పాలకులు శాంతికాముకులు
యుద్ధంలో సంధి కోసం
స్కూల్ పిల్లల శవాలకు చుట్టిన తెల్లటి వస్త్రాన్ని
శాంతి కేతనంలా ఎగరేస్తారు
పాలకులు మానవతావాదులు
ప్రపంచ ప్రజల మనసుల్లో
మానవత్వాన్ని వెలిగించటం కోసం
మనుషుల శవాలకు నిప్పంటిస్తారు
పాలకులు నిర్మాతలు
వందేళ్ల నిర్మాణాలన్నీటిని
పునాదుల నుండి కూల్చేసి
అందమైన శూన్యాన్ని నిర్మిస్తారు
పాలకులు దయార్ద్ర హృదయులు
పాల కోసం ఏడుస్తున్న పిల్లాడి నోటికి
తండ్రి గుండె తెగి కారుతున్న రక్తాన్ని
తాగమని డబ్బాలో నింపిస్తారు
ఆకలని అరుస్తున్న చిన్నారి చేతికి
అమ్మ శరీరం నుండి తెగిపడిన మాంసాన్ని
తినమని అన్నం ముద్దలా అందిస్తారు
రెండు నిమిషాలు మౌనం పాటించి
స్కూల్ అసెంబ్లీలో ప్రార్ధన గీతంలా
పిల్లల చావు కేకలను వినిపిస్తారు
పాలకులు అభివృద్ది కారకులు
హాస్పిటల్ బిల్డింగ్లో బాంబు పేల్చి
ప్రపంచంలోనే అతిపెద్ద మార్చురీగా అభివృద్ది చేస్తారు
నేలంతా అడుగుకొక గుంతను తవ్వి
మొత్తం దేశాన్నే శ్మశానవాటికగా అప్గ్రేడ్ చేస్తారు




