఆ పాటవచ్చే వైపు తిరుగుతారు. ఆ క్షణంలో ఆ పాట మాధుర్యం వారి కఠినమైన దైనందిన జీవితాన్ని కాసేపు నిలిపివేస్తుంది. ఆండీ వార్డెన్ కుర్చీలో కూర్చుని, తన కాళ్లను బల్లపై చాపి, తాళం వేసిన తలుపు వెలుపల అధికారులు గుమిగూడుతున్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా సంగీతాన్ని ఆస్వాదిస్తాడు. అలాంటి అద్భుతమైన క్షణాన్ని అనుభవించినందుకు తాను ఎంత మూల్యం చెల్లించుకోవాలో ఆండీకి బాగా తెలుసు, అయినప్పటికీ అతను దానిని తన కోసం మాత్రమే కాకుండా ప్రతి ఖైదీ కోసం చేశాడు. అంతేకాకుండా, గాజు తలుపు వెలుపల నిలబడి ఉన్న జైలు సూపరింటెండెంట్ భయంకరమైన చూపును తన చిరునవ్వుతో తిరస్కరిస్తూ అతను ఈ పని చేస్తాడు. ఒక సాంస్కృతిక కార్యకర్తగా, రాజకీయ ఖైదీగా, ఇది నాకు అద్భుతంగా అనిపించింది. ఆ చూపులో ఆశాభావం, తిరుగుబాటు, సృజనాత్మక ఆనందాన్ని సృష్టించిన సంతోష క్షణం సామూహికతతో అనుసంధానం అద్భుతంగా మిళితమై ఉన్నాయి. అదే ఈ సినిమాకు, జీవితానికి సారం. ఈ సమైక్య క్షణమే అతిపెద్ద పాలనలను కూడా నేలకూల్చింది. గత కొన్ని రోజులుగా, ఇది భారతదేశంలోని విప్లవాత్మక నేలలోకి ఎరువుగా ప్రవేశించడాన్ని నేను చూశాను.
“పునరావాసమా? అదొక పనికిమాలిన పదం”
సినిమా చివరిలో, దర్శకుడు ఫ్రాంక్ డారాబాంట్ మనకు మరో ఆకట్టుకునే సన్నివేశాన్ని అందిస్తాడు. రెడ్ అని పిలువబడే ఎల్లిస్ బాయిడ్ రెడ్డింగ్, తన నాలుగు దశాబ్దాల జైలు జీవితంలో ఎన్నడూ చూపని ధిక్కారంతో పెరోల్ బోర్డు ముందు హాజరవుతాడు. సంవత్సరాలుగా, బోర్డు ముందు రెడ్ అనేకసార్లు హాజరయ్యాడు, ప్రతిసారీ తన నుండి ఆశించిన విధంగానే సమాధానం ఇచ్చాడు, అయినప్పటికీ అతని విడుదల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతూనే ఉన్నాయి. కానీ ఈ విచారణలో, అతను ఇక పశ్చాత్తాపపడటానికి సిద్ధంగా లేడు. సుదీర్ఘ అనుభవంతో రూపుదిద్దుకున్న వ్యక్తిగా—స్పష్టమైన చూపుతో, దృఢంగా, తిరగబడేలా కమిటీ ముందు నిలబడతాడు.
మీరు పునరావాసం పొందారా అని అడిగినప్పుడు, రెడ్ ఇలా సమాధానమిస్తాడు: “పునరావాసమా? అదొక పనికిమాలిన పదం. అది రాజకీయ నాయకులు కనిపెట్టిన పదం. ఇంటర్వ్యూ చేసే మీ వ్యక్తి లాంటి యువకులు సూట్లు, టైలు వేసుకొని తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి వీలుగా దీనిని సృష్టించారు” అని అంటాడు. రెడ్ కోపం ఒక లోతైన మానసిక సంఘర్షణ నుండి ఉద్భవించింది—ఇది దాదాపు ప్రతి ఖైదీని కుదిపేసే సంఘర్షణ.
‘ఖైదీ’ అనే పదం బయటికి ఒకే వర్గానికి చెందినదిలా వినిపిస్తుంది. అయితే, దేశంలోని ప్రతి ఖైదీ చివరికి ఈ బ్రాహ్మణీయ, పెట్టుబడిదారీ, పితృస్వామ్య సమాజంలో భాగమే కాబట్టి, ప్రతి ఖైదీ వర్గం, కులం, మతం, జెండర్, ప్రాంతం, భాష అనే గోడల ద్వారా విడిపోయి ఉంటాడు. ఖైదీలు తమపై మోపబడిన నేరాల ఆధారంగా కూడా విభజితమై ఉంటారు. అయినప్పటికీ, అందరూ ఒకే పైకప్పు కింద ఉంటారు. వారిలో చాలామంది నిరాధారమైన ఆరోపణలలో ఇరుక్కుపోతారు. తరచుగా నేర ప్రపంచంలోకి లాగబడతారు. చాలామందికి, బయటి నుండి సహాయం చేసేవారు ఎవరూ ఉండరు, లేదా న్యాయ ప్రక్రియలో సానుకూలమైనది ఏమీ మిగిలి ఉండదు. అయినప్పటికీ, వారు అత్యంత సన్నని ఆశా రేఖను పట్టుకుని, ఆ విశాలమైన, శిక్షాత్మకమైన జైలు వ్యవస్థలోనే జీవిస్తూ ఉంటారు. వారి రోజువారీ పోరాటమూ, నిరాశకు పూర్తిగా లొంగిపోవడానికి నిరాకరించాలానే స్వభావమూ ఈ ఖైదీలందరినీ కలిపి ఉంచుతుంది. ధైర్యంతో, చైతన్యంతో జీవిస్తున్న జైలులోని అసంఖ్యాక వ్యక్తుల నుంచి నేను నా సొంత పోరాటానికి బలాన్ని పొందాను.
కమిటీ ముందు తన ధిక్కారాన్ని ప్రదర్శించినప్పటికీ, రెడ్ ను క్షమించి మిగిలిన శిక్షను రద్దు చేసి విడుదల చేస్తారు. జైలులో 40 సంవత్సరాలు గడిపిన తర్వాత, బ్రూక్స్ లాగే రెడ్ బయటి జీవితం కూడా ఊపిరాడనిదిగా, యాంత్రికంగా మారిపోతుంది. మరో రోబోలా తయారవుతాడు. బ్రూక్స్ ఆత్మహత్య చేసుకున్న గదినే రెడ్‌కు కేటాయిస్తారు. బ్రూక్స్ కు ముందే, చాలామంది అదే గదిలో తమ మెడకు తాడు బిగించుకుని ఉండవచ్చు. ఇప్పుడు రెడ్ కూడా ఆ వాస్తవికత వైపు వెళ్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో, ఆండీ రాసిన లేఖ అతనిని చేరుతుంది: “గుర్తుంచుకో రెడ్, ఆశ అనేది మంచి విషయం, బహుశా అన్నింటికంటే ఉత్తమమైనది. ఏ మంచి విషయమూ ఎప్పటికీ చనిపోదు.” ఆ మాటలను అక్షరాలా నమ్మి, ఆండీ తనకు సూచించిన దిశలో నడవడం ప్రారంభించి, చివరికి ప్రశాంతమైన సముద్ర తీరానికి చేరుకుంటాడు. సినిమా ముగుస్తుంది.
జైళ్లు లేని చోట
సినిమా తెరపైన ముగుస్తుంది, కానీ దాని కథ మన మనసుల్లో కొనసాగుతుంది. రెడ్ ఎంతో కాలంగా పరితపిస్తున్న ప్రశాంతతను చివరికి ఆ విశాలమైన, అంతులేని సముద్ర తీరానికి చేరుకున్నప్పుడు కనుగొంటాడేమో. కానీ జైలు నుండి నేను విడుదల అయినప్పటి వాస్తవికత—నేను బయటకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు; ఆ తర్వాత రోజుల్లో నేను అనుభవించిన భావన—’ది షాషాంక్ రిడెంప్షన్’ చివరి క్షణాలకు ఖచ్చితంగా చాలా భిన్నంగా ఉంది. ఆ భారీ జైలు గేటు గుమ్మానికి అవతల నిలబడి, నేను సంతోషానికి, దుఃఖానికి మధ్య చిక్కుకుపోయాను. ఐదు సంవత్సరాలకు పైగా సాగిన దీర్ఘకాలిక కారాగార వాసం తర్వాత, నేను చివరకు హర్షాలీతో కొంత ప్రశాంతమైన సమయాన్ని గడపగలుగుతాను. నన్ను ఇంటికి తీసుకెళ్లడానికి ఆమె జైలు గేటు బయట ఎదురుచూస్తూంటుంది. నా కుటుంబం లాంటి వారైన ఉద్యమంలో నన్ను ఎంతో ఆదరించే ప్రియమైన కామ్రేడ్లను కూడా నేను కలుస్తాను.
కానీ అదే సమయంలో, ఆ సంతోషంపైన మొదట్లో మసక నీడలా ఉన్న దుఃఖం క్రమంగా ముదురుతోంది. అది ఆనందాన్ని కప్పివేయడం ప్రారంభించింది, తీవ్రంగా కలవరపెట్టింది. ఆ సమయంలో, ఎల్గర్ భీమా కోరేగావ్ కేసులో నా సహ నిందితుడు, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌కు ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. తన మూడు దశాబ్దాల న్యాయవాద వృత్తిలో ఎంతో మంది ఖైదీలకు ఉచితంగా సహాయం చేసిన అటువంటి గాడ్లింగ్ స్వయంగా తలోజా సెంట్రల్ జైలులోనే ఇంకా కటకటాల వెనుక ఉన్నారు.
సినిమాలోని తిరుగుబాటు కథానాయకుడు ఆండీ జైలులోని అత్యంత చీకటి మూలల్లో కూడా ఆశను సజీవంగా ఉంచుతాడు. ఉద్యమ కాలంలో నేను ఒక్క ఆండీని మాత్రమే కాదు, ఎంతోమందిని చూశాను: ధైర్యాన్ని నింపి, ఈ క్రూరమైన పాలనకు వ్యతిరేకంగా నిలబడే ప్రజలను చూశాను. కుల, వర్గ, పితృస్వామ్యాలను నిర్మూలించే విప్లవోద్యమంలో, శత్రువుతో పోరాడి ప్రాణాలు విడిచిన అమరవీరులలో, అత్యంత భయానక పరిస్థితులలో కూడా ఉద్యమాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించిన వారిలో నేను ఆ స్ఫూర్తిని గుర్తిస్తున్నాను. ప్రతి ఒక్క తెలిసిన, తెలియని స్వాతంత్ర్య సమరయోధుడిలో, నేను ధైర్యాన్ని- తిరుగుబాటును రెండింటినీ చూస్తున్నాను.
బయట నా కోసం ఎదురుచూస్తున్న అనేక వైరుధ్యాలను, పోరాటాలను నేను ఎదుర్కొంటున్నప్పుడు, ఆ సినిమాలో చూపిన ఆశే నాకు అవసరమైన ఆశ. ఆశ, నిరాశల మధ్య ఉన్న ఆ గందరగోళ, భావోద్వేగభరితమైన స్థితిలో కూడా, నన్ను స్వాగతించడానికి జైలు గేటు వద్దకు వచ్చిన ఆ ప్రజలందరిలో, రేపటి కోసం ఒక ఆశాజనకమైన ఉద్యమానికి అంకురార్పణ జరుగుతున్నట్లు నేను చూడగలిగాను.
మా వాహనాల కాన్వాయ్ నన్ను ఆ గంభీరమైన జైలు గోడల నుండి, ఆ ఎర్ర గేటు నుండి స్వేచ్ఛ వైపుకు తీసుకువెళుతోంది. అయినప్పటికీ, నా మనసు జైలు లోపలి ప్రపంచానికి, బయటి ప్రపంచానికి మధ్య ఊగిసలాడుతూ, ఒక విచిత్రమైన అలజడిలో చిక్కుకుంది. ఐదున్నర సంవత్సరాలుగా, ప్రతి సాయంత్రం ఆరు గంటల తర్వాత నన్ను లోపల బంధించేవారు.
ఆ రోజు, నేను ఇక నిర్బంధంలో లేను. నేను స్వేచ్ఛగా ఉన్నాను. నేను నా ప్రజలతో ఉన్నాను. విడుదల రోజున జైలు గోడల వెనుక నెమ్మదిగా కనుమరుగవుతున్నట్లు నేను చూసిన అడ్వకేట్ గాడ్లింగ్, ఏదో ఒక రోజు తప్పకుండా విడుదల అవుతారు. దెబ్బతిన్న, చెల్లాచెదురైన మన ఉద్యమ బూడిద నుండి, మన ఫీనిక్స్ పక్షి మళ్లీ లేచి రెక్కవిప్పి ఎగురుతుంది. మరియు, ఆశ, తిరుగుబాటు మన పక్షాన ఉంటే, ఒకానొక రోజు మనం ఒకరిద్దరు ఖైదీలను మాత్రమే కాదు, యావత్ దేశాన్ని—ఈ ప్రపంచాన్ని కూడా—ఈ ఫాసిజం అనే చెరసాల నుండి విడిపించగలమని అది మనకు చెబుతుంది. అసలు జైళ్లే లేని ప్రపంచం అది…
రమేష్ గైచోర్
రమేష్ మురళీధర్ గైచోర్ ఒక భారతీయ కులతత్వ వ్యతిరేక కార్యకర్త, కళాకారుడు; కబీర్ కలా మంచ్ అనే సాంస్కృతిక బృందంలో సభ్యుడు.
హర్షాలి పోద్దార్
హర్షాలి పోద్దార్ ఒక భారతీయ కులతత్వ వ్యతిరేక కార్యకర్త, రచయిత్రి, అనువాదకురాలు, మరియు ప్రముఖ నిర్వాహకురాలు.
https://thepolisproject.com/read/hopefulness-and-rebellion-the-story-of-prison-me-and-the-shawshank-redemption/




