జనాభా పెరుగుదల ఆర్థిక అభివృద్ధికి వరంగా మారాల్సిన చోట.. నిరుద్యోగం, పేదరికం, వలసలు, సామాజిక అస్థిరతకు కారణమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. యువత అధికంగా ఉండటం ఒక దేశానికి పెద్ద వ‌న‌రు. ఒక వ‌రంగా,  ఆర్థికంగా గొప్ప అవకాశంగా భావిస్తారు. పనిచేసే వయసులో ఉన్నవారి సంఖ్య పెరిగితే ఉత్పత్తి, పొదుపు, పెట్టుబడులు పెరిగి దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణుల భావ‌న‌. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారవుతోంది. యువత సంఖ్య పెరుగు తున్న వేగానికి అనుగుణంగా ఉద్యోగాలు పెరగడం లేదు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా చేసిన హెచ్చరిక ప్రకారం.. రాబోయే పదేండ్లలో ప్రపంచ దక్షిణ దేశాల్లో 120 కోట్ల మంది యువత ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించనుండగా… ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సృష్టించగల ఉద్యోగాలు 40 కోట్ల వరకు మాత్రమే. దీంతో 80 కోట్ల ఉపాధి అవకాశాల లోటు ఏర్పడే ప్రమాదం ఉంది.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఈ సంక్షోభానికి కేంద్రంగా ఉంది. ప్రతి ఏడాది లక్షలాది మంది యువత ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నారు. కానీ అదే స్థాయిలో ఉద్యోగాలు మాత్రం పెరగడం లేదు. నైపుణ్యాలు- ఉద్యోగ మార్కెట్ మధ్య అంతరం, పాక్షిక ఉపాధి, మహిళల తక్కువ ఉద్యోగ భాగస్వామ్యం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వ్యవసా యం ఇప్పటికీ దేశంలో దాదాపు సగం మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ.. దేశ స్థూల దేశీయోత్పత్తిలో దాని వాటా 2023-24లో 16శాతమే. 30 ఏండ్లలోపు సగటు వయసు ఉన్న భారత్‌కు ఇది కీలక దశ. యువ జనాభాను ఉత్పాదక శక్తిగా మార్చగలిగితే అది గొప్ప ఆర్థిక అవకాశంగా మారుతుంది. లేకపోతే నిరుద్యోగం, అసంతృప్తి,  సామాజిక ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ఏఐ ప్రభావం కూడా వైట్‌కాలర్ ఉద్యోగాలపై పడుతోంది. తయారీ, ఐటీ లాజిస్టిక్స్ రంగాల్లో స్థిర ఉద్యోగాల బదులు కాంట్రాక్ట్, గిగ్, అసంఘటిత ఉపాధి పెరుగుతోంది. భారత్‌లో నిరుద్యోగ రేటు ఏప్రిల్‌లో 5.2 శాతానికి పెరిగింది. పట్టణ యువతలో నిరుద్యోగం దాదాపు 14 శాతానికి చేరింది. చదువుకున్న యువత తక్కువ జీతాలు, తమ నైపుణ్యాలకు సరిపోని పనుల్లో ఇరుక్కు పోతున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై అమెరికా యుద్ధ  ప్రభావం భారత్‌పై పడుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కుదేలవ్వడంతో అక్కడి భారతీయులు స్వదేశీ బాట పడుతున్నారు. ఇక భారత్‌లో చమురు రవాణా ఖర్చులు పెరగ డం, ఎగుమతుల మందగమనం, కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం.. ఇవన్నీ భారత యువత భవిష్యత్తుపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతున్నాయి. 

ఉద్యోగాలు లేకపోవడం వల్ల యువతలో ప్రభుత్వాలపై నమ్మకం తగ్గి సామాజిక విభజనలు పెరిగి, నేరాలు, తీవ్రవాద భావజాలాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ దేశాల్లో ఉపాధి సంక్షోభం కొనసాగితే.. మెరుగైన జీవనో పాధి కోసం అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు పెరుగుతాయి. అందుకే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి కల్పించే పరిశ్రమలపై దృష్టి పెట్టాలి. త‌ద్వారా యువతకు పని, గౌరవప్రదమైన జీవితం కల్పించడంలో ప్రపంచం విఫలమైతే.. 21వ శతాబ్దపు జనాభా ప్రయోజనం ప్రపంచవ్యాప్త సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది.

ప్రపంచంలోనే అత్యధిక యువ శ్రామిక శక్తి కలిగిన దేశంగా భారత్ సాధిస్తున్న ప్రగతిపై, 2045-50 నాటి ‘వికసిత్ భారత్’ రూపకల్పనపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. అయితే, అంతకంటే ముందే దేశ ఆర్థిక భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసే సవాలుతో కూడిన ‘ఉపాధి సంక్షోభం’ ఒక అదృశ్య ఆర్థిక టైమ్ బాంబ్‌లా భారత్‌ను వెంటాడుతోంది. ఐక్యరాజ్య సమితి(యుఎన్) తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకు లు 36.7 కోట్లకు పైగా ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో దాదాపు 28 శాతానికి సమానం. వీరికి తగిన ఉపాధి, నిరుద్యోగిత నివారణ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశీయరంగా ఏటా కనీసం కోటి కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 22 నుండి 25 ఏళ్ల వయస్సులో ఉన్న యువత రాబోయే 6 నుండి 7 ఏళ్లలో 30 ఏళ్ల మైలురాయిని దాటనున్నారు. జీవితంలో ఎంతో కీలకమైన ఈ వ్యవధిలో యువతకు సరైన ఉద్యోగం, తగిన ఆదాయం, నైపుణ్యం లభించక పోతే, అది కేవలం వ్యక్తిగత కుటుంబాలపైనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగం, ఇళ్ల కొనుగోలు, వివాహాలు, సామాజిక భద్రతను కుప్పకూల్చే  ప్రమాదముంది.

ప్రైవేట్ రంగం ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఏటా కోటి మందికి అవకాశాలు ఇవ్వలేకపోవడంతో, యువత ఆశలన్నీ ప్రభుత్వ ఉద్యోగాలపైనే నిలుస్తున్నాయి. ఉదాహరణకు, కేవలం 15,118 పోస్టుల కోసం నిర్వహించిన ఎస్ఎస్‌సి సిజిఎల్ పరీక్షకు 25 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడగా, ఆర్ఆర్‌బి పరీక్షలకు గత మూడున్నరేళ్లలో సుమారు 4 కోట్ల మంది హాజరు కావడమే దీనికి నిదర్శనం. యువత తమ విలువైన 22 నుండి 30 ఏళ్ల వయస్సు వరకు పోటీ పరీక్షలకే వెచ్చిస్తూ, తుది ఎంపిక కాకపోవడంతో, అవ‌స‌ర‌మైన‌ నైపుణ్య లోపం వల్ల పరిశ్రమల్లో ఇతర అవకాశాలు పొందలేక తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సర్వీస్ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) సాంకేతికత విప్లవాత్మకంగా మారుస్తూ అనేక సంప్రదాయ ఉద్యోగాలను ఆటోమేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. మరోవైపు, పెద్ద ఎత్తున కార్మికులను శోషించుకునే సామర్థ్యం ఉన్న ఉత్పాదక రంగం వాటా గత రెండు దశాబ్ధాలుగా 16 నుంచి 18 శాతానికి పరిమితం కావడం ఆందోళనకరంగా మారింది. పరిశ్రమలో సాంకేతికత, పెట్టుబడి పెరిగిన కొద్ధి ఉపాధి అవకాశాలు తగ్గుతుండ‌టం గ‌మ‌నార్హం. 

ఈ ఉపాధి గండం నుండి భారత్ బయటపడాలంటే కేవలం ఉచిత పథకాలు లేదా తాత్కాలిక నియామకాలు సరిపోవని, ఐదు కీలక సూత్రాలతో కూడిన వ్యూహం అవసరమని నిపుణులు అంటున్నారు. మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకాలను ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, టైక్స్ టైల్స్ రంగాలలో విస్తరించి ఉత్పాదక రంగ వాటాను కనీసం 25 శాతానికి పెంచాలి. అదేవిధంగా, ఏఐ, రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విశ్వవిద్యాలయ స్థాయి నుంచే ఉచిత ప్రాక్టికల్ నైపుణ్య శిక్షణను అందించాల్సిన  అవసరం ఉంది. దీనితో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (యంఎస్‌యంఇ) రుణ ప్రాప్తిని పెంచడం ద్వారా మాత్రమే భారత్ తన జనాభా ప్రయోజనా న్ని సంపూర్ణంగా ఉపయోగించుకోగలదు.

దేశంలో యువతే అత్యంత పెద్ద వనరు. జనాభాలో యువత వాటా ఎక్కువగా ఉండటం భారతదేశానికి ఉన్న గొప్ప బలంగా చెప్పుకుంటున్నాం. ఆ యువత ఇప్పుడు సరైన అవకాశాలు దొరక్క తీవ్ర నిరాశలో ఉంది. ఉన్నత విద్య పూర్తిచేసిన తర్వాత కూడా ఉద్యోగాలు లభించడం లేదు. సొంతంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు సిద్ధమైనా పెట్టుబడి, రుణ సదుపాయాలు లేవు. యువత ఉపాధి పరిస్థితిపై కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్ఎఫ్ఎస్) నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. యువశక్తిని సరైన దిశలో వినియోగించడంలో ప్రస్తుత పాలకులు పూర్తిగా విఫలరమయ్యారని చెప్పడానికి లెక్కలే నిదర్శనం. దేశ భవిష్యత్తును నిర్ణయిం చే యువత ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది? చదువు పూర్తయిన తర్వాత వారి ముందున్న ప్రధాన సవాళ్లు ఏమిటి? అంటే, బతకడానికి ఉపాదేనని చెప్పవచ్చు.

దేశంలో అన్ని వస్తువులు, సేవల ధరలు సెగలు కక్కుతుండడం, మరోవైపున ఉపాధి క్షీణించిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఖర్చులు పెరిగి ఉపాధి లేక ఆదాయాలు తరిగిపోవడంతో కుటుంబాలు అప్పులపాలవున్నాయి.  ప్రభుత్వ శాఖలు వెల్లడించే గణాంకాలు, వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలు పరిశీలిస్తే రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఇంకింత‌ భయానకంగా మారబోతున్న‌ది. నవంబర్ 5న  కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో టోకు ధరల సూచీ 3.88 శాతానికి చేరింది. గత 38 నెలల కాలంలో ఇది అత్యధికం కావడం ఆందోళనకరం. ధరలు పెరిగిపోతుంటే వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కునారిల్లిపోతున్నాయి. అమెరికా యుద్ధోన్మాదంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతినడంతో దేశంలో వంట గ్యాస్ కొరత తీవ్రమయ్యింది. ఫలితంగా భారతీయ రెస్టారెంట్ రంగం నెలకు రూ. 79,000 కోట్ల భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూస్తోందని పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పిహెచ్‌డిసిసిఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది.

నిరుద్యోగానికి, పేద‌రికానికి జ‌నాభా పెరుగుద‌లే కార‌ణ‌మ‌న్న మాల్థ‌స్ సిద్ధాంతం ఎప్పుడో చ‌రిత్ర చెత్త‌కుప్ప‌లో ప‌డింది. మ‌నిషి త‌న రెండు చేతుల‌తో చేసిన ఉత్ప‌త్తి ప‌దిమందిపోష‌ణ‌కు స‌రిపోతుంది. ఒక విత్త‌నం వంద‌ల గింజ‌లను సృష్టించిన‌ట్లు.. ఒక మ‌నిషి చేసిన కృషి, ఉత్ప‌త్తి స‌మాజానికి పెద్ద వ‌న‌రు మాత్ర‌మే కాదు, పెద్ధ శ‌క్తి వెలుగు. ఈ వెలుగులోంచే.. మానవాభివృద్ధి, సామాజాభివృద్ధి కొన‌సాగింది, కొన‌సాగుతున్న‌ది.

కానీ, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ పూర్తిగా తన చేతుల్లోనే ఉన్నా వాటిపైనా ప్రధాని మనసు పెట్టరు. ప్రతిసారి ఓట్ల కోసం యువతకు ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇవ్వడం అలవాటుగా మారింది. ఇది కచ్చితంగా ఏరు దాటాక తెప్ప తగలేయడమే. ప్రభుత్వరంగంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నెలకూ పది లక్షల మంది నిరుద్యోగ సైన్యంలో చేరుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. నిరుద్యోగిత పెరగడానికి కార్పొరేట్ అనుకూల ఆర్థిక‌ విధానాలే కారణం. దీని ఫలితమే యువత నిరాశకు లోనవుతున్నది.  ఇలాంటి సామాజిక ఆర్థిక ప‌రిస్థితుల్లో.. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఏరకంగా యువ‌త‌ సమరశంఖంగా పూరించిందో అదేవిధంగా ఉద్యోగ అవకాశాలపై పోరాడాల్సిన అవసరం ఉంది. ప్ర‌స్తుత అధికార ప‌క్షాల‌న్నీ కార్పొరేట్ అనుకూలమైన‌వే కాబ‌ట్టి పోరాటాల‌తోనే విద్యార్థి యువ‌త త‌మ భ‌విష్య‌త్తును, దేశ భ‌విశ్య‌త్తును తీర్చిదిద్దాలి.  అంద‌రికీ ఉద్యోగ ఉపాధి సామ‌న‌ అవ‌కాశాలు ఉండే ఆద‌ర్శ భార‌తాన్ని ఆవిష్క‌రించుకోవాలి.

Leave a Reply