ఎవరి విశ్వాసాలు ఎలా ఉన్నా పండుగ అంటే మనుషుల్ని దగ్గర చేసేది. ప్రాచీన పండుగలన్నీ సుమారుగా ప్రకృతితో గాఢమైన అనుబంధాన్ని చాటేవే. వ్యవసాయంతోనూ, పశుపోషణతోనూ జీవితాలను అనుసంధానించి ప్రకృతి లయకు స్పందిస్తూ, రంగురంగుల రుతువుల రాకను సంతోషంగా ఆహ్వానించేవి. ఒక సామూహిక వేడుక సంతోషాన్నిస్తుంది. స్నేహితులతో, బంధువులతో కలిసి గడిపిన మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. వ్యక్తిగత విశ్వాసాలకు, మతానికి అతీతంగా పండుగల్లో, వేడుకల్లో చుట్టు పక్కల వాళ్లతో కూడా సంతోషాన్ని పంచుకుంటారు. మిఠాయిలు ఇచ్చి పుచ్చుకుంటారు. పండుగల వెనక విశ్వాసాల్లో ఆధిపత్య కుల, లింగ భావనలు లేక కాదు. నిజానికి బ్రాహ్మణీయ కుల వ్యవస్థ కబళించాక ప్రకృతితో అనుసంధానమైన పండుగలు, సామూహిక వేడుకలు పూర్తి భిన్నంగా నిర్వచించబడ్డాయి. కొత్త కొత్త కథలు వాటికి జోడించారు. ఉదాహరణకు దసరా దీపావళి పండుగల వెనుక పూర్తి భిన్నమైన కథలు వేరువేరు ప్రాంతాల్లో ప్రచారంలో ఉండడం మనకు తెలుసు. ఉత్తరాది వ్యాపార వర్గాల సంస్కృతి దక్షిణాది పండుగల్లో, వేడుకల్లో బాగా చొరబడిపోయింది.
గత ఇరవై ముప్పై ఏళ్లలో అయితే పండుగలు చాలా మారిపోయాయి. అవి క్రమంగా ప్రకృతికి, సామాజిక భావనకు పూర్తిగా దూరమయ్యాయి. ఆచారం, సంప్రదాయం అని పైకి ఏవో చెప్పుకుంటారు కానీ పండుగలన్నీ సామాజిక ప్రదర్శనలుగా మారాయి. ఏ రకంగా చూసినా వాటిలో పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాలు ఉండవు. పండుగల్లోకి మార్కెట్ చొరబడింది. ఇంకోవైపు నుండి రాజకీయాలు చొరబడ్డాయి. మార్కెట్‌కు సరుకుల భావనే తప్ప సామాజిక భావన లేదు. పాలక రాజకీయాలు సమాజాన్ని చూడవు. గుంపును మాత్రమే చూస్తాయి. ప్రజల్ని విచక్షణ లేని గుంపుగా ఉంచితేనే వారి ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తాయి.
పండుగల సందర్భంగా ధమాకా సేల్స్ వస్తాయి. మీ పాత టీవి, మొబైల్, బైక్ అన్నీ పక్కన పడెయ్యండి. మీ హోదాను, దర్పాన్ని ప్రదర్శించే సరికొత్త వస్తువులు కొనండి అంటూ అవసరం ఉన్నా లేకున్నా కొనిపించడమే మార్కెట్ల పరమావధి. డబ్బులు లేకున్నా ఫరవాలేదు, అప్పు (ఇఎమ్ఐ) చేయండి అంటూ ఉసిగొల్పుతాయి. వస్తువులు కొనడం, ప్రదర్శించడం మాత్రమే జీవిత పరమావధి. షాపింగ్‌లోనే సంతోషం ఇమిడి ఉంది. ఈ మానసికత అన్నిట్లోకి ప్రవేశిస్తుంది. అది మార్కెట్ ఎకానమీకుండే సామాజిక లక్షణం. డిజె మోత మోగించడమే కాదు, ప్రార్థనా స్థలాలన్నిటిలోకి లౌడ్ స్పీకర్లు రావడం ప్రదర్శనా వ్యామోహమే. దైవ సన్నిధిలో మానసిక ప్రశాంతత అనే భావన ఎగిరిపోతుంది. వాళ్లు పెడితే మేమెందుకు పెట్టకూడదు అనే పోటీ, దానికి తోడు మెజారిటీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ఉన్మాదం తోటి మనుషుల పట్ల ఉండాల్సిన పట్టింపు (కన్సర్న్) కూడా లేకుండా చేసింది. ఒకే పండుగ జరుపుకునే వాళ్ల మధ్య కూడా పోటీ శృతిమించిపోయింది. అవతలి వాళ్లు రెండు వేల రూపాయల పటాకులు కాలిస్తే మేం అయిదు వేలు కాల్చాలి అనే పోటీ. ఒకరు 20 అడుగుల విగ్రహం పెడితే మరొకరు 40 అడుగులు పెట్టాలనే పోటీ. ప్రతి సందర్భానికి డిజెల మోత, పటాకుల పేలుడు. అందరూ తమవైపు చూడాలనే తాపత్రయం, ప్రదర్శనా వ్యామోహం. పండుగలే కాదు, పెళ్లిళ్లు, పుట్టిన రోజులు, చావులకు కూడా పటాకుల కాల్చాల్సిందే. అప్పులపాలైనా లక్షలు ఖర్చుపెట్టి వేడుకలు చేసి నలుగురిలో గొప్పను చాటుకోవాల్సిందే. దీని వల్ల తమ స్థాయి పెరుగుతుందని అనుకుంటారు.
పండుగలు, వేడుకలు బజార్లలో ప్రదర్శనలుగా మారిపోయాక యువత అందులో కొత్త ఆనందాన్ని వెతుక్కుంది. సహజసిద్ధమైన ఆటపాటల బాల్యం లేక, యవ్వనోద్రాకాలను వెల్లడించే అవకాశం లేక ఒక్కసారిగా అక్కడ కట్టలు తెంచుకుంటారు. జీవితంలో వెలితి ఏదో పూడ్చుకోవాలని, విపరీతమైన అభద్రతలో ఉనికి చాటుకోవాలని వెంపర్లాడతారు. కొత్త సంవత్సరం వేడుకల్లో తాగి బైక్ నడిపి చచ్చిపోవడం, వినాయక చవితి వేడుకల్లో బూతుపాటలకు తప్పతాగి డాన్స్ చేయడం, విగ్రహాలతోపాటు మునిగి చచ్చిపోవడం, అవకాశమున్న చోటల్లా అమ్మాయులను వేధించడం.. చెప్పుకుంటూపోతే అందరికీ తెలిసినవే చాలా ఉన్నాయి. గుర్తించవలసినదేమిటంటే రెండుమూడు దశాబ్దాలుగా ఇటువంటి తరాన్ని మనం తయారుచేసుకున్నాం. ఏ రుగ్మత విడిగా పుట్టదు. కనిపించేవి పండుగల సందర్భంలో బైటపడే రోగ లక్షణాలు మాత్రమే. ఆ సందర్భంలో ఎవరితో ఎంత వాదన చేసినా ప్రయోజనం పెద్దగా ఉండదు. డిజె శబ్దాలకు చంటి పిల్లలు, ముసలివాళ్లు, గుండె సమస్యలున్నవాళ్లు తట్టుకోలేక చనిపోతున్నా పోటీలో ఏమాత్రం తగ్గకూడదనే ఉన్మాదం పండుగ ఎలా అవుతుంది? దీనిలో పవిత్ర భావన ఏమిటి? నిమజ్జన ఊరేగింపులో డిజెకు డాన్స్ చేస్తూ కుప్పకూలి చనిపోవడం వేడుక అవుతుందా? దీపావళి పండక్కు ఆసుపత్రులు నిండిపోవడంలో, ప్రపంచంలో 100 అత్యంత కాలుష్య నగరాల్లో 99 మన దేశంలోనే ఉండడంలో గొప్పదనం ఉందా? ఇదంతా తప్పు, దీని వల్ల మనం చాలా నష్టపోతున్నాం అని ఎవరైనా అంటే మీరు మతానికి వ్యతిరేకం, ఏకంగా దేశానికే వ్యతిరేకం అని దాడి చేసే ధోరణి కూడా పెరిగిపోయింది.
మార్కెట్ ఒక పరమభావన. దాన్ని ప్రశ్నించకూడదు. పెట్టుబడులు మన వనరులు నాశనం చేస్తున్నా, మన పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నా, ప్రజలకు నిలువనీడ లేకుండా చేస్తున్నా, ఏకంగా ప్రాణాలు తీస్తున్నా ప్రశ్నించకూడదు. అలాగే మతాన్ని కూడా ప్రశ్నించకూడదు. రాయలసీమలో కరువొస్తే పంటపొలాలకు నీళ్లు లేవన్నవాళ్లు ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో చేసిన వినాయక విగ్రహాలను, అన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిపి నిమజ్జనం చేయడానికి మాత్రం ఏకంగా కొన్ని టియంసీల నీళ్లు నిలువచేస్తారు. కానీ ప్రజలు తాగునీరు అడిగినా, సాగునీరు అడిగినా శాంతి భద్రతల సమస్య వస్తుంది. ఇదేం లాజిక్ అంటే.. ఇది మార్కెట్‌కు మాత్రమే అందే లాజిక్ అనాలి. నీళ్లు లేక పంటలు ఎండిపోవడం మనం చూస్తాం కానీ పరిశ్రమలు ఆగిపోవడం ఎక్కడా చూడం. ఒక్కో పండుగకు పెట్టే ఖర్చు చూస్తే మనకు కరువెక్కడుంది, పేదరికం ఎక్కడుంది అనిపించక మానదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గానీ, సుప్రీం కోర్టు గానీ, పటాకులు కాల్చకండి అంటాయి. తయారుచేయకండి అని కంపెనీలకు మాత్రం చెప్పవు. (గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని నిబంధన పెట్టారు కానీ అన్ని రకాల పటాకులు మార్కెట్లో మాత్రం అందుబాటులో ఉంటాయి) ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో విగ్రహాలంటూ చేసి పెట్టాక ఎక్కడో ఒక చోట నిమజ్జనం చేయక తప్పదు. అసలు తయారీ దగ్గరే ఆపే ప్రయత్నాలు ఎన్నడూ చేయరు. మన దేశంలో నిబంధనలు పెద్ద జోక్. ప్రజలు ఎప్పుడన్నా ప్రశ్నించినప్పుడు, పాలకులకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే ఆంక్షలు ఉల్లంఘించారంటూ వ్యవస్థలు కదులుతాయి.
యుక్తాయుక్త విచక్షణ లేని గుంపు ప్రవర్తనను పాలక రాజకీయాలు వాళ్ల అవసరం కోసం ప్రోత్సహిస్తాయి. ఏం చేసినా చెల్లుతుందనే లెక్కలేనితనం మరింతగా జబ్బు ముదిరేలా చేసింది. ఇందులో ఆరెస్సెస్ శక్తుల కృషి గణనీయంగా ఉంది. మూక మనస్తత్వాన్ని రెచ్చగొట్టడమే కాదు, వాళ్లు దగ్గరుండి గుంపును నడిపిస్తున్నారు. టపాకులు కాల్చకండి, ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయింది అంటే మేం కాల్చి తీరుతాం అంటారు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో వేయకండి అంటే మేం వేసి తీరుతాం అంటారు. డిజెలు పెట్టకండి అంటే మేం ఇంకా గట్టిగా పెడతాం అంటారు. ఈ మొత్తంలో ప్రకృతి బలిపశువు అయింది. గాలీ నీరూ కలుషితమై దేశమే రోగగ్రస్త అయింది. తమకేం కావాలో తమకే తెలియని మనుషులు మార్కెట్‌కూ, మతానికీ బానిసలయ్యారు. తాము ఏం కోల్పోతున్నామో, తమను తాము ఎక్కడ కోల్పోతున్నామో, ఏ శక్తులు తమ తలలపై ఆడుతున్నాయో అర్థం చేసుకున్నరోజే వాటినుండి బైటపడతారు. యువత కళ్లు తెరిస్తే మాత్రం పాలకులకు పెద్ద ‘కల్చరల్ షాక్’ తగులుతుంది. ఉద్యమ సంస్థలు యువతను ప్రత్నామ్నాయ సాంస్కృతిక కార్యాచరణవైపు తీసుకురాగలగాలి. ఆరెస్సెస్ వంటి శక్తులు చొరబడిన అన్ని మూలలను, మూలాలను పట్టుకొని ధ్వంసమైనవాటిని కొత్త చైతన్యంతో తిరిగి నిర్మించాలి. ఆ పని చేస్తూ పై చర్చను ముందుకు తీసుకుపోవాలి.




