ఎండ మండిపోతాండాది. తిరుపతి బండ్లవీధిలో భక్తుల రద్దీ ఎక్కువగుండాది. గోవిందరాజస్వామి గుడి వైపు నుంచి వచ్చే జనాలు, ఆటోల అరుపులు, దుకాణాల ముందరి బేరాలతో వీధి నిండిపోయింది. చివరనున్న ‘క్రాంతి డిజిటల్ సర్వీసెస్’లో మాత్రం ఫ్యాను తిరుగుతున్నా గాలి తగలడం లేదు. బయట బోర్డు మీద ‘ఇచ్చట తెలుగు టైపింగ్ చేయబడును’ అన్న అక్షరాలను పావురాల రెట్టలు సగం కప్పేశాయి.

క్రాంతి జిరాక్స్ మిషన్‌లో ఇరుక్కున్న కాగితాన్ని లాగుతున్నాడు. సగం చిరిగి చేతికొచ్చింది. మిగిలిన సగంలో ఆధార్ కార్డు ముఖం ఉండిపోయింది.

“ఏమప్పా, నాదేనా పోయింది?” కౌంటర్ అవతలి ముసలాయన అడిగాడు.

“ముఖం లోపలుండిపోయింది తాతా. భయపడబాక. ఇంకో కాపీ తీసిస్తాలే.”

అప్పుడే ఫోను మోగింది.

“క్రాంతిగారూ, అభినందనలు. మీ ‘మెట్ల కింద మనుషులు’ కథకు మా జాతీయ కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది.”

క్రాంతి చిరిగిన కాగితాన్ని చూసుకున్నాడు.

“నిజంగానా సార్?”

“అవునండీ.”

“డబ్బెంత ఇస్తారు?”

అవతల చిన్న దగ్గు వినిపించింది.

“యాభై వేలు.”

క్రాంతి మిషన్ మూత దించాడు. ముసలాయన ఆధార్ ముఖం లోపలే ఉండిపోయింది.

“తాతా, నీకు రెండు కాపీలు తీసిస్తా. డబ్బులొద్దులే.”

ముసలాయనకు కారణం తెలియకపోయినా సంతోషించాడు. క్రాంతికి కారణం తెలిసినా నమ్మకం కుదరలేదు. ఫోను పెట్టాక కూడా ఆ నంబరు నిజంగా వచ్చిందో లేదో రెండుసార్లు చూసుకున్నాడు.

క్రాంతి రోజంతా దరఖాస్తులు రాసేవాడు. పెన్షన్ రాలేదని ఒకరు, రేషన్ కార్డులో పేరు తప్పిందని మరొకరు, ఇంటిపన్ను ఎక్కువైందని ఇంకొకరు వచ్చేవాళ్లు. వాళ్ల మాటల్లోని కోపాన్ని తగ్గించి, బాధను మర్యాదగా మార్చి, చివరికి ‘తగు చర్యలు తీసుకోగలరు’ అని ముగించేవాడు. సాయంత్రానికి అతని వేళ్లలో ఇతరుల జీవితాలే మిగిలేవి.

అప్పుడప్పుడు కథలు రాసి పత్రికలకు పంపేవాడు. కొన్ని తిరిగొచ్చేవి. కొన్నిటికి సమాధానమే ఉండేది కాదు. ఒక సంపాదకుడు ‘మాండలికం కొంత తగ్గించండి’ అన్నాడు. ఇంకొకరు ‘స్థానిక వాతావరణం మరింత రావాలి’ అన్నారు. ఇద్దరి సలహాలూ ఒకే ఫైలులో పెట్టుకున్నాడు.

బహుమతి వచ్చిన కథలో చెంగమ్మ అనే ఆడమనిషి ఉండేది. అలిపిరి దారిలో చెప్పులు కుట్టుకునేది. ఆమె కొడుకు గొప్ప ఉద్యోగం సంపాదించడు. ఆమె దగ్గరకు కలెక్టర్ రాడు. చివరికి వాన పడితే సూదీ దారాన్ని కొంగులో మూటకట్టుకుని గుడిసెకు పోతుంది. కథ అక్కడితో ఆగిపోతుంది. క్రాంతికి ఆ ముగింపు నచ్చింది. వాన తరువాత ఆమె బతుకు గురించి అతనికి తెలియదు.

పంపేముందు తప్పులుంటాయేమోనని కంప్యూటర్లో కృత్రిమ మేధను తెరిచాడు.

‘అక్షరదోషాలు సరిచెయ్యి. వాక్యాలు కొంచెం బాగుచెయ్యి.’

అది తప్పులతోపాటు చెంగమ్మ జీవితాన్నీ సరిచేసింది. కొడుకును బెంగళూరులో ఉద్యోగంలో పెట్టింది. వాడితో తల్లికి పెద్ద చెప్పుల దుకాణం తెరిపించింది. ప్రారంభోత్సవానికి స్థానిక నాయకుణ్ణి కూడా తీసుకొచ్చింది.

“అబ్బో, నీకంతా సులభమే!” అనుకున్నాడు క్రాంతి.

మార్చినదంతా తీసేశాడు. ఒక్క వాక్యం మాత్రం ఉండిపోయింది.

‘ఆమె చేతివేళ్లలో నగర చరిత్ర ముడతలు పడింది.’

దాన్ని చదువుతుంటే తాను కూడా పెద్ద రచయితలా అనిపించాడు. ఆ వాక్యాన్ని తన కథలో పెట్టుకుని మిగిలిన కథను మళ్లీ చదివాడు. మామూలు బట్టల మధ్య కొత్త చొక్కాలా కనిపించింది. అయినా తీసేయలేదు.

సాయంత్రం నిర్వాహకుల మెయిల్ వచ్చింది. వంద పదాల్లో రచయిత పరిచయం కావాలన్నారు.

‘క్రాంతి. ముప్పై ఎనిమిదేళ్లు. తిరుపతిలో జిరాక్స్ షాపు నిర్వహిస్తున్నాడు.’

అంతకంటే అతనికి తన గురించి రాయడానికి ఏమీ దొరకలేదు. అప్పులు చెప్పొచ్చుగానీ పరిచయంలో అవి అడగలేదు. మళ్లీ కృత్రిమ మేధను ఆశ్రయించాడు.

‘దీన్ని రచయిత పరిచయంగా మార్చు.’

‘ఆధ్యాత్మిక నగరపు అట్టడుగు జీవన స్పందనలను ఆవిష్కరిస్తున్న విశిష్ట స్వరం క్రాంతి…’

పక్క దుకాణం శ్రీనివాసులుకు చదివి వినిపించాడు.

“అట్టడుగు అంటే మన షాపు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడమేనా?”

“ఏమోరా. కానీ చదువుతుంటే నీ దగ్గర అప్పు అడగొచ్చనిపిస్తాండాది. అదే పంపించేయ్.”

మరుసటి రోజు పత్రికలో ‘ప్రముఖ కథకుడు క్రాంతి’ అని ఫొటో వచ్చింది. తమ్ముడి పెళ్లిలో తీసుకున్న ఫొటో అది. పెళ్లికొడుకును కత్తిరించినా అతని చెయ్యి క్రాంతి భుజంమీద మిగిలింది. ఎవరో కనిపించని మనిషి తనను అభినందిస్తున్నట్టుంది.

షాపు యజమాని పేపరు పట్టుకొచ్చాడు.

“మన బిల్డింగుకే పేరొచ్చిందప్పా.”

క్రాంతి నవ్వాడు.

“వచ్చే నెల నుంచి అద్దె ఐదొందలు పెంచుదాం.”

ఆ నవ్వు పూర్తవకముందే యజమాని వెళ్లిపోయాడు.

బహుమతి సభకు ముందు వీడియో ఇంటర్వ్యూ పెట్టారు. క్రాంతి షట్టర్ సగం దించి కూర్చున్నాడు. అవతల అమ్మాయి వెనక పుస్తకాల అలమర ఉంది. అన్ని పుస్తకాలూ సమానమైన ఎత్తులో ఉన్నాయి. తన షాపులోని కాగితాల కట్టలు గుర్తొచ్చాయి.

“మీ రచనా ప్రయాణం ఎప్పుడు మొదలైంది?”

“పదో తరగతిలో ఒకమ్మాయికి ఉత్తరం రాసినాను.”

ఆమె నవ్వలేదు.

“సాహిత్య ప్రయాణం అడుగుతున్నాను.”

“అదీ విఫలమైందిలే మేడం. అందుకే గుర్తుంది.”

ఆమె ప్రశ్న మార్చింది.

“చేతివేళ్లలో నగర చరిత్ర ముడతలు పడిందన్న వాక్యం అద్భుతం. ఎలా తట్టింది?”

బయట నుంచి ఒకడు షట్టర్ కింద తలపెట్టాడు.

“అన్నా, కలర్ ప్రింటెంత?”

“పది రూపాయలు!”

క్రాంతి తెరవైపు తిరిగాడు.

“ఆ వాక్యం కంప్యూటరు సూచించింది మేడం.”

ఆమె కళ్లద్దాలు సవరించుకుంది.

“కృత్రిమ మేధా?”

“అవునండీ. తప్పులు చూడమంటే రాసింది. బాగుందని ఉంచేసినాను.”

తరువాతి ప్రశ్నలు వేగంగా వచ్చాయి.

“ఎంత భాగం రాయించారు? పాత్రలు ఎవరివి? ముగింపు ఎవరిది? మొదటి ముసాయిదా ఉందా?”

“నోట్‌బుక్కులో ఉంది.”

“చూపించగలరా?”

క్రాంతి కౌంటర్ కింద చూశాడు. ఉదయమే అందులోని రెండు పేజీలతో లామినేషన్ కవర్లు తుడిచాడు. మిగిలిన పుస్తకం మీద టీ గ్లాసు ఉంది.

రెండ్రోజులకు బహుమతిని పరిశీలనలో ఉంచినట్టు మెయిల్ వచ్చింది. తరువాత యూట్యూబులో అతని ముఖం కనిపించింది.

‘తిరుపతిలో రోబో రచయిత!’

ఫొటో పక్కన రోబోను పెట్టారు. దాని ఇనుప చెయ్యి కూడా అతని భుజంమీదే ఉంది. తమ్ముడి పెళ్లి చెయ్యి ఎక్కడ పోయిందో తెలియలేదు. షాపుకొచ్చిన కుర్రాడు వీడియో చూపించి నవ్వాడు. క్రాంతి నవ్వలేకపోయాడు.

ఆ రాత్రి కథ మళ్లీ చదివాడు. చెంగమ్మ పేరు ఊరికే పెట్టలేదు. చిన్నప్పుడు తండ్రితో కొండకు నడుస్తున్నప్పుడు తన చెప్పు తెగింది. దాన్ని కుట్టిన ఆవిడ పేరు చెంగమ్మ. చిల్లర లేక తండ్రి తిరిగొచ్చేటప్పుడు ఇస్తానన్నాడు. వాళ్లు బస్సులో దిగొచ్చారు. డబ్బులు తరువాత ఇచ్చాడో లేదో తెలియదు.

ఆ చిన్న జ్ఞాపకంతోనే ఆమెకు కొడుకునీ గుడిసెనీ ఇచ్చి కథ రాశాడు.

మరుసటి రోజు ఆమెను వెతుక్కుంటూ వెళ్లాడు. పాత చోటు మారిపోయింది. కంచెలు, బోర్డులు వచ్చాయి. కొంతదూరంలో నీలం పట్టా కింద ముసలావిడ చెప్పుకు మేకు కొడుతోంది.

“చెంగమ్మ నువ్వేనా?”

“ఎవరప్పా? చెప్పు కుట్టాల్నా?”

“నీ మీద కథ రాసినాను.”

ఆమె సమ్మెట పక్కన పెట్టింది.

“నన్నడక్కుండా?”

క్రాంతి కూర్చోవడానికి చూశాడు.

“ఆ కరెంటు పెట్టెమీద కూకోకు. షాకు కొడతాది. ఇటు కూకో.”

ఇసుకలో కూర్చుని జరిగిందంతా చెప్పాడు. బహుమతి, ఇంటర్వ్యూ, కంప్యూటరు వాక్యం, తన మీద వస్తున్న వీడియోల గురించి వివరించాడు. ఆమె చెప్పు అడుగున రబ్బరు ముక్క సరిచేస్తూ విన్నది.

“కథలో నా కొడుకుని ఏం చేసినావు?”

“నీ దగ్గరే ఉంటాడు.”

ఆమె కొద్దిసేపు మాట్లాడలేదు.

“నిజంగా ఎక్కడున్నాడో తెలీదు. పదేళ్లయింది పోయి.”

క్రాంతి ఇసుకలో వేలితో గీత గీశాడు.

“మరి డబ్బులొస్తే నాకేమన్నా ఇస్తావా?”

అతను జేబులో చెయ్యిపెట్టాడు.

“ఇప్పుడే ఇవ్వమని కాదప్పా. నువ్వు రాసినందుకు నీకిస్తారు. వాక్యం చెప్పినందుకు దానికిస్తారు. నేను బతికినందుకు లెక్కేమన్నా ఉందా అని అడిగినా.”

వచ్చాక నిర్వాహకులకు ఉత్తరం రాశాడు. యంత్రం సూచించిన వాక్యం ఏదో రాశాడు. చెంగమ్మ నిజంగా ఉందని చెప్పాడు. బహుమతిలో సగం ఆమెకు ఇవ్వాలనుకుంటున్నానన్నాడు.

సమాధానం మర్యాదగా వచ్చింది.

‘మీ నిజాయితీని అభినందిస్తున్నాం. రచన పూర్తిగా స్వీయసృష్టి అయి ఉండాలనే నిబంధన మేరకు బహుమతిని రద్దు చేస్తున్నాం.’

క్రాంతి ఉత్తరం చివర చూశాడు. నిర్వాహకుడి సంతకం కింద ఎవరిదో గొప్ప సూక్తి ఉంది. దాని రచయిత పేరు ఉంది. తన వాక్యం దగ్గర యంత్రం పేరు పెట్టుంటే ఏమయ్యేదో అడగాలనుకున్నాడు. మెయిల్ రాసి పంపకుండా మూసేశాడు.

వారానికి స్థానిక సాహిత్య సంఘం చర్చాసభ ఏర్పాటు చేసింది. నిర్వాహకులూ న్యాయనిర్ణేతలూ తెరమీద మాట్లాడతారన్నారు.

“ఆరోగ్యకరమైన చర్చ జరగాలబ్బా,” కార్యదర్శి అన్నాడు.

“నా ఆరోగ్యం బాగాలేదు సార్.”

“అందుకే నీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాం.”

హాల్లో నలభై కుర్చీలున్నాయి. ఇరవై మంది వచ్చారు. మిగిలిన కుర్చీల్లో పాత పత్రికల కట్టలున్నాయి. వాటిని ఎవరూ తీసేయలేదు. వెనక నిలబడిన ఇద్దరికీ ముందు ఖాళీలున్నాయని చెప్పలేదు.

తెరమీద మొదటి న్యాయనిర్ణేత మానవీయ స్పర్శ గురించి మాట్లాడాడు. రెండో ఆయన యంత్రానికి అనుభవం ఉండదన్నాడు. మూడో ఆయన ఈ అంశంపై తన వ్యాసం త్వరలో వస్తుందని ప్రకటించాడు.

క్రాంతి మాట్లాడబోతుంటే చెంగమ్మ వచ్చింది. చెప్పులు కుట్టే సంచిని కిందపెట్టి ముందు కుర్చీలో కూర్చుంది.

“ఎట్టా వచ్చినావమ్మా?”

“మా మనవడు ఫోన్లో చూపిచ్చినాడు. నా సంగతీ మాట్లాడతారంట గదా.”

తెరమీద ప్రశ్న వినిపించింది.

“ఆ అనుభవం మీది కానప్పుడు మీ సృష్టిగా ఎలా చెబుతారు?”

“కథ నేను రాసినానన్నాను సార్. ఆమె బతుకు నాదనలేదు.”

“రాయడానికీ సృష్టించడానికీ తేడా ఉంది.”

“అందుకేనేమో సార్, దరఖాస్తుల మీద నా పేరు పెట్టను.”

వెనక ఇద్దరు నవ్వారు. కార్యదర్శి వాళ్లవైపు చూశాడు.

“ఆ వాక్యం తీసేస్తే కథ నిలబడుతుందా?”

“నిలబడుతుంది.”

“మరి ఎందుకు పెట్టారు?”

“బాగుందనిపించింది. మామూలుగా చెబితే కథ కాదంటారేమో అనిపించింది.”

“బాగున్నదల్లా మనది అయిపోదు.”

చెంగమ్మ లేచింది.

“అదే నేనూ అడుగుతాండా అయ్యా.”

ఆమెకు మైకు అందించారు.

“నా చేతులు చూపించనా?”

కెమెరాకు దగ్గరగా చేతులు చాపింది. సరిగా కనిపించక కార్యదర్శి ఫోను దగ్గరకు తెచ్చాడు.

“ఈ గాటు సూది దిగింది. ఇది వేడి జిగురు పడింది. ఇది మా ఆయన కొరికినది. ఇందులో నగర చరిత్ర ఏడుందయ్యా? నొప్పెక్కడో అడిగితే చూపిస్తా. మీరేమో ఇంకేదో చెబుతాండారు.”

ఎవరూ మాట్లాడలేదు.

“వీడు వానొస్తే నేను ఇంటికి పోయినట్టు రాసినాడంట. నాకు ఇల్లున్న సంగతి వీడికెవరు చెప్పినారు? వానొస్తే మండపంలో కూకుంటా. కొడుకు నా కాడే ఉన్నాడంట. ఉంటే బాగుండేది. రాసినంత మాత్రాన వచ్చేస్తాడా?”

క్రాంతి ఆమె చేతులనే చూస్తున్నాడు. ఒక వేలికి నల్లదారం చుట్టి ఉంది. దానికింద చిన్న గుడ్డముక్క కనిపించింది. కథ రాసినప్పుడు ఆ చేతులు గుర్తుచేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదని అనిపించింది.

ముగ్గురూ ఏదో రాసుకున్నారు.

“రచయిత బాధ్యత గురించి ముఖ్యమైన ప్రశ్నలు వచ్చాయి,” మొదటి ఆయన అన్నాడు.

కొద్దిసేపటికి సమావేశం ముగిసింది. తెర ఖాళీ అయింది.

“డబ్బులివ్వన్నట్టేనా?” చెంగమ్మ అడిగింది.

“ఇవ్వరమ్మా.”

“ముందే చెప్పుండచ్చుగా. నాలుగు జతలు కుట్టుకునేదాన్ని.”

ఆమె సంచి తీసుకుంది. క్రాంతి బయటిదాకా వెంటవెళ్లాడు. ఆటో పిలుస్తానంటే వద్దంది. నడుచుకుంటూ వెళ్లిపోయింది.

మరుసటి సాయంత్రం చెంగమ్మ మళ్లీ షాపుకొచ్చింది.

“రేషన్ కార్డు పోయింది నాయనా. దరఖాస్తు రాసియ్యి.”

క్రాంతి కూర్చోమన్నాడు. పేరు, చిరునామా అడిగాడు. పాత కార్డు నంబరు తెలియలేదు. ఆధార్ కాపీ తీసి, అవసరమైన వివరాలు రాసుకున్నాడు.

“వయసెంతమ్మా?”

“నీ కథలో ఎంత రాసినావు?”

“అరవై ఐదు.”

“అదే వెయ్యి. నీకు నాకంటే ఎక్కువ తెలిసినట్టుందిగా.”

క్రాంతి నవ్వలేదు.

“కాగితంలో ఉన్నదే వేద్దామమ్మా.”

దరఖాస్తు పూర్తిచేసి చదివి వినిపించాడు. ఆమె ఒకచోట సరిచేసింది. భర్త చనిపోయిన సంవత్సరం అది కాదంది. మార్చాడు. వేలిముద్ర వేయించి కాపీ చేతికిచ్చాడు.

“ఇప్పుడు చెప్పమ్మా. చెప్పులు కుట్టడం ఎవరు నేర్పించినారు?”

“అదొక పెద్ద కథలే.”

“షాపు మూసేదాకా సమయముంది.”

ఆమె సంచి కిందపెట్టింది. బయట రద్దీ తగ్గుతుండగా క్రాంతి టీ తెప్పించాడు. చెంగమ్మ గ్లాసు చుట్టూ కొంగు చుట్టుకుంది.

కంప్యూటర్ తెర అంచున చిన్న పెట్టె మెరిసింది.

‘మీ రచనను మెరుగుపరచడంలో సహాయం కావాలా?’

క్రాంతి దాన్ని మూసి ఆమెవైపు తిరిగాడు.

“మా అమ్మ చెప్పులు కుట్టేది కాదు నాయనా,” అంటూ చెంగమ్మ మొదలుపెట్టింది.

Leave a Reply